సూపర్ పవర్ సంతోష్! కేటీఆర్, కవిత నారాజ్!
posted on Mar 3, 2021 @ 10:15AM
రాష్ట్ర ప్రభుత్వంలో అత్యంత కీలకం సచివాలయం. ఆ తర్వాత ముఖ్యమంత్రి కార్యాలయం సీఎంవోనే సూపర్ పవర్. ప్రభుత్వం తీసుకునే కీలక నిర్ణయాలన్ని సీఎంవోలోనే ఫైనల్ అవుతుంటాయి. తెలంగాణలో సీఎం కేసీఆర్ తర్వాత పవర్ సెంటర్ ఎవరిదీ అంటే అంతా మంత్రి కేటీఆరే పేరే చెబుతారు. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆరే.. పాలనలోనూ చక్రం తిప్పుతున్నారని అనుకుంటున్నారు. సీఎంవోలో ఆయన చెప్పిందే వేదమని భావిస్తుంటారు. అయితే అసలు సంగతి మాత్రం విస్తుపోయేలా ఉంది. ప్రస్తుతం తెలంగాణ సీఎంవోలో అంతా ఎంపీ సంతోష్ కుమార్ హవానే సాగుతుందని తెలుస్తోంది.
సీఎం కేసీఆర్ ను ఎవరూ కలవాలన్నా ముందు సంతోష్ ను ప్రస్ననం చేసుకోవాల్సిందేనట. కేసీఆర్ ఫాంహౌజ్ లోకి సంతోష్ కు తప్ప ఎవరికి ఎంట్రీ లేదని తెలుస్తోంది. ఫామ్ హౌజ్ లోకి మంత్రి కేటీఆర్ , కవిత వెళ్లాలన్న ముందు సంతోష్ ఓకే చేస్తేనే సాధ్యమవుతుందనే చర్చ తెలంగాణ భవన్ లోనే జరుగుతుంది. కేటీఆర్, కవితకే అలా ఉంటే... మిగితా టీఆర్ఎస్ నేతల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించవచ్చు. కేసీఆర్ వ్యక్తిగత విషయాలతో పాటు పాలనా పరమైన అంశాల్లోనూ ఇప్పుడు సంతోష్ కీలకంగా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. రాష్ట్ర ఇంటలిజెన్స్ అధికారులు సైతం తమ నివేదికలను సంతోష్ కే ఇస్తున్నారని తెలుస్తోంది. రోజువారి నిఘా వర్గాల వివరాలు కూడా సంతోష్ కు వెళుతున్నాయంటే ఆయన పవర్ ఏ రేంజ్ లో ఉందో ఊహించవచ్చు.
టీఆర్ఎస్ తో పాటు ప్రభుత్వంలో సంతోష్ పవర్ ఫుల్ సెంటర్ గా మారిపోయారనే చర్చ కొంత కాలంగా జరుగుతోంది. అందుకే కేసీఆర్ కలవాలనుకునే నేతలు.. మంత్రులైనా సరే ముందు సంతోష్ ను బతిమాలిడుకోవాల్సిన పరిస్థితి ఉందంటున్నారు. సీఎంవోలో ప్రస్తుతం సీఎం కేసీఆర్ కు మాజీ సీఎస్ రాజీవ్ శర్మ, సీనియర్ ఐఏఎస్ నర్సింగ్ రావు సలహాదారులుగా ఉంటూ కీలకంగా ఉన్నారు. వారితో పాటు మరికొందరు రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ లు ముఖ్యమంత్రికి సలహాదారులుగా ఉన్నారు. వీళ్లతో పాటు సీఎంవోలో ప్రస్తుతం సంతోష్ టీమ్ కూడా పని చేస్తుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో సీఎం కేసీఆర్ పర్యటనలు, ఆయన వ్యక్తిగత నిర్ణయాల వరకే సంతోష్ కుమార్ చూసేవారు. కేసీఆర్ ఎక్కడికి వెళ్లినా ఆయనతో పాటు ఉండేవారు. అయితే రాజ్యసభకు పంపించాక ఆయనలో మార్పు వచ్చిందంటారు. ఇప్పుడు కేసీఆర్ కార్యక్రమాలు చూడటంతో పాటు పార్టీ, ప్రభుత్వ పాలనా వ్యవహరాల్లోనూ సంతోష్ సర్వస్యం అయ్యారని తెలుస్తోంది.
గతంలో ఉన్నతాధికారులు, ఐఏఎస్, ఐపీఎస్ లు పోస్టింగులు, ప్రమోషన్ల కోసం కేటీఆర్ ను కలిసివారు.. ఇప్పుడు వాళ్లంతా సంతోష్ దగ్గరకు వెళుతున్నారట. ఉద్యోగ సంఘాలు కూడా సంతోష్ ను పవర్ సెంటర్ గా చూస్తున్నాయని తెలుస్తోంది. ప్రమోషన్లు, బదిలీల కోసం కేటీఆర్ తో పాటు సంతోష్ కు కలుస్తున్నారనే చర్చ టీఆర్ఎస్ లో జరుగుతోంది. సినీ, రాజకీయ ప్రముఖులు కూడా మంత్రి కేటీఆర్ చుట్టూనే తిరిగేవారు. తమకు ప్రభుత్వం నుంచి ఏ సాయం కావాలన్నా, కొత్త ప్రాజెక్టులకు అనుమతులు రావాలన్నా, సర్కార్ నుంచి రాయితీలు అడగాలన్నా అందరూ కేటీఆర్ దగ్గరకే వచ్చేవారు. కాని ఇప్పుడు కొందరు వ్యాపార, సినీ ప్రముఖులు ఎంపీ సంతోష్ ను ఆశ్రయిస్తున్నారని చెబుతున్నారు.
ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కూడా ఆయనకు బాగా ఉపకరిస్తుందని చెబుతున్నారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా సినీ, వ్యాపర దిగ్గజాలతో సంతోష్ కు పరిచయాలు పెరిగాయని, దీంతో ఆయన ఇమేజీ కూడా పెరిగిందనే చర్చ జరుగుతోంది. మీడియాను కూడా సంతోష్ మ్యానేజ్ చేస్తున్నారని, అందుకే ఆయన కార్యక్రమాలకు మంచి కవరేజ్ లభిస్తుందని చెబుతున్నారు. మొత్తానికి సంతోష్ కేసీఆర్ సీఎంవోలో పవర్ ఫుల్ కావడంపై టీఆర్ఎస్ వర్గాల్లోనూ అసంతృప్తి వ్యక్తమవుతుందని తెలుస్తోంది. కేటీఆర్ వర్గం కూడా ఈ పరిణామాలపై అసహనంగా ఉన్నారని చెబుతున్నారు. సంతోష్ గ్రాఫ్ రోజురోజుకు పెరుగుతుండటంతో... భవిష్యత్ లో కేటీఆర్ కు గండంగా మారవచ్చనే ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో సాగుతోంది.