కరోనా.. సెలవులు.. భయాలు! గ్రేటర్ లో పూర్ పోలింగ్
posted on Dec 1, 2020 @ 5:59PM
సోషల్ మీడియాలో సొల్లు కబుర్లు చెబుతారు.. ఆన్ లైన్ లో హంగామా చేస్తుంటారు.. రోడ్లు బాగా లేవంటూ, నీళ్లు రావడం లేదంటూ ఫేస్ బుక్ ల్లో ప్రజా ప్రతినిధులను ప్రశ్నిస్తుంటారు. ట్విట్టర్ లో బడా నేతలకే షాకులిస్తుంటారు. కాని సమస్యలు పరిష్కరించాల్సిన ప్రజా ప్రతినిధులను ఎన్నుకునే ఎన్నికల్లో మాత్రం పాల్గొనరు. ఎప్పటిలానే గ్రేటర్ హైదరాబాద్ ఓటర్లు నిరాశపరిచారు. ఎవరెవరెన్ని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చినా పోలింగ్ బూత్‌ల వైపు కన్నెత్తి చూడలేదు. దీంతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోలింగ్ శాతం దారుణంగా పడిపోయింది. కొన్ని డివిజన్లలో 20 శాతం కూడా పోలింగ్ జరగలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించవచ్చు. శివారు ప్రాంత డివిజన్లలో కొంత బాగానే ఉన్న ఓల్ట్ సిటీతో పాటు కోర్ సిటీలో మాత్రం ఓటింగ్ తీరు అత్యంత అధ్వాన్నంగా ఉంది.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఈసారి పోటీ తీవ్రంగా ఉంది. ప్రధాన పార్టీలు ప్రటిష్టాత్మకంగా తీసుకోవడంతో ప్రచారం హోరాహోరీగా సాగింది. దీంతో జీహెచ్ఎంసీలో ఈసారి పోలింగ్ శాతం పెరుగుతుందని భావించారు. కాని అందరి అంచనాలు తలకిందులయ్యాయి. పోలింగ్ పెరగకపోగా గతంలో కంటే భారీగా తగ్గిపోయింది. సోషల్ మీడియాలో లెక్చరర్లు దంచే ఐటీ ప్రొఫెనల్స్ ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. సెలబ్రెటిల్లో కూడా కొందరే కనిపించారు. కార్పొరేట్ ఉద్యోగులు హాలీడేను ఎంజాయ్ చేస్తున్నట్టుగా పోలింగ్‌కు దూరంగా ఉన్నారు. మధ్యతరగతి ప్రజలు కూడా ఓటింగ్ పై ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. పోలింగ్ లో యూత్ పెద్దగా కనిపించక పోగా.. వృద్దులు, వికలాంగులు మాత్రం ఉత్సాహంగా ఓటేసి ప్రజాస్వామ స్పూర్తి చాటారు. క్యూ ఉన్నప్పటికీ ఎంతో ఓపికతో నిలబడి మరీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. బస్తీ జనాలు కూడా ఓటింగ్ లో బాగానే పాల్గొన్నారు.
కరోనా భయంతో చాలా మంది ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు రాలేదని చెబుతున్నారు. కరోనా నియంత్రణ చర్యలు తీసుకున్నా ప్రజలకు చెప్పడంలో ఎన్నికల సంఘం విఫలమైంది. దీంతో ఓటేసేందుకు చాలా మంది వెనుకంజ వేసినట్లు చెబుతున్నారు. వేలాది మంది సాప్ట్ వేర్ ఉద్యోగులు సిటిని వదిలి సొంతూర్ల నుంచే వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నారు. వారంతా ఓటింగ్ కు దూరమయ్యారు. కరోనా సమయంలో హైదరాబాద్ లో ఉన్న వేలాది కుటుంబాలు సొంతూర్లకు వెళ్లాయి. వారిలో చాలా మంది తిరిగి రాలేద. వీటితో పాటు వరుస సెలవులు ప్రభావం చూపిందంటున్నారు. వరుసగా మూడు సెలవులు రావడంతో చాలా మంది టూర్లకు వెళ్లారని తెలుస్తోంది.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో గతంలో ఎప్పుడు లేనంతగా ఈసారి ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. ఎంఐఎం, బీజేపీ నేతల ప్రసంగాలు వివాదాస్పదమయ్యాయి. సర్జికల్ స్ట్రైక్, సమాధులు కూల్చేస్తాం, తరమికొడతాం, రోహింగ్యాలు, పాకిస్తాన్ వంటి అంశాలే ప్రచార అస్త్రాలుగా మారిపోయాయి. దీంతో గతంలో ఎప్పుడు లేనంతగా గ్రేటర్ ఎన్నికలు టెన్షన్ పుట్టించాయి. ప్రచారంలో జరిగిన ఇలాంటి పరిణామాలతో కొందరు ఓటర్లు భయాందోళనకు గురయ్యారని చెబుతున్నారు. పోలింగ్ రోజుల గొడవలు జరుగుతాయన్న భయంతో కొందరు ఓటేసేందుకు రాలేదంటున్నారు. పాతబస్తి అంశాలు ప్రచారంలో ప్రధానంగా వినపడటంతో అక్కడ ఓటింగ్ పై ప్రభావం చూపించిందని చెబుతున్నారు. ఓల్ట్ సిటీలోని కొన్ని వర్గాలు ఓటేసేందుకు ముందుకు రాలేదని చెబుతున్నారు.
