సంపదలో 'అయోధ్య' ను దాటని 'పరిమళం'...
posted on Mar 13, 2020 @ 11:53AM
రాజ్యసభ అఫిడవిట్లలో ఉట్టిపడిన వై ఎస్ ఆర్ సి పి అభ్యర్థుల 'లక్ష్మీ కళ'
ఇచ్చుకున్నోడు ఈగ....పుచ్చుకున్నోడు పులి అని సామెత. ఇక్కడ ఇచ్చుకున్నది జగన్ మోహన్ రెడ్డి అయితే, పుచ్చుకున్న ఆ ఇద్దరూ కూడా నిజంగా పులులేనండోయ్.. కాకపోతే నిజం పులులు కాదు.. సంపదలో పులులు. జగన్ మోహన్ రెడ్డి రాజ్యసభ కు పంపుతున్న పరిమళ్ నత్వానీ , అయోధ్య రామిరెడ్డి ఇద్దరూ కూడా ... తమ అఫిడవిట్లలో పేర్కొన్న వివరాలు చూసినా, చదివినా ఎవరికైనా కళ్ళు తిరిగిపోతాయి. కాపోతే, ఆ ఇద్దరిలో అయోధ్యరామి రెడ్డి సంపదే, పరిమళ్ నత్వాని సంపద కన్నా ఎక్కువ. ఈ అఫిడవిట్ల ప్రకారం పరిమళ్ నత్వాని కన్నా అయోధ్యరామిరెడ్డి అత్యధిక ఆస్తులున్నాయి. ఆయన స్థిర, చరాస్తులన్నీ కలిపి 2,377 కోట్ల రూపాయలు దాటిపోయాయి. తనకు మొత్తం 2,376 కోట్ల రూపాయలు చరాస్తి ఉందని,55 లక్షల రూపాయల విలువైన వ్యవసాయ భూమి ఉందని, నివాస గృహాల విలువ 17.55 కోట్లని ఆయన పేర్కొన్నారు. అప్పులు 61 కోట్ల రూపాయలు ఉన్నట్లు తెలిపారు. అయోధ్య రామిరెడ్డి భార్య పేరిట చరాస్తి 128.72 కోట్లు, స్థిరాస్తి 13 కోట్లు, వ్యవసాయేతర భూమి విలువ 26 కోట్లు, నివాస గృహాల ద్వారా ఆస్తి 41 కోట్లు ఉన్నాయని, అప్పులు 93 కోట్లు ఉన్నాయని పేర్కొన్నారు. కుమార్తె పేరున మరో 13 కోట్ల రూపాయల చరాస్తి ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు.
రెండవ స్థానంలో నిలిచిన పరిమళ్ నత్వాని తన ఆస్తుల విలువను నాలుగు వందల కోట్ల రూపాయలుగా అఫిడవిట్లో పేర్కొన్నారు. ఆయన చరాస్తి 180 కోట్లు, స్థిరాస్తి 179 కోట్లు, బరగారం, రంగురాళ్ల విలువ 1.35 కోట్లు, ఇతర భూమి 6.50 కోట్ల రూపాయలు, 1.65 కోట్ల రూపాయల విలువైన భవనాలు ఉన్నట్లు ప్రకటిరచారు. 203 కోట్ల అప్పులు ఉన్నట్లు పేర్కొన్నారు. తన భార్య పేరిట చరాస్తి 21.25 కోట్లు, స్థిరాస్తి 15 కోట్లు, బంగారం, రంగురాళ్లు కలిపి 5.71 కోట్లు ఉన్నట్లు తెలిపారు. అలాగే ఆమె పేరిట అప్పులు ఆరు కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. ఏది ఏమైనా, తెలుగు దేశం పార్టీ లోగడ రాజ్య సభ కు పంపిన ధనికుల స్థాయికి తగ్గకుండా, తన పార్టీ నుంచి కూడా జగన్ సారు ఓ మోస్తరు ధనికులనే ప్రస్తుతం రాజ్యసభ కు పంపుతున్నారు. దీని ద్వారా ....పైసలున్న వారికి ఏ గవర్నమెంట్ లో అయినా పదవులు దొరుకుతాయనే భరోసా అయితే లభించింది.