టీడీపీకి మరో దెబ్బ.. కేఈ ప్రభాకర్ రాజీనామా
posted on Mar 13, 2020 @ 2:30PM
స్థానిక ఎన్నికల్లో అనుచరులకు అన్యాయం
టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యం దక్కలేదని అసంతృప్తి
తెలుగుదేశం పార్టీని వీడిన కేఈ
కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కేఈ ప్రభాకర్, పార్టీకి రాజీనామా చేశారు. నేడు తన అనుచరులతో సమావేశమైన ఆయన రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో తన అనుచరులకు టికెట్ల కేటాయింపులో తీవ్ర అన్యాయం జరిగిందని భావిస్తున్న ఆయన, తెలుగుదేశం పార్టీని వీడటమే మంచిదన్న నిర్ణయానికి వచ్చేశారని, అందుకే రాజీనామా చేశారని ఆయన వర్గీయులు చెబుతున్నారు.
తెలుగుదేశం పార్టీపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ముఖ్యంగా తనకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న ఆగ్రహం ఆయనలో నెలకొనివుందని అంటున్నారు. కాగా, కేఈ ప్రభాకర్ ఏ పార్టీలో చేరనున్నారన్న విషయమై ఇంకా స్పష్టమైన సమాచారం లేదు. కొందరు వైసీపీలో చేరుతారని, మరికొందరు బీజేపీలోకి వెళతారని ఊహాగానాలు చేస్తున్నారు.