జగన్ ఆస్తులు పెరిగాయ్.. జనం ఆస్తులు తరిగాయ్!
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో అధికార పార్టీ నాయకుల ఆస్తులు పెరిగాయే కానీ ప్రజల ఆస్తులు పెరగలేదని తెలుగు దేశం పార్టీ నాయకుడు, మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ఆయన చేసింది ఆరోపణే అయినా అందులో ఏంటో కొంత నిజం లేక పోలేదు. యనమల మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని.. పట్టణ ప్రాంతాల్లో 20 నెలలుగా అభివృద్ధి లేదన్నది ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయని అన్నారు. గడచినా రెండు సంవత్సరాలలో బడ్జెట్ కేటాయింపులకు వస్తావా వ్యయానికి పొంతన లేదని ఆరోపించారు. వైకాపా 20 నెలల పాలనను బేరీజు వేసుకొని మున్సిపల్ ఎన్నికల్లో ఓటేయాలని యనమల ప్రజలను కోరారు. ఎవరికి, ఎందుకు ఓటేయాలో ప్రజలు పరిశీలించాలని యనమల విజ్ఞప్తి చేశారు.
ఎన్నికల యనమల ప్రస్తావించిన ఎన్నికల విషయాన్ని అలా ఉంచి చూసినా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉందనే విషయంలో మరో అభిప్రాయానికి తావే లేదు. ఇప్పుడే కాదు, రాష్ట్ర విభజన నాటి నుంచి రాష్ట్రంలో ఆర్థిక క్రమ శిక్షణ అనేది అటకెక్కింది.ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహం అక్కరలేదు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర విభజన అనంతర పరిణామాల నేపధ్యంగా పక్కదారి పట్టిన ఆర్థిక క్రమశిక్షణ, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో మరింత అధ్వాన్న స్థితికి చేరింది. సంక్షేమం పేరిట పేరంటాలకు వాయినాలు ఇచ్చినట్లుగా,ఓటర్లకు తాయిలాలు పంచి ఇవ్వడమే కానీ, ఆదాయం ఎక్కడినుంచి వస్తునది అన్న ఆలోచన కనిపించడమే లేదు.
సహజంగా ప్రభత్వాలు ఆదాయం వచ్చే మార్గాలపై దృష్టి నిలిపి అందుకు సంబందించిన ప్రణాళిక, క్యాలెండర్ తయారు చేకుంటాయి. కానీ ఇటీవల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంత్రి వర్గం 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబందించిన నవరత్న సంక్షేమ పథకాల వితరణ క్యాలెండర్ ఆమోదించింది. అంటే పంపకాల పట్టికను ఆమోదించింది. మంత్రి పేర్నినాని దాన్ని సగర్వంగా మీడియాకు సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాల క్యాలెండర్ ప్రకారం, రాష్ట్రంలో అమలవుతున్న నవరత్న పథకాలు అందుకు అదనంగా అమలులో ఉన్న రేషన్ సబ్సిడీ,నెలవారీ పించన్లు, గోరుముద్దలు,పాస్టర్,ఇమామ్ లకు ఇచ్చే నెలవారీ నజరానాలు, ఇంకా ఇతరత్రా పథకాలు ఇత్యాదులు అన్నీ కులుపుకుంటే, సంక్షేమ పథకాల ప్రయోజనం పొందుతున్న లబ్దిదారుల సంఖ్య రాష్ట్ర జనాభా కంటే రెండున్నర మూడు రెట్లు ఎక్కువగా వుంది. అంటే రాష్ట్రంలోని ప్రతి వ్యక్తికి రెండు అంతకంటే ఎక్కువ పథకాల ప్రయోజనం చేరుతోంది. మంచిదే జుట్టున్నమ్మ ఏ కొప్పైనా పెట్టవచ్చును,కానీ మింగ మెతుకు లేదు మీసాలకు సంపెంగ నూనె అంటేనే కొంచెం ఎబ్బెట్టుగా అనిపిస్తుంది.
పేదలకు నిజంగా మరే ఆధారంలేని అభాగ్యులు, అన్నార్తుల కడుపు నింపేందుకు, పేదల జీవితాలలో వెలుగులు నింపేందుకు సంక్షేమ పథకాలు అమలు చేస్తామంటే, ఎవరూ కాదనరు.కానీ గీత దాటి.. సంక్షేమమే సర్వస్వం అనుకుంటేనే పేచీ వస్తుంది. ఎట్లో పారేసిన ఎంచి పారేయాలనేది సామెత.అంతే కాదు.. ఎవరి పేరున అయితే జగన్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందో, అదే వైఎస్సార్ అనేక సంధర్భాలలో ఉమ్మడి రాష్ట్ర శాసన సభలో ఈ సామెతను గుర్తు చేశారు.
మరో వంక చూస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రోజు రోజురోజుకు దిగజారి దౌర్భాగ్య స్థితికి చేరుకుంటోంది. రాష్ట్రం అప్పుల ఊబిలోకి కురుకు పోతోంది.ఇప్పటికే పిల్ల పాప సహా రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరి నెత్తిన రూ.75 వేల వరకు అప్పుతట్ట కూర్చుంది. రాష్టంలో పుట్టే ప్రతి బిడ్డ అప్పుతోనే పుడుతున్నారు. అయినా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఓటు బ్యాంక్’ను నిలుపుకునేందుకు అందిన కాడికి అప్పులు చేసుకుంటూ పోతున్నారు.చివరకు రాష్ట్ర ఖజానా పూర్తిగా వట్టిపోయి.. అప్పులు కూడా పుట్టని పరిస్థితి వస్తుందని ఇప్పటికే ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
జనం నోట్లతో జనం ఓట్లు కొని, సొంత ఆస్తులను పెంచుకునే విధానం గురించి ప్రజలే ఆలోచించుకోవాలని కూడా ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది అందరూ ఆలోచించవలసిన విషయమే. ఎంత వరకు నిజమో ఏమో కానీ, ముఖ్యమంత్రి డైలీ ఇన్కమ్ రూ. 300 కోట్లని మాజీ ఎంపీ జేసీ దివాకర రెడ్డి ఇటీవాలనే ఆరోపించారు. అదే నిజమైన .. అందుకో సగమే నిజమున్నా .. రాష్ట్రం దివాలా తీయటానికి అట్టే కలం పట్టక పోవచ్చును.