బాలీవుడ్ మత్తులో కేటీఆర్!

నిర్మల్  జిల్లా భైంసాలో మరోసారి హింస చెలరేగడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. భైంసాలో భారీగా బలగాలను మోహరించారు.పట్టణంలో పోలీసు  కవాతును నిర్వహించారు. సమస్యాత్మక ప్రాంతాల మీదుగా  ఫ్లాగ్ మార్చ్ కొనసాగింది. బైంసా ఘటనపై రాజకీయ రగడ ముదురుతోంది. కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్. ఒక ప్రణాళిక ప్రకారమే భైంసాలో హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయని అన్నారు. దీనికి సంబంధించి కేంద్ర నిఘా వర్గాలకు లేఖ రాస్తానని చెప్పారు. భైంసా అల్లర్లపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఎంపీ అర్వింద్ డిమాండ్ చేశారు. మంత్రి కేటీఆర్ బాలీవుడ్ మత్తులో మునిగిపోయారని... ఆ మత్తు నుంచి ఆయన బయటకు రావాలని అరవింద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్, కేటీఆర్ ఇద్దరూ ఓటు బ్యాంకు రాజకీయాల్లో మునిగిపోయారని అన్నారు. ఓట్ల కోసం హిందువుల ప్రాణాలను పణంగా పెడుతున్నారని మండిపడ్డారు. మత్తులో మునిగితేలుతున్న కేసీఆర్ తన మతాన్ని కూడా మర్చిపోయారని అన్నారు. భూకబ్జాల్లో కేటీఆర్ ను కవిత మించిపోయారని విమర్శించారు. హోం మంత్రి మహమూద్ చేతకాని స్థితిలో ఉన్నారని... లా అండ్ ఆర్డర్ తమకు అప్పచెపితే అల్లర్లను ఎలా కంట్రోల్ చేయాలో చేసి చూపిస్తామని అర్వింద్ చెప్పారు.  

బీజేపీ ముఖ్యమంత్రి రాజీనామా

ఉత్తరాఖండ్‌‌ రాజకీయాలలో సంచలనం జరిగింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ తన పదవికి రాజీనామా చేశారు. మంగళవారం పలు నాటకీయ పరిణామాల మధ్య సాయంత్రం 4 గంటల సమయంలో రాజ్‌భవన్‌కు చేరుకున్న ఆయన గవర్నర్ రాణి మౌర్యకు తన రాజీనామాను అందజేశారు. రావత్ పనితీరుపై .. బీజేపీ పెద్దలు, కేంద్ర ప్రభుత్వం అసంతృప్తిగా ఉన్నదని తెలుస్తున్నది. గడిచిన నాలుగు రోజులుగా ఆయనను పదవి నుంచి తొలగిస్తారని వస్తున్న వార్తల నేపథ్యంలో రావతే ఈరోజు పదవి నుంచి తప్పుకున్నారు. రావత్ వ్యవహార శైలిపై స్థానిక ఎమ్మెల్యేలు ఆగ్రహంగా ఉన్నారని తెలుస్తున్నది. క్యాబినెట్ కూర్పుపైనా ఆయనపై ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నారు. ఇదే విషయమై పార్టీ పరిశీలకుడు రమణ్ సింగ్ ముందు తెలియజేశారు. అసంతృప్త వర్గాలు, ఇతరులతో చర్చించిన రమణ్ సింగ్.. ఇటీవలే ఇందుకు సంబంధించిన నివేదికను బీజేపీ అధిష్టానానికి అందజేశారు. దీంతో బీజేపీ కేంద్ర పెద్దలు ఆయన రాజీనామాకు పట్టుబట్టినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

కిషన్ రెడ్డి కుర్చీకి ఎసరు?

ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందనే సామెత  అందరికీ తెలిసిందే. ఇప్పుడు భైంసా అల్లర్ల వ్యవహారం  అటు తిరిగి ఇటు తిరిగి, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కుర్చీకి ఎసరు తెస్తుందా.. అంటే  పార్టీవర్గాలు, పరిస్థితి అలాగే ఉందనే అంటున్నాయి. భైంసా అల్లర్లు జరిగిన వెంటనే పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్, నిజమాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అలాగే ఇతర నాయకులు స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వాన్నిబోనులో నిలబెట్టారు. అయినా కిషన్ రెడ్డి మాత్రం కేంద్ర హోం మంత్రి అమిత్ షా భైంసాలో ఏమి జరిగిందని ఆరా కోరే వరకు స్పందించలేదన్న ఆరోపణలు పార్టీ నుంచే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో అయితే  కిషన్ రెడ్డికి వ్యతిరేకంగా కాంపైన్ నడుస్తోంది.  ఈ నేపధ్యం లోనే కిషన్ రెడ్డి మంగళవారం  భైంసా సంఘటనను ఖండిస్తూ వీడియో విడుదల చేశారు. భైంసాలో అలాంటి  సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని  రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంఘ వ్యతిరేక శక్తులు ఉద్దేశపూర్వకంగా ఘర్షణలు సృష్టిస్తున్నాయని,అలాంటి శక్తులపట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని  సూచించారు. భైంసాలో కొన్నేళ్లుగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని, ఒక వర్గం వారిపై మరో వర్గం వారు దాడి చేయడం మంచిది కాదని.. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసు వ్యవస్థను పటిష్టం చేయాలని డీజీపీకి సూచన చేశారు. మరోవంక అరవింద్ చలో భైంసా అంటూ బయలుదేరి హౌస్ అరెస్ట్ అయ్యారు. గత సంవత్సరం కూడా హిందువులపై దాడులు జరిగిన విషయాన్ని గుర్తుచేశారు. హిందువులలో భరోసా కలిపించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవంక దుబ్బాక ఉపఎన్నికల సమయంలో పోలీసులు రఘునందన రావు  ఇంటి పై దాడి చేసిన సందర్భంలో కిషన్ రెడ్డి స్పందించిన తీరు విమర్శలకు గురైంది. అలాగే కిషన్ రెడ్డి తెరాస పట్ల మెతక వైఖరి అవలబిస్తున్నారనే అపవాదు ఉండనే ఉంది. ఇలా  పార్టీలో కిషన్ రెడ్డి పట్ల  కొంత అసంతృప్తి ఉందని..సోషల్ మీడియాలో  వస్తున్న ట్వీట్లు, పోస్టులు సూచిస్తున్నాయి. అలాగేకిషన్ రెడ్డికి అమిత్’ షా క్లాసు తీసుకున్నారన్న వార్త కూడా  సోషల్ మీడియాలో షికార్లు చేస్తోంది. మొత్తానికి భైంసా అల్లర్లు కిషన్ రెడ్డిని అల్లరి పాలు చేసేటట్లే ఉన్నాయి. 

నేను చాలా మంచోడిని.. రాసలీలల మంత్రి క్లారిటీ

"అంతా అబద్దం. పచ్చి అబద్దం. నేను అమాయకుడిని. రాసలీలల సీడీ ఎవరో కావాలని చేసిన కుట్ర. నేను ఎలాంటి తప్పు చేయలేదు." ఇదీ కర్ణాటక రాసలీలల మంత్రి రమేశ్ జార్ఖిహొళి ఇచ్చిన క్లారిటీ. అది కూడా మీడియా సమావేశం పెట్టి మరీ తాను చాలా మంచోడినంటూ చెప్పుకొచ్చారు మాజీ మంత్రివర్యులు. తప్పేమీ లేకపోతే రాజీనామా ఎందుకు చేశారని విలేకర్లు ప్రశ్నిస్తే.. అది నా సొంత నిర్ణయమంటూ విషయం దాటేశారు.  కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాసలీలల సీడీ ఘటనపై బీజేపీ నేత, మాజీ మంత్రి రమేశ్‌ జార్ఖిహొళి తొలిసారి స్పందించారు. తాను సచ్చీలతను వెల్లడించేందుకు మీడియా ముందుకొచ్చారు. తనపై వచ్చిన రాసలీలల ఆరోపణల్లో నిజం లేదని ఖండించారు. ఆ ఆరోపణలకు సంబంధించి విడుదలైన సీడీ గురించి తనకేం తెలియదని.. కావాలని ఎవరో కుట్ర చేస్తున్నారన్నారు.  ‘రాసలీలల వ్యవహారంలో నేను ఉన్నానని ఆరోపిస్తూ విడుదలైన సీడీలో నిజం లేదు. నేను అమాయకుడిని. అసలు ఈ సీడీ వ్యవహారం నాలుగు నెలల కిందటే నా దృష్టికి వచ్చింది. నేను ఎలాంటి తప్పు చేయలేదని అప్పుడే నా సోదరుడికి కూడా వివరించా. అందులో ఉన్నది నేను కాదు. ఈ విషయంలో న్యాయపరమైన సహకారం గురించి నాకు అధిష్ఠానం నుంచి కాల్‌ వచ్చింది. అయినప్పటికీ ఆ ఆరోపణలపై నేను ఒంటరిగా పోరాడగలనని చెప్పా’ అని రమేశ్‌ తెలిపారు.   ‘మంత్రి పదవికి రాజీనామా చేయడం నా సొంత నిర్ణయమే. నన్ను రాజీనామా చేయమని సీఎం యడియూరప్ప కోరలేదు. నా అంతట నేనే రాజీనామా చేశా. నా వల్ల పార్టీ ఇబ్బందుల పాలు కావడం నాకు ఇష్టం లేదు. అందుకే తర్వాతి రోజు ఉదయమే రాజీనామా సమర్పించా’ అని రమేశ్‌ వెల్లడించారు.   ఓ యువతికి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి, లైంగికంగా లొంగ దీసుకుని, కొన్ని నెలలుగా ఆమెతో రాసలీలలు నెరుపుతున్నారనేది రమేశ్ జార్ఖిహొళిపై ఓ సమాచార హక్కు చట్టం కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఫిర్యాదుతో పాటు మంత్రి రాసలీలల వీడియోను సైతం బయటపెట్టారు. అందులో ఆ యువతితో రమేశ్ జార్ఖిహొళి చాలా సన్నిహితంగా ఉన్న ద‌ృశ్యాలు సంచలనంగా మారాయి. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.. రమేశ్ పై ఒత్తిడి పెరిగి.. మంత్రి పదవికి రాజీనామా చేశారు. వీడియోలో ఆయన స్పష్టంగా కనిపిస్తున్నా.. తాను ఎలాంటి తప్పు చేయలేదని.. ఆ సీడీ ఓ కుట్ర అంటూ మాజీ మంత్రి రమేశ్ జార్ఖిహొళి చెప్పడాన్ని ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయి. అటు, ప్రజల నుంచీ తీవ్ర విమర్శలు వస్తున్నాయి. 

