జగన్ వీక్ సీఎం.. ఏడాదిలోగా అవుట్!
posted on Mar 9, 2021 @ 9:17PM
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. సీఎం జగన్మోహన్ రెడ్డి చుట్టే చర్చలు జరుగుతున్నాయి. జగన్ పై సొంత పార్టీలోనే కుట్ర జరుగుతుందంటూ జాతీయ మీడియాలో వచ్చిన వార్తలు కలకలం రేపగా... ఏపీ నేతలు కూడా అలాంటి వ్యాఖ్యలే చేస్తున్నారు. జగన్ పదవిపై ఆశతో కొందరు నేతలు.. ఆయనకు ఉచ్చు బిగిస్తున్నారని నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు చెప్పారు. జాగ్రత్తగా ఉండాలంటూ ఆయన జగన్ కు సూచనలు చేశారు.
రఘురామ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారగా.. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్‌రెడ్డి మూడేళ్లు కూడా కొనసాగలేడని అన్నారు. సీఎంపై వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. దుగరాజపట్నంపోర్టుకు కేంద్రం అన్ని అనుమతులు ఇచ్చి 2012లోనే నిధులను కేటాయించిందన్నారు. వైసీపీ దౌర్జన్యాలపార్టీగా మారిందన్నారు చింతా మోహన్.
పంచాయతీ ఎన్నికలలో పోలీసు అధికారులను అడ్డంపె ట్టుకుని వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందన్నారు మోహన్. తిరుపతి పార్లమెంటు అభివృద్ధిపై వైసీపీ, టీడీపీ, బీజేపీ ఏం చేశాయో కాంగ్రెస్‌పార్టీతో బహిరంగ చర్చకు సిద్దమా అని సవాల్ విసిరారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ సీఎంకు తెలిసే జరిగిందన్నారు. జగన్‌లాంటి బలహీనమైన ముఖ్యమంత్రి ఇప్పటివరకు ఏపీకి ఎవరూ లేరని మరో వందేళ్లలో కూడా రాబోరన్నారు చింతా మోహన్.