జగన్ రెడ్డిది ఫాసిస్ట్ పాలన! నేరగాళ్ల రాజ్యం తెచ్చారన్న చంద్రబాబు
posted on Dec 11, 2020 @ 3:10PM
ఆంధ్రప్రదేశ్ అరాచకాలకు అడ్డాగా మారిందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. జగన్ అండతో వైసీపీ ఫాసిస్ట్ మూకలు రెచ్చిపోతున్నాయని ఆరోపించారు. ఏ నేరానికి పాల్పడినా ఎవరేం చేయరనే ధీమాతో నిందితులంతా పేట్రేగిపోతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో రూల్ ఆఫ్ లాకు గండికొట్టారని చంద్రబాబు మండిపడ్డారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు, దౌర్జన్యాలకు అంతే లేకుండా పోయిందన్నారు. ఏడాదిన్నరగా రాష్ట్రంలో అశాంతి, అభద్రత నెలకొందని, ఎక్కడా శాంతిభద్రతలు లేకుండా నేరగాళ్ల రాజ్యం తెచ్చారని చంద్రబాబు విమర్శించారు.
చిత్తూరు జిల్లా కురబలకోట మండలం అంగళ్లు వద్ద తెలుగుదేశం పార్టీ నేతలపై వైసీపీ నేతలు చేసిన దాడిని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. టీడీపీ నేతలను గాయపర్చడం, వారి వాహనాలను ధ్వంసం చేయడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బి.కొత్తకోటలో మరణించిన పార్టీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తున్న నాయకులపై దాడి చేయడం దారుణమన్నారు చంద్రబాబు. జగన్ మోహన్ రెడ్డి ఫాసిస్ట్ పాలనకు ఈ దాడులు అద్దం పడుతున్నాయని టీడీపీ అధినేత ధ్వజమెత్తారు.
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం బడుగు, బలహీనవర్గాలపై దాడులు జరగని రోజే లేదని చంద్రబాబు ఆరోపించారు. ప్రతి రోజూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలపై దమనకాండ యథేచ్ఛగా కొనసాగుతోందని చెప్పారు. రాష్ట్రంలో నేరగాళ్ల అరాచకాలను నియంత్రించే వ్యవస్థే లేకుండా పోయిందన్నారు. జగన్ రెడ్డి సీఎం అయ్యాక పోలీసు వ్యవస్థ నీరు గారి పోయిందని... రాష్ట్రంలోని పేదలు, సామాన్యులకు రక్షణ లేకుండా పోయిందని చంద్రబాబు విరుచుకుపడ్డారు. దాడులు, దౌర్జన్యాలకు పాల్పడేవాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.