అధికార పార్టీలకే మళ్లీ అధికారం! ఐదు రాష్ట్రాలపై ఒపీనియన్ పోల్
posted on Mar 3, 2021 @ 10:40AM
దేశంలో మినీ సంగ్రామం జరుగుతోంది. నాలుగు రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దేశ రాజకీయాల్లో కాక రేపుతున్న పశ్చిమ బెంగాల్ తో పాటు అసోం. దక్షిణాదిలో కేరళ, తమిళనాడు అసెంబ్లీ సమరం జరుగుతోంది. పుదిచ్చేరికి ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో ఇప్పుడున్న ప్రభుత్వాలే కొనసాగుతాయని ఓపీనియన్ పోల్స్ అభిప్రాయపడుతున్నాయి. తాజాగా వచ్చిన ఏబీపీ-సీ-వోటర్ సంస్థ సర్వేలోనూ ఇదే తేలింది. పశ్చిమ బెంగాల్ లో మరోమారు మమతా బెనర్జీ పాలనా పగ్గాలు చేపట్టనున్నారని అంచనా వేసింది. కేరళలో ఇప్పుడున్న వామపక్ష ప్రభుత్వమే తిరిగి అధికారంలోకి వస్తుందని.. అసోం తిరిగి బీజేపీ హస్తగతమవుతుందని బీపీ-సీ-వోటర్ సంస్థ అంచనా వేసింది.
294 అసెంబ్లీ స్థానాలున్న పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ సారథ్యంలోని అధికార తృణమూల్ కాంగ్రెస్ కు 148 నుంచి 164 సీట్ల వరకూ రావచ్చని సర్వే తెలిపింది. బీజేపీకి 92 నుంచి 108 సీట్ల వరకూ సాధించి, బెంగాల్ గడ్డపై తన బలాన్ని మరింతగా పెంచుకుంటుందని, కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమికి 31 నుంచి 39 సీట్లు దక్కవచ్చని అభిప్రాయపడింది. 126 అసెంబ్లీ స్థానాలున్న అసోంలో ఎన్డీయే కూటమికి 68 నుంచి 76 సీట్ల వరకూ రావచ్చని, కాంగ్రెస్ 43 నుంచి 51 మధ్య, ఇతరులకు 5 నుంచి 10 సీట్లు దక్కవచ్చని తెలిపింది.
140 సీట్లున్న కేరళలో పినరయి విజయ్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ 83 నుంచి 91 సీట్లు సాధించి మరోసారి అధికారం దక్కించుకుంటుందని ఏబీపీ-సీ-వోటర్ సంస్థ సర్వేలో తేలింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కు 47 నుంచి 55 స్థానాలు, బీజేపీకి రెండు సీట్లు దక్కవచ్చని తెలిపింది. తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలుండగా.. అధికారంలో ఉన్న అన్నాడీఎంకే - బీజేపీ కూటమికి ఎదురు దెబ్బతప్పదని, ఆ పార్టీకి 58 నుంచి 66 సీట్లు మాత్రమే రావచ్చని ఏబీపీ సీ -ఓటర్ అంచనా వేసింది. స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే 154 నుంచి 162 సీట్లు సాధించి అధికార పీఠాన్ని దక్కించుకుంటుందని తెలిపింది. కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యమ్ పార్టీకి 8 నుంచి 20 సీట్లు రావచ్చని ఏబీపీ-సీ-వోటర్ అంచనా వేసింది.