వరద సాయమే కొంప ముంచుతుందా? గ్రేటర్ గులాబీలో టెన్షన్
posted on Oct 31, 2020 @ 5:27PM
అనుకున్నదొక్కటి.. అయిందొక్కటి.. బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్టా. ఈ పాట ఇప్పుడు హైదరాబాద్ లో అధికార టీఆర్ఎస్ పార్టీకి అచ్చు గుద్దినట్లు సరిపోయేలా ఉంది. ఇటీవల కురిసన భారీ వర్షాలు, వరదలకు నగరంలోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి. దాదాపు 15 వందల కాలనీలను వరద ముంచెత్తిందని ప్రభుత్వ వర్గాలే ప్రకటించాయి. మోకాళ్ల లోతు నీటిలోనే రెండు, మూడు రోజుల పాటు వేలాది కుటుంబాలు ఉన్నాయి. వరద పోటెత్తడంతో ఇండ్లలోని సామాగ్రి కూడా ధ్వంసమైంది. అయితే వరదలపై స్పందించిన సీఎం కేసీఆర్.. సిటీలో వరదతో ఇబ్బంది పడిన ప్రతి కుటుంబానికి 10 వేల రూపాయలు పరిహారంగా ఇస్తామని ప్రకటించారు. ఇందుకోసం 3 వందల కోట్ల రూపాయలు కూడా వెంటనే రిలీజ్ చేశారు.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు డిసెంబర్ లో నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీంతో ఇప్పుడు చేస్తున్న వరద సాయం తమకు బల్దియా ఎన్నికల్లో కలిసి వస్తుందని అధికార పార్టీ ఆశించింది. వరద సాయం చేస్తున్న కాలనీలు, బస్తీలన్ని గంపగుత్తగా తమకే మద్దతిస్తాయని గులాబీ నేతలు భావించారు. అందుకే కేసీఆర్ వరద సాయం ప్రకటన చేసిన వెంటనే టీఆర్ఎస్ నేతలు హడావుడి చేశారు. తమ డివిజన్ లోని లోతట్టు ప్రాంతాలు, బస్తీల్లో తిరుగుతూ వరద సాయం చేస్తామంటూ ప్రజలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. అయితే ప్రస్తుతం పరిస్థితి మరోలా మారిపోయింది. అధికార పార్టీ అంచనాలకు భిన్నంగా తమకు గ్రేటర్ ఎన్నికల్లో కలిసి వస్తుందనుకున్న వరద సాయం పంపిణి.. కొంప ముంచేలా మారిపోయిందని టీఆర్ఎస్ నేతలు తలలు పట్టుకునే పరిస్థితులు నెలకొన్నాయి.
నగరంలో వరద సహాయం వివాదంగా మారుతోంది. నీట మునిగిన ప్రాంతాలు, వాటిల్లిన నష్టం అంచనాలు, బాధితులకు ప్రస్తుతం పంపిణీ చేస్తున్న నష్ట పరిహారంలో తేడాలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. వరద నీటితో నష్టపోయిన వారికి కాకుండా అనర్హులకు ఇచ్చారని, మునిగిపోయిన తమను పక్కన పెట్టారంటూ సిటీలోని అన్ని ప్రాంతాల్లోనూ అందోళనలు జరుగుతున్నాయి. గడ్డిఅన్నారం, చంపాపేట, ఉప్పల్, రామంతాపూర్, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, రాంనగర్ ఏరియాలో అయితే గత వారం రోజులుగా ప్రజలు ధర్నాలు చేస్తున్నారు. తమకు వరద సాయం చేయాలంటూ మున్సిపల్ కార్యాలయాలు, వార్డు కార్యాలయాల దగ్గర నిరసనలు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో కార్పొరేటర్లను చుట్టుముట్టారు. మున్సిపల్ అధికారులను నిర్బంధించారు. ఉప్పల్‌లో మున్సిపల్ కార్యాలయంలో ఎదుటే భోజనాలు చేసి ఆందోళనకు దిగారు.
