మోదీ ఇలాకాలో మజ్లిస్.. ఇక కాస్కో..
posted on Mar 3, 2021 @ 10:34AM
ప్రస్థానం ఒక్క అడుగుతోనే ప్రారంభం. దశాబ్దాల క్రితం పాతబస్తీలో ఎగిరిన పతంగి.. నేడు దేశవ్యాప్తంగా రెపరెపలాడుతోంది. హైదరాబాద్ గడ్డపై నుంచి గోద్రా వరకూ విస్తరించింది MIM. గుజరాత్ లోని స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో మజ్లిస్ పార్టీ హవా కొనసాగింది. గోద్రా మున్సిపాలిటీలో 9 స్థానాల్లో MIM పోటీ చేసింది. అందులో 7 చోట్ల గెలిచింది. గోద్రాలో మజ్లిస్ గెలుపుతో పతంగి పార్టీలో ఫుల్ జోష్.
గోద్రా. 2002లో మత ఘర్షణలతో దేశవ్యాప్తంగా మార్మోగిన పేరు. ఆ తర్వాత గుజరాత్ లో బీజేపీ బాగా బలపడింది. మరో వర్గానికి సరైన ప్రాతినిధ్యం లేకుండా పోయింది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మజ్లిస్ పార్టీ ఓ వర్గానికి ప్రతినిధిగా గోద్రాలో అడుగుపెట్టింది. అక్కడి మున్సిపాలిటీ ఎన్నికల్లో తొలిసారి బరిలో దిగిన ఎమ్ఐఎస్.. తక్కువ స్థానాల్లోనే అయినా సంచలన విజయాలు నమోదు చేసింది. 9 లో 7 గెలిచి పతంగి జెండా పైపైకి ఎగిరింది.
గోద్రా కంటే ముందే గుజరాత్ లో పలు చోట్ల పాగా వేసింది మజ్లిస్ పార్టీ. అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎమ్ఐఎస్ సత్తా చాటింది. అహ్మదాబాద్ లో 4 డివిజన్లు దక్కించుకుంది. మొదాసాలో 12 స్థానాల్లో పోటీ చేసి 9 సీట్లు గెలుచుకుంది. బరూచ్‌లోనూ బోణీ కొట్టింది.
ఇన్నేళ్లూ హైదరాబాద్ పాతబస్తీకి మాత్రమే పరిమితమైన ఎంఐఎం.. స్లో అండ్ స్టడీగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పాగా వేస్తోంది. మహారాష్ట్రలో ఒక ఎంపీ సహా రెండు ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకుంది. ఇటీవల బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 5 ఎమ్మెల్యే స్థానాలను కైవసం చేసుకుంది. ఇక మొదటిసారి బీజేపీ ఇలాకా గుజరాత్‌లో స్థానిక సంస్థల ఎన్నికలతో ఎంట్రీ ఇచ్చి.. గెలిచి.. సంచలనం స్రుష్టించింది.