గాంధేయవాది స్మృతి వనంలో వైసీపీ నేతల మందు పార్టీ.. రికార్డింగ్ డ్యాన్సులు
posted on Dec 11, 2020 @ 1:16PM
ఏపీలో వైసీపీ నేతల నిర్వాకంతో సీఎం జగన్ తల బొప్పి కట్టేలా ఉంది. తొమ్మిదేళ్లకు పైగా ప్రతిపక్షంలో ఉండి పోరాడి.. బంపర్ మెజారిటీతో ఏపీలో అధికారం చేపట్టిన సీఎం జగన్ ప్రశాంతంగా పరిపాలన పై దృష్టి పెట్టకుండా సొంత పార్టీ నాయకులు తమ ప్రవర్తనతో ప్రతి రోజు కొత్త తలనొప్పులు తీసుకు వస్తున్నారు. తాజాగా గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, గాంధేయవాది అయిన వావిలాల గోపాలకృష్ణయ్య స్మృతి వనంలో వైసీపీ యూత్ వింగ్ అధ్యక్షుడు అచ్యుత శివప్రసాద్ జన్మదిన వేడుకలను ఎలాంటి అనుమతి లేకుండానే నిర్వహించారు. దీనికోసం లౌడ్ స్పీకర్లు పెట్టి మద్యం మత్తులో సినిమా పాటలకు స్టెప్పులేశారు. మరోపక్క అమ్మాయిలతో రికార్డింగ్ డ్యాన్సులు కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా మద్యపానానికి వ్యతిరేకంగా పోరాడిన ఆ మహనీయుడి సమాధి వద్దే మందుకొడుతూ ఫుల్ గా ఎంజాయ్ చేశారు.
అయితే నిబంధనల ప్రకారం స్మృతివనంలోకి రాత్రి 7గంటలు దాటితే ఎవర్నీ అనుమతించరు. అలాంటిది ఏకంగా రాత్రి 9గంటల నుంచి అర్ధరాత్రి ఒంటిగంట వరకు మాజీ కౌన్సిలర్లు, మున్సిపల్ ఎన్నికల పోటీలో అభ్యర్థులుగా ఉన్నవారు అమ్మాయిలతో కలిసి చిందులు వేశారు. వైసీపీ నేతల ఈ తాజా నిర్వాకానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ ఆ ఘటన పై విచారణకు ఆదేశించారు. ఎంత అధికారంలో ఉంటే మాత్రం ఒక మహనీయుడి సమాధి వద్ద ఇలా అవమానించేలా ప్రవర్తిస్తారా అని మరోపక్క స్థానికులు మండిపడుతున్నారు.
గతంలో ఎలాంటి అభివృద్ధికి నోచుకోని వావిలాల స్మృతివనాన్ని గత టీడీపీ ప్రభుత్వం రూ.10 కోట్లతో సుందరంగా తీర్చిదిద్దింది. స్థానికులు ఎంతో పవిత్రస్థలంగా భావించే స్మృతి వనంలో ఈ విధంగా మందుపార్టీలు చేసుకోవడంపై వివిధ పార్టీల స్థానిక నేతలు ఆందోళనకు దిగారు. టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు ఇక్కడ నిరసలను చేపట్టారు. మరోపక్క ఈ ఘటన తరువాత టీడీపీ ఆధ్వర్యంలో స్మృతివనాన్ని పసుపునీటితో శుద్ధి చేశారు.
ఇటువంటి పార్టీలు వేరే ఎక్కడైనా జరిగి న్యూసెన్స్ జరిగితే పరిస్థితి వేరుకానీ.. గాంధీ స్పూర్తితో మద్యనిషేధం అమలు చేస్తున్నామంటున్న వైసీపీ నేతలు.. అదే మద్యనిషేధం కోసం ఉద్యమించిన గాంధేయవాది వావిలాల గోపాల కృష్ణయ్య సమాధినే మందు పార్టీలు, రికార్డింగ్ డాన్సులకు వేదికగా చేయడాన్ని జనం తప్పుబడుతున్నారు.