బీజేపీ కమలం గుర్తును వెనక్కు తీసుకోవాలని దాఖలైన పిల్
posted on Dec 11, 2020 9:24AM
ఏ రాజకీయ పార్టీకైనా ఎన్నికల చిహ్నం ఎంతో ముఖ్యం. ఎందుకంటే మన దేశంలో ఎన్నికల సమయంలో అభ్యర్థి ఎవరనే దానికంటే ఆ పార్టీ లేదా అభ్యర్థి ఎన్నికల చిహ్నాన్ని గుర్తు పెట్టుకుని మరీ సామాన్య జనం ఓటు వేస్తారు. ఎవరికైనా బీజేపీ అంటే కమలం, కాంగ్రెస్ అంటే హస్తం, టీఆర్ఎస్ అనగానే కారు, వైసీపీ అంటే ఫ్యాన్, టీడీపీ అంటే సైకిల్ చిహ్నాలు గుర్తుకు వస్తాయి. అయితే తాజాగా బీజేపీకి కేటాయించిన ఎన్నికల చిహ్నం కమలాన్ని వెనక్కు తీసుకోవాలని అలహాబాద్ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు చెందిన కాళీ శంకర్ గతంలో ఇదే విషయం పై ఈసీని ఆశ్రయించారు. బీజేపీకి కేటాయించిన కమలం గుర్తు మనదేశ జాతీయ పుష్పమని, దీంతో అన్ని ప్రభుత్వ వెబ్‌సైట్లలోనూ ఈ గుర్తు కనిపిస్తుందని, కాబట్టి ఈ ఎన్నికల గుర్తును వాడేందుకు ఏ పార్టీకి అనుమతి ఇవ్వొద్దని అయన కోరారు. దీంతో ఈ గుర్తు కలిగిన పార్టీకి అయాచితంగా లబ్ధి చేకూరుతుందని అయన ఆరోపించారు. అయితే, ఆయన చేసిన విజ్ఞప్తిని ఈసీ గతేడాది ఏప్రిల్ లోనే తిరస్కరించింది.
దీంతో ఈ విషయం పై ఆయన తాజాగా అలహాబాద్ హైకోర్టు లో పిల్ దాఖలు చేసారు. అంతేగాకుండా వివిధ రాజకీయ పార్టీలకు కేటాయించే గుర్తులను కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే వాడుకునేలా పరిమితం చేయాలని, వాటిని తమ పార్టీ లోగోలుగా ఉపయోగించుకునేందుకు అనుమతి ఇవ్వవద్దని అయన తన పిల్ లో కోరారు. పార్టీలు తమ గుర్తులను నిత్యం వాడుకునేందుకు అనుమతి ఇస్తే, ఏ పార్టీతోనూ సంబంధంలేని ఇండిపెండెంట్ అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని అయన పేర్కొన్నారు. దీనికి సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేయాలని ఈసీని ఆదేశించాలని అయన తన పిల్ లో కోర్టుకు విజ్ఞప్తి చేశారు.
దీని పై స్పందించిన చీఫ్ జస్టిస్ గోవింద్ మాధుర్, జస్టిస్ పీయూష్ అగర్వాల్‌తో కూడిన ధర్మాసనం.. పిల్ లో పేర్కొన్న అంశాలపై తన స్పందనను తెలియజేయాల్సిందిగా ఈసీని ఆదేశించింది. ఈ వ్యాజ్యం పై తదుపరి విచారణను వచ్చే నెల 12కు వాయిదా వేసింది. అలాగే, ఈ పిల్ లో ఇతర రాజకీయ పార్టీలను కూడా ప్రతివాదులుగా చేర్చాలంటూ కాళీ శంకర్ తరపు న్యాయవాదిని కోర్టు ఆదేశించింది. అయితే ఈ పిల్‌పై తమ స్పందనను తెలియజేసేందుకు కొంత సమయం ఇవ్వాలని ఈసీ తరపు న్యాయవాది కోర్టును కోరారు.