కరోనా పై తప్పుడు సంకేతాలతో భారత్ కు ముప్పు.. ఐసీఎంఆర్ ను హెచ్చరించిన లాన్సెట్
posted on Sep 26, 2020 @ 2:51PM
భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు నిత్యం పెరుగుతూనే ఉన్నాయి. అయితే దేశంలో మరణాల రేటు తక్కువగా ఉందని.. అలాగే ఇంకేముంది.. ఇదిగో వ్యాక్సిన్ అంటూ కొద్దీ రోజుల క్రితం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) హడావిడి చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐసీఎంఆర్ అనుసరిస్తోన్న విధానాలను విమర్శిస్తూ ప్రముఖ అంతర్జాతీయ మెడికల్ జర్నల్ లాన్సెట్ కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా ఉద్ధృతి దేశంలో అత్యధికంగా ఉన్నప్పటికీ భారత ప్రభుత్వం, అలాగే ఐసీఎంఆర్ ఏమీ కాదులే అన్న ధోరణితో వ్యవహరిస్తుండడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. అంతేకాకుండా ఐసీఎంఆర్ శాస్త్రీయ ఆధారాల నుంచి పక్కకు పోతోందని లాన్సెట్ మెడికల్ జర్నల్ తన సంపాదకీయంలో పేర్కొంది. ఐసీఎంఆర్ తాజా ధోరణులతో ప్రజలకు కూడా తప్పుడు సంకేతాలు అందుతాయని.. దీంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోకుండా ఈ చర్యలు నిరోధిస్తాయని తన సంపాదకీయంలో తెలిపింది. ఇటువంటి చర్యల వల్ల భారత్‌లో మరింత సంక్షోభం ఏర్పడుతుందని పేర్కొంది.
కరోనా వ్యాప్తి తీవ్రత పట్ల భారత సర్కారు చాలా పాజిటివ్ ధోరణితో ఉందని.. ఇంతటి కరోనా సంక్షోభం సమయంలో వాస్తవాలను దాచవద్దని కోరింది. ప్రజలకు అసలు నిజాలు చెప్పకపోతే పెద్ద ప్రమాదమని ఈ సందర్భంగా హెచ్చరించింది. కరోనా ముప్పును కప్పిపెడుతూ పూర్తి ఆశావాదాన్ని ప్రోత్సహిస్తూ చేస్తోన్న ఒత్తిడి కారణంగా భారత్‌లో శాస్త్రీయ సంస్థలు కూడా ఆ దిశగా ప్రభావితమవుతున్నాయని లాన్సెట్ పేర్కొంది. ఇదే సందర్భంలో భారత్ నుంచి కరోనాకు వ్యాక్సిన్ ను ఈ ఏడాది ఆగస్టు 15లోగా అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని కొన్ని నెలల క్రితం ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ చేసిన ప్రకటనను కూడా లాన్సెట్ తప్పుబట్టింది. అంతేకాదు. ప్రపంచంలోని ఇతర దేశాల కంటే తక్కువ మరణాల రేటు భారత్‌లో ఉందని ప్రభుత్వం వాదించడాన్ని కూడా తప్పుబడుతూ.. అసలు భారత్ చెబుతోన్న ఈ సంఖ్యలు పోల్చదగినవా? కాదా.. అనే విషయం తెలుసుకోవడం కూడా కష్టంగా ఉందని తెలిపింది. భారతదేశంలోని రాజకీయ నాయకులు శాస్త్రీయ ఆధారాలను, నిపుణుల సలహాలపై దృష్టి పెడితే బాగుంటుందని హితవు పలికింది.