తగ్గిన పోలింగ్ తో ఎవరికి నష్టం ! అన్ని పార్టీల్లో టెన్షన్
posted on Dec 1, 2020 @ 6:51PM
తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా చర్చగా మారిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ముగిశాయి. హోరాహోరీగా ప్రచారం సాగడంతో ఈసారి పోలింగ్ శాతం పెరుగుతుందని అంచనా వేసినా.. ఈ సారి గతంలో కంటే ఓటింగ్ భారీగా తగ్గింది. కేవలం 35 శాతం మాత్రమే పోలైంది. గ్రేటర్ పోలింగ్ ముగియడంతో పార్టీలన్ని తమకు ఎన్ని ఓట్లు వచ్చాయోనని లెక్కలు వేసుకుంటున్నాయి.
పోలింగ్ శాతం తగ్గడంతో అన్ని పార్టీలకు టెన్షన్ పట్టుకుంది. కొన్ని డివిజన్లలో 15 శాతం వరకే పోలింగ్ జరగగా.. అక్కడ రెండు, మూడు వేల ఓట్లు వచ్చిన వారు కూడా గెలిచే అవకాశం ఉంది. దీంతో తగ్గిన పోలింగ్ ఎవరి కొంప ముంచుతుందోనన్న ఆందోళన అన్ని పార్టీల్లో కనిపిస్తోంది. పోలింగ్ శాతం తగ్గడం తమకే అనుకూలమని ప్రధాన పార్టీలు బయటికి చెబుతున్నా లోలోపల మాత్రం కలవరపడుతున్నట్లు తెలుస్తోంది.
గ్రేటర్ ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గడం తమకు కలిసివస్తుందని అధికార పార్టీ అంచనా వేస్తుందని తెలుస్తోంది. పోలింగ్ లో వృద్ధులు, వికలాంగులు ఎక్కువగా పాల్గొనడం తమకు ప్లస్ అవుతుందంటున్నారు గులాబీ నేతలు. బస్తీ జనాలు ఓటింగ్ లో ఎక్కువగా పాల్గొనడం, ముస్లింల ఓటింగ్ బాగానే ఉండటం తమకు అనుకూల అంశాలని లెక్కలు వేసుకుంటోంది. వరద సాయం అందిన కుటుంబాలు ప్రభుత్వానికి కృతజ్ఞతగా ఓటింగ్ లో పాల్గొన్నారని చెబుతున్నారు. ఉద్యోగులు, సెలబ్రిటిలు తమకు మద్దతు ఇచ్చారని చెబుతున్నారు. కేంద్ర సర్వీసు ఉద్యోగుల మద్దతు తమకే లభించిందంటున్నారు టీఆర్ఎస్ నేతలు. బీజేపీ నేతల రెచ్చగొట్టే ప్రసంగాల వల్లే ప్రజలు ఓటింగ్ దూరంగా ఉన్నారని టీఆర్ఎస్ నేతలు అరోపిస్తున్నారు.
బీజేపీ నేతలు కూడా తగ్గిన పోలింగ్ శాతం తమకు అనుకూలమని చెబుతోంది. ముఖ్యంగా ఓల్ట్ సిటీలో తాము అద్భుత ఫలితాలు సాధించబోతున్నామని చెబుతున్నారు. ఎంఐఎంపై వ్యతిరేకతతోనే ముస్లింలు ఈసారి ఓటింగ్ రాలేదంటున్నారు కమలం నేతలు. అదే సమయంలో ప్రచారంలో తాము ఇచ్చిన భరోసాతో పాతబస్తిలోని హిందువులు ఈసారి ఉత్సాహంగా ఓటింగులో పాల్గొన్నారని చెబుతున్నారు. కేసీఆర్ సర్కార్ పై అసంతృప్తితో ఉన్నవారంతా బయటికి వచ్చి ఆయనకు వ్యతిరేకంగా కసిగా ఓట్లు వేశారంటున్నారు. యూత్ ఓటింగ్ బాగా జరిగిందని.. తమకు ఇబ్బందిగా మారుతారని భావించిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఓటింగులో ఎక్కువగా పాల్గొనలేదని బీజేపీ నేతలు అంచనాకు వస్తున్నారు. శివారు ప్రాంతాల్లో కమలం హవా వీచిందని చెబుతున్నారు.
పాతబస్తిలో తమకు తిరుగులేదని భావించే ఎంఐఎం పార్టీలో మాత్రం తగ్గిన పోలింగ్ శాతం గుబులు రేపుతుందని తెలుస్తోంది. ఇటీవల ఆ పార్టీకి వ్యతిరేకంగా ఓల్ట్ సిటీలో ఆందోళనలు జరిగాయి. ఎన్నికల ప్రచారంలో అసద్, అక్బర్ కే నిరసన సెగ తగిలింది. వరద సాయం అందని బాధితులంతా పతంగి పార్టీపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని చెబుతున్నారు. వారంతా పోలింగ్ కు రాకపోవడమే, వచ్చినా మరో పార్టీకి ఓట్లు వేయడమే జరిగిందనే చర్చే ఓల్డ్ సిటీలో జరుగుతోంది. పోలింగ్ శాతం తగ్గడంతో కాంగ్రెస్ లోనూ ఆశలు పెరుగుతున్నాయి. నాలుగైదు వేల ఓట్లు వచ్చినా గెలిచే అవకాశం ఉండటంతో తాము గౌరవపద్రమైన సీట్లు గెలుస్తామని హస్తంనేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఉప్పల్, మల్కాజ్ గిరి, ఎల్బీనగర్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గుచూపారని చెబుతున్నారు. టీడీపీ కూడా తాము ఐదారు స్థానాల్లో గెలుస్తామని ఆశలు పెట్టుకుంది.