చైనాకు భారత్ మరో పెద్ద షాక్.. మరో 43 యాప్‌ల నిషేధం

భారత్ చైనా సరిహద్దు ఘర్షణల నేపథ్యంలో గత జూన్ లో పలు చైనా యాప్‌లను నిషేధిస్తూ చర్యలు తీసుకున్నకేంద్ర ప్రభుత్వం.. తాజాగా చైనాకు మరో ఝలక్ ఇచ్చింది. ఆ దేశానికి చెందిన 43 యాప్‌లను బ్యాన్ చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మనదేశ సార్వభౌమత్వం, సమగ్రత, రక్షణ, భద్రతకు ముప్పు వాటిల్లుతోందని పేర్కొంటూ ఈ 43 మొబైల్ అప్లికేషన్లను నిషేధిస్తూ సమాచార, సాంకేతిక శాఖ ఈరోజు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అనుబంధ ఇండియన్ సైబర్ క్రైమ్ కో-ఆర్డినేషన్ నుంచి వచ్చిన నివేదికల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐటీ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కొత్తగా బ్యాన్ చేసిన ఈ యాప్స్‌లో చైనా వ్యాపార దిగ్గజ సంస్థ అలీ ఎక్స్‌ప్రెస్ కూడా ఉంది. దానితో పాటు అలీబాబా వర్క్ బెంచ్, హీరోస్ ఎవాల్వ్‌డ్, డింగ్ టాక్ వంటి ఇతర అప్లికేషన్లున్నాయి.    ఇది ఇలా ఉండగా.. ఈ ఏడాది జూన్ 29న ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ సెక్షన్ 69 ఏ కింద 59 మొబైల్ యాప్స్‌ను.. అలాగే సెప్టెంబర్ 2న మరో 118 యాప్‌లను ప్రభుత్వం నిషేధించిన సంగతి తెలిసిందే. వీటిలో ఎక్కువగా చైనీస్ యాప్‌లే. కాగా టిక్‌టాక్, యూసీ బ్రౌజర్, వీ చాట్, లూడో వంటి యాప్‌లు భారతదేశ సమగ్రత, సార్వభౌమత్వానికి భంగం వాటిల్లేలా చేస్తున్నాయంటూ గతంలో ఎన్నో ఆరోపణలు వచ్చాయి.

మాస్క్ తీసేసి.. శానిటైజర్ లో కాలేసిన మంత్రి కేటీఆర్

మాట తప్పే వ్యక్తిని ఏమంటారు? అంటే రాజకీయ నాయకుడు అని చెప్పుకొనే రోజుల్లో బతుకుతున్నాం. ఏదో నూటికో కోటికో ఒకరిద్దరు తప్ప దాదాపు రాజకీయ నాయకులంతా అదే కోవకి చెందిన వాళ్లనేది బహిరంగ రహస్యం. చిన్నదో పెద్దదో ఏదొక విషయంలో, ఏదొక సందర్భంలో మాట మార్చడమో, మాట తప్పడమో చేస్తూనే ఉంటారు. దీనికి తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా అతీతులు కాదు. తాజాగా ఆయన మాస్క్ గురించి ఉపన్యాసం ఇచ్చిన 24 గంటల్లోనే శానిటైజర్ లో కాలేశారు.   యాంకర్ సుమ తాజాగా మంత్రి కేటీఆర్ ని ఇంటర్వ్యూ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఇంటర్వ్యూలో హైదరాబాద్ అభివృద్ధి అంశంతో పాటు పలు విషయాలను పంచుకున్నారు. అదంతా బాగానే ఉంది కానీ, ఇంటర్వ్యూ స్టార్టింగ్ లో కేటీఆర్ చెప్పిన దానికి, ఇంటర్వ్యూ ముగిసిన కొద్ది గంటలకు ఆయన చేసిన దానికి అసలు పొంతనే లేదు. కేటీఆర్ మాస్క్ లేకుండా ఇంటర్వ్యూలో పాల్గొనడంతో.. మిమ్మల్ని మాస్క్ లేకుండా చూసి ఎన్ని రోజులైంది అని సుమ ప్రశ్నించింది. దీంతో పొంగిపోయిన కేటీఆర్ మాస్క్ గురించి చిన్నపాటి ఉపన్యాసమే ఇచ్చారు. మనిషికి ముక్కు ఎంత ముఖ్యమో ప్రస్తుతం పరిస్థితుల్లో మాస్క్ కూడా అంతే ముఖ్యం అన్నట్టుగా చెప్పారు. ఆరేడు నెలల నుంచి తాను ఎక్కడికెళ్లినా మాస్క్ ధరించే వెళ్తున్నానని.. లాక్ డౌన్ సమయంలో కంటైన్మెంట్ జోన్లలో తిరిగాను, కరోనా పేషెంట్స్ ని కలిసాను.. అయినా తనకి కరోనా సోకలేదని, ఎప్పుడూ మాస్క్ ధరిస్తూ ఉండటమే దానికి కారణమని చెప్పుకొచ్చారు. అంతేకాదు, కొందరుంటారు పేరుకి మాస్క్ పెట్టుకుంటారు, మాట్లాడేటప్పుడు మాస్క్ తీసేసి మాట్లాడతారు అంటూ సెటైర్స్ కూడా వేశారు.   అబ్బబ్బా మాస్క్ గురించి మంత్రి కేటీఆర్ ఎంత గొప్పగా సెలవిచ్చారో కదా. ఆగండి ఆగండి కంగారుపడి పొగిడేసి మనం కూడా ఆయనలాగా శానిటైజర్ లో కాలేస్తే ఎలా?. మాస్క్ గురించి ఉపన్యాసం ఇచ్చిన 24  గంటల్లోనే కేటీఆర్ మాస్క్ గొప్పతనాన్ని మరిచారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ఆయన.. నిన్న ప్రచారంలో మాస్క్ ని ముక్కుకి పెట్టుకోవడమే మరిచారు. మాస్క్ లేకుండా పబ్లిక్ లోకి రానని చెప్పిన ఆయన, కొందరు మాట్లాడేటప్పుడు మాస్క్ తీసేస్తున్నారని సెటైర్స్ వేసిన ఆయన.. చెప్పిన 24 గంటల్లోనే తప్పులో కాలేశారు. ఏదో ఫార్మాలిటీకి మెడలో మాస్క్ తగిలించుకొని ప్రచారంలో పాల్గొన్నారు. ఇలా అయితే ఎలా మంత్రి గారు. అసలే మిమ్మల్ని ప్రజలు మాస్క్ కి బ్రాండ్ అంబాసిడర్ అనుకుంటున్నారు. మీరు మాస్క్ మరిచి మా మనోభావాలు హర్ట్ చేయకండి. దయచేసి వాక్సిన్ వచ్చేవరకు మాస్క్ తోనే కనిపించండి.

పవన్ కళ్యాణ్ కు బీజేపీ బిగ్ షాక్.. తిరుపతి నుండి మేమే పోటీ చేస్తాం

జీహెచ్ఎంసీ ఎన్నికలలో బీజేపీతో అవగాహనకు వచ్చిన జనసేన చివరి నిమిషంలో బరి నుండి తప్పుకుంది. బీజేపీ అగ్రనేతల రాయబారం తర్వాత ఎన్నికల బరి నుంచి తప్పుకునేందుకు పవన్ కల్యాణ్ అంగీకరించారు. అయితే త్వరలో ఏపీలోని తిరుపతి లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక జరగబోతుండడంతో.. ఆ సీట్‌‌ను జనసేన కోరుకుంటోంది. బీజేపీ కోసం జిహెచ్ఎంసి ఎన్నికల నుండి తప్పుకున్నామని, దీనికి ప్రతిగా తిరుపతి సీటును తమకు ఇవ్వాలని కోరడానికి జనసేన నేతలు పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ ఢిల్లీ చేరుకున్నారు. అయితే నిన్న సోమవారం నుంచి ఇప్పటివరకు వారికి బీజేపీ అగ్రనేతల అపాయింట్ మెంట్ ఇంకా దొరకలేదు. దీంతో బీజేపీ అగ్రనేతలను కలవడం కోసం పవన్, మనోహర్ ఎదురు చూస్తున్నారు.   ఇది ఇలా ఉండగా తిరుపతి లోకసభ సీటును జనసేనకు ఇవ్వబోమని, తామే అక్కడ నుండి పోటీ చేస్తామని బీజేపీ ఎంపీ జీవీఎల్ స్పష్టం చేసారు. తమ పార్టీ గతంలో కూడా తిరుపతి లోక్ సభ స్థానం నుండి గెలిచిందని ఆయన గుర్తు చేశారు. మరోపక్క తిరుపతిలో పోటీ చేస్తామని ముందే ప్రకటించిన ఎపి బీజేపీ ఇన్ ఛార్జ్ సునీల్ దియోధర్ కూడా జనసేనకు అడ్డుపడుతున్నట్లు తెలుస్తోంది. తిరుపతిలో పోటీ చేసి.. పవన్ కల్యాణ్ మద్దతుతో వైసీపీని ఓడించొచ్చని.. దీంతో ఏపీలో తమ పరపతి పెరుగుతుందని.. పైగా సీఎం జగన్ కూడా తమ కంట్రోల్ లో ఉంటాడని బిజెపి స్కెచ్ వేసింది. ఇంతకూ బీజేపీకి గ్రేటర్ ఎన్నికలలో చేసిన సాయానికి బదులుగా మిత్రపక్షం జనసేనకు తిరుపతి సీటు ఇస్తారా.. లేక అక్కడ కూడా బీజేపీ నే పోటీ చేస్తుందా వేచి చూడాలి.