ఏలూరు ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ 

ఆంధ్రప్రదేశ్  లోని ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై సస్పెన్స్ వీడింది. ఏలూరులో బుధవారం ఎన్నికలు నిర్వహించేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. యథావిథిగా ఈనెల 10న ఎన్నికలు నిర్వహించవచ్చన్న హైకోర్టు డివిజనల్ బెంచ్.. ఫలితాలను మాత్రం ప్రకటించవద్దని స్పష్టం చేసింది. ఏలూరు కార్పొరేషన్ ఓటర్ల జాబితాలో అవకవకలు చోటు చేసుకున్నాయని ఆరోపిస్తూ.. ఎన్నికలు వాయిదా వేయాలని కోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జితో కూడిన ధర్మాసనం ఎన్నికలు నిర్వహించవద్దని స్పష్టం చేసింది. దీనిపై ఎస్ఈసీ డివిజన్ బెంచ్ కు వెళ్లగా.. ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఐతే ఈనెల 14న ప్రకటించనున్న ఫలితాలపై మాత్రం స్టే విధించిన ధర్మాసనం.. తదుపరి విచారణను ఈనెల 23కు వాయిదా వేసింది. ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మొత్తం 50 డివిజన్లు ఉన్నాయి. అన్ని డివిజన్లకూ నోటిఫికేషన్ విడుదల కాగా.. ఇందులో మూడు డివిజన్లను అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవం చేసుకుంది. మిగిలిన 47 డివిజన్లకు మార్చి 10న జరగనున్నాయి.  కార్పొరేషన్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. మంగళవారం ఉదయం నుంచి సందిగ్ధత నెలకొన్నా.. ఏక్షణాన్నైనా తీర్పు వచ్చే అవకాశముండటంతో ముందస్తుగానే సిబ్బందిని, ఎన్నికల సామాగ్రిని తరలించే ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలను గుర్తించిన నేపపథ్యంలో.. పోలింగ్ ప్రారంభమయ్యే సమాయనికి అంతా సిద్ధం చేస్తామని అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టరేట్ నుంచి సిబ్బందికి ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది.  ప్రచారం ముగిసిన తర్వాత ఎన్నికలపై హైకోర్టు స్టే ఇవ్వడంతో  అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. ఐతే పోలింగ్ కు కొన్నిగంటల ముందు గ్రీన్ సిగ్నల్ రావడంతో అభ్యర్థులు కూడా ఊపిరి పీల్చుకున్నారు గత ఏడాది జనవరిలో చొదిమెళ్ల, కొమడవోలు, వెంకటాపురం, పోణంగి, సత్రంపాడు, శనివారపుపేట, తంగెళ్లమూడి పంచాయతీలను కార్పొరేషన్‌లో విలీనం చేస్తూ వార్డుల పునర్విభజన జరిగింది. ఐతే విలీనం సమయంలో ఓటర్ల జాబితాలో తప్పులు నమోదయ్యాయని.. అలాగే రిజర్వేషన్ల కేటాయింపుల్లోనూ ఇబ్బందులున్నాయని ఏలూరుకు చెందిన చిరంజీవి అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఓటర్ల జాబితాలో పొరబాట్లు, రిజర్వేషన్లలో చోటు చేసుకున్న తప్పులను సవరించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు సింగిల్ బెంచ్ స్పష్టం చేసింది. దీనిని ప్రభుత్వం, ఎస్ఈసీ సవాల్ చేయగా.. ఎన్నికల నిర్వహణకు హైకోర్టు డివిజన్ బెంచ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

