అలిగి వెళ్లిపోయిన మంత్రి అవంతి!!
posted on Dec 11, 2020 @ 10:31AM
రాష్ట్ర మంత్రి అంటే సవాలక్ష పనులు ఉంటాయి. ఎన్ని పనులు చూసుకోవాలి, ఎన్ని కార్యక్రమాలకు హాజరు కావాలి. ఇవన్నీ ఆలోచించకుండా.. మనం మంత్రిని కార్యక్రమానికి పిలిచాం, మనం చెప్పిన టైంకి ఆయన రాలేదు కాబట్టి.. మనమే కార్యక్రమాన్ని పుర్తి చేద్దాం అనుకుంటే ఎలా?.. మంత్రికి ఎంత అవమానం?.. తాజాగా ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ కి అలాంటి అనుభవమే ఎదురైంది.
వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానానికి చెందిన పూదోటను అభివృద్ధి చేసేందుకు నిర్ణయించిన సింహాచలం దేవస్థానం పాలక మండలి గురువారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే, మంత్రి అవంతి శ్రీనివాస్ ను ఆహ్వానించింది. కార్యక్రమం ఉదయం 9.15 గంటలకు ప్రారంభమవుతుందని సమాచారం ఇచ్చింది. అయితే మరో కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఉదయం 10.10 గంటలకు పూదోటకు చేరుకున్నారు. అప్పటికే విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి, అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ తదితరులు పూదోటలో మొక్కలు నాటి వెళ్లిపోయారు.
అనంతరం అక్కడకు చేరుకున్న మంత్రికి పాలక మండలి సభ్యులు పూర్ణకుంభం, సన్నాయి వాయిద్యాలతో ఆహ్వానం పలకబోయారు. ఈ సందర్భంలో మంత్రి మిగిలిన అతిథుల గురించి వాకబు చేశారు. వారు ఉదయాన్నే చేరుకోవడంతో మొక్కలు నాటించేశామని బదులివ్వడంతో మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. 'కార్యక్రమానికి ఆహ్వానించినవారు.. నేను వచ్చే వరకు ఆగలేరా?.. మీరే కార్యక్రమం చేసేసుకుంటే ఇంకెందుకు నన్ను పిలవడం..' అని మండిపడ్డారు. తాను వచ్చేంత వరకు ఆగి వుంటే బాగుండేదని, కనీసం ప్రొటోకాల్ పాటించకపోవడమేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు వీడియో కాన్ఫరెన్స్ ఉందని, మరో కార్యక్రమానికి కూడా వెళ్లాల్సి వుందంటూ, వారి మర్యాదలను స్వీకరించకుండా, కారు దిగకుండానే మంత్రి అవంతి తిరిగి వెళ్లిపోయారు.