ఓటుకు నోటు కేసులో కొత్త ట్విస్టులు! రేవంత్ కు పీసీసీ పగ్గాలు రాకుండా కుట్రలా?
posted on Dec 11, 2020 @ 2:54PM
తెలంగాణలో తీవ్ర సంచలనం స్పష్టించిన ఓటుకు నోటు కేసులో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. ఈ కేసులో ఓ వైపు ఏసీబీ కోర్టులో దర్యాప్తు వేగంగా సాగుతుండగానే.. మరోవైపు ఈ కేసులోనే ఏ4 నిందితుడిగా ఉన్న జెరూసలేం మత్తయ్య సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబు, రేవంత్ రెడ్డి తో తనకు ప్రాణ హాని ఉందంటూ మత్తయ్య తెలంగాణ మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించాడు. ఓటుకు నోటు కేసులో అప్రూవర్ గా మారినందున తనను హత్య చేయాలని ప్లాన్ చేశారని అతను ఆరోపించారు. తనకు ఇప్పటికే ఈడీ నోటీసులు వచ్చాయన్న మత్తయ్య.. కేసు విచారణ పూర్తయ్యే వరకు తనకు రక్షణ కల్పించాలని హెచ్చార్సీని వేడుకున్నారు.
మత్తయ్య చేసిన తాజా వ్యాఖ్యలు తెలంగాణతో పాటు ఏపీలోనూ చర్చనీయాంశంగా మారాయి.. మత్తయ్య ఆరోపణల వెనక రాజకీయ కుట్ర ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం మల్కాజ్ గిరి ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డికి తెలంగాణ పీసీసీ పగ్గాలు వస్తాయనే ప్రచారం జరుగుతోంది. రేపో మాపో ఆయన నియామకంపై ఏఐసీసీ నుంచి ప్రకటన వస్తుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జేరూసలేం మత్తయ్యను తెరపైకి తెచ్చారనే వాదనలు వస్తున్నాయి. రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలు రాకుండా చెక్ పెట్టేందుకు పెద్ద ఎత్తున కుట్రలు జరుగుతున్నాయని., దీని వెనక టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేత ఉన్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. తమ నేతకు పీసీసీ పగ్గాలు వస్తే ప్రభుత్వంపై మరింత గట్టిగా పోరాడతారనే భయంతోనే మత్తయ్యతో అధికార పార్టీ కుట్రలు చేస్తుందని రేవంత్ రెడ్డి అనుచరులు మండిపడుతున్నారు. ఇంతకాలం సైలెంటుగా ఉన్న మత్తయ్య.. ఇప్పుడే ఎందుకు బయటికి వచ్చారని వారు ప్రశ్నిస్తున్నారు. రేవంత్ రెడ్డికి పీసీసీ రాకుండా అడ్డుకోవడంతో పాటు చంద్రబాబును ఇరికించే ప్రయత్నం చేస్తున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లోనూ జరుగుతోంది.
తెలంగాణలో కీలకంగా మారిన ఓటుకు నోటు కేసులో ప్రస్తతం ఏసీబీ కోర్టులో వేగంగా విచారణ జరుగుతోంది. ఈ కేసులో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు హైకోర్టులో నిరాశ ఎదురైంది. ఈ కేసు నుంచి సండ్రను తొలగించేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఈ మేరకు ఆయన వేసిన డిశ్చార్జ్ పిటిషన్‌ను ఈనెల 8న ఏసీబీ కోర్టు కొట్టివేసింది. అంతేకాదు విచారణకు ఎంపీ రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్, ఉదయ్ సింహా హాజరుకాకపోవడంపై సీరియస్ గా స్పందించింది. ఈనెల 15న కచ్చితంగా హాజరుకావాలని ఏసీబీ కోర్టు వారిని ఆదేశించింది. హాజరు మినహాయింపు పిటిషన్లను అనుమతించబోమని స్పష్టం చేసింది. దీంతో ఓటుకు నోటు కేసులో ఏం జరుగుతుందన్నది ఆసక్తిగా మారింది. ఈ సమయంలోనే ఈ కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న జేరూసలేం మత్తయ్య చంద్రబాబు, రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేయడం కలకలం రేపుతోంది.
2015లో తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు నోటు కేసు తెరపైకి వచ్చింది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ ను ప్రలోభాలకు గురి చేశారనే ఆరోపణలతో రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, ఉదయ సింహ, జేరూసలేం మత్తయ్యలపై ఏసీపీ కేసు నమోదైంది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ ను 50 లక్షల రూపాయల నగదును రేవంత్ రెడ్డి ఇస్తున్న వీడియోలు వైరల్ అయ్యాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన వేం నరేందర్ రెడ్డిని గెలిపించుకునేందుకు ఈ బేరసారాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు స్టీఫెన్ సన్ తో అప్పటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సహా పలువురు టీడీపీ నేతలు మాట్లాడినట్లుగా ఉన్న ఆడియోలు కూడా వెలుగు చూశాయి. ఈ కేసులోనే రేవంత్ రెడ్డి జైలుకు కూడా వెళ్లారు.