510 కోట్లకు వైన్ షాపు వేలం 

మద్యం షాపునకు వేలం మాములుగా కోటి రూపాయల వరకు ఉంటుంది.. కొన్ని ప్రాంతాల్లో రెండు కోట్ల వరకు వెళుతుంది.. కాని అక్కడ మాత్రం మద్యం షాపు వేలం ఎంతో తెలుసా.... 2, 3 ,4 కోట్లు కాదు.. 10 కోట్లు కూడా కాదు.. వంద కోట్లకు ఇంకా పైనే.... ఏకంగా  510 కోట్ల రూపాయలు.. అక్షరాల ఐదు వందల 10 కోట్లు.. మీరు చదువుతున్నది నిజమే.. కేవలం ఒక్క లిక్కర్ షాపు వేలం ఖరీదే  510 కోట్ల రూపాయలు.  రాజస్థాన్ లో  వైన్ షాపు కోసం వేలం నిర్వహించగా ఏకంగా రూ.510 కోట్లు పలికింది. హనుమాన్ గఢ్ జిల్లా నోహర్ లోని ఆ లిక్కర్ షాపుకు వేలంలో బేసిక్ ధరను 72 లక్షలుగా నిర్ణయించింది రాజస్థాన్ సర్కార్. కాని వేలంలో షాపు ధర క్రమంగా పెరుగుతూ పోయింది. ఈ వేలంపాట 15 గంటల పాటు నిర్వహించారంటే ఎంత హోరాహోరీగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. చివరికి కిరణ్ కన్వర్ అనే వ్యాపారి ఈ వైన్ షాపును కళ్లు చెదిరే ధరకు సొంతం చేసుకున్నాడు. రాజస్థాన్ సర్కారు ఇటీవల కొత్త మద్యం పాలసీ తీసుకువచ్చింది. లాటరీ పద్ధతిలో వైన్ షాపులు కేటాయించే బదులు వేలం పద్ధతి పాటించాలని నిర్ణయించింది. దీంతో మద్యం షాపుల కోసం వ్యాపారులు పోటీ పడటంతో ప్రభుత్వానికి వేలంలో కాసుల పంట పండింది. ఇంకా ఆశ్చర్యం కలిగించే అంశం ఏమిటంటే... వేలంలో 510 కోట్లు పలికిన వైన్ షాపుకు గతంలో లాటరీ పద్ధతిలో కేవలం రూ.65 లక్షలకే అమ్ముడైంది.   

ఏపీ స్కూల్ లో కలకలం..  ఒక్కసారిగా కుప్పకూలిన విద్యార్థులు...

ఏపీలోని ఏలూరు నగరంలో కొన్ని నెలల క్రితం ఒక వింత వ్యాధి కలకలం రేపిన సంగతి తెల్సిందే. తాజాగా మరోసారి ఈ వింత వ్యాధి మళ్ళీ కలకలం రేపుతోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఏపీలోని కృష్ణాజిల్లా గుడివాడలో పాఠశాలలోని విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన కలకలం సృష్టిస్తోంది. గుడివాడలో ఉన్న ఆర్సీఎం మిషనరీ స్కూల్లో విద్యార్థులు ఒక్కసారిగా కళ్లు తిరిగిపడిపోవడం తాజాగా ఆందోళన కలిగిస్తోంది. దాదాపు పదిమంది విద్యార్థులు ఒక్కసారిగా క్లాస్ రూములోనే కుప్పకూలిపోయారు. దీంతో అప్రమత్తమైన స్కూల్ యాజమాన్యం విద్యార్థులను వెంటనే ఆస్పత్రికి తరలించింది. అయితే బాధిత విద్యార్థులంతా 1, 2 తరగతులు చదువుతున్న చిన్నారులు కావడం గమనార్హం. ఆ విద్యార్థులు ఉన్నట్టుండి కళ్లు తిరిగి క్లాస్ రూమ్ లోనే పడిపోయారని.. ప్రస్తుతం వారు ఇంకా మైకంలోనే ఉన్నట్లు చికిత్స అందిస్తున్న డాక్టర్లు తెలిపారు.  చిన్నారులందరికి  ప్రస్తుతం సెలైన్ ఎక్కిస్తూ డాక్టర్ల అబ్జర్వేషన్ లో చికిత్స అందిస్తున్నారు. ఆ విద్యార్థులలో కొంతమంది కడుపు నొప్పితో విలవిల్లాడుతున్నారని సమాచారం .. ఇది ఇలా ఉండగా విద్యార్థులు తమ ఇళ్ల వద్దే టిఫిన్ చేసి స్కూలుకు వచ్చారని.. అంతేకాకుండా స్కూల్లో కూడా లంచ్ కి ముందే ఈ ఘటన జరిగిందని.. దీంతో ఫుడ్ పాయిజన్ కారణమా అయ్యే అవకాశమే లేదని టీచర్లు చెప్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న చిన్నారులు ఒక్కసారిగా ఉలిక్కిపడి లేవడం, కేకలు వేయడం చేస్తున్నట్లు పిల్లల తల్లిదండ్రులు చెప్తున్నారు. అయితే ఆ విద్యార్థులు అస్వస్థతకు గురవడానికి కారణాలపై డాక్టర్లుఇంకా ఏమీ చెప్పలేకపోతున్నారు. దీంతో విద్యార్థులు /కోలుకోని ఎం జరిగిందో చెప్తేగానీ ఈ మిస్టరీ వీడే అవకాశం కనిపించడం లేదు. ఇంకోపక్క ఆ చిన్నారుల తల్లిదండ్రులను కరోనా భయం కూడా వెంటాడుతోంది. పిల్లలు అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న జాయింట్ కలెక్టర్, ఎస్పీ కూడా ఆస్పత్రికి వచ్చి పరిస్థితిని సమీక్షించారు.        

