గ్రేటర్ లో ఓటింగ్ తగ్గడానికి అసలు కారణం ఇదేనా?
posted on Dec 2, 2020 @ 10:01AM
హైదరాబాదీలు బద్దకస్తులు.. ఓటింగ్ కోసం సెలవు ఇస్తే హాలీ డే ట్రిప్ గా మారుస్తారు.. ఇది జీహెచ్ఎంసీలో ఓటింగ్ శాతం తక్కువగా జరగడంతో హైదరాబాదీలపై వస్తున్న విమర్శలు. అయితే క్షేత్రస్థాయిలో చూస్తే నగర ఓటర్లలో మెజార్టీ మంది.. అంటే దాదాపు 65 శాతం వరకు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నట్లు కనిపిస్తోంది. పోలింగ్ తర్వాత సిటీలోని కొందరు ఓటర్లను పరిశీలించినప్పుడు వారిలో మెజార్టీగా ఓటు వేసిన వారే. ఫీల్డ్ లో సీన్ ఇలా ఉంటే.. గ్రేటర్ పరిధిలో ఓవరాల్ ఓటింగ్ మాత్రం 45 దగ్గరే ఉంటుంది. ఇదే ఇప్పుడు చర్చనీయాశంగా మారింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఓటింగ్ తగ్గడానికి అసలు కారణం... ఓటర్ లిస్టు తప్పుల తడకగా ఉండటమే ప్రధాన కారణమని తెలుస్తోంది.
ప్రతిసారీ గ్రేటర్ పరిధిలో చాలా తక్కువగా ఓటింగ్ నమోదవడంపై ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జనాభా, ఓటర్ల లెక్కల టెక్నికల్ అంచనాల మేర కు.. ప్రతి 100 మంది జనాభాకు 67 మంది ఓటర్లుండాలి. నగరాల్లో 70 మంది వరకు ఓటర్లు ఉంటరు. గ్రేటర్ హైదరాబాద్‌లో 2011 జనాభా లెక్కల ప్రకారం 68 లక్షల మంది, 2014 సామాజిక సర్వే ప్రకారం 78 లక్షల మంది జనాభా ఉన్నారు. ప్రస్తుతం సిటీ జనాభా 90 లక్షలు అనుకుంటే... దాదాపు 65 లక్షల ఓటర్లు ఉండాలి. కానీ 74 లక్షల 44 వేల మంది ఉన్నారు. ఈ లెక్కన సిటీలో డబుల్ ఓటర్లు, నివాసం లేని వారి ఓట్లు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. జీహెచ్ఎంసీ ఓటర్ల జాబితాను పరిశీలిస్తే.. లెక్కలేనన్ని తప్పులు కనపడతాయి. జనాభాకు, ఓటర్ల సంఖ్యకు అసలు పొంతనే ఉండదు. ఓటర్లకు.. పోలింగ్‌కు లెక్క కుదరదు. ఓటర్లు జాబితాలో పేరు నమోదు చేసుకునే విషయంలో చూపిస్తున్న చొరవ.. ఇండ్లు మారినప్పుడో, సిటీని వదిలి వెళ్తున్నప్పుడో, చనిపోయినప్పుడు జాబితాలో పేర్లు తొలగించడంలోనో చూపడం లేదు. దీనివల్ల హైదరాబాద్ ఓటర్ల జాబితాలో కొందరి పేర్లు రెండు, మూడు చోట్ల ఉన్నాయని ఎక్స్పర్టులు చెప్తున్నారు. జిల్లాల్లో ఓట్లు ఉన్నవారికి కూడా గ్రేటర్ లో లక్షలాది మందికి ఓట్లు ఉన్నాయని తెలుస్తోంది.