బీజేపీ దేశాన్ని అమ్మేస్తోంది! 50 ప్రశ్నలు సంధించిన కేటీఆర్‌

బీజేపీకి అవకాశం ఇస్తే హైదరాబాద్‌ను కూడా అమ్మేస్తారని విమర్శించారు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. ఇప్పటికే మోడీ సర్కార్ భారతదేశాన్ని అమ్మేస్తోందని ఆరోపించారు. అన్నింటినీ ప్రైవేట్‌పరం చేయడమే బీజేపీ పాలసీ అన్నారు కేటీఆర్. రైల్వే రంగాన్ని ఎందుకు ప్రైవేటీకరణ చేస్తున్నారో చెప్పాలన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయని హామీలంటూ బీజేపీ విడుదల చేసిన ఛార్జ్‌షీట్‌పై మంత్రి కేటీఆర్‌ కౌంటర్‌ ఇచ్చాడు. బీజేపీ నేతలు గోబెల్స్‌ కజిన్స్‌లా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కేంద్రం మంత్రులు సైతం అస్యతాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల కష్టాలను తీర్చినందుకా టీఆర్‌ఎస్‌ ప్రభత్వుంపై చార్జ్‌షీట్‌ విడుదల చేశారని బీజేపీ నేతలను ప్రశ్నించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో రైతుబంధు అమలు చేస్తున్నామని చెప్పారు. దేశంలో ఎక్కడలేని విదంగా 24 గంటల కరెంట్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణాయే అన్నారు. తెలంగాణ నెంబర్‌ వన్‌ రాష్ట్రమని కేంద్రమంత్రులు చెప్పారని గుర్తుచేశారు.    బీజేపీకి 50 ప్రశ్నలు సంధించారు కేటీఆర్. లోయర్‌ సీలేరును తీసుకెళ్లి ఏపీలో కలిపింది బీజేపీ కాదా?అని ప్రశ్నించారు. పేకాట క్లబ్‌లు మూసివేయించినందుకా మాపై ఛార్జిషీట్‌? లక్షల మంది చిరు వ్యాపారుల పొట్టగొట్టారు.. వారు భాజపాపై ఛార్జిషీట్‌ వేయాలి. కరోనా సమయంలో చనిపోయిన వలస కార్మికుల ఆత్మలు ఛార్జిషీట్‌ వేయాలి అన్నారు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు పెడుతున్నందుకు బీజేపీపై రైతులు ఛార్జిషీట్‌ వేయాలన్నారు. పెట్టు బడుల ఉపసంహరణ దేశ భవిష్యత్‌ కోసమా.. గుజరాత్‌ పెద్దల కోసమా? అని ప్రశ్నించారు.  ఐటీఐఆర్‌ రద్దు చేసింది ఎవరు? ఆరేళ్ల లో హైదరాబాద్‌కు బీజేపీ ఏం చేసిందో చెప్పగలరా? అని బీజేపీ నేతలను నిలదీశారు. ఇంటింటికి మంచి నీళ్లు, వేలాది గురుకులాలు పెట్టి పేద విద్యార్థులను చదివిస్తున్నందుకే  టీఆర్‌ఎస్‌పై చార్జ్‌షీట్‌ విడుదల చేశారా? అని బిజేపీ నేతలను ప్రశ్నించారు కేటీఆర్.

జీహెచ్ఎంసీకి కేంద్ర నిధులు ఇవ్వలేమన్న కిషన్! పార్టీకి భారమంటూ కేడర్ ఫైర్ 

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో విజయం కోసం దూకుడుగా పోరాడుతున్న బీజేపీకి సొంత పార్టీ నేతలే బ్రేకులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. నగరం నుంచే లోక్ సభకు ప్రాతినిధ్య వహిస్తూ కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి తీరుతో కమలం పార్టీకి ఇబ్బందులు వస్తున్నాయని చెబుతున్నారు. ఎన్నికల ప్రచారం హోరాహారీగా జరుగుతున్న సమయంలో కేడర్ లో జోష్ నింపాల్సిన కిషన్ రెడ్డి.. పార్టీకి ఇబ్బంది కలిగించేలా మాట్లాడుతున్నారన్న చర్చ బీజేపీలోనే జరుగుతోంది. ముఖ్యంగా వరద సాయం, కేంద్ర నిధులపై ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగిస్తున్నాయని చెబుతున్నారు. కేంద్ర మంత్రిగా, నగర ఎంపీగా గ్రేటర్ ఎన్నికల్లో పార్టీని పరుగులు పెట్టాంచాల్సిన కిషన్ రెడ్డే.. పార్టీ భారంగా మారారనే చర్చ బీజేపీ నుంచే వినిపిస్తోంది.    జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వరద సాయం అంశం కీలకంగా మారింది. ప్రభుత్వం చేసిన 10 వేల రూపాయల ఆర్థిక సాయం కొందరికి మాత్రమే అందింది. దీంతో సాయం అందని వారంతా కేసీఆర్ సర్కార్ పై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. దీన్ని క్యాష్ చేసుకునేందుకు విపక్షాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. బీజేపీని గెలిపిస్తే వరద బాధితులకు సాయంగా 25 వేల రూపాయలు ఇస్తామని ప్రకటించారు బండి సంజయ్. ఇది జనంలోకి బాగా వెళ్లింది. ఇది గ్రహించిన  అధికార పార్టీ నేతలు అప్రమత్తమయ్యారు. వరద సాయం చేసేది జీహెచ్ఎంసీ కాదని, రాష్ట్ర ప్రభుత్వమే నిధులు ఇచ్చిందని.. టీఆర్ఎస్సే ఇంకా మూడేళ్లు అధికారంలో ఉంటుంది కాబట్టి... సాయం చేయడం తమతోనే సాధ్యమని ఎన్నికల ర్యాలీలలో చెబుతూ వస్తున్నారు మంత్రి కేటీఆర్. ఇలాంటి సమయంలో కేంద్రం నుంచి నిధులు తెచ్చి వరద బాధితులకు సాయం చేస్తామని కిషన్ రెడ్డి ప్రకటిస్తే బీజేపీకి ఎంతో బూస్ట్ వచ్చేది. అయితే అలాంటి ప్రకటన చేయని కిషన్ రెడ్డి.. సంజయ్ హామీనే తప్పనే అర్దం వచ్చేలా మాట్లాడారు. స్థానిక సంస్థలకు కేంద్రం నిధులు ఇవ్వదని, అలా ఇవ్వడానికి చట్టాలు ఒప్పుకోవని చెప్పారు కిషన్ రెడ్డి.    కిషన్ రెడ్డి ప్రకటనతో కమలం నేతలు అవాక్కయ్యారట. సంజయ్ ఇచ్చిన వరద సాయం హామీ వల్ల వచ్చిన మైలేజీ అంతా కిషన్ రెడ్డి ప్రకటనతో పోయిందని గ్రేటర్ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారట. వరద సాయం, కేంద్ర నిధులపై  కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తమకు అనుకూలంగా మలుచుకుంది టీఆర్ఎస్. కిషన్ రెడ్డి కామెంట్లను నిమిషాల్లో వైరల్ చేసింది. కేంద్రం నిధులు ఇవ్వదని కేంద్రమంత్రి చెబుతుంటే.. ఇంటికి 25 వేల రూపాయలు సాయం చేస్తామంటూ ప్రజలను బండి సంజయ్ మోసం చేస్తున్నారంటూ.. ఇద్దరు మాట్లాడిన వీడియోలను జనంలోకి వదిలారు కారు పార్టీ నేతలు. ఆ వీడియోలు చూసిన జనాలకు కూడా.. బీజేపీ ఎక్కడి నుంచి తెచ్చి వరద సాయం చేస్తుందనే అనుమానాలు వస్తున్నాయని చెబుతున్నారు. ఎన్నికల ప్రచారాల్లోనూ మంత్రి కేటీఆర్ పంచ్ డైలాగులతో విరుచుకుపడుతుంటే కిషన్ రెడ్డి మాత్రం సొల్లు ప్రసంగాలు చేస్తున్నారని.. ఇలా అయితే టీఆర్ఎస్ ను ఎదుర్కోవడం కష్టమనే అభిప్రాయం కమలం కేడర్ లో వస్తోంది అంటున్నారు. దుబ్బాక ఉప ఎన్నికలోనూ కిషన్ రెడ్డి నామమాత్రంగా వ్యవహరించారని బీజేపీ నేతలు చెబుతున్నారు.     అంతేకాదు కిషన్ రెడ్డి ఎంఐఎం నేతలతో సన్నిహితంగా ఉంటారనే ప్రచారం ఉంది.  ఎంఐఎం సహకారం వల్లే అంబర్ పేట నుంచి ఎమ్మెల్యేగా  ఆయన వరుసగా గెలుస్తూ వచ్చారని కూడా చెబుతారు. ఇప్పుడు ఇది కూడా గ్రేటర్ ప్రచారంలో బీజేపీకి ఇబ్బందిగా మారిందంటున్నారు. గతంలో అసద్ తో కిషన్ రెడ్డి కలిసి ఉన్న ఫోటోలు, వారిద్దరు వేదికలపై నవ్వుతూ మాట్లాడుతూ కూర్చున్న వీడియోలను కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తలు వైరల్ చేస్తున్నారు. దీంతో గ్రేటర్ ఎన్నికల్లో ఎంఐఎం పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న కమలం నేతలకు ఇది మైనస్ గా మారిందని బీజేపీ నేతలే చెబుతున్నారు. గ్రేటర్ టికెట్ల  విషయంలోనూ కిషన్ రెడ్డి వ్యవహారం వల్లే కొన్ని చోట్ల కార్యకర్తలు రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చిందని చెబుతున్నారు.