రేవంత్ గ్యాంగ్ వర్సెస్ ఉత్తమ్ టీమ్

పాలమూరు రెడ్లు వర్సెస్ నల్గొండ రెడ్లు. అవును, మీరు చదివింది నిజమే. కాంగ్రెస్ లో ఇప్పుడు అలానే జరుగుతోంది. రెడ్డి నాయకులు జిల్లాల వారీగా విడిపోయారు. ఆధిపత్యం కోసం హోరాహోరీగా తలపడుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వారి కోల్డ్ వార్ పీక్స్ కు చేరింది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ తరఫున చిన్నారెడ్డి బరిలో నిలిచారు. ఆయనను గెలిపించే బాధ్యత వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తీసుకున్నారు.  వరంగల్-ఖమ్మం-నల్గొండ స్థానం నుంచి రాములు నాయక్ పోటీ చేస్తున్నారు. ఆయన తరఫున పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. హస్తం పార్టీ పెద్దలు.. అందులోని రెండు జిల్లాలకు చెందిన రెడ్డి నేతలు.. రెండు వర్గాలుగా విడిపోయి తమ ఆధిపత్యం నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. కాంగ్రెస్ లో నడుస్తున్న కోల్డ్ వార్ ప్రస్తుత ఎమ్మెల్సీ ఎలక్షన్ లో మరోసారి బయటపడుతోందని చెబుతున్నారు. పాలమూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి చిన్నారెడ్డిని ఎలాగైనా గెలిపించుకోవాలని.. ఒకవేళ విజయం దక్కకపోయినా.. ఓట్ల సంఖ్య భారీగా పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నారు. చిన్నారెడ్డి గెలుపు కోసం మరో పాలమూరు నేత రేవంత్ రెడ్డి గట్టిగా ప్రయత్నిస్తున్నారు. నియోజకవర్గ పరిధిలో ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. కుదిరితే చిన్నారెడ్డిని గెలిపించడం.. కుదరకపోతే రాములు నాయక్ కంటే అధికంగా ఓట్లు సంపాదించడం.. ఇదే రేవంత్ టార్గెట్.  అటు, వరంగల్ పరిధిలోనూ ఉత్తమ్, కోమటిరెడ్డి ఇదే లక్ష్యంతో పని చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి రాములు నాయక్ గెలుపు కోసం మూడు జిల్లాల పరిధిలో పర్యటిస్తున్నారు. అయితే, రేవంత్ ప్రధాన అనుచరురాలైన సీతక్క ప్రాతినిథ్యం వహిస్తున్న ములుగు మీటింగ్ కు పీసీసీ చీఫ్ ఉత్తమ్ డుమ్మా కొట్టడం చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలకు ఇది నిదర్శనం. నల్గొండ జిల్లాకు చెందిన ఇద్దరు ఎంపీలు ఉత్తమ్, కోమటిరెడ్డిలు తమ పరిధిలోని ఎమ్మెల్సీ స్థానాన్ని గెలిచి ఢిల్లీకి తమ బలమెంతో చూపించాలనే పట్టుదలతో ఉన్నారు. ఒకవేళ రాములు నాయక్ గెలవకపోయినా.. కనీసం చిన్నారెడ్డి కంటే ఎక్కువ ఓట్లు వచ్చినా చాలనేది వారి మనసులో మాటని అంటున్నారు. ఇలా, అభ్యర్థి గెలుపుకంటే కూడా పక్క నియోజకవర్గంలోని పోటీదారుకంటే ఎక్కువ ఓట్లు వస్తే చాలన్నట్టు నేతల ప్రచార తీరు సాగుతోంది.  ఎమ్మెల్సీ ఎన్నికలతో కాంగ్రెస్ లో కోల్డ్ వార్.. హీట్ పుట్టిస్తోంది. పాలమూరు రెడ్లు వర్సెస్ నల్గొండ రెడ్లుగా ఈ ఆధిపత్య పోరు నడుస్తోంది. పాలమూరు రెడ్లను రేవంత్ రెడ్డి లీడ్ చేస్తుంటే.. ఉత్తమ్, కోమటిరెడ్డి నల్గొండ రెడ్లను ముందుండి నడిపిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఎవరి బలం ఎంతో నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. పీసీసీ చీఫ్ రేసులో దూసుకుపోతున్న రేవంత్ రెడ్డికి ఈ ఎన్నికలు సవాల్ గా మారాయి. ఓట్ల శాతంతో తన సత్తాను ఢిల్లీకి ఘనంగా చాటాలని చూస్తున్నారు. అందుకు, కౌంటర్ గా నల్గొండ రెడ్డి టీమ్ కూడా రాములు నాయక్ కోసం గట్టిగానే ట్రై చేస్తోంది. ఇలా.. ఒకే పార్టీలోని రెండు రెడ్డి వర్గాలు నువ్వా-నేనా అన్నట్టు తలపడుతుండటంతో తెలంగాణలో హస్తం పార్టీ పాలిటిక్స్ హాట్ హాట్ గా సాగుతున్నాయి. మరి ఈ రెడ్డి ఫైట్ లో గెలిచేదెవరో? నిలిచేదెవరో? రేవంత్ రెడ్డా? ఉత్తమ్ అండ్ టీమా?