అధికారులు పంపిణీకి సిద్ధం చేసిన జాబితాపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. క్షేత్ర స్థాయిలో పరిశీలించకుండా, కార్పొరేటర్లు, నాయకులకు చెప్పిన ప్రాంతాలను సైతం జాబితాలో చేర్చారు. ముంపు బాధితుల్లో ఎక్కువ మందికి నగదు సాయం అందుతున్నా కొన్ని ప్రాంతాల్లో అందడం లేదు. ముంపునకు గురికాని ప్రాంతాల్లో సైతం నగదు పంపిణీ చేశారు. కొన్ని డివిజన్లలో స్థానిక టీఆర్‌ఎస్ నాయకులు వ్యవహారం తలనొప్పింగా మారింది. నగదు పంపిణీ అయిన తర్వాత డబ్బులు వసూలు చేస్తుండంతో ఇటీవల ఎమ్మెల్యే మౌలాలి డివిజన్‌లో ముగ్గురిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అయినా నాయకుల తీరు మారడం లేదు. చాలా డివిజన్లలో కూడా అదే పరిస్థితి నెలకొంది. బాధితులకు అందజేసిన పరిహారంలో కొంత మొత్తాన్ని వసూళ్లు చేస్తున్నారు అధికార పార్టీ నేతలు. ముంపునకు గురికాని ప్రాంతాల్లో రూ.5వేలు పంపిణీ చేస్తున్నారు.
వరద సహాయంలో దళారీ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని టీఆర్ఎస్ నేతలు డబ్బులు సూలు చేస్తున్నారనే ఆరోపణలు దాదాపుగా అన్ని ప్రాంతాల నుంచి వస్తున్నాయి.వరద సహాయం రూ.10వేలు ఇచ్చినట్టే ఇచ్చి వెంటనే సగం డబ్బులు తిరిగి ఇవ్వాలని కొందరు నేతలు బాధితులను డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.. ఎందుకివ్వాలని బాధితులు ప్రశ్నిస్తే ‘అసలు మీ ఇల్లు మునగనే లేదు అని చెప్పి మొత్తం డబ్బులు తీసుకుంటాం’ అని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముంపు బారిన పడని కాలనీల్లో సైతం డబ్బులు ఇస్తున్నారని అసలైన అర్హులకు ఎందుకు ఇవ్వరని వాపోయారు. కొందరి దగ్గర ఆధార్‌కార్డు తీసుకుని ఓటీపీ వచ్చిన తర్వాత లబ్ధిదారుని సంతకం తీసుకుని.. తర్వాత డబ్బులు ఇచ్చేది లేదని లోకల్ లీడర్లు వెళ్లిపోయారని కొందరు బాధితులు ఆరోపిస్తున్నారు. శవాల మీద ప్యాలాలు ఏరుకుంటున్నట్లు స్థానిక నేతలు వ్యవహరిస్తున్నారని ముంపు బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గ్రేటర్ లో ప్రస్తుతం వరద సాయం అందిన వ్యక్తులు అదృష్టవంతుడిగా మారుతున్నాడు. డబ్బులు తీసుకున్నవారు సంతోష పడుతుండగా.. మిగతా వారంతా సర్కార్ పై ఆగ్రహంగా ఉంటున్నారు. దీంతో ప్రతి డివిజన్ లో సాయం అందని వారే ఎక్కువగా ఉంటారని.. వారంతా తమకు వ్యతిరేకమవుతున్నాయని గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న టీఆర్ఎస్ నేతలు ఆందోళన చెందుతున్నారు. వరద సాయం కలిసి వస్తుందనుకుంటే .. అదే ఇప్పుడు తమకు ఇబ్బందిగా మారిందని, డివిజన్ లో తిరగలేకపోతున్నామని మరి కొందరు గులాబీ నేతలు కలవరపడుతున్నారు. మొత్తంగా గ్రేటర్ లో సర్కార్ చేస్తున్న వరద సాయం తమ కొంప ముంచుతూ విపక్షాలకు వరంగా మారిందనే చర్చే అధికార పార్టీలో ఎక్కువగా జరుగుతోంది.