సజ్జల ఓవర్ యాక్షన్ మరీ ఎక్కువైంది..!
posted on Mar 3, 2021 @ 9:45AM
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో ఏ మంత్రికి లేని అధికారాలు ఆయనకే ఉన్నాయని.. సాక్షాత్తు ఐఏఎస్, ఐపిఎస్ అధికారులు కూడా ఆయనకే రిపోర్ట్ చేస్తారని గుసగుసలు వినిపిస్తాయి. అయన కనుసన్నలలోనే రాష్ట్ర హోమ్ శాఖ పని చేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తుంటాయి. అయన మరెవరూ కాదు సీఎం జగన్ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి.
తాజాగా సజ్జల రామకృష్ణ రెడ్డి గారిపై మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత జీవీ హర్షకుమార్ విరుచుకుపడ్డారు. "ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఎవడండీ? మరీ ఓవరేక్షన్ ఎక్కువైంది. అయ్యా మినిస్టర్లూ మీరు కొంచెం ఆత్మగౌరవంతో బతకండి. ఎందుకు ఈ వెధవ పదవులు. కనీసం మీలో ఒక్కడికి కూడా సీఎం జగన్ అప్పాయింట్‌మెంట్ ఇవ్వడు. అన్ని వ్యవహారాలపై సజ్జలతోనే మాట్లాడి, సజ్జలతోనే మీడియా సమావేశాలు నిర్వహిస్తాడు. ఎందుకు మీకు ఈ వెధవ బతుకులు, కొద్దిగానైనా గౌరవం పెంచుకోండి" అని మాజీ ఎంపీ, రాష్ట్ర మంత్రులను హర్షకుమార్ ఎద్దేవా చేశారు.
ఫేస్‌బుక్ లైవ్‌లో మాట్లాడిన హర్షకుమార్.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు ఆయన సలహాదారుల గురించి ప్రజలకు తెలిసేది కాదన్నారు. అప్పట్లో సీఎం ముఖ్య సలహాదారు కేవీపీ రామచంద్రరావుతో సహా అందరూ వెళ్లేవారు. అయితే అన్ని విషయాలు కేవీపీతో చర్చించిన తర్వాతే వైఎస్ ఫైనల్ గా నిర్ణయం తీసుకునేవారన్నారు. అయితే కేవీపీప్రెస్‌మీట్లు పెట్టి ప్రభుత్వ విధానాలను ఎపుడు బయటకు చెప్పేవారు కాదని చెప్పారు. కానీ ఈ సజ్జల ఎవరండీ బాబు, ప్రజల డబ్బు తింటూ.. ప్రభుత్వ విధానాలను ప్రకటిస్తాడు.. ప్రతిపక్షనేతలను విమర్శిస్తాడూ అని హర్షకుమార్ మండి పడ్డారు.