నేనే సీఎం అయితే... మంత్రి పెద్దిరెడ్డి మనసులో మాట

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై సొంత పార్టీలోనే కుట్ర జరుగుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. సీఎం జగన్ రెడ్డి  జైలుకెళ్తే .. ఆయన పదవి దక్కించుకోవాలని కొందరు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని వైసీపీ నుంచి నర్సాపురం ఎంపీగా గెలిచిన రఘురామ కృష్ణం రాజు అనుమానం వ్యక్తం చేశారు. రఘురామ వ్యాఖ్యలు ఏపీ రాజకీయ వర్గాలతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతున్నాయి. జగన్ పై కుట్ర చేసేదెవరు అన్న చర్చ జనాల్లో జరుగుతుండగానే.. సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.   విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై మీడియాతో మాట్లాడిన పెద్దిరెడ్డి తన మనసులో మాట బయటపెట్టారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ‌కు వ్యతిరేకంగా ప్రజాప్రతినిధులు రాజీనామా చేస్తే ఉపయోగం ఏమిటని తెలుగుదేశం నేతలను ప్రశ్నించారు. జగన్మోహన్‌రెడ్డి సీఎం కనుక ఇంకా టీడీపీ‌లో శాసన సభ్యులు ఉన్నారు.. అదే సీఎంగా నేనైతే చంద్రబాబు మాత్రమే ఆ పార్టీలో మిగిలేవారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.  ప్రజాప్రతినిధులు రాజీనామా చేస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగుతుందా అని నిలదీశారు. కేంద్రంపై అంతా విశాఖ స్టీల్ కోసం కలిసి పోరాడి సాధించాలని కోరారు. రాజీనామా చేయాలని టీడీపీ చేస్తున్న వ్యాఖలు అర్ధరహితమని చెప్పారు.    నేనే సీఎం అయితే అంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. జగన్ జైలుకు వెళ్తే.. ముఖ్యమంత్రి కావాలని పెద్దిరెడ్డి స్కెచ్ వేస్తున్నారనే ప్రచారం చాలా కాలంగా జరుగుతోంది. వైసీపీలో ఆయన తనకంటూ బలమైన వర్గాన్ని తయారు చేసుకున్నారని కూడా చెబుతున్నారు. పెద్దిరెడ్డి వెనుక పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. వైసీపీ నేతలు ఎవరూ కూడా ముఖ్యమంత్రి అంశం గురించి మాట్లాడే సాహసం చేయరు. అలాంటిది పెద్దిరెడ్డి నేనే సీఎం అయితే అని మాట్లాడటం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ముఖ్యమంత్రి కావాలనే తన మనసులో మాటను పెద్దిరెడ్డి.. ఇలా బయటికి  చెప్పేశారనే చర్చ జరుగుతోంది. నేనే సీఎం అయితే అంటూ పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలు వైసీపీలోనూ దుమారం రేపుతున్నాయని తెలుస్తోంది.  

నిన్న పోస్టింగ్.. ఇవాళ ఊస్టింగ్.. దేత్తడికి దేత్తడి

నిన్న పోస్టింగ్.. ఇవాళ ఊస్టింగ్.. తెలంగాణ టూరిజం శాఖలో వెలుగుచూసిన ఈ ఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. యూట్యూబ్ స్టార్ దేత్తడి హారికకు తెలంగాణ టూరిజం  డిపార్ట్‌మెంట్ షాకిచ్చింది. దేత్తడి హారికను సోమవారం తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించారు. ఈ మేరకు టూరిజం డిపార్ట్‌మెంట్ ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా ఆమెకు నియామక పత్రం  అందించారు. కానీ కొన్ని గంటల్లోనే సీన్ మారిపోయింది.  హారికను బ్రాండ్ అంబాసిడర్ పదవి నుంచి తప్పించారు. ఆమె వివరాలను టూరిజం శాఖ తమ వెబ్ సైట్ నుంచి మంగళవారం తొలగించింది  తెలంగాణ అమ్మాయి కావడంతో టూరిజం అంబాసిడర్‌గా ఆమెను శ్రీనివాస్ గుప్తా నియమించారని సమాచారం. అయితే టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, సీఎంవో అధికారులకు సమాచారమివ్వకుండానే శ్రీనివాస్ గుప్తా స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవడంతో ఇలా జరిగిందని సంబంధిత శాఖ అధికారులు అంటున్నారు. ఈ మేరకు శ్రీనివాస్ గుప్తాను సీఎంవో అధికారులు మందలించినట్టు తెలిసింది. దీంతో శాఖా పరమైన అనుమతులు తీసుకోకపోవడంతో తొలగించినట్టు తెలుస్తోంది.  ఉప్పల శ్రీనివాస్ కుటుంబానికి హారిక దగ్గర బంధువు అని, అందుకే ఎవరికీ చెప్పకుండా టూరిజం డిపార్ట్‌మెంట్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. యూట్యూబ్‌లో తెలంగాణ యాసతో పాపులర్ అయింది దేత్తడి హారిక.. తన వీడియోల ద్వారా ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఆ తర్వాత బిగ్‌బాస్- 4లోకి ఎంట్రీ ఇచ్చి మరింత పాపులర్ అయ్యారు. అక్కడ కూడా తన డ్యాన్స్‌లతో రెచ్చిపోయింది దేత్తడి హారిక. ఆమె డ్యాన్సులకు ఎంతోమంది అభిమానులయ్యారు.

