ఎస్ఐ కాళ్లు పట్టుకున్న అభ్యర్థి! వైసీపీ రిగ్గింగ్ ఆపాలంటూ వినతి
posted on Mar 10, 2021 @ 2:05PM
బోగస్ ఓట్లు.. దొంగ ఓట్లు.. రిగ్గింగ్. ఇవి మున్సిపల్ ఎన్నికల పోలింగులో వినిపిస్తున్న పదాలు.. కనిపిస్తున్న దృశ్యాలు. మున్సిపల్ ఎన్నికల్లో అధికార వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. పోలింగ్ అధికారులు, పోలీసుల సహకారంతో బరి తెగిస్తున్నారని, యథేచ్చగా దొంగ ఓట్లు వేయించుకుంటున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అధికార పార్టీకి అనుకూలంగా అధికారులు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. వైసీపీ ఏజెంట్లను ఇష్టానుసారంగా అనుమతిస్తూ...ఇతర పక్షాల ఏజెంట్లుపై ఆంక్షలు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారని చెబుతున్నారు. టీడీపీ, జనసేన మద్దతుదారులను పోలీసులు హౌస్ అరెస్టు చేసిన ఘటనలు కూడా జరిగాయి.
చిత్తూరు జిల్లా మున్సిపల్ పోలింగ్‌లో పోలీసుల తీరు వివాదాస్పదమైంది. చిత్తూరు 29వ డివిజన్‌లో వైసీపీ కార్యకర్తలు రిగ్గింగ్‌కు యత్నించారు. ఈ ప్రయత్నాన్ని ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన వనిత భర్త శ్రీనివాసులు అడ్డుకున్నారు. దీంతో అతనిపై వైసీపీ శ్రేణులు దాడికి యత్నించారు. తనకు న్యాయం చేయాలంటూ శ్రీనివాసులు ఎస్ఐ కాళ్లు పట్టుకున్నారు. వైసీపీ నేతల నుంచి తనకు రక్షణ కల్పించాలని కోరారు. రిగ్గింగును ఆపాలని విన్నవించారు. ఈ ఘటన చిత్తూరులో కలకలం రేపింది
కర్నూల్ జిల్లా నంద్యాలలో వైసీపీ నాయకులు రెచ్చిపోయారు. 34వ వార్డులో స్లిప్పులు పంచుతున్న టీడీపీ కార్యకర్తపై వైసీపీ అభ్యర్థి తరఫు బంధువులు మూకుమ్మడిదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో టీడీపీ కార్యకర్తకు తీవ్రగాయాలు అయ్యాయి. బాధితుడు ఫిర్యాదు చేయడంతో త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కడపలో కూడా వైసీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. ఓటు వేయడానికి వెళ్లిన ముస్లిం మహిళల నుంచి ఓటర్ స్లిప్పులు లాక్కున్నారు. వారిని ఓటు వేయనీయలేదు. మీ ఓటు మేము వేస్తామని చెప్పి వారిని పంపివేస్తున్నారు. దీంతో వైసీపీ కార్యకర్తలు దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఓటర్లు ఆరోపించారు.
గుంటూరు జిల్లా సత్తెనపల్లి 24వార్డులో దొంగ ఓట్లను అడ్డుకునేందుకు వెళ్ళిన తనపై దాడి చేశారని మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులు ఆరోపించారు. ఎన్నికల్లో వైసీపీ అనైతికంగా గెలవాలని చూస్తుందన్నారు. టీడీపీ ఓటింగ్ శాతాన్ని తగ్గించాలనే గొడవలు సృష్టించారు ..వారి బెదిరింపులకు తాము భయపడేది లేదన్నారు.