ఓటర్ స్లిప్పుల పంపిణి సక్రమంగా జరగకపోవడం, ఓట్ల గల్లంతు వంటి కారణాలు కూడా ఓటింగ్ శాతం తగ్గడానికి కారణమంటున్నారు. ఓల్డ్ సిటీలో భారీగా ఓట్లు గల్లంతు అయ్యాయి. పలుచోట్ల ఓటర్ల జాబితాలో మరణించిన వారి పేర్లు కనిపించాయి. కుటుంబంలో కొందరి పేర్లు మాత్రమే జాబితాలో ఉన్నాయని.. మరికొందరి పేర్లు గల్లంతు అయ్యాయని పలు ప్రాంతాల్లో ఓటర్లు ఆందోళనకు దిగారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లు రవి ఓటు గల్లంతైంది. దీంతో ఆయన అధికారులకు ఫిర్యాదు చేశారు. కరోనా కారణంగా ఈసారి పోలింగ్ కేంద్రాలను పెంచారు. అయితే చాలా మంది ఓటర్లు తాము ఎప్పుడూ ఓటు వేసే పోలింగ్ కేంద్రాలకు వెళ్లడం.. అక్కడి అధికారులు ఇక్కడ కాదని వెనక్కి పంపడంతో కొందరు వెనుదిరిగిపోయారని చెబుతున్నారు. తమకు డబ్బులు ఇవ్వలేదనే కారణంతోనూ కొన్ని ప్రాంతాల్లో జనాలు ఓటేసేందుకు ముందుకు రాలేదని తెలుస్తోంది.
గతంలోనూ గ్రేటర్ హైదరాబాద్ లో తక్కువ శాతమే పోలింగ్ జరిగింది. 2016 గ్రేటర్ ఎన్నికల్లో 46 శాతం పోలింగ్ నమోదైంది. ఇప్పటివరకు హైదరాబాద్ లో జరిగిన పోలింగులో అదే రికార్డ్. కాని ఈసారి గ్రేటర్ ప్రచారం హోరాహోరీగా సాగింది. టీఆర్ఎస్ పార్టీ తమ నేతలందరిని గ్రేటర్ లో మోహరించింది. మంత్రలు సైతం గల్లిగల్లీ తిరిగారు. బీజేపీ ప్రచారానికి జాతీయ అగ్ర నేతలు వచ్చారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, యూపీ ముఖ్యమంత్రి యోగీ అదిత్యనాథ్, బీజేపీ చీఫ్ జేపీ నడ్డాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు జీహెచ్ఎంసీలో ప్రచారం చేశారు. పార్టీల హంగామాతో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలను తలపించాయి. దీంతో పోలింగ్ శాతం పెరుగుతుందని అంతా భావించారు. కాని ఈసారి గతంలో కన్నా తగ్గడం చర్చనీయాంశమైంది.
ఓటింగ్ కు రాని యువత తీరుపై సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రశ్నిస్తారు కానీ.. ఓటేసేందుకు మాత్రం ముందుకు రారా..? అంటూ మండిపడుతున్నారు. పోలింగ్ కేంద్రం వైపు కన్నెత్తి చూడని వారికి ప్రభుత్వ పథకాలు, సంక్షేమ ఫలాలు రద్దు చేయాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. ఓటు వినియోగించుకోని వారికి ఓటు హక్కు అవసరమా..? అని మరికొందరు చెబుతున్నారు. వెంటనే వారికున్న ఓచు హక్కును తీసేయండి అంటూ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.