తిరుపతి కోసం గ్రేటర్ ఫిక్సింగ్? పవన్ పై రోజా పంచ్ 

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికకు సంబంధించి పవన్ కల్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా. గ్రేటర్ ఎన్నికల్లో  బీజేపీ కోసం జనసేన తప్పుకుందని చెప్పారు. తిరుపతిలో సీటు కావాలని అన్నాడు అంటే మ్యాచ్ ఫిక్సింగ్ అని భావించాలా?.. గ్రేటర్ లో వదులుకున్నాం కాబట్టి తిరుపతిలో సీటు ఇవ్వాలని ఒప్పందం కుదుర్చుకున్నారా?" అని పవన్ ను టార్గెట్ చేస్తూ రోజా ప్రశ్నించారు. బీజేపీకి కొన్ని ఓట్లు పడాలి, టీఆర్ఎస్ ఓడాలి అంటూ ఎన్నికల నుంచి పవన్ వైదొలిగారు.. ఇప్పుడు తిరుపతికొచ్చి పోటీచేస్తున్నారని రోజా అన్నారు. గతంలో తన సొంత నియోజకవర్గంలో, తన సొంతవాళ్ల మధ్యే గెలవలేని వ్యక్తి ఇప్పుడు తిరుపతి వచ్చి ఏం చేస్తాడని ఆమె ప్రశ్నించారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా తిరుపతిలో గెలిచేది వైసీపీనే అని స్పష్టం చేశారు.    జనసేన పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు రోజా. జనసేన పార్టీయా లేక కేటీఆర్ అన్నట్టు మోడీ భజనసేన పార్టీయా అనేది అర్థం కావడంలేదని రోజా ఎద్దేవా చేశారు. పార్టీ స్థాపించిన వెంటనే ఎన్నికలకు పోకుండా టీడీపీ, బీజేపీలకు  ప్రచారం చేసి వాళ్లకు ఓట్లు వేయాలని ప్రజలకు చెప్పారని ఆమె విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్న మోడీ గారు ఇవ్వకపోయినా పవన్ ఏమీ మాట్లాడలేదని రోజా విమర్శించారు.

రోహింగ్యాలు ఉంటే అమిత్ షా ఏం చేస్తున్నారు? బీజేపీకి అసద్ కౌంటర్ 

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో మాటల తూటాలు పేలుతున్నాయి. టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం నేతలు హాట్ కామెంట్స్ తో గ్రేటర్ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఎంఐఎం టార్గెట్ గా బీజేపీ చేస్తున్న ఆరోపణలకు కౌంటరిచ్చారు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. ఎంఐఎంకు ఓటు వేస్తే టీఆర్‌ఎస్ లబ్ధి పొందుతుందన్న కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. ఓటర్ల జాబితాలో 30 నుంచి 40 వేల మంది రోహింగ్యాలు ఉన్నారన్న బీజేపీ ఆరోపణలు చేస్తోందని చెప్పిన అసద్.. రోహింగ్యాల పేర్లు ఓటర్ల జాబితాలో ఉంటే మరి దేశానికి హోం మంత్రిగా ఉన్న అమిత్‌షా ఏం చేస్తున్నారని ఆయన నిలదీశారు. అమిత్ షా నిద్రపోతున్నారా? అంటూ ఆయన ఎద్దేవా చేశారు. అంత మంది రోహింగ్యాలు ఓటర్ల జాబితాలోకి ఎలా వచ్చారని అమిత్ షా ఎందుకు విచారణ జరపించట్లేదని అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. ఆ రోహింగ్యాలు ఎవరో బీజేపీ వెల్లడించాలని అన్నారు. విద్వేషం సృష్టించడమే బీజేపీ నేత ఉద్దేశమని అసద్ ఆరోపించారు.

రాజాసింగ్ వెనక ఎవరున్నారు? తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది?

మూడు గ్రూపులు.. ఆరు అలకలు.. పన్నెండు గొడవలు. ఇదీ గ్రేటర్ హైదరాబాద్ లో ప్రస్తుతం బీజేపీ పరిస్థితి. తెలంగాణ రాజకీయాల్లో కాక రేపిన దుబ్బాక ఉప ఎన్నికలో దక్కిన విజయం బీజేపీకి బూస్ట్ ఇచ్చింది. దుబ్బాక  జోష్ తో జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ కమలం వికసిస్తుందని, బల్దియాపై కాషాయ జెండా ఎగురవేస్తామని బీజేపీ నేతలు ప్రకటనలు చేశారు. తీరా ఎన్నికలు వచ్చాకా మాత్రం ఆ పార్టీలో నిరుత్సాహం కనిపిస్తోందని చెబుతున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో దూసుకుపోతుంటే.. వర్గ పోరుతో కమలనాధులు వెనకబడ్డారనే చర్చ జరుగుతోంది. నగర పరిధిలోని నేతలు రెండు వర్గాలుగా విడిపోవడంతో కేడర్ లోనూ గందగోళం నెలకొందని చెబుతున్నారు.                  నగరంలో బీజేపీకి ఉన్న ఒకే ఒక ఎమ్మెల్యే రాజాసింగ్. ఆయన తీరుతో గ్రేటర్ ఎన్నికల వేళ బీజేపీకి ఇబ్బందులు వచ్చాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజాసింగ్ తీరు బీజేపీలో మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉంది. హిందూ అనుకూల, ఎంఐఎం వ్యతిరేక ప్రకటనలు చేస్తూ కేడర్ లో జోష్ నింపుతుంటారు రాజాసింగ్. అయితే పార్టీ వ్యవహారాల్లో మాత్రం ఆయన ఎప్పుడూ కాంట్రవర్సీనే. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వర్గీయుడిగా ముద్రపడిన రాజాసింగ్.. కావాలనే బండి సంజయ్ కి సహకరించడం లేదనే చర్చ జరుగుతోంది. బీజేపీలో తీవ్ర కలకలం రేపిన రాజాసింగ్ ఆడియో వెనక కిషన్ రెడ్డి పాత్ర ఉందని తెలుస్తోంది.  గ్రేటర్ ఎన్నికల్లో తానే చక్రం తిప్పాలని కిషన్ రెడ్డి భావించారట. అయితే బండి సంజయ్ సిటీపై ఫోకస్ చేస్తూ సభలు, సమావేశాలు పెట్టారు. సంజయ్ దూకుడుతో ఆయనకు నగరంలో బలమైన వర్గం తయారైందట. గ్రేటర్ టికెట్ల ఎంపికలోనూ కిషన్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరించాలని చూసినా.. సంజయ్ టీమ్ వ్యతిరేకించిందని తెలుస్తోంది. సిటీలో సంజయ్ టీమ్ పెరగడాన్ని కిషన్ రెడ్డి జీర్ణించుకోలేకపోయారని చెబుతున్నారు. అందుకే సంజయ్ కు వ్యతిరేకంగా ఎమ్మెల్యే రాజాసింగ్ తో కిషన్ రెడ్డి డ్రామా ఆడిస్తున్నారని బీజేపీ కార్యకర్తల్లోనే చర్చలు జరుగుతున్నాయి.   కిషన్ రెడ్డి మనిషిగా ముద్రపడిన రాజాసింగ్.. ఆయన చెప్పినట్లే చేస్తారని చెబుతుంటారు. కిషన్ రెడ్డి పార్టీ చీఫ్ గా ఉన్నప్పుడు రాజాసింగ్ పార్టీ కార్యాలయంలో యాక్టివ్ గా ఉండేవారట. ఎప్పుడు అక్కడే ఉండేవారంటున్నారు. లక్ష్మణ్ కు పార్టీ పగ్గాలు అప్పగించిన తర్వాత కిషన్ రెడ్డి పార్టీ కార్యాలయం రావడం మానేశారట. పార్టీ కార్యాలయంలో ఆయన ప్రెస్ మీట్లు కూడా పెట్టలేదంటున్నారు. కిషన్ రెడ్డి బాటలోనే రాజాసింగ్ కూడా లక్మణ్ పార్టీ ప్రెసిడెంట్ గా ఉన్నన్ని రోజులు.. పార్టీ కార్యాలయం వైపు వెళ్లలేదని చెబుతున్నారు. ఇప్పుడు బండి సంజయ్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న తర్వాత కూడా రాజా సింగ్ తీరు మారలేదంటున్నారు. కిషన్ రెడ్డితో సంజయ్ కు విభేదాలు ఉన్నందునే.. సంజయ్ కి వ్యతిరేకంగా రాజా సింగ్ రాజకీయం చేస్తున్నారనే చర్చ జరుగుతోంది.   గోషామహాల్ నియోజకవర్గం పరిధిలో జరిగిన టికెట్ల గొడవ, పార్టీ కార్యాలయం దగ్గర ధర్నాలు, బీఫామ్ తీసుకునేందుకు వచ్చిన దళిత అభ్యర్థిపై దాడి చేసి బట్టలు చించేయడం వంటి ఘటనలు పార్టీ పరువు తీశాయనే చర్చ బీజేపీలో జరుగుతోంది. బండి సంజయ్ పై కేంద్రానికి ఫిర్యాదు చేసినట్లు ఎమ్మెల్యే రాజాసింగ్ ట్వీట్ వైరల్ కావడం కమలంలో కల్లోలం రేపింది. అయితే రాజాసింగ్ పేరుతో ఫేక్ ట్వీట్ వైరల్ అవుతోందని కమలనాధులు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తుండగానే.. రాజా సింగ్ ఆడియో బయటికి వచ్చింది. బండి సంజయ్ తీరుపై రాజా సింగ్ తీవ్ర ఆరోపణలు చేస్తున్న ఆ వీడియో నిమిషాల్లోనే వైరల్ గా మారింది. గ్రేటర్ నామినేషన్ల సమయంలోనే జరిగిన ఈ రెండు ఘటనలు  పార్టీకి నష్టం కల్గించాయనే అభిప్రాయం తెలంగాణ బీజేపీ నేతల నుంచి వస్తోంది. సిటీలో ఉన్న ఒక్క ఎమ్మెల్యేనే కలిసి రాకపోతే.. జీహెచ్ఎంసీని ఎలా ముందుకు తీసుకెళతారనే చర్చ కొన్ని వర్గాల ఓటర్లలో వచ్చిందని చెబుతున్నారు. ఇది పార్టీకి చాలా మైనస్ అయిందని, కేడర్ లోనూ జోష్ తగ్గిందని చెబుతున్నారు.    తెలంగాణ బీజేపీలో మరో కీలక పరిణామం చోటు చేసుకుందని చెబుతున్నారు. లక్ష్మణ్ పార్టీ చీఫ్ గా ఉన్నప్పుడు కిషన్ రెడ్డి ఆయనకు సపోర్ట్ చేయలేదని టాక్ ఉంది. ఇప్పుడు మాత్రం ఇద్దరూ కలిసి తీరుగుతున్నారు. తెలంగాణ బీజేపీకి ఇప్పటివరకు నగరం నేతే అధ్యక్ష బాథ్యతలు చేపట్టారు. మొదటిసారి సిటీయేతర వ్యక్తి పార్టీ పగ్గాలు చేపట్టారు. దీంతో గుర్రుగా ఉన్న నగర నేతలంతా ఏకమై.. సంజయ్ ని టార్గెట్ చేస్తున్నారని చెబుతున్నారు. అందుకే సంజయ్ పార్టీ పగ్గాలు చేపట్టగానే... గతంలో ఉప్పు నిప్పులా ఉన్న  కిషన్ రెడ్డి, లక్ష్మణ్ కలిసిపోయారని చెబుతున్నారు. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ తో పొత్తుపై మాట్లాడేందుకు కూడా కిషన్ రెడ్డి, లక్ష్మణ్ వెళ్లారు. పార్టీ అధ్యక్షుడు సంజయ్ హైదరాబాద్ లోనే ఉన్నా ఆయనను తీసుకువెళ్లలేదు. దీంతో బండికి చెక్ పెట్టేందుకే కిషన్ రెడ్డి, లక్ష్మణ్ కలిసిపోయారనే ప్రచారానికి బలం చేకూరుతోంది. మొత్తంగా పార్టీ నేతల వర్గపోరుతో గ్రేటర్ ఎన్నికల్లో పార్టీకి నష్టం జరుగుతుందనే ఆందోళన కమలం  కేడర్ లో వ్యక్తమవుతోంది. దుబ్బాక ఇచ్చిన బూస్ట్త్ తో గ్రేటర్ లో మరింత స్పీడుగా వెళ్లాల్సిన పార్టీ.. ముఖ్య నేతల తీరుతో మూల్సం చెల్లించుకోవాల్సిన పరిస్థితికి వచ్చిందని వారు ఆవేదన చెందుతున్నారట.  

