సభాపతి తీరుపై విమర్శలు.!
posted on Dec 2, 2020 @ 1:10PM
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభా సభాపతి రూల్సు కు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, కేవలం ఒక పార్టీకి ప్రతినిధిగా సభను నడిపిస్తున్నారని విమర్శలు తీవ్రస్థాయిలో వినిపిస్తునాయ్. కనీసం సభా మర్యాదలను కూడా పాటించకుండా శాసనసభా సభాపతే ఈ విదంగా సభ్యులను సభలోనే అగౌరపర్చడం ఏమిటని ఇటు రాజకీయ వర్గాలు అటు న్యాయకోవిదులు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు.
ముఖ్యంగా నిన్న, అంటే డిసెంబర్ 1 వ తారీఖున సభలో ఆయన ప్రతిపక్ష నాయకునిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపుతున్నాయ్. రాష్ట్ర అసెంబ్లీలో నిన్న పేదల గృహ నిర్మాణంపైన చర్చ జరుగుతున్నప్పుడు, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు కొంత సహనం కోల్పోయినమాట వాస్తవమే. సభాపతి కుర్చీలో కూర్చున్న తమ్మినేని సీతారాం దీనిపై స్పందిస్తూ, "ఏమనుకుంటున్నావ్? నీ ఉడత ఊపులకు, పిల్లి శాపనార్ధాలకు ఎవరూ భయపడరు. ఎల్ఓపీ అయితే ఎవరికీ గొప్ప? జాగ్రత్త… ఏం మాట్లాడుతున్నావ్?" అంటూ వ్యాఖ్యలు చేయడం అన్ని వర్గాలనుండి రకరకాల విమర్శలకు తావిచ్చింది.
సభలో వున్న సభ్యులు, ఇటు అధికార పక్షానికి చెందిన వారైనా, అటు ప్రతిపక్షమువారైనా, విమర్శలు గుప్పించుకోవడం సర్వ సాదారణమేనని, దీనికి సభాపతి కుర్చీలో కూర్చున్న వారు మాత్రం కొంత సౌమ్యాత పాటించవలసిన అవసరం ఎంతయినా ఉందని న్యాయకోవిదులు అభిప్రాయపడుతున్నారు. సభాపతే నిగ్రహం కోల్పోతే ఇక సభ నడిచే విధానం ఎలా ఉంటుందో ఎవరైనా సులభంగానే వూహించుకోవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు.
ఒకవేళ సభలో వున్న సభ్యులు సహనం కోల్పోయి ఏదైనా మాట్లాడితే కుర్చిలో కూర్చున్నవారు వారిని వారించి సభను సవ్యంగా సాగేటట్లు చూడవలిసిందిపోయి, సభాపతే ఆవిధంగా సభ్యులను, ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుడిని ఆవిధంగా మాట్లాడడం ఏమాత్రం స్వాగతించవసిన విషయం కాదని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రతిపక్షంలో కూర్చున్నవాళ్లు తమ వాదనలను గట్టిగా విన్పించడం, దీనికి అటు అధికార పక్షంలో కూర్చున్నవాళ్లు సరైన రీతిలో సమాధానం చెప్పడం ఏమాత్రం తప్పు లేదని, సభ్యులు కోపతాపాలను సభలో ప్రదర్శించడం లో తప్పు లేదని, సభను సరైన రీతీలో నడపవలసిన సభాపతి మాత్రం ఏనాడు సహనం కోల్పోకూడదని, అలాంటిది తమ్మినేని సీతారాం స్పీకర్ చైర్ లో కుర్చున్న దగ్గరనుండి దీనికి పూర్తిగా తిలోదకాలు ఇచ్చారని వీరు అభిప్రాయపడుతున్నారు.
ఇది తమ్మినేనికి కొత్తేమి కాదని, గతంలో అనేక పర్యాయాలు ఇలా జరిగిందని రాష్ట్ర రాజకీయ నాయకులంటున్నారు. గత జులై లో సుప్రీమ్ కోర్ట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్రాసిన లేఖ ఫై స్పందించిన తమ్మినేని న్యాయ స్థానాలపైనే వ్యాఖ్యలు చేసారని గుర్తుచేస్తున్నారు. ఇక గత జనవరిలో అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానులపై చర్చ జరుగుతున్న సమయంలో కూడా ఆయన సహనం కోల్పోయి ప్రతిపక్ష సభ్యులపై చేసిన వ్యాఖ్యలు, జనవరి 6 న కొంతమంది అధికారులపై ఆయన చేసిన వ్యాఖ్యలు, ఇక గత సంవత్సరం నవంబర్లో శ్రీకాకుళంలో జరిగిన ఒక కార్యక్రమానికి ఆయనను పిలవలేదని ఆయన చేసిన కామెంట్లు, ఏమాత్రం ఆయన పొజిషన్ కు తగ్గవి కాదని వారంటున్నారు.
ఒకవేళ ఏ సభ్యుడైన సభామర్యాదలు పాటించకుండా ఏవైనా అసభ్య పదజాలం వాడినా, సభాపతి హోదాలో అయన ఆ సభ్యుడిని ఆ కామెంట్లు ఉపసంహరించుకోమని డిమాండ్ చేయవచ్చని, గతంలో చైర్లో కూర్చున్న చాలామంది ఇలాంటివి పాటించారని, ఒకానొక సందర్భంలో ముఖ్యమంత్రి హోదాలో వున్నవారే వారి వారి కామెంట్లను ఉపసంహరించుకున్న దాఖలాలు చాలా ఉన్నాయని, కానీ సభాపతి మాత్రం ఎక్కడ సహనం కోల్పోయిన సందర్భాలు లేవని, ఇది ఇప్పుడే చూస్తున్నామని నాయకులంటున్నారు. ఏది ఏమైనా, చైర్కు ఒక హోదా ఉందని, దానిలో కూర్చున్నవారు ఆ హోదా ను కాపాడవసిన అవసరం ఎంతయినా ఉందని మాత్రం వారు గుర్తుచేస్తున్నారు.