స్థానిక ఎన్నికలు శైలజానాథ్ కు పరీక్షే!
posted on Mar 13, 2020 @ 11:29AM
కనీసం పోటీ చేయడానికి కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థుల కరవు అయిపోయారట. ఈ నేపథ్యంల్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోవడం పీసీసీ చీఫ్ డాక్టర్ ఎస్ శైలజనాథ్‌కు పెద్ద పరీక్షగా మారింది.
ఈ ఎన్నికల్లో అసలు మార్కులు పడతాయా? కనీసం పాసవుతారా? అనేదీ కష్టంగానే వుంది. గ్రామ, మండల, పట్టణాల్లో కేడర్ పూర్తిగా బలహీన పడటంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్‌లోని అన్ని సీట్లలో పోటీకి దిగడం ఆ పార్టీకి పెద్ద సమస్యగా మారింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ స్థానాలకు నాయకత్వం ఒత్తిడితో మొక్కుబడిగానే అభ్యర్థులు బరిలోకి దిగారు. అన్ని స్థానాలకూ అభ్యర్థులు కరవయ్యారు.
జెడ్పీటీసీ, మున్సిపల్ స్థానాల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్‌కు ఎన్ని సీట్లు వస్తాయనేదీ నేతలు గట్టిగా చెప్పలేక పోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సమరంలో ప్రధాన పోటీ వైసీపీ, టీడీపీ మధ్యే కొనసాగుతోంది. ఈ ప్రధాన పార్టీలకు కాంగ్రెస్ పోటీ ఇచ్చే పరిస్థితులు రాష్ట్రంలో ఎక్కడా కన్పించడం లేదు. జనరల్‌తోపాటు రిజర్వుడు స్థానాల్లో కాంగ్రెస్‌కు బలమైన అభ్యర్థులు కరవయ్యారు.
రాష్ట్ర విభజనతో కాంగ్రెస్‌కు రాష్ట్రంలో కోలుకోలేని దెబ్బ తగిలింది. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క ఎమ్మెల్యే, ఒక్క ఎంపీ సీటును సైతం సాధించలేక పోయింది. ప్రస్తుతం జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ దాదాపుగా ఇదే పరిస్థితి పునరావృతం కానుంది.
పీసీసీ చీఫ్‌లు మారినా పార్టీ శ్రేణుల్ని ఆకర్షించే స్థాయిలో కాంగ్రెస్ నాయకత్వం లేకపోవడం పెద్ద మైనస్‌ని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. కేంద్రంలోను, రాష్ట్రంలోను వరుస వారీగా కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోవడంతో కాంగ్రెస్ కేడర్ నిరుత్సాహంగా ఉంది. వైసీపీ, టీడీపీ అభ్యర్థులకు దీటుగా పోటీ చేసేందుకు కాంగ్రెస్ అభ్యర్థులు వెనుకంజ వేస్తున్నారు. కేవలం నామినేషన్లు వేసి ప్రచారానికే వారంతా పరిమితమయ్యారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకువస్తామంటూ ప్రగల్భాలు పలికిన వైసీపీ, టీడీపీ ఇప్పుడు ఎందుకు మౌనం వహిస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ నిలదీస్తోంది.రాష్ట్రం అభివృద్ది చెందాలంటే ప్రత్యేక హోదాయే ఇవ్వాల్సిందే. కేంద్రంలో ప్రధాని మోడీ, రాష్ట్రంలో సీఎం జగన్‌లు ప్రధాన సమస్యలు వదిలేసి ఎంటర్‌టైన్‌మెంట్ చూపిస్తున్నారట. ప్రజలకు కొన్ని సంక్షేమ పథకాలు అమలు చేసి, మాయమాటలతో రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తోందంటూ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదా కోసం రాజకీయ పార్టీలు పోరాడాలన్నారు. పార్లమెంటులో పెద్ద సంఖ్యలో ఎంపీలను కలిగి ఉండి వైసీపీ ప్రత్యేక హోదాపై నోరు మెదపడం లేదంటూ పీసీసీ చీఫ్ డాక్టర్ ఎస్.శైలజనాథ్ ఓట్లు అడుక్కుంటున్నారు. ఈ ఎన్నికల్లో కొన్ని స్థానాలైనా గెలిచి పట్టు సాధించాలనే వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ ఆశగా వుంది.