వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్న కాసేపటికే వ్యక్తి మృతి
posted on Mar 3, 2021 @ 11:52AM
దేశంలో తాజాగా 60 ఏళ్ల పైబడిన వృద్దులకు కరోనా వ్యాక్సిన్ ఇస్తున్న సంగతి తెల్సిందే. అయితే కరోనా వ్యాక్సిన్‌పై ప్రజలలో ఉన్న అపోహలను పొగొట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత తీవ్రంగా ప్రయత్నిస్తున్నా.. కొన్ని అపశ్రుతులు చోటుచేసుకుంటూనే ఉన్నాయి దీంతో ప్రజలలో ఈ వ్యాక్సిన్ పట్ల అనుమానాలను పెంచుతున్నాయి. కొంతకాలం క్రితం వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకున్న సమయంలో కారణాలేమైనప్పటికీ చాలా మంది అస్వస్థతకు గురి కాగా.. కొంతమంది మరణించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో వారి మరణాలకు వ్యాక్సిన్‌కు ఎటువంటి సంబంధం లేదని అధికారులు తేల్చారు.
ఇది ఇలాఉండగా తాజాగా మహారాష్ట్రలోని థానే జిల్లా భీవండిలో కరోనా వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్న వ్యక్తి..తరువాత కొద్దిసేపటికే మృతి చెందడం కలకలం రేపుతోంది. బివాండీ నగరానికి చెందిన సుఖదేవ్ కిర్దత్ (45) కంటి వైద్యనిపుణుడి వద్ద డ్రైవరుగా పనిచేస్తున్నాడు. సుఖదేవ్ కరోనా వ్యాక్సిన్ రెండవ డోస్ తీసుకున్న 15 నిమిషాల తర్వాత పరిశీలన గదిలోనే మూర్చపోయాడు. దీంతో వెంటనే అతడిని ఇందిరాగాంధీ స్మారక ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఆరోగ్యశాఖ డ్రైవరుగా ఉన్న సుఖ్ దేవ్ జనవరి 28న మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకున్నాడు.
అయితే నెలరోజుల క్రితం మొదటి డోస్ తీసుకున్నపుడు సుఖదేవ్ కు ఎలాంటి సమస్య లేదని, అయితే అతనికి కొన్నేళ్లుగా రక్తపోటు సమస్య ఉందని, కాళ్ల వాపు లక్షణాలు కూడా ఉన్నాయని భివాండీ మున్సిపల్ కార్పొరేషన్ ఆరోగ్య శాఖ అధికారి కేఆర్ ఖరత్ తెలిపారు. అయితే సుఖ్‌దేవ్ కుటుంబ సభ్యులు మాత్రం అతనికి గతంలో ఎలాంటి అనారోగ్యం లేదని చెప్తున్నారు. ఇది ఇలాఉండగా సుఖ్ దేవ్ మరణానికి కారణం చెప్పడం కష్టమని.. అతని మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన తరువాత వివరాలు వెల్లడిస్తామని డాక్టర్ ఖరత్ తెలిపారు .