మూడు ముక్కలుగా టీఆర్ఎస్? కేసీఆర్ సర్కార్ కు ఎర్త్!
posted on Mar 10, 2021 @ 10:55AM
కేసీఆర్ ప్రభుత్వం కుప్పకూలనుందా? డజన్ మందికి పైగా ఎమ్మెల్యేలు పార్టీని వీడనున్నారా? ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాతే ముహుర్తమా? ప్రభుత్వం పతనమవడం ఖాయమా? అంటే అవుననే అంటున్నారు బీజేపీ బాస్ బండి సంజయ్. వరంగల్ లో జరిగిన సమావేశంలో ఆ మేరకు హింట్ ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ సర్కారు కూలి పోవడం ఖాయమన్నారు. అందుకే కేసీఆర్ వణికిపోతున్నాడని.. ఉద్యోగ సంఘాలతో హడావుడిగా చర్చలు జరుపుతున్నాడని చెప్పుకొచ్చారు. పీఆర్సీపై ఉద్యోగులను మోసం చేస్తున్న ముఖ్యమంత్రికి త్వరలోనే పెద్ద షాక్ తగలబోతోందంటూ జోస్యం చెప్పారు సంజయ్.
బండి సంజయ్ కామెంట్లను రొటీన్ పొలిటికల్ స్టేట్ మెంట్స్ లా తీసుకోలేమంటున్నారు విశ్లేషకులు. గులాబీ పార్టీకి గండం పొంచి ఉందని చెబుతున్నారు. బీజేపీ విసురుతున్న వలకు ఇప్పటికే 12 మంది ఎమ్మెల్యేలు చిక్కారని.. త్వరలోనే వారంతా కారు వదిలి కాషాయ కండువా కప్పుకునేందుకు రెడీగా ఉన్నారని అంటున్నారు. జస్ట్.. సరైన సమయం కోసమే వెయిట్ చేస్తున్నారని.. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత దాదాపు ముహూర్తం ఫిక్స్ అవుతుందని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది.
12మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జంప్?
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ భారీ స్కెచ్ వేసిందని తెలుస్తోంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా డైరెక్షన్ లోనే ఆపరేషన్ ఆకర్ష్ కు తెర తీశారని సమాచారం. త్వరలో అధికార టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి భారీగా వలసలు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. బీజేపీ పెద్దల లెక్క ప్రకారం.. 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్సేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు, ఓ మాజీ మంత్రి, ఒక జెడ్పీ చైర్‌పర్సన్ కాషాయ కండువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఇద్దరు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ఇద్దరు, మహబూబ్‌నగర్ జిల్లా నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు బీజేపీ అగ్రనేతలతో టచ్‌లో ఉన్నట్లు సమాచారం. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన ఒక్కో ఎమ్మెల్యే కూడా బీజేపీకి దగ్గరవుతున్నట్లు చర్చ జరుగుతోంది. ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా త్వరలో పదవీకాలం ముగుస్తుండటం, అధినేత నుంచి పలకరింపులు లేకపోవడం, ప్రగతిభవన్‌కు దారి లేకపోవడంతో పార్టీని వీడాలనే నిర్ణయించుకున్నట్లు సమాచారం. గతంలో మంత్రిగా పనిచేసినా ఇప్పుడు పెద్దగా ప్రాధాన్యం లేకపోవడం, జిల్లాలోని ఇద్దరు మంత్రులూ తన ప్రత్యర్ధులకే అండగా ఉంటుండం, స్థానిక ఎమ్మెల్యేతో ఇటీవల విభేదాలు రచ్చకెక్కడం లాంటి కారణంతో సీనియర్ నేత ఒకరు పార్టీని వీడడమే బెస్ట్ అనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.
రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన హైదరాబాద్ పరిసరాలలోని ఓ జిల్లా పరిషత్ చైర్మన్ కూడా పార్టీలో తగిన గౌరవం లేదని బాధపడుతూ బీజేపీతో టచ్‌లోకి వెళ్ళినట్లు తెలిసింది. మంత్రితో ఏర్పడిన విభేదాలను పరిష్కరించుకోడానికి అటు అధినేత, ఇటు యువనేత నుంచి సహకారం లేకపోవడంతో పార్టీని వీడేందుకే నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. బీజేపీ ఎమ్మెల్యే టికెట్ ఇస్తామంటూ స్పష్టమైన హామీ ఇవ్వడంతో మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఈ మొత్తం వ్యవహారంలో ఓ మాజీ ఎంపీ కీలకంగా వ్యవహరిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఆయా సెగ్మెంట్లలో టీఆర్ఎస్ పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కారణంగా ఈ ఎమ్మెల్యేలు బీజేపీ వైపు చూస్తున్నట్లు తెలిసింది. బీజేపీ కూడా వారికి గట్టి హామీలే ఇస్తున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ నుంచి గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలను టీఆర్ఎస్‌లో చేర్చుకున్న ఫార్ములానే ఇప్పుడు బీజేపీ అవలంబిస్తోంది.
ఇటు బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ తో పాటు.. అటు హరీశ్ రావు రూపంలో మరో ముప్పు ఎప్పుడూ పక్కలో బల్లెంలా ఉండనే ఉంది. పార్టీలో తనను తొక్కేశారని తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న హరీష్.. మామకు వెన్నుపోటు పొడిచేందుకు అదును కోసం ఎదురు చూస్తున్నారనేది ఓపెన్ టాక్. హరీశ్ రావు తన వర్గంతో ఏ క్షణంలోనైనా పార్టీని చీల్చేందుకు సన్నద్ధంగా ఉంటారని.. ఆ సందర్భం రావడమే ఆలస్యమని అంటారు. ఇక.. బీసీ వర్గానికి చెందిన ఓ సీనియర్ మంత్రి సైతం వేరు కుంపటి పెట్టే ప్రయత్నాల్లో ఉన్నారని విస్తృత ప్రచారం జరుగుతోంది. కొంత కాలంగా గులాబీ జెండాపై రెబెల్ వాయిస్ వినిపిస్తున్న ఆ నేత.. రేపే, మాపో సొంత పార్టీ ప్రకటిస్తారని చెబుతున్నారు. ఇలా.. ముక్కోణపు పోటీలో.. కారు పార్టీ మూడు ముక్కలైనా ఆశ్చర్యపోనవసరం లేదు. ఈ పరిణామాలన్నింటినీ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిశితంగా గమనిస్తున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.