అధికార పార్టీలో అసమ్మతి.. బీజేపీలోకి జంపింగ్స్.. కారుకు కష్టమేనా!
posted on Sep 26, 2020 @ 2:51PM
సిద్ధిపేట జిల్లా దుబ్బాక అసెంబ్లీకి త్వరలో జరగనున్న ఉప ఎన్నికల్లో అధికార పార్టీకి కష్టాలు తప్పేలా కనిపించడం లేదు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడకముందే నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు రోజుకో రంగు పులుముకుంటున్నాయి. సోలిపేట రామలింగారెడ్డి మరణం తర్వాత సానుభూతి పవనాల కంటే అసంతృప్తే ఎక్కువగా కనిపిస్తుండడంతో కారు పార్టీకి తలనొప్పిగా మారింది. రామలింగారెడ్డి కుటుంబంపై సానుభూతి చూపాల్సిన టీఆర్ఎస్ నేతలు అసమ్మతి సెగ లేపుతున్నారు. నియోజకవర్గంలోని నాయకులు వేర్వేరు సమావేశాలు ఏర్పాటు చేసి తమ అసమ్మతిని వ్యక్తపరుస్తున్నారు. కొందరైతే ఏకంగా రామలింగారెడ్డి కుటుంబానికి టిక్కెట్ ఇవ్వద్దని తీర్మానాలు చేస్తూ హైకమాండ్ కు పంపిస్తున్నారు.
చేగుంట మండలంలో అధికార పార్టీకి భారీ షాక్ తగిలింది. మండలానికి చెందిన పలువురు టీఆర్ఎస్ ఎంపీటీసీలు, సర్పంచులు, మాజీ సర్పంచ్ లు, మాజీ ఎంపీటీసీ సభ్యులు, మండల నాయకులు, వందలాది మంది కార్యకర్తలు బీజేపీలో చేరిపోయారు. రెండు రోజుల క్రితం అసమ్మతి సమావేశం నిర్వహించిన ఈ నేతలు.. పార్టీ ఆవిర్భావం నుంచి కష్టపడి పని చేసినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి వెంట నలుగురు వ్యక్తులు ఉండి దుబ్బాక రాజకీయానికి, టీఆర్ఎస్ పార్టీకి మచ్చ తెచ్చారని ఆరోపించారు. రాబోయే ఉపఎన్నికల్లో ఆ కుటుంబానికి టిక్కెట్ ఇస్తే మళ్లీ తమను అణగతొక్కుతారని చెప్పారు. కేసీఆర్ గ్రామాలుగా పిలవబడే 12 ఊర్ల నాయకత్వం కూడా సోలిపేట కుటుంబానికి టికెట్ ఇవ్వొద్దని డిమాండ్ చేస్తున్నది. గతంలో తాము సిద్దిపేట నియోజకవర్గంలో ఉండి, నియోజకవర్గాల పునర్విభజనలో దుబ్బాక మండలంతో కలిసి వివక్షకు గురవుతున్నామని వారంతా ఆవేదన చెందుతున్నారు.
సోలిపేట కుటుంబానికి టికెట్ ఇవ్వడంపై పార్టీలోని ఇతర సీనియర్ నేతలకు ఇష్టం లేదు. వారు కూడా తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారు. దివంగత మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి తనయుడు చెరుకు శ్రీనివాస్‌రెడ్డి ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉత్సాహంతో ఉన్నారు. గ్రామాల్లో తిరుగుతూ తనతో వచ్చే టీఆర్‌ఎస్ శ్రేణులను సమీకరిస్తున్నారు. తనకు టికెట్ ఇవ్వాలని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుపై శ్రీనివాస్ రెడ్డి ఒత్తిడి పెంచుతున్నట్లు చెబుతున్నారు. టికెట్ ఇవ్వకపోతే తన దారి తాను చూసుకుంటానని శ్రీనివాస్ రెడ్డి చెప్పినట్లు సమాచారం. పార్టీ మరో సీనియర్ నాయకుడు మామిడి మెహన్‌రెడ్డి కూడా మండలాల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ సోలిపేట కుటుంబానికి టికెట్టు వద్దనే నినాదంతో పనిచేస్తున్నారు. పార్టీలో మొదటి నుంచి పనిచేసిన నిజమైన కార్యకర్తకు టికెట్ ఇస్తే తాము కలిసికట్టుగా గెలిపించుకుంటామని, అదే కుటుంబానికి ఇస్తే పార్టీ కార్యకర్తలకు అవకాశాలు ఎప్పుడు వస్తాయని ప్రశ్నిస్తున్నారు. ఈ ఇద్దరు నేతలకు బీజేపీ కూడా వల వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రామలింగారెడ్డి కుటుంబానికి టికెట్ ఇస్తే.. శ్రీనివాస్ రెడ్డి, మెహన్ రెడ్డిలు అధికార పార్టీ గెలుపు కోసం ప్రయత్నాలు చేయకపోవచ్చని టీఆర్ఎస్ లోనే చర్చ జరుగుతోంది.
మరోవైపు దుబ్బాక ఉప ఎన్నికలో ఘన విజయం సాధిస్తామని చెబుతున్న టీఆర్ఎస్ ముఖ్య నేతలకు... నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఆందోళన కల్గిస్తున్నాయి. రోజు రోజుకు అసమ్మతి పెరిగిపోతుండటంతో అధికార పార్టీలో అలజడి కనిపిస్తోంది. ఉప ఎన్నికల బాధ్యతలు చూస్తున్న మంత్రి హరీష్ రావుకు ఇది తలనొప్పిగా మారిందంటున్నారు. అసమ్మతి నేతలను బుజ్జగించేందుకు ఎంతగా ప్రయత్నిస్తున్నా.. వారు వినడం లేదని తెలుస్తోంది. చేగుంట మండల నేతల రాజీనామాతో మరింత అప్రత్తమైన హరీష్.. ఇతర మండలాల్లోని అసమ్మతి నేతలతో స్వయంగా మాట్లాడి కూల్ చేస్తున్నారని చెబుతున్నారు. మొత్తానికి సీఎం కేసీఆర్ సొంత జిల్లా, తన సొంతూరు పక్క నియోజకవర్గమైన దుబ్బాకలో నెలకొన్న అసమ్మతి టీఆర్ఎస్ ను పరేషాన్ చేస్తుందని తెలంగాణ భవన్ లో ప్రచారం జరుగుతోంది.