ఏపీ రాజధాని భవిష్యత్తు ఈనెల 17 న తేలుతుందా..!
posted on Aug 14, 2020 @ 11:19AM
ఏపీలో మూడు రాజధానుల అంశం పై ఇటు హైకోర్టు లోను అటు సుప్రీం కోర్టులోనూ పిటిషన్ లు దాఖలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే హైకోర్టు మూడు రాజధానుల బిల్లు పై స్టేటస్ కో ఇవ్వగా.. దీని పై స్టే కోరుతూ జగన్ సర్కార్ సుప్రీం కోర్టు తలుపు తట్టిన సంగతి తెలిసిందే. ఐతే ఆ పిటిషన్ లో తప్పులు దొర్లడంతో మళ్ళీ పిటిషన్లు దాఖలు చేయాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు ఈ పిటిషన్ పై ఆగష్టు 17న అంటే వచ్చే సోమవారం రాజధాని అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. దీంతో ఈ అంశం పై సుప్రీం కోర్టు తీర్పు ఎలా ఉంటుందో అనే ఉత్కంఠ నెలకొంది.
ఏపీకి అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ఇప్పటికే రైతులు దాదాపు 250 రోజులుగా ఆ ప్రాంతంలో దీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఐతే జగన్ ప్రభుత్వం మాత్రం ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటు చేయాలని కృత నిశ్చయంతో ఉంది. ఇప్పటికే సీఆర్డీఏను కూడా రద్దు చేసారు. ఈ పరిస్థితుల్లో రాజధానుల అంశం చివరికి సుప్రీంకోర్టుకు చేరింది.