జగన్ కు వెన్నుపోటు తప్పదా! 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిపై కుట్ర జరుగుతోందా? సొంత పార్టీలోనే ఆయన శత్రువులున్నారా? అదను చూసుకుని జగన్ కు వెన్నుపోటు పొడిచేందుుకు కాసుకుని కూర్చున్నారా? ఏపీలో కొన్ని రోజులుగా ఇలాంటి ప్రచారం జరుగుతోంది. వైసీపీ నేతలు ఖండిస్తూ వస్తున్నా... ఈ ప్రచారం మాత్రం ఆగడం లేదు. తాజాగా మరోసారి ఇది ఊపందుకుంది. జగన్ కు పదవిపోటు పొడిచేందుకు వైసీపీలోనే రంగం సిద్ధమవుతుందనే ప్రచారం జరుగుతోంది. తాజాగా  నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు కూడా ఇవే అనుమానాలు వ్యక్తం చేశారు.  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జైలుకెళ్తే పదవి దక్కించుకోవాలన్న కుట్ర జరుగుతోందని నర్సాపురం ఎంపీ అనుమానం వ్యక్తం చేశారు.  తనకు తెలిసీ ముఖ్యమంత్రిపై కుట్ర చేసే ధైర్యం ఎవరికి ఉంటుందని తాను అనుకోవడంలేదన్నారు. అయితే జాతీయ చానెల్ లో వచ్చిన వార్తను అంత తేలిగ్గా కొట్టిపడేయొద్దని అన్నారు. అందులో ఎంతోకొంత నిజం లేకపోతే ఆ వార్త రాదన్నారు రఘురామ. సీఎం జగన్ ఈ వార్తను అంత తేలిగ్గా తీసిపారేయొద్దని చెప్పారు. ‘మీ వెనుక ఎవరైన దొంగ వెధవులు కుట్ర చేస్తున్నారేమో అన్న దృష్టితో ఆలోచించి నిజమైన బ్లాక్ షీప్‌ ను పట్టుకోండి’ అని సీఎం జగన్ కు రాఘురామ సూచించారు. ముందుగా చెక్క భజన చేస్తూ.. వెనుక గోతులు తీస్తున్నారేమో అన్న అనుమానం ఉందన్నారు రఘురామ కృష్ణం రాజు.   జగన్ పై సొంత పార్టీలోనే  కుట్ర జరుగుతోందని గతంలోనూ ప్రచారం జరిగింది. చిత్తూరు జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి... తన వర్గాన్ని తయారు చేసుకున్నారని  వార్తలు వచ్చాయి. తనపై ఉన్న కేసులో ఒకవేళ జగన్ జైలుకు వెళ్లాల్సి వస్తే... జగన్ కుటుంబ సభ్యులు కాకుండా తానే ముఖ్యమంత్రి కావాలని ఆ సీనియర్ మంత్రి భావిస్తున్నారని ప్రచారం జరిగింది. అయితే తనపై వస్తున్న వార్తలను సదరు మంత్రి ఖండించారు. జగన్ జైలుకు వెళ్లే పరిస్థితే రాదు.. ముఖ్యమంత్రి మార్పు ఉండనే ఉండదని చెప్పారు. ఆయన వివరణ ఇచ్చినా ఆ ప్రచారం ఆగలేదు. సదరు మంత్రిపై అనుమానంతో.. జగన్ అతనిపై నిఘా పెట్టారని కూడా అంటున్నారు. తాజాగా జాతీయ చానెల్ కథనంతో  జగన్ పై కుట్ర అంశం మరోసారి కలకలం రేపుతోంది. 

