అక్టోబర్ నాటికి ఆక్స్‌ఫర్డ్ 'కోవిషీల్డ్' వ్యాక్సిన్
posted on Jul 23, 2020 @ 11:09AM
ప్రపంచం మొత్తాన్ని కరోనా గడగడలాడిస్తున్న ప్రస్తుత సమయంలో ప్రతి ఒక్కరు కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) ఒక శుభవార్త తెలిపింది. ఈ సంవత్సరం అక్టోబరు నాటికి అంటే మరో మూడు నెలల్లో వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ఆ సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది. ఇప్పటికే ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ ‘కోవిషీల్డ్’తొలి దశ ప్రయోగాల్లో సంతృప్తికర ఫలితాలు వచ్చినట్టు ఎస్ఐఐ సీఈవో అదర్ పూనావాలా తెలిపారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో నిన్న వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన సందర్భంగా ఆయన ఈ విషయాలు వెల్లడించారు. మన దేశంలో కూడా వచ్చే నెలలో తదుపరి దశ ప్రయోగాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని పూనావాలా తెలిపారు. ఆక్స్‌ఫర్డ్ తయారు చేసిన వ్యాక్సిన్ 'కోవిషీల్డ్' ఫోటోను అయన ట్విట్టర్ ద్వారా విడుదల చేసారు.
ఐతే అక్టోబరు నాటికి ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ వస్తుందన్న ఎస్ఐఐ సీఈవో అదర్ పూనావాలా వ్యాఖ్యలకు విరుద్ధంగా, టీకా డిసెంబరు నాటికి అందుబాటులో వస్తుందని ఆ సంస్థ చైర్మన్ సైరస్ పూనావాలా చెప్పడం గమనార్హం. ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ తొలి దశ ప్రయోగాలు విజయవంతంగా ముగిశాయని, రెండు, మూడో దశ ప్రయోగాలు ఆస్ట్రియాలో కొనసాగుతున్నాయని ఆయన వివరించారు. భారత్ లో కనీసం వందకోట్ల డోసులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని తాము నిర్ణయించామని, పేదలను దృష్టిలో పెట్టుకుని తక్కువ ధరకే దీనిని అందుబాటులో ఉంచుతామని సైరస్ పూనావాలా తెలిపారు.