అనుబంధాలే ఇతివృత్తాలుగా
posted on Aug 14, 2020 @ 11:19AM
ఆలిస్ రివాజ్ (14 ఆగస్టు 1901 - 27 ఫిబ్రవరి 1998)
అనునిత్యం తన జీవితంలో కనిపించే వ్యక్తులే ఆమె అక్షరాల్లో ఒదిగిపోయారు. నవలల్లో పాత్రధారులుగా మారి పాఠకులను అలరించారు. విభిన్నమనస్తత్వాలతో కూడిన వ్యక్తుల మధ్య అనుబంధాలను, ఆప్యాయతలను ఒకవైపు చెబుతూనే మరో వైపు స్త్రీవాదాన్ని అంతర్లీనంగా తన నవలల్లో ప్రతిబింబించారు. ఆమే స్విస్ రచయిత ఆలిస్ రివాజ్. స్విట్జర్లాండ్ ఇరవయ్యవ శతాబ్దపు ప్రధాన రచయితలలో ఒకరు.
స్విస్ మునిసిపాలిటీ లోని రోవ్రేలో 14 ఆగస్టు 1901న ఆలిస్ జన్మించారు. పాల్ గోలే, ఇడా ఎట్లర్ దంపతుల ఏకైక సంతానం ఆమె. తండ్రి ఉపాధ్యాయుడు. సోషలిజంపై ఆసక్తితో ఉపాధ్యాయ వృత్తిని వదిలి రచయితగా మారాడు. దాంతో వారి కుటుంబం లాసాన్ కు వెళ్లింది. ఆలిస్ కు సంగీతం అంటే చాలా ఇష్టం. పియానో నేర్చుకున్నారు. ఆ తర్వాత ఆమె ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ లో చేరారు. అప్పటివరకు తల్లిదండ్రుల్లో కలిసి నివరించిన ఆమె 25 సంవత్సరాల వయసులో రివాజ్ జెనీవాకు వెళ్లారు, అక్కడే చివరి వరకు ఉన్నారు.
అంతర్జాతీయ కార్మిక సంస్థతో చాలా సంవత్సరాలు పనిచేసిన తరువాత ఆలిస్ రచనారంగం వైపు మళ్లారు. ఆమె మొదటి నవల నౌజేన్ డాన్స్ లా మెయిన్ (క్లౌడ్స్ ఇన్ యువర్ హ్యాండ్స్) 1937 లో ప్రచురితమైంది. మరో నవల జేట్టీ టోస్ పెయిన్ (కాస్ట్ యువర్ బ్రెడ్) నవల కూడా ఆమెకు మంచి పేరు తీసుకువచ్చింది. అత్యుత్తమ రచనగా అవార్డులు అందుకుంది. ఆమె రచనలు కళలు, కుటుంబంలోని అనుబంధాలు ఎక్కువగా కనిపిస్తాయి. అంతేకాదు స్త్రీవాద ధోరణి అంతర్లీనంగా ఉంటుంది. నవలలు, చిన్న కథలు, వ్యాసాలు, డైరీలతో పాటు ఆమె కవి జీన్-జార్జెస్ లోసియర్ గురించి కూడా అధ్యయనం చేసింది.
ఆలిస్ రచనల ద్వారా చాలా తక్కువ కాలంలోనే స్విట్జర్లాండ్ లోని ఫ్రెంచ్ భాషా రచయితలలో అగ్రగామిగా నిలిచారు. ఆలిస్ రివాజ్ 27 ఫిబ్రవరి 1998న 96 ఏండ్ల వయసులో మరణించారు. ఆమె రచనలు స్విస్ నేషనల్ లైబ్రరీలో అందుబాటులో ఉన్నాయి. ఆమె పేరు మీద జెనీవాలో ఒక వీధి, కళాశాల ఏర్పాటు చేశారు. అంతేకాదు 2002 నుంచి ఆలిస్ రివాజ్ అన్న పేరుతో ఇంటర్ సిటీ రైలు కూడా అక్కడ నడుస్తోంది. ఆమె పేరు ప్రజల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయింది.