చిత్తూరులో మరో దారుణం.. వెంటనే స్పందించిన సోనూసూద్
posted on Aug 14, 2020 @ 10:22AM
కరోనా వైరస్ వ్యాప్తి మొదలైన తరువాత మానవత్వం అనేది కనుమరుగవుతోంది. దీనికి ఉదాహరణగా మనం అనేక సంఘటనలు రోజు చూస్తున్నాం. తాజాగా ఎపి లోని చిత్తూరు జిల్లా గంగవరం గ్రామంలో ఇటువంటిదే ఒక ఘటన జరిగింది. గంగవరం గ్రామానికి చెందిన వెంకట్రామయ్య (73) అనే వ్యక్తి ఇంటి బయట పడుకున్నప్పుడు పక్కింటి ఆవు దాడి చేసింది. ఈ దాడిలో ఆవు అతని గుండెలపై తొక్కడంతో పక్కటెముకలు విరిగి వెంకట్రామయ్య తీవ్రంగా గాయపడ్డాడు.
దీంతో ఆదివారం ఉదయం అయన కూతురు హేమలత అతన్ని చికిత్స కోసం పలమనేరు ప్రభుత్వాస్పత్రికి తీసుకుని వెళ్ళింది. అక్కడ డాక్టర్లు అతన్ని పరీక్షించి స్కానింగ్ చేయాలని, ఐతే తమ వద్ద ఆ సౌకర్యం లేదని చెప్పి వెనక్కి పంపారు. దాంతో ఆమె తన తండ్రిని దగ్గరలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చూపించి ఇంటికి తీసుకుని వెల్లింది. మొన్న బుధవారం అతనికి ఊపిరి తీసుకోవడం కష్టం కావడంతో హేమలత తండ్రిని ఆటోలో ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకు వెళ్లింది. ఐతే అక్కడ డాక్టర్ లేకపోవడంతో మళ్ళీ ప్రభుత్వాస్పత్రికి తీసుకుని వెడుతుండగా దారిలోనే వెంకట్రామయ్య ఆటోలోనే మరణించాడు. దాంతో ఆటో డ్రైవర్ శవాన్ని నడి రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయాడు. దాంతో ఆమె నడిరోడ్డు మీద శవంతో రోదించడం ప్రారంభించింది. అంతేకాకుండా తన తండ్రి కరోనాతో చనిపోలేదని ఆమె ఎంత మొత్తుకున్నా ఎవరూ పట్టించుకోలేదు.
ఐతే ఆమె రోదిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఈ దారుణ ఘటనపై సినీ నటుడు సోనూసూద్ స్పందించారు. వెంకటరామయ్య కుమార్తెను పరామర్శించి ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవడానికి తన మనుషులను పలమనేరుకు పంపనున్నారు. ఈ రోజు అంటే శుక్రవారం బెంగళూరు నుంచి సోనూసూద్ మనుషులు వచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోనున్నారు. అయితే సోనూసూద్ ఇప్పటికే చిత్తూరులో వ్యవసాయానికి ఎడ్లు లేక కన్నకూతుళ్లు నాగలి పట్టి లాగుతుండగా వ్యవసాయం చేస్తున్న ఓ రైతుకి ట్రాక్టర్ బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. రాబోయే పది తరాలకు సరిపోయేలా సంపాదించి ఇంకా సంపాదన పై ఆశ చావని.. ఒక్క పైసా కూడా ఇతరులకు సాయం చెయ్యని మహానుభావులు ఉన్న మన సమాజంలో సోను సూద్ వంటి వారు మన మధ్య ఉండడం నిజంగా మన అందరి అదృష్టం. రియల్లీ హాట్స్ ఆఫ్ టు యూ సోనూసూద్.