కాంగ్రెస్ మేనిఫెస్టో.. అంతకు మించి.. వరద బాధితులకు రూ.50 వేలు

జీహెచ్ఎంసీ ఎన్నికలకు కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది. గాంధీభవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆ పార్టీ నేతలు మాణికం ఠాగూర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి‌, భట్టి విక్రమార్క మేనిఫెస్టోను విడుదల చేశారు. మేనిఫెస్టోలో అధికార పార్టీ టీఆర్ఎస్ ని మించి ఉచిత హామీలను కాంగ్రెస్ ఇచ్చింది. వరద బాధితులకు రూ.50 వేలు ఆర్థిక సాయం ఇస్తామని హామీ ఇచ్చింది. ఇళ్లు దెబ్బతిన్న వారికి రూ.2.5 లక్షల నుంచి 5 లక్షల సాయం అందజేస్తామని వెల్లడించింది. పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.2.5 లక్షలు, పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.5 లక్షలు ఇస్తామని తెలిపింది. వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ. 25 లక్షల పరిహారం అందజేస్తామని ప్రకటించింది.   ఎంఎంటీఎస్‌, మెట్రోల్లో దివ్యాంగులు, మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని వెల్లడించింది. అర్హులందరికీ డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఇస్తామని తెలిపింది. 80 గజాలలోపు స్థలంలో ఇల్లు కట్టుకున్నవారికి ఆస్తి పన్ను రద్దు అని ప్రకటించింది. క్షురకులు, రజకులు, వడ్రంగులకు చెందిన దుకాణాలకు ఆస్తిపన్నుతో పాటు విద్యుత్ బిల్లులు మాఫీ చేస్తామని తెలిపింది. ధరణి పోర్టల్ రద్దుకు కృషి చేస్తామని తెలిపింది. ప్రతి కుటుంబానికి 30 వేల లీటర్ల ఉచిత మంచినీరు అందజేస్తామని కాంగ్రెస్ వెల్లడించింది.

ముగ్గురు ఫైర్ బ్రాండ్లకు సవాల్! మల్కాజ్ గిరిలో ఆర్ఆర్ఆర్ వార్

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపు కోసం ప్రధాన పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. గ్రేటర్ పోరులో మల్కాజిగిరి నియోజకవర్గం కీలకంగా మారింది. మల్కాజ్ గిరి నియోజకవర్గానికి మూడు ప్రధాన పార్టీల నుంచి ముగ్గురు పైర్ బ్రాండ్ నేతలు ఇంచార్జులుగా ఉన్నారు. వారందరూ పేరు విచిత్రంగా ఆర్ అక్షరంతోనే ప్రారంభం అవుతోంది. దీంతో మల్కాజ్ గిరి నియోజకవర్గం పరిధిలో ట్రిబుల్ ఆర్.. ఆర్ఆర్ఆర్ ఫైట్ జరుగుతోందని ప్రచారం జరుగుతోంది.  మల్కాజ్ గిరి ఇంచార్జ్ గా మంత్రి ఈటెల రాజేందర్ ను నియమించింది అధికార పార్టీ. ఆయన ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టేశారు. కార్యకర్తల సమావేశాలు ముగించుకుని ఇంటింటి ప్రచారం చేస్తున్నారు రాజేందర్. బీజేపీ ఇంచార్జుగా ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ లీడర్.. తెలంగాణలో కాక రేపిన దుబ్బాక ఉప ఎన్నిక విజేత రఘునందన్ రావు ఉన్నారు. రఘునందన్ కూడా తన మార్క్ ప్రచారం స్టార్ చేశారు. తన సొంత నియోజకవర్గం కావడంతో మల్కాజ్ గిరిని సవాల్ గా తీసుకున్నారు తెలంగాణ ఫైర్ బ్రాండ్ లీడర్ రేవంత్ రెడ్డి. ఆయన కూడా కాంగ్రెస్ అభ్యర్థుల విజయం కోసం సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. మల్కాజ్ గిరిలో ముగ్గురు ఫైర్ బ్రాండ్ లీడర్లు మకాం వేయడంతో రాజకీయం హీటెక్కిస్తోంది. మల్కాజ్ గిరి లోకల్ ఎమ్మెల్యే మైనం పల్లి హన్మంతరావు కూడా ఫ్రైర్ బ్రాండే. గ్రేటర్ ఎన్నికల్లో ఆయన మరింత దూకుడుగా  వెళుతున్నారు. దీంతో మల్కాజ్ గిరిలో ముగ్గురు ఫైర్ బ్రాండ్ల మధ్య ప్రతిష్టాత్మక  సమరం సాగుతోందనే చర్చ నియోజకవర్గంలో జరుగుతోంది.       మల్కాజ్ గిరి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో తొమ్మిది డివిజన్లు ఉన్నాయి. 2016 గ్రేటర్ ఎన్నికల్లో తొమ్మిదికి తొమ్మిది డివిజన్లు గెలిచి క్లీన్ స్వీప్ కొట్టింది అధికార టీఆర్ఎస్. మరోసారి అది రిపీట్ చేయాలనే టార్గెట్ తో మంత్రి ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే మైనం పల్లి హన్మంతరావు ఎత్తులు వేస్తున్నారు. నియోజకవర్గంలో కొందరు సిట్టింగులను మార్చింది గులాబీ పార్టీ. మంత్రి పదవిపై చాలా రోజులుగా ఆశలు పెట్టుకున్నారు మైనంపల్లి. ఈసారి అవకాశం వస్తుందని భావించినా.. ఆయనకు నిరాశే ఎదురైంది. అయితే మల్కాజ్ గిరి  పరిధిలోని అన్ని డివిజన్లలో గెలిచి కేసీఆర్ దగ్గర మార్కులు కొట్టేయాలని మైనంపల్లి భావిస్తున్నారట. నియజకవర్గం పరిధిలో  గత అరేండ్లలో జరిగిన అభివృద్ది, ఇటీవల చేసిన వరద సాయం తమకు కలిసి వస్తుందని కారు పార్టీ నేతలు ఆశిస్తున్నారు. అయితే వరద సాయం కొంత మందికే అందడంతో మిగిలివారంతా ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నారని తెలుస్తోంది. వరదల సమయంలో ప్రభుత్వం, స్థానిక కార్పొరేటర్లు, బల్దియా అధికారులు తమను పట్టించుకోలేదని బాధితులు ఆరోపిస్తున్నారు.  దీంతో గులాబీ నేతల్లో కొంత ఆందోళన కనిపిస్తుందని చెబుతున్నారు. అందుకే బీజేపీ వల్లే వరద సాయం ఆగిపోయిందనే ప్రచారం ఎక్కువ చేస్తున్నారు టీఆర్ఎస్ నేతలు.   తెలంగాణ పీసీసీ రేసులో ఉన్న ఎంపీ రేవంత్ రెడ్డి.. గ్రేటర్ ఎన్నికలను సవాల్ గా తీసుకున్నారు. తన లోక్ సభ పరిధిలోకి వచ్చే మల్కాజ్ గిరి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ఎక్కువ డివిజన్లు గెలిచి పీసీసీకి లైన్‌ క్లియర్ చేసేకునేందుకు తన వ్యూహాలతో దూసుకెళ్తున్నాడు. మల్కాజిగిరి పరిధిలో తక్కువ సీట్లు సాధిస్తే పీసీసీ చీఫ్ పదవికి ఎఫెక్ట్‌ పడుతుందని భావిస్తున్న రేవంత్.. నియోజకవర్గ పరిధిలోని డివిజన్లలో గెలుపును సెమీ ఫైనల్‌గా భావించి తన శక్తిని మొత్తం ప్రచారంలో దారపోస్తున్నారు.  ఓటర్లను కాంగ్రెస్ వైపు మళ్లించేలా గ్రౌండ్‌ వర్క్ ప్రిపేర్ చేస్తున్నట్లు సమాచారం. ఇక్కడ ఎక్కువ డివిజన్లు గెలిస్తే.. పీసీసీ చీఫ్ విషయంలో వ్యతిరేకుల నోళ్లు మూయించొచ్చని భావిస్తున్నట్లుగా పార్టీలోని రేవంత్ రెడ్డి అనుచరుల్లో చర్చ నడుస్తోంది. వరద సాయంలో అక్రమాలు జరుగుతున్నాయంటూ రేవంత్ రెడ్డి చేసిన పోరాటానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. రేవంత్ పోరాటం వల్లే మీసేవా కేంద్రాల్లో దరఖాస్తులు తీసుకోవాలని సర్కార్ నిర్ణయించిందని కాంగ్రెస్ చెబుతోంది. ఇదే విషయాన్ని జనాల్లోకి తీసుకెళుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు హస్తం లీడర్లు.    దుబ్బాక వేవ్ గ్రేటర్‌లోనూ కొనసాగించి టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీయే అని నిరూపించేందుకు రఘునందన్‌ రావు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. దుబ్బాక విజయం వన్‌ టైమ్‌ వండరే అని టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు కామెంట్ చేయడాన్ని ఛాలెంజ్‌గా తీసుకున్న రఘునందన్ రావు.. మల్కాజ్ గిరిలో  ఎక్కువ డివిజన్లు సాధించి మరోసారి హైకమాండ్‌ దృష్టిలో తనపేరు మారు మోగేలా చేసుకోవాలని ‌ప్లాన్ చేస్తున్నాడు. రఘునందన్ ను ఇంచార్జ్ గా నియమించడంతో మల్కాజ్ గిరి బీజేపీ కేడర్ లోనూ జోష్ పెరిగిందని చెబుతున్నారు. కేసీఆర్ సర్కార్ వైఫల్యాలు, వరద సాయంలో జరిగిన అవినీతే ప్రధాన ప్రచారస్త్ర్రంగా చేసుకుంటున్నారు రఘునందన్ రావు.     మొత్తంగా తన నియోజకవర్గంలో పట్టు నిలుపుకోవాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే  మైనంపల్లి హనుమంతరావు, టీపీసీసీ చీఫ్‌ పదవి కోసం ఎదురుచూస్తున్న ఎంపీ రేవంత్ రెడ్డి రేవంత్‌రెడ్డి.. దుబ్బాక ఉప ఎన్నికలో విజయంతో ఊపుమీదున్న ఎమ్మెల్యే రఘునందన్ రావులు ఎవరికివారు తమ సత్తా నిరూపించుకునేందుకు ట్రై చేస్తున్నారు. ముగ్గురు ముఖ్య నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో గ్రేటర్ పోరు మల్కాజ్ గిరి నియోజకవర్గంలో కాక పుట్టిస్తోంది. ముగ్గురు మాటకారులే కావడం, ఫైర్‌ బ్రాండ్‌గా పేరుండటంతో గ్రేటర్ సమరంలో మల్కాజిగిరిలో ఎవరు పైచేయి సాధిస్తారన్న ఉత్కంఠ నెలకొంది.

