ఒకే ఇంట్లో 20 ఎమ్మెల్సీ ఓట్లు..
posted on Mar 10, 2021 @ 2:40PM
తెలంగాణలో జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బోగస్ ఓట్ల కలకలం రేగుతోంది. భారీగా బోగస్ ఓట్లు నమోదు చేయించారనే ఆరోపణలు మొదటి నుంచి వినిపిస్తుండగా.. తాజాగా అందుకు బలమైన ఆధారం లభించే ఘటన వెలుగు చూసింది. భధ్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒకే ఇంటి నంబర్ పై ఏకంగా 20 ఓట్లు నమోదయ్యాయి. వాటిలో 17 గ్రాడ్యుయేట్ ఓటర్ల లెక్కలు తప్పు అని తెలుస్తోంది. అధికారుల విచారణలోనూ ఆ ఇంటిలో ముగ్గురు పట్టభధ్రులు మాత్రమే ఉన్నట్లు తేలింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణం రైటర్ బస్తీ కాలనీకి చెందిన 15వ వార్డు 8-3-19 నంబరు గల ఇంటి యజమాని వాసమళ్ళ ఏసురత్నం ఓటర్ల జాబితా ప్రకారం ఆ ఇంటి నెంబరుపై ఏకంగా 20 ఓట్లు నమోదు కావడంతో అధికారులకు అనుమానం వచ్చింది. అధికారులు ఆ ఇంటి యజమానిని ఆరా తీయగా ముగ్గురు పట్టభధ్రులు మాత్రమే ఉన్నారని...మిగతా 17 మంది ఎవరో కూడా తమకు తెలియదని వారు తెలిపారు. వారి వివరాలను తెలుపగా వారి పేర్లు కూడా ఎప్పుడూ వినలేదని ఇంటి యజమాని చెప్పడంతో అధికారులు షాకయ్యారు. ఓటర్ల జాబితాను అధికారులు పరిశీలించగా.. ఇలాంటి తప్పిదాలు ఇంకా చాలా ఉన్నాయని గుర్తించారు.
ఒకే ఓటరు పేరు రెండు పోలింగ్ కేంద్రాల్లోనూ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే ఇది ఎవరి పని అనేది అనుమానాలకు తావిస్తోంది. ఎన్నికల్లో గెలుపు కోసం రాజకీయ పార్టీలు ఇలా ఓటర్లను నమోదు చేయించాయా? అనే అనుమానం ఉంది. అలా చేయించింది ఎవరు? ఏ పార్టీకి చెందిన వారు? అనేది మాత్రం తెలియడం లేదు. బోగస్ ఓట్లు వెలుగు చూస్తుండటంతో పోటీలో ఉన్న అభ్యర్థులు టెన్షన్ పడుతున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి డైరెక్షన్ లోనే వేలాదిగా బోగస్ ఓట్లు చేర్పించారని స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఆరోపిస్తున్నారు. మంగళవారం ఆయన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కలిసి దీనిపై ఫిర్యాదు కూడా చేశారు.