కేటీఅర్ కల చెదిరినట్లేనా ?
posted on Mar 3, 2021 @ 1:24PM
అవిభక్త ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ముఖ్యమంత్రుల కుమారులు ఎవరూ కూడా ముఖ్యమంత్రి కాలేదు. కాసు బ్రహ్మానంద రెడ్డి,చెన్నా రెడ్డి, కోట్ల విజయ భాస్కర రెడ్డి, ఎన్టీరామా రావు వంటి హేమాహేమీ నాయకుల సంతతి రాజకీయాల్లో అయితే ఉన్నారు కానీ ముఖ్యమంత్రి పదవి మాత్రం ఎవరికీ దక్కలేదు. వైఎస్సార్ కుమారుడు, జగన్మోహన్ రెడ్డిని కూడా అవిభక్త ఆంధ్ర ప్రదేశ్ లో ఆ అదృష్టం వరించలేదు. రాష్ట్ర విభజన తర్వాతనే జగన్ రెడ్డి 13 జిల్లాల అవశేష ఆంధ్ర ప్రదేశ్ కు ముఖ్యమంత్రి అయ్యారు.
నిజానికి వైఎస్ చనిపోయిన వెంటనే ఆయన కుర్చీలో కుర్చోవాలని జగన్ రెడ్డి ఆశపడ్డారని, ఆసక్తి చూపారని అంటారు. అయన తరపున మద్దతు కూడగట్టేందుకు ఎమ్మెల్ల్యేల సంతకాల సేకరణ చేపట్టారని కూడా అంటారు. అందులో నిజానిజాలు ఎలా ఉన్నా.. జగన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి మీద మనసు పరేసుకున్నది అయితే నిజం. అయితే అవిభక్త ఆంధ్ర ప్రదేశ్ లో ఆయన ఆశ తీరలేదు. అంతే కాదు అలా ఆశకుపోయే ఆయన జైలు పాలయ్యారని అంటారు. అలాగే తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామా రావు, తమ రాజకీయ వారసుడు, బాలకృష్ణ అని ప్రకటించినా అదీ జరగలేదు. అవిభక్త ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కుమారులు,కుమార్తెలకు ముఖ్యమంత్రి పీఠం అందని ద్రాక్షగానే మిగిలి పోయింది.
ఆంధ్ర రాష్ట్రం నుంచి విడివడి కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలోనూ అవిభక్త ఆంధ్రప్రదేశ్ ఆచారమే కొనసాగుతుందా అంటే అవుననే సమాధానమే వస్తోంది. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్నపరిణామలు,వినవస్తున్నరాజకీయ వ్యాఖ్యలు గమనిస్తే ముచ్చటపడి కాబోయే ముఖ్యమంత్రిగా పిలిపించుకున్న, కేసీఆర్ కుమారుడు కేటీఅర్ కు కూడా ముఖ్యమంత్రి కుర్చీ అందని ద్రాక్షగానే మిగిలి పోతుందని తెలుస్తోంది. కాబోయే సీఎం అంటూ కీర్తించిన నోళ్లే ఇప్పుడు గుసగుసలు పోతున్నాయంటున్నారు.
ప్రస్తుతం అధికార తెరాసలో మునుపటి పరిస్థితులు లేవు. ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కు పార్టీ మీద పట్టు సన్నగిల్లింది. కుటుంబంలో పాటు పార్టీలోనూ అంతర్గత విబేధాలు బుసలు కొడుతున్నాయి. నలుగురు నాలుగు దిక్కులా లాగడంతో ఎటూ పాలుపోక కింకర్తవ్యం అన్న మీమాంసలో ఆయన ఉన్నట్లు సమాచారం. అంతర్గత విబేధాలను, ఫ్యామిలీలో, పార్టీలో సాగుతున్న కిస్సా కుర్సీకా కుమ్ములాటలకు తాత్కాలిక పరిష్కారంగానే ముఖ్యమంత్రి ఇటీవల పదేళ్ళు తానే ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతానని బాంబు పేల్చారు. అయినా ముఖ్యమంత్రి పదవి మీద మనసు పారేసుకున్న కేటీఆర్, అది కాస్తా చేజారిపోవడంతో మనసు కష్ట పెట్టుకున్నట్లు, తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సమీప భవిష్యత్ లో ముఖ్యమంత్రి మార్పు ఉండదు అనేది స్పష్టమై పోయింది. కనీసం ప్రస్తుత పదవీ కాలం ముగిసే వరకు అయితే కేటీఆర్ కోరిక తీరదు. ఆ తర్వాత రాజెవరో .. రెడ్డెవరో ..