అసెంబ్లీ, లోక్ సభ, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు ముందు నగరంలో భారీగా కొత్త ఓట్లు నమోదవుతుంటాయి. ఎన్నికల బరిలో నిలవాలనుకునే అభ్యర్థులు... ముందు జాగ్రత్తగా తమ వారితో బోగస్ ఓట్లు నమోదు చేయిస్తారని చెబుతున్నారు. జిల్లాలకు చెందిన వారితో అప్లయ్ చేయిస్తారు. వారందరికి ఓటు వస్తుంది. ఎన్నికల తర్వాత సదరు నాయకుడు ఈ ఓట్ల సంగతే మర్చేపోతాడు. దీంతో అలాంటి వారి ఓట్లు గ్రేటర్ జాబితాలో అలానే ఉంటాయి. సిటీలోని అద్దెకు ఉండేవారు... తాము వెళ్లిన ప్రతి చోట కొత్త ఓట్లకు నమోదు చేయించుకుంటారు. కాని తమ పాత ఓటును మాత్రం తీసివేయించుకోరు. ఇలా సిటీలో రెండు, మూడు ఓట్లు ఉన్నవారి సంఖ్య కూడా వేలల్లోనే ఉంటుందని చెబుతున్నారు. సరైన జాబితా తయారీలో ఎస్‌ఈసీ ఫెయిలైందనే ఆరోపణలు వస్తున్నాయి.
పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు, రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వారు, భవన నిర్మాణ కూలీల ఓట్లను కొన్ని పార్టీలు, నేతలు.. ఎన్నికలకు ముందు ఎన్ రోల్ చేయిస్తుంటారు. తర్వాత వాటిని తొలగించరు. ఇలా ఇతర రాష్ట్రాల నుంచే వచ్చి నగరంలో పనిచేసిన వేలాది మంది కూలీల పేర్లు కూడా గ్రేటర్ ఓటర్ జాబితాలో ఉన్నాయంటున్నారు. రాజకీయ నేతలకు సొంత కంపెనీలు ఉంటే.. తమకు ఎప్పటికైనా కలిసివస్తాయనే ఆశతో తమ వర్కర్ల పేర్లతో ఓట్లు నమోదు చేయిస్తున్నారు. కార్మికులకు ఇప్పటికే ఓటు ఉన్నా మళ్లీ అప్లయ్ చేయిస్తారు. రెండు ఓట్లు ఉన్నా గుర్తించే టెక్నాలజీ ఎన్నికల కమిషన్ దగ్గర లేకపోవడంతో వారందరికి రెండో, మూడో ఓట్లు కూడా వస్తున్నాయి. ఇలాంటి తరహా ఓటర్లు కూడా గ్రేటర్ లో వేలల్లోనే ఉంటారని చెబుతున్నారు.
మొత్తంగా ఓటర్ జాబితా తప్పుల తడకగా ఉండటం, ఎన్నికల అధికారుల నిర్లక్ష్యం వల్లే హైదరాబాద్ లో ఓటింగ్ శాతం తగ్గినట్లుగా క్రియేట్ అవుతుందనే అభిప్రాయం మేథావులు, రాజకీయ అనలిస్టుల నుంచి వస్తోంది. బోగస్, డబుల్, నివాసం లేని వారి ఓట్లను తొలగిస్తే గ్రేటర్ లో నిజమైన ఓటర్ల సంఖ్య 65 లక్షల వరకే ఉంటుందని చెబుతున్నారు. 65 లక్షల ఓటర్లకు గాను 35 నుంచి 40 లక్షలు పోలైతే దాదాపు 65 శాతం పోల్ అవుతున్నట్లే. హైదరాబాదీలపై వస్తున్న బ్యాడ్ ఇమేజ్ పోవాలంటే ఓటర్ కార్డుకు ఆధార్ లింక్ చేయడమే పరిష్కారం అంటున్నారు. ఓటర్ల జాబితాలో తప్పుడు, రిపిటీషన్ ఓట్ల తొలగింపు పకడ్బందీగా చేపట్టాల్సి ఉందన్న అభిప్రాయాలు వస్తున్నాయి. అలా చేస్తే ఫేక్ ఓట్లు, డబుల్ ఓట్లు పోతాయని, నిజమైన ఓటర్లే హైదరాబాద్ లో మిగిలిపోతారని చెబుతున్నారు. అప్పుడే హైదరాబాదీలు ఓటింగ్ పాల్గొంటున్నారా లేక పోలింగ్ డే రోజును హాలీడేగా మార్చుకుంటురా తేలుతుందంటున్నారు ఎక్స్ పర్ట్స్.