కోమాలోనే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ..
posted on Aug 14, 2020 @ 9:49AM
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి ఇప్పటికీ విషమంగానే ఉంది. ప్రస్తుతం ఆయన కోమాలో ఉన్నారని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరెల్ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఐతే అయన అవయవాలు మాత్రం పనిచేస్తున్నాయని డాక్టర్లు తెలిపారు. ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం హిమోడైనమికల్లీ స్టేబుల్ అని తెలిపారు. అయితే హిమోడైనమికల్లీ స్టేబుల్ కు అర్ధం అసాధారణ రీతిలో గుండె కొట్టుకోవడం, చేతులు, కాళ్లు చల్లబడటం, ఛాతీ నొప్పి, మూత్రం తగ్గడం, లోబీపీ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆ వ్యక్తి బతికే ఉంటారు కానీ ఆరోగ్య పరిస్థితి మాత్రం విషమంగా ఉంటుంది. ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం ఇలాగే ఉందని ఆయనకు చికిత్స చేస్తున్న వైద్యులు తెలిపారు.
గత సోమవారం తనకు కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని ట్విటర్ వేదికగా ప్రణబ్ ముఖర్జీ వెల్లడించిన సంగతి తెలిసిందే. మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఈ నెల 10న ఢిల్లీలోని ఆర్మీ రిసెర్చ్ అండ్ రిఫరల్ ఆసుపత్రిలో ప్రణబ్ ముఖర్జీకి అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్స చేశారు. ఐతే చికిత్స తరవాత కూడా ఆయన పరిస్థితి విషమంగానే ఉంది. ఐతే ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ, కూతురు షర్మిష్ట ముఖర్జీ ఖండించారు. ప్రజలు పుకార్లను నమ్మవద్దని వారు సూచించారు.