సీఎస్ కు నిమ్మగడ్డ మూడో లేఖ! హైకోర్టు తీర్పును జత చేసిన ఎస్ఈసీ 

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ వెనక్కి తగ్గడం లేదు. వచ్చేఏడాది ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సిందేనంటున్నారు. ఇప్పటికే సీఎస్‌ నీలం సాహ్నికి రెండుసార్లు లేఖ రాశారు. తాజాగా ఆయన మళ్లీ మరోలేఖ రాశారు. ఇందులో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సహాయ, సహకారాలు అందించాలని కోరినట్లు తెలుస్తోంది.ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఈనెల 17న జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను కూడా ఆ లేఖతో పాటు నిమ్మగడ్డ పంపించినట్లు సమాచారం. ఎన్నికల సంఘం జారీ చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఇచ్చిన తీర్పునూ, ప్రభుత్వం నుంచి అవసరమైన సహచారం కోసం ఎన్నికల సంఘం మూడోరోజుల్లోగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలన్న హైకోర్టు సూచననూ ప్రస్తావించారని సమాచారం. హైకోర్టు తీర్పు కాపీని లేఖకు నిమ్మగడ్డ జతచేసి పంపినట్లు చెబుతున్నారు. రాజ్యాంగ బద్ధ సంస్థలకు ప్రభుత్వం సహకరించాలని హైకోర్టు తీర్పు ఇచ్చిందని లేఖలో నిమ్మగడ్డ సీఎస్ కు గుర్తుచేశారని తెలుస్తోంది. ఎన్నికల నిర్వహణ, కమిషన్ విధి నిర్వహణలో ప్రభుత్వ సహకారం తప్పనిసరిగా ఉండాలని తీర్పులో న్యాయస్థానం స్పష్టం చేసింది. ప్రభుత్వ సహకారంపై తమకు మళ్లీ నివేదిక సమర్పించాలని తీర్పులో ఎన్నికల కమిషన్‌ను ధర్మాసనం ఆదేశించింది. ఇదే విషయాన్ని తన లేఖలో ఎన్నికల కమిషనర్ ప్రస్థావించారు.    స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది. ఎన్నికలను నిర్వహించేందుకు తాము సిద్ధమని ఎన్నికల సంఘం అంటోంది. కరోనా తీవ్రత కారణంగా ఇప్పుడే ఎన్నికలు వద్దంటోంది ప్రభుత్వం. ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే రెండు సార్లు చీఫ్ సెక్రటరీ నీలం సాహ్నికి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ లేఖ రాశారు. అయితే ఆమె నుంచి సరైన ప్రతిస్పందన రాలేదు. దీంతో సీఎస్ కు నిమ్మగడ్డ రమేశ్ ముచ్చటగా మూడోసారి లేఖ రాశారు. ఎన్నికల ఏర్పాట్లకు సహకరించేలా జిల్లా కలెక్టర్లను ఆదేశించాలని ఆ లేఖలో సీఎస్ ను నిమ్మగడ్డ కోరారు.    ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించిన ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్.. ఎన్నికల సన్నద్ధతపై కలెక్టర్లు, జడ్పీ సీఈవోలు, పంచాయతీరాజ్‌ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కానీ సీఎస్ సహకరించకపోవడంతో మీటింగ్‌ వాయిదా పడుతూ వస్తోంది. సోమవారం ఏర్పాటు చేసిన మీటింగ్‌కు అధికారులు ఎవ్వరు రాలేదు. తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు, ఆదేశాలు లేవని అధికారులు చెబుతున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో మీటింగ్‌ నిర్వహించాలని నిమ్మగడ్డ రమేశ్‌ పట్టుదలతో ఉన్నారు. దీంతో  సీఎస్‌ నీలం సాహ్నికి ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ మరో లేఖ రాశారు. ఎస్ఈసీ రాసిన మూడో లేఖపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తిగా మారింది.

అమరావతికి చేసిన ఖర్చు కూడా చెప్పలేరా.. జగన్ సర్కార్ పై హైకోర్టు సీరియస్ 

ఏపీ ప్రభుత్వం రాజధాని అమరావతికి ఇప్పటివరకు ఎంత ఖర్చు పెట్టారో చెప్పాలని, అదే సమయంలో నిర్మాణ పనులు ఆగిపోవడంతో జరిగిన నష్టం గురించి కూడా వివరాలు ఇవ్వాలని చాలా రోజుల కిందట హైకోర్టు ఆదేశించిన సంగతి తెల్సిందే. అయితే రాష్ట్ర అధికారులు మాత్రం హైకోర్టుకు వివరాలు ఇవ్వకుండా వాయిదాల మీద వాయిదాలు కోరుతున్నారు. అంతేకాకుండా అధికారులు ఇవ్వడం లేదని అకౌంటెంట్ జనరల్ తరపు న్యాయవాది కోర్టులో వాదించారు. దీంతో ఈ అంశంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, న్యాయమూర్తులు జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన త్రిసభ్య ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వం పై సీరియస్ అయింది. వచ్చే సోమవారం లోపు అమరావతి నిర్మాణానికి సంబంధించి తాము అడిగిన వివరాలు అందించాలని, అయితే వివరాల సమర్పణలో కనుక విఫలమైతే అకౌంటెంట్‌ జనరల్‌ స్వయంగా కోర్టు ముందు హాజరయ్యేలా ఆదేశాలు జారీ చేస్తామని హెచ్చరించింది. ఒకవేళ ఆయన వివరాలు సమర్పించలేకపోతే విజిలెన్స్‌, ఆదాయపు పన్నుల శాఖ నుంచి తెప్పించుకుంటామని తేల్చి చెప్పింది. ఈ కేసు పై తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.   ఈ కేసు విచారణ సందర్భంగా రాజధాని రైతుల తరుఫున లాయర్ మురళీధరరావు వాదిస్తూ.. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు అన్యాయం చేసి, వారి హక్కులను హరించేలా చట్టాలు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని వాదించారు. రైతుల భూములు తీసుకున్నందుకు ప్రతిగా అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని అయన గుర్తు చేశారు. ఆ మేరకు రైతులతో కుదిరిన ఒప్పందాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించడం కుదరదని అయన స్పష్టం చేశారు. ‘‘రాజధానిని నిర్మిస్తామని భూములు తీసుకుని.. ఇప్పుడు అందుకు భిన్నంగా వ్యవహరించడం కుదరదు. రాజధాని వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం మంత్రులతో ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ రాజధాని రైతులు, సాధారణ ప్రజలు ఇచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోలేదు. కేవలం ముఖ్యమంత్రి ఆకాంక్షమేరకే జీఎన్‌రావు కమిటీని ఏర్పాటు చేసినట్లుంది. ఆ కమిటీ రాజధాని కోసం భూములిచ్చిన రైతులను సంప్రదించలేదు. బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ (బీసీజీ) కూడా అదే తరహాలో నివేదిక ఇచ్చింది. జీఎన్‌రావు కమిటీ, బీసీజీ రూపొందించిన నివేదికలు, ఆ నివేదికలను అధ్యయనం చేసి మంత్రులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీ రూపొందించిన నివేదిక ఒకే తరహాలో ఉన్నాయి’’ అని తెలిపారు. అంతేకాకుండా రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం తమకు సూచనలు చేయాలని బీసీజీని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇవ్వలేదని అయన కోర్టుకు వివరించారు. అయితే ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి తాయం వివరణ తీసుకుంటామని ఈ సందర్భంగా ధర్మాసనం పేర్కొంది.   ఇది ఇలా ఉండగా ఇప్పటివరకు రాజధానికి చేసిన ఖర్చుపై అధికార, ప్రతిపక్షాలు పరస్పరం ఆరోపణలు చేసుకోవడమే కానీ.. ఇంత వరకూ అధికారిక లెక్కలు బయట పెట్టలేదు. గత టీడీపీ ప్రభుత్వం అమరావతికి పైసా ఖర్చు పెట్టలేదని పురపాలక మంత్రి బొత్స సత్యనారాయణ తో సహా పలువురు మంత్రులు, వైసిపి నాయకులు చెబుతూ వస్తున్నారు.ఇదే సమయంలో టీడీపీ నేతలు మాత్రం దాదాపు పదివేల కోట్లు ఖర్చు పెట్టామని చెప్పుకుంటున్నారు. రాజధాని నిర్మాణంలో పాలుపంచుకున్న పలు సంస్థలు పనులు మధ్యలో నిలిపివేసాయి. ఒప్పందం ప్రకారం అలా పనులు నిలిపివేస్తే ప్రభుత్వం వాటికీ పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం ఈ వివరాలన్నీ చాలా రహస్యంగా ఉన్నాయి. ఈ మొత్తం వివరాలు బయటకు వస్తే అపుడు అమరావతి కోసం అసలు ఎంత ఖర్చు చేసారు అనే వివరాలు బయటకు వస్తాయి.

