ఏపీ శాంతి భద్రతలపై కేంద్రం ఆరా!
posted on Mar 13, 2020 @ 3:35PM
ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతల పరిస్థితిపై నివేదికను అందజెయ్యాలని గవర్నర్‌ను కేంద్ర హోంశాఖ కోరింది. డీజీపీని హైకోర్టుకు పిలిచి ప్రశ్నించడం, స్థానిక ఎన్నికల సందర్భంలో రాష్ట్రంలో జరుగుతున్న గొడవల నేపథ్యంలో వాస్తవ పరిస్థితులపై నివేదిక పంపమని కేంద్ర ప్రభుత్వం గవర్నర్‌ను సూచించింది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను చేజిక్కించుకోవాలని భావిస్తున్న వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా బీభత్సం సృష్టిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలు, దౌర్జన్యాలపై గవర్నర్‌ను రెండు మూడుసార్లు కలిసి ఫిర్యాదు చేశామని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు చెబుతున్నారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేశారని యనమల ఆరోపిస్తున్నారు.
అంతే కాదు ఒక వ్యూహం ప్రకారం వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలను కవ్వించి తెలుగుదేశం పార్టీ నేతలు వీడియోలు తీస్తున్నారు. ఇలా వీడియోలు తీయడం వల్లే గొడవలు జరుగుతున్నాయని అధికార పక్షం అంటోంది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడానికి ముందు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన పార్టీ నేతలతో పలుమార్లు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి కొన్ని టిప్స్ ఇచ్చారట. వైఎస్సార్‌సీపీ శ్రేణుల కదలికలను మొబైల్ ఫోన్లలో వీడియోలు తీయాలని ఆదేశించారు. దీంతో టీడీపీ కార్యకర్తలు వీడియోలు తీయడంతో గొడవలు జరుగుతున్నాయి.
చిన్నపాటి వాగ్వాదాలు, గొడవలు జరిగితే చిత్రీకరించి తమకు పంపాలని టీడీపీ రాష్ట్ర కార్యాలయం నుంచి సూచనలు వచ్చాయి. ఆ వీడియోలను ఎన్నికల కమిషనర్ ట్విట్టర్ ఎకౌంట్లో పెట్టి దాన్నే ఫిర్యాదుగా తీసుకోవాలని కోరాలని టీడీపీ నాయకత్వం పేర్కొంది. వీడియోలను అనుకూలంగా మలచుకుని సోషల్ మీడియాలో వైరల్ చేయాలని టీడీపీ క్యాడర్‌కు సూచనలు అందినట్లు సమాచారం.
టీడీపీ కార్యకర్తలు ఎక్కడికక్కడ వీడియోలు తీస్తుండడంతో వైఎస్సార్‌సీపీ నాయకులు అడ్డుకుంటున్నారు.
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సదుం గ్రామంలో టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్‌సీపీ నేతలను వీడియోలు తీస్తూ రెచ్చగొట్టడంతో గొడవ జరిగింది. ఈ ఘటనకు కొనసాగింపుగానే అదే నియోజకవర్గంలోని పులిచర్లలోనూ ఘర్షణ రేగింది. వీడియో తీయడం వల్లే పుంగనూరు నియోజకవర్గంలో గొడవ జరగ్గా, చంద్రబాబు ఆ గొడవనే పదేపదే ప్రస్తావించడం గమనార్హం.
వీడియోలు తీస్తూ, కామెంట్లు చేస్తూ రెచ్చగొట్టడం, ఆ తర్వాత జరిగే గొడవలను వీడియోలు తీయడమే కొందరు పనిగా పెట్టుకున్నట్లు తెలిసింది. మాచర్లలోనూ టీడీపీ నాయకులు వీడియోలు తీసి హడావుడి చేయడం వల్లే గొడవ పెరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.
స్థానిక ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై గవర్నర్ కేంద్రానికి ఎలాంటి నివేదిక పంపనున్నారనేది ఆసక్తికరంగా మారింది.