గన్నవరం గరంగరం.. వంశీలో మొదలైన కలవరం!!
posted on Jul 22, 2020 @ 4:49PM
కృష్ణా జిల్లా గన్నవరం వైసీపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. టీడీపీకి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో.. అధికారపార్టీలో ఏర్పడిన విభేదాలు తారాస్థాయికి చేరినట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో వల్లభనేని వంశీ టీడీపీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కానీ ఆ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. అప్పటినుంచి వంశీ.. టీడీపీతో అంటీముట్టనట్టుగా వ్యవహరించారు. వైసీపీకి మద్దతు తెలుపుతూ.. సొంత పార్టీ నేతలపైనే వంశీ దూషణల పర్వానికి దిగారు. టీడీపీ అధినేత చంద్రబాబు మరియు ఆ పార్టీ నాయకులపై తీవ్ర విమర్శులు చేశారు. అధికారికంగా వైసీపీలో చేరకున్నా.. తాను వైసీపీ మనిషినే అన్న ముద్ర మాత్రం వేయించుకున్నారు. మంత్రులు కొడాలి నాని, పేర్ని నానితో కలిసి వెళ్లి మరీ సీఎం జగన్ ను వంశీ కలిశారు. అక్కడనుంచి గన్నవరం వైసీపీ రాజకీయాలు మలుపు తిరిగాయి.
వంశీ వైసీపీకి అనుకూలంగా ఉండటాన్ని.. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో, యార్లగడ్డకు నామినేటెడ్ పోస్టు కట్టబెట్టి ఆ వర్గాన్ని శాంతింపజేశారు. అయితే, యార్లగడ్డ నుంచి ఎదురవుతున్న అసంతృప్తిని ఏదో విధంగా చల్లార్చుకున్న వంశీ.. మరో నాయకుడు 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన దుట్టా రామచంద్రరావు నుంచి తీవ్రమైన ఇరకాటాన్ని ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే వంశీ, దుట్టా రామచంద్రరావు వర్గాలకు పొసగడం లేనట్టుగా తెలుస్తోంది. వంశీకి వ్యతిరేకంగా దుట్టా అల్లుడు శివభరత్ రెడ్డి.. గన్నవరం నియోజకవర్గంలో ఓ వర్గానికి ప్రోత్సాహం ఇస్తున్నారని పార్టీలో ప్రచారం జోరుగా సాగుతోంది.
ప్రస్తుతం నియోజకవర్గంలో వంశీకి పెద్దగా ప్రాధాన్యత దక్కడం లేదని ఆయన వర్గీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శివభరత్‌రెడ్డి నియోజకవర్గంలో పెత్తనం చేస్తున్నారని, వైసీపీ పెద్దలకు ఆయన బంధువు కావడంతో అధికారులు కూడా ఆయన చెప్పిన విధంగా చేస్తున్నారనే మాట వంశీ వర్గీయుల నుంచి వినిపిస్తోంది. హైదరాబాద్‌లో హాస్పటల్ నిర్వహిస్తున్న శివభరత్‌రెడ్డి.. నియోజకవర్గంలోని కార్యకర్తకుల, నాయకులకు ఫోన్‌లు చేసి నిత్యం టచ్‌లో ఉంటూ తన వర్గాన్ని పెంచుకుంటున్నారని, ఇది వంశీకి ఇబ్బందిని కల్గిస్తోందని అంటున్నారు.
వైసీపీకి మద్దతు ప్రకటించిన వంశీ.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో గెలవాలని భావిస్తున్నారు. ఆ మేరకు వ్యూహాలు రంగం సిద్ధం చేసుకుంటుండగానే.. వైసీపీ నాయకుల నుంచి వస్తోన్న ప్రతిస్పందనతో వంశీ కలవరానికి గురవుతున్నారంటున్నారు. దీనికితోడు, ఇటీవల జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో దుట్టా వర్గం సమావేశమైంది. గన్నవరంలో ఉప ఎన్నిక జరిగితే టికెట్ తమకే ఇవ్వాలంటూ షరతు విధించినట్లు తెలుస్తోంది. వంశీకి టికెట్ ఇస్తే ఎట్టి పరిస్థితుల్లోను సహకరించబోమని తేల్చిచెప్పినట్లు సమాచారం.
దీంతో, ఏం చేయాలో తెలియక వంశీ అయోమయంలో ఉన్నారట. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే.. ఉప ఎన్నికల్లో టికెట్ ఇస్తారా?.. ఒక వేళ ఇచ్చినా.. దుట్టా వర్గీయులు ఎన్నికల్లో తనకు సహకరిస్తారా?.. అనే ఆందోళన వంశీలో నెలకొందని ఆయన వర్గీయులు అంటున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా శివభరత్‌రెడ్డికే సహకరించే అవకాశముందని, ఇటువంటి పరిస్థితుల్లో ఏమి చేయాలో తెలియక వంశీ నిర్వేదానికి గురవుతున్నారనే మాట ఆయన వర్గీయులు నుంచి వినిపిస్తోంది.