గులాబీకి గ్రేటర్ టెన్షన్! వరాలు పనిచేయవంటున్న విపక్షం

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఓటమి భయం పట్టుకుందా? గులాబీ బాస్ ఎంట్రీకి అర్ధమేంటీ? కొత్త హామీలను జనాలు నమ్ముతారా?. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. ఐదు రోజుల్లో ప్రచారం ముగియనుండటంతో పార్టీలన్ని స్పీడ్ పెంచాయి. బీజేపీ దూకుడుతో అధికార పార్టీలో ఓటమి భయం పట్టుకుందనే ప్రచారం జరుగుతోంది. దుబ్బాకలో టీఆర్ఎస్ పరాజయంతోనే తెలంగాణలో రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోయాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ కారుకు బ్రేకు పడితే.. ఆ పార్టీకి ముందు ముందు గండమేనన్న చర్చ జరుగుతోంది. దీంతో గ్రేటర్ ఎన్నికలపై స్వయంగా సీఎం కేసీఆరే రంగంలోకి దిగారని చెబుతున్నారు. గతంలో జరిగిన లోకల్ బాడీ ఎన్నికలను కేసీఆర్ పెద్దగా పట్టించుకోలేదు. ప్రచారం కూడా చేయలేదు. అయితే గ్రేటర్ ఎన్నికలను మాత్రం ఆయన మినిట్ మినిట్ మానిటర్ చేస్తున్నారని తెలుస్తోంది. డివిజన్ల వారీగా పార్టీ పరిస్ఖితులను తెలుసుకుంటూ.. వివిధ సంస్థల ద్వారా సర్వే చేయిస్తూ.. వాటి వివరాల ఆధారంగా  పార్టీ  ఇంచార్జులకు కేసీఆర్ సలహాలు, సూచనలు చేస్తున్నారని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.    తెలంగాణ భవన్ లో జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టోను కేసీఆరే రిలీజ్ చేశారు. గ్రేటర్ లో రోజుకు రోజుకు బీజేపీ గ్రాఫ్ పెరుగుతుండటంతో సీఎం స్వయంగా రంగంలోకి దిగారని చెబుతున్నారు. గ్రేటర్ జనాలకు ఆయన వరాలు కురిపించారు. అయితే కేసీఆర్ గ్రేటర్ హామీలపై గ్రేటర్ జనాల్లో చర్చ జరుగుతోంది. ఓటమి భయంతోనే కేసీఆర్ కొత్త హామీలు ఇచ్చారని అభిప్రాయపడుతున్నారు. వరద సాయం పేరుతో గులాబీ నేతలకు దోచి పెట్టి.. ఎన్నికలయ్యాకా అందరికి ఇస్తామని చెప్పడమేంటనీ ముఖ్యమంత్రిని విపక్షాలు నిలదీస్తున్నాయి. సర్కార్ కు నిజంగా చిత్తశుద్ది ఉంటే వరద బాధితులకే నేరుగా డబ్బులు ఇచ్చేవారని చెబుతున్నారు. ఎన్నికల్లో తమ పార్టీ ఓడిపోతుందని సర్వేల్లో తేలడంతో కేసీఆర్ కొత్త ఎత్తులు వేస్తున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లోనూ జరుగుతోంది. లోకల్ బాడీస్ ఎన్నికల్లో గతంలో ఎప్పుడూ కేసీఆర్ ప్రచారం చేయలేదు. గత గ్రేటర్ ఎన్నికల్లోనూ అంతా కేటీఆరే చూసుకున్నారు. ఇటీవల జరిగిన దుబ్బాక ఉప ఎన్నిక తమకు సవాల్ గా మారినా ప్రచారానికి వెళ్లలేదు కేసీఆర్. కాని గ్రేటర్ ఎన్నికలపై మాత్రం ఫోకస్ చేశారు. పార్టీ మేనిఫెస్టోను కూడా కేసీఆరే రిలీజ్ చేశారు. దీన్ని బట్టి గులాబీ నేతలకు ఓటమి భయం పట్టుకుందనే చర్చ జరుగుతోంది. అందుకే వరాలు ప్రకటించారని చెబుతున్నారు.    కరోనా సమయంలో క్యాబ్, ట్యాక్సీ, ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లాక్ డౌన్ తో వాహనాలు రోడ్డు ఎక్కకపోవడంతో తినడానికి తిండలేక కొందరు డ్రైవర్లు అవస్థలు పడ్డారు. కరోనా సమయంలో వారిని అసలు పట్టించుకోలేదు కేసీఆర్ సర్కార్. పక్కన ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆటో,  క్యాబ్ డ్రైవర్లకు 10 వేల రూపాయల ఆర్థిక సాయం చేశారు. ఇక్కడ కూడా అలానే తమను ఆదుకోవాలని క్యాబ్, ట్యాక్సీ, ఆటో డ్రైవర్లు వేడుకున్నా టీఆర్ఎస్ సర్కార్ కనీసం స్పందించలేదు. లారీ డ్రైవర్లు కూడా ఆర్థిక కష్టాలు ఎదుర్కొన్నారు. లారీలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో అంతా అప్పుల పాలయ్యారు. మూడు నెలల క్రితమే రోడ్డు ట్యాక్సీ రద్దు చేయాలని లారీ యజమానులు ప్రభుత్వానికి విన్నవించారు. అయితే అప్పుడు స్పందించని సర్కార్.. గ్రేటర్ ఎన్నికల వేళ వారికి ఊరటనిస్తూ నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ ఎన్నికల్లో  ఎలాగైనా గట్టెక్కేందుకే కేసీఆర్ సర్కార్ తాజా వరాలు ఇచ్చిందనే ప్రచారం జరుగుతోంది. గ్రేటర్ లో దాదాపు ఐదు లక్షల మంది ఆటో, క్యాబ్, ట్యాక్సీ డ్రైవర్లు ఉన్నారని అంచనా. వారంతా తమకు మద్దతిచ్చేలా రోడ్డు ట్యాక్స్ ను రద్దు చేశారని చెబుతున్నారు.    కేసీఆర్ ఇప్పుడు ఎన్ని వరాలు ప్రకటించినా గ్రేటర్ లో టీఆర్ఎస్ కు ఓటమి తప్పదని బీజేపీ, కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవాలని ఎంత మెత్తుకున్నా పట్టించుకోకుండా.. ఎన్నికల వేళ చేయడాన్ని జనాలు కూడా అర్ధం చేసుకుంటారని చెబుతున్నారు. ఓట్ల కోసమే కేసీఆర్ కొత్త డ్రామాలు చేస్తున్నారని గ్రేటర్  ప్రజలు భావిస్తున్నారని, పోలింగ్ రోజున వారు తమ సత్తా చూపిస్తున్నారని ప్రతిపక్ష నేతలు అంటున్నారు.గులాబీ నేతలు మాత్రం తాము ఇచ్చిన హమీలపై ప్రజల్లో మంచి స్పందన వస్తుందని, గ్రేటర్ ఎన్నికల్లో తమకు ప్లస్ కాబోతున్నాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరీ కేసీఆర్ హామీలు అధికార పార్టీని గట్టెక్కిస్తాయా లేక ప్రతిపక్షాలు చెబుతున్నట్లు ఓట్ల హామీగానే సిటీ జనాలు చూస్తారా చూడాలి మరీ..

భయపెడుతున్న కరోనా సెకండ్ వేవ్...  అప్రమత్తమైన తెలంగాణ సర్కార్

దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ మొదలైన నేపథ్యంలో.. తెలంగాణ లోని కేసీఆర్ సర్కార్ అప్రమత్తమైంది. కరోనా తాజా పరిస్థితులపై సీఎం కేసీఆర్ నేతృత్వంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న అన్ని పడకలకూ ఆక్సిజన్ సదుపాయాన్ని కల్పించాలని ఈ భేటీలో నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 22 వేల పడకలు ఉండగా, ప్రస్తుతం 11 వేల పడకలకు మాత్రమే ఆక్సిజన్ సౌకర్యం ఉంది. అంతేకాకుండా వందకు పైగా పడకలు ఉన్న ఆసుపత్రులకు లిక్విడ్ ఆక్సిజన్ ను, మిగిలిన ఆసుపత్రులకు సాధారణ ఆక్సిజన్ ను సరఫరా చేయాలని ప్రభుత్వం పేర్కొంది.   అన్ని ఆసుపత్రుల్లో కలిపి అదనంగా మరో 5 వేల పడకలను ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా తొలి దశలో ఎదుర్కొన్న సంక్షోభ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని, మరోసారి ఆ పరిస్థితి ఏర్పడకుండా ముందే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల నుంచి గాంధీ ఆసుపత్రి వరకూ కరోనా చికిత్సలకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలనూ సిద్ధంగా ఉంచాలని, అదే విధంగా వ్యాక్సిన్ వచ్చేంత వరకూ ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది.

కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎంపీ హర్షకుమార్‌

అమలాపురం మాజీ ఎంపీ హ‌ర్ష కుమార్ తిరిగి సొంతగూటికి చేరారు. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత కాంగ్రెస్ పార్టీ కి దూరమైన ఆయ‌న.. ఇవాళ ఉమెన్‌చాందీ, శైలజానాథ్‌ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా హర్షకుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. విభజన హామీలు అమలు చేయకుండా బీజేపీ మోసం చేస్తోందని మండిపడ్డారు. బీజేపీపై పోరాడటంలో వైసీపీ, టీడీపీలు విఫలమయ్యాయని విమర్శించారు. ఏపీ ప్రజలు మరోసారి మోసపోవడానికి సిద్ధంగా లేరని, ప్రజలు కాంగ్రెస్‌ వైపు చూస్తున్నారని హర్షకుమార్ చెప్పారు.   కాగా, 2004-2014 వ‌ర‌కు వ‌రుస‌గా రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ త‌రుపున ఎంపీగా గెలుపొందిన ఆయ‌న‌, రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. గత కొంతకాలంగా ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వినిపిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో ద‌ళితుల‌పై జ‌రుగుతున్న దాడులకు వ్యతిరేకంగా పోరాడ‌తున్నారు.

ఫేక్ పోస్టులు..ఫేక్ సర్వేలు.. కుళ్లు జోకులు! గతి తప్పిన సోషల్ క్యాంపెయిన్ 

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. వారం రోజుల్లోనే పోలింగ్ ఉండటంతో పార్టీలన్ని సర్వశక్తులు ఒడ్డిపోరాడుతున్నాయి. ప్రచారంలో అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటున్నాయి పార్టీలు. గ్రేటర్ ఎన్నికల్లో సోషల్ మీడియా  కీ రోల్ పోషిస్తోంది. అన్ని పార్టీలు ఆన్  లైన్ ప్రచారం కోసం ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేసుకున్నాయి. అయితే సోషల్ మీడియా ప్రచారం గ్రేటర్ సమరంలో హద్దులు దాటినట్లు కనిపిస్తోంది. అన్ లైన్ లో ఫేక్ ప్రచారమే ఎక్కువగా జరుగుతోంది. తమ పార్టీకి కలిసొచ్చేలా, ప్రత్యర్థి పార్టీలకు డ్యామేజీ కలిగేలా ఫేక్ ఆడియో కాల్స్, మార్ఫింగ్ ఫోటోలు, మార్ఫింగ్ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. గ్రేటర్ ఎన్నికల సర్వేలంటూ ఫేక్ సర్వేలను క్రియేట్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.    గ్రేటర్ ఎన్నికలపై సర్వే అంటూ ఫేక్ సర్వేలు బయటికి వస్తున్నాయి. ఒకే సర్వే సంస్థ పేరుతోనూ డిఫరెంట్ ఫలితాలు ఉండే సర్వేలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాణక్య సంస్థ పేరుతోనే టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు అనుకూలంగా సర్వేలు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. బీజేపీకి 90-96, ఎంఐఎం 3035,  టీఆర్ఎస్ 24-29, కాంగ్రెస్ కు 4-6 సీట్లు వస్తాయని ఉన్న సర్వేలను బీజేపీ కేడర్ వైరల్ చేస్తోంది. టీఆర్ఎస్ కు 96- 106, ఎంఐఎంకు 40-45, కాంగ్రెస్, బీజేపీలకు 1-2 డివిజన్లు వస్తాయని సూచించే సర్వే మ్యాపులను గులాబీ కార్యకర్తలు వైరల్ చేస్తున్నారు. కాంగ్రెస్ కు 80కి పైగా సీట్లు రాబోతున్నాయంటూ అదే చాణక్య పేరుతో హస్తం అభిమానులు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఏది నిజమో, ఏది అసత్యమో తెలియక గ్రేటర్ ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు.    ఫేక్ ఆడియో కాల్స్, వీడియోలు, మార్ఫింగ్ ఫోటోలను క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ టార్గెట్ గా టీఆర్ఎస్ అనుకూలురు ఎక్కువగా పోస్టులు పెడుతున్నారు. బండి సంజయ్ ను గ్రేటర్ ఎన్నికల బాధ్యత నుంచి తప్పించారంటూ ఓ న్యూస్ ఛానెల్ బ్రేకింగ్ పేరుతో  సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో సంజయే మీడియా ముందుకు వచ్చి అది ఫేక్ అని చెప్పుకోవాల్సి వచ్చింది. తమ పేరుతో అసత్య ప్రచారం జరుగుతుందని సదరు ఛానెల్ కూడా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బండి సంజయ్ ను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించాలంటూ గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీ పెద్దలకు ఫిర్యాదు చేసినట్లుగా.. రాజా సింగ్  ట్వీట్ ను మార్ఫింగ్ చేసి వైరల్ చేశారు. దానిపైనా రాజాసింగ్ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. మాజీ మంత్రి డీకే అరుణ తిరిగి కాంగ్రెస్ లో చేరబోతున్నారని, ఉత్తమ్ తో ఆమె సమావేశమయ్యారని కొన్ని వర్గాలు ప్రచారం చేశాయి. ఎమ్మెల్యే రాజాసింగ్ కాంగ్రెస్ లో చేరారని కూడా కొందరు పోస్టులు పెట్టి వైరల్ చేశారు.    గ్రేటర్‌ ఎన్నికల వేళ సోషల్‌ మీడియాలో విద్వేషం హద్దులు దాటుతోంది. తమ ప్రత్యర్థులపై దిగజారుడు వ్యాఖ్యలు, విషపురాతలు రాస్తూ ప్రచారం చేస్తున్నారు. నేతల అలవాట్లు, ఆకారాలపై విద్వేషపు పోస్టులు పెడుతున్నారు. గుండోడు, బండోడు, బక్కోడు, బికారీ.. ఇలా  ప్రత్యర్థులపై అభ్యంతరకర, రాయలేని వ్యాఖ్యలతో చెలరేగుతున్నారు, రెచ్చగొడుతున్నారు. నాయకుల అలవాట్లు, ఆహార్యంపై సెటైర్లు, కుళ్లుజోకులు వేస్తున్నారు. వ్యక్తిగత దూషణకు దిగుతున్నారు. ప్రత్యర్థులను చులకన చేసే ప్రయత్నంలో దిగజారుడు పోస్టులు పెడుతున్నారు.  ఆకారం, అలవాట్ల ఆధారంగా కుళ్లుజోకులు వేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీపై యువత మనసులో విద్వేషపు బీజాలు నాటుతున్నారు. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్‌లలో ఇలాంటి పోస్టులకు కొదవలేదు. వ్యక్తులను కించపరుస్తూ వీడియోలు, సినిమాల్లోని హాస్యపు బిట్లు, మీమ్స్, బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్కులతో పోస్టులు రూపొందిస్తూ కొత్త ఓటర్లకు గాలం వేస్తున్నారు.    కొత్త ఓటర్లే లక్ష్యంగా ప్రైవేటు ఆర్మీల హల్‌చల్‌ చేస్తున్నాయి. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌ నిత్యావసర వస్తువుగా మారింది. ఆన్‌లైన్‌ క్లాసుల పుణ్యమాని ఇప్పుడు ప్రతీ విద్యార్థికి స్మార్ట్‌ఫోన్‌ ఉంది. ముఖ్యంగా 18 ఏళ్లు దాటి డిగ్రీ, ఇంజినీరింగ్‌ చదువుతున్న విద్యార్థుల ఓట్లే లక్ష్యంగా ఈ వ్యంగ్యపు, వెకిలి పోస్టులు రూపొందిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్‌ వినియోగించే యువతలో నూటికి 90 శాతం వినోదానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. అందుకే, వారి దృష్టిని తమవైపు తిప్పుకునేందుకు, ప్రత్యర్థి పార్టీలపై కుళ్లుజోకులతో విరుచుకుపడుతున్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ఫేక్ ప్రచారంతో శాంతిభద్రతలకు విఘాతం కలుగొచ్చని, దాడులకు పురిగొలిపే ప్రమాదముందని పోలీసులే ఆందోళన వ్యక్తం చేస్తున్నారంటే వీటి తీవ్రత అర్థం చేసుకోవచ్చు.    గ్రేటర్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ రాగానే.. పార్టీల సానుభూతిపరులు అప్పటికపుడు ప్రత్యేకంగా కంటెంట్‌ రైటర్లు, డీటీపీ ఆపరేటర్లు, వీడియో ఎడిటర్లను నియమించుకున్నారు. కేవలం 20 రోజులకే వీరికి రూ.30 వేల నుంచి 40 వేల వరకు చెల్లిస్తూ ఇలాంటి పోస్టులను ప్రోత్సహిస్తున్నారు. పార్టీలకు అనుకూలంగా వారి అధికారిక సోషల్ వింగ్ లు చేసే పోస్టులు పద్ధతిగానే ఉంటున్నాయి.కొందరు అభిమానుల ముసుగులో ప్రైవేటు ఆర్మీలు నడిపిస్తున్నారు. వారంతా తమ పోస్టింగులతో ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడుతున్నారు. సోషల్ మీడియా  పోస్టులపై పోలీసులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. చేసిన, చేయబోయే పనులను చెప్పుకొని ఓట్లు అడగటం, ప్రత్యర్థులను విమర్శలతో ప్రశ్నించడం మంచి రాజకీయమని, కాని ఇలా విద్వేషాలకు దిగడం ప్రమాదమంటున్నారు పోలీసులు.

పని తీరు అద్భుతం.. కోల్డ్ స్టోరేజ్ అవసరం లేని కరోనా వ్యాక్సిన్ రెడీ

ఈ ఏడాది ప్రారంభంలో కరోనా వైరస్ వ్యాప్తి మొదలైనప్పటి నుండి వ్యాక్సిన్ కోసం ప్రపంచ వ్యాప్తంగా పలు సంస్థలు ప్రయత్నాలు మొదలు పెట్టిన సంగతి తెల్సిందే. అయితే ఈ ప్రయత్నాలలో కొన్ని సంస్థలు విజయం సాధించి ఉత్పత్తి వైపు కూడా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే ఫైజర్, మోడెర్నా సంస్థలు తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ లు వాటి సగటు సామర్థ్యం 95 శాతమని తెలిపాయి. అయితే ఫైజర్ టీకా విషయానికి వస్తే అభివృద్ధి చెందుతున్న దేశాలలో పంపిణీ పరంగా కొన్ని సవాళ్లు ఎదురవుతాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ వ్యాక్సిన్ నిల్వ, రవాణాకు -70 డిగ్రీల ఉష్ణోగ్రత అవసరమవడమే ముఖ్య సమస్యగా నిపుణులు చెపుతున్నారు.   ఈ పరిస్థితుల్లో ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ, ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా రూపొందించిన కరోనా వ్యాక్సిన్ సామార్థ్యానికి సంబంధించి అస్ట్రాజెనికా సీఈఓ పాస్కల్ సోరియట్ ఈరోజు సోమవారం కీలక ప్రకటన చేసారు. కరోనాకు వ్యతిరేకంగా ఈ వ్యాక్సిన్ సమర్ధవంతంగా పనిచేస్తోందని అయన చెప్పారు. బ్రిటన్, బ్రెజిల్ దేశాల నుండి చివరి దశ ట్రయల్స్ సమాచారం మేరకు ఈ టీకా సమర్ధవంతంగా పనిచేస్తున్నట్టుగా తేలింది. ఈ వ్యాక్సిన్ సగటు సామర్థ్యం 70 శాతమని ప్రకటించింది.   అయితే క్లీనికల్ ట్రయల్స్‌లో భాగంగా ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ విషయంలో అధికారులు రెండు రకాల డోసులు వలంటీర్లకు ఇచ్చారు. మొదటి విధానంలో వలంటీర్లకు మొదట సగం డోసు ఇచ్చి, ఆ తరువాత పూర్తి డోసు ఇవ్వగా.. వ్యాక్సిన్ 90 శాతం సామర్థ్యంతో పనిచేసినట్టు వెల్లడైంది. ఇక కరోనా వ్యాక్సిన్ డోసులకు సంబంధించిన రెండో విధానంలో ఈ వ్యాక్సిన్ ను కేవలం సగం డోసు వినియోగించగా దాని సామర్థ్యం 90 శాతంగా వెల్లడవడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది అని ఆస్ట్రాజెనెకా సీఈవో తెలిపారు. ఈ విధానం అన్నిటికంటే ఎఫెక్టివ్ గా పనిచేస్తోందని, వ్యాక్సిన్ విషయంలో ఇదే పద్దతి అవలంబించాలని వివిధ దేశాల ఔషధ నియంత్రణ సంస్థలకు సూచిస్తామని అయన పేర్కొన్నారు.   అంతేకాకుండా ఎమ్‌ఆర్‌ఎన్ఏ ఆధారంగా రూపొందించిన మోడర్నా, ఫైజర్ టీకాలతో పోలిస్తే ఆక్సఫర్డ్ వ్యాక్సిన్ సగటు సామర్థ్యం కొంత తక్కువగా ఉన్నప్పటికీ వ్యాక్సిన్ పంపిణీ సౌలభ్యం పరిగణలోకి తీసుకుంటే ఆక్స్‌ఫర్డ్ టీకాయే భారత్ తో పాటు అభివృద్ధి చెందుతున్న దేశాలకు అనువైనదని నిపుణులు అభిప్రాయడుతున్నారు. మిగిలిన వ్యాక్సిన్ల తో పోలిస్తే.. ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ ను సాధారణ రిఫ్రెజిరేటర్లలో కూడా నిలువ చేయగలగడం దీని ప్రధమానమైన అడ్వాంటేజ్ అని నిపుణులు అంటున్నారు. కోల్డ్ స్టోరేజ్ వ్యవస్థలు పూర్తి స్థాయిలో అందుబాటులో లేని భారత్‌ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆక్సఫర్డ్ టీకాయే తగినదనే అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు రెండు డోసులు కలిపి కేవలం రూ.1000లోపే లభ్యమయ్యే అవకాశం ఉంటడమనేది ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ కు సంబంధించి మరో సానుకూల అంశమని వారు అంటున్నారు. ఇది ఇలా ఉండగా.. ఈ క్లీనికల్ ట్రయల్స్‌కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని వివిధ దేశాల వ్యాక్సిన్ నియంత్రణ సంస్థలకు అందించి, త్వరగా అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుంటామని ఆస్ట్రాజెనెకా ఈ సందర్భంగా పేర్కొంది.

బహిరంగంగానే తిట్టుకుంటున్న వైసీపీ నేతలు

ఏపీలో అధికార వైసీపీకి ఆ పార్టీ నాయకుల తీరు తలనొప్పిగా మారింది. ఇటీవల వైసీపీ నేతలు బహిరంగంగానే ఒకరినొకరు తిట్టుకుంటున్నారు. మొన్నటికి మొన్న విశాఖలో డీఆర్సీ సమావేశంలో మాటల యుద్ధం జరిగింది. సమావేశంలో ఇతర ప్రజాప్రతినిధుల ముందే ఎంపీ విజయసాయిరెడ్డిపై చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ విరుచుకుపడ్డారు. మరోవైపు.. ఇదే సమావేశంలో అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ కూడా తనదైన శైలిలో విమర్శలు చేశారు. ఆ తర్వాత సీఎం ఆఫీస్ వద్ద డిప్యూటీ సీఎం నారాయణ స్వామిని ఉద్దేశించి మంత్రి పెద్దిరెడ్డి 'బుద్ధి, జ్ఞానం ఉందా నీకు.. డిప్యూటీ సీఎం వా నువ్వు' అని దుర్బాషలాడిన ఘటన సంచలనంగా మారింది. దీనికి సంబదించిన వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు నువ్వెంతంటే నువ్వెంత అని వాగ్వాదానికి దిగారు.    తూర్పుగోదావరి జిల్లా డీఆర్సీ సమావేశం రసాభాసగా మారింది. టిడ్కో ఇళ్లు విషయంలో కాకినాడలో అవినీతి జరుగుతున్నట్టు తన దృష్టికి వచ్చిందని ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్ పేర్కొన్నారు. దీంతో ఒక్కసారిగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ కేకలు వేశారు. ఒకే పార్టీ లో ఉంటూ నాకు చెప్పాలి కదా అని బోసుపై దుర్భాషలాడారు. మేడ లైన్ ప్రాంతాల్లో అక్రమ కట్టడాలు వల్లే కాకినాడ నగరం మునిగిపోయిందని కూడా బోస్ ఆరోపించారు. దీంతో ఎమ్మెల్యే ద్వారంపూడి మరింత రెచ్చిపోయారు. ఈ విషయాలు తనకు చెప్పాలి కదా అంటూ ఆవేశంతో ఊగిపోయారు. ఎమ్మెల్యే ద్వారంపూడికి మంత్రి కన్నబాబు, ఇతర ఎమ్మెల్యేలు నచ్చజెప్పారు. దీంతో రాసభాస మధ్య సమావేశం అర్థాంతరంగా ముగిసిపోయింది.  

వైఎస్సార్‌ అభిమానులు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు

ఏపీ సీఎం వైఎస్ జగన్ తండ్రి, మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డిపై తెలంగాణలోని దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్‌ ని విమర్శించే క్రమంలో "వెనుకటి ఒకాయన గిట్లే మాట్లాడి, గట్లే పోయిండు.. పావురాల గుట్టకు! నువ్వు కూడా గంతే. యాక్షన్ కు రియాక్షన్ కచ్చితంగా ఉంటుంది" అంటూ రఘునందన్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీనిపై వైసీపీ కార్యకర్తలు, వైఎస్సార్ అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. వైఎస్సార్ అభిమానులు బీజేపీకి ఓటు వేయొద్దని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రఘునందన్ స్పందించారు. వైఎస్సార్‌ అంటే తనకు ఎంతో గౌరవం ఉందని, తన వ్యాఖ్యల్లో ఎలాంటి దురుద్దేశం లేదని వివరించారు.    వైఎస్సార్‌ గురించి తాను చేసిన వ్యాఖ్యలను ఆయన అభిమానులు తప్పుగా అర్థం చేసుకుంటున్నారని, వైఎస్సార్‌ అభిమానుల మనసు నొప్పించి ఉంటే క్షమాపణలు కోరుతున్నట్లు తెలిపారు. "సీఎం కేసీఆర్ కేసీఆర్ గతంలో వైఎస్సార్ పై చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ నేను ఆ కుటుంబానికి హెచ్చరిక చేసినట్టుగా మాట్లాడాను. అంతేతప్ప నేను వైఎస్సార్ ను కించపరుస్తూ మాట్లాడలేదు." అన్నారు "ఈ సందర్భంగా వైఎస్సార్‌ అభిమానులందరికీ ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి తప్పుగా ట్రోల్ చేయకండి. నా వ్యాఖ్యల పట్ల మీరు బాధపడుతున్నందుకు చాలా చింతిస్తున్నాను" అని రఘునందన్ రావు ఓ ప్రకటన చేశారు.