ప్రధానికి లేఖతో కవరింగ్! జగన్‌కు GVMC టెన్షన్

విశాఖ ఉక్కుపై ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ. ప్రైవేటీకరణపై చర్చించేందుకు అనుమతి ఇవ్వాలని వినతి. అఖిలపక్షంతో ఢిల్లీకి వచ్చి చర్చిస్తానంటూ మోదీకి ప్రతిపాదన. స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు కేటాయించాలి. 7వేల ఎకరాలు ప్లాట్లు చేసి అమ్మేయాలి. ఇలా పలు ప్రతిపాదనలు ఆ లేఖలో ఉన్నాయి. సీఎం జగన్ కు విశాఖ ఉక్కుపై సడెన్ గా ఇంత చిత్తశుద్ధి ఎందుకొచ్చిందనే ఆశ్చర్యం అవసరం లేదు. ఎందుకంటే, బుధవారం విశాఖ కార్పొరేషన్ ఎలక్షన్. అందుకే, మంగళవారం మోదీకి జగన్ లెటర్. అంతే, సింపుల్ లాజిక్ అంటున్నాయి ప్రతిపక్షాలు. విశాఖ ఉక్కును వంద శాతం ప్రైవేటీకరణ చేస్తామంటూ సోమవారం పార్లమెంట్ లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తేల్చి చెప్పేశారు. కేంద్రం తీరుతో విశాఖ తీరంతో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. మంత్రి ప్రకటన చేసినప్పటి నుంచీ విశాఖలో ఆందోళనలు ఓ రేంజ్ లో కొనసాగుతున్నాయి. సరిగ్గా జీవీఎమ్సీ ఎన్నికలకు ఒకరోజు ముందు జరుగుతున్న ఈ నిరసనలు అధికార వైసీపీలో వణుకుపుట్టిస్తున్నాయి. రాష్ట్రంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని కేంద్ర మంత్రే స్వయంగా ప్రకటించడంతో విశాఖ ఉక్కు పాపం వైసీపీ మెడకు చుట్టుకుంటోంది. ఆ ప్రభావం కార్పొరేషన్ ఎన్నికల్లో కనిపించకుండా.. ప్రభుత్వాన్ని ముంచేయకుండా.. సీఎం జగన్ నష్ట నివారణ చర్యలు చేపట్టారని చెబుతున్నారు. అందులో భాగంగానే, విశాఖ స్టీల్ పై మోదీతో చర్చించేందుకు జగన్ లేఖ రాశారని అంటున్నారు.  సాధారణంగా ఓ ముఖ్యమంత్రి.. ప్రధానిని కలవాలంటే పీఎంవో ద్వారా అపాయింట్ మెంట్ తీసుకుంటారు. గతంలో ప్రధాని మోదీని జగన్ సైతం అలానే కలిశారు. అప్పుడు అపాయింట్ మెంట్ కోసం ఎలాంటి లేఖ రాయలేదు. అలాంటిది ఇప్పుడు కొత్తగా.. ప్రధానిని కలిసేందుకు ప్రత్యేకంగా లేఖ రాయడం విడ్డూరంగా ఉందని అంటున్నారు. లెటర్ రాసి అపాయింట్ మెంట్ కోరడం వెనుక రాజకీయ ఎత్తుగడ దాగుందని అనుమానిస్తున్నారు. విశాఖ ఉక్కు కోసం తానేదో ప్రయత్నం చేస్తున్నట్టు ప్రజలను నమ్మించడానికే ఇలా లేఖ రాసి దానిని బహిరంగ పరిచారని చెబుతున్నారు. ఇదంతా బుధవారం జీవీఎమ్సీ ఎన్నికల్లో వైసీపీకి నష్టం జరగకుండా పార్టీని గట్టెక్కించేందుకు వేసిన ఎత్తుగడే అని విమర్శిస్తున్నాయి ప్రతిపక్షాలు. ప్రైవేటీకరణపై రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదిస్తున్నామంటూ కేంద్ర మంత్రి పార్లమెంట్ సాక్షిగా అంత సూటిగా చెప్పాక ఇక జగన్ రెడ్డిని నమ్మేదెలా అని ప్రశ్నిస్తున్నారు ఉక్కు కార్మికులు.  సీఎం జగన్, పీఎం మోదీకి రాసిన లేఖలో కొత్త అంశాలేవీ ప్రస్తావించలేదు. గతంలో రాసిన లేఖకు కాస్త అటూ ఇటూగా ఉందా లేఖ. ఢిల్లీకి తనతో పాటు రాజకీయ పార్టీలు, ట్రేడ్ యూనియన్లతో వచ్చి కలుస్తానని లేఖలో సీఎం వివరించారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో తాను రాసిన లేఖ విషయాన్ని కూడా తాజా లేఖలో సీఎం ప్రస్తావించారు. "32 మంది ప్రాణ త్యాగ ఫలితం విశాఖ ఉక్కు. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అనే నినాదం ఆంధ్రుల ఆత్మగౌరవంతో ముడిపడి ఉంది. 2002-2015 వరకు స్టీల్ ప్లాంట్ లాభాల్లో ఉంది. ప్లాంట్‌కు ఉన్న 19,700 ఎకరాల భూమి విలువ లక్ష కోట్లు దాటింది. ప్రపంచ వ్యాప్తంగా 2014-15లో స్టీల్‌కు ఎదురైన విపత్కర పరిస్థితుల నేపథ్యంలో ప్లాంట్ నష్టాల్లోకి వెళ్లింది. ఉత్పత్తి ఖర్చు పెరగడానికి కారణం సొంత గనులు లేకపోవడమే. పెట్టుబడుల ఉపసంహరణకు బదులు సొంత గనులు కేటాయించాలి. ఉపయోగించకుండా ఉండిపోయిన 7వేల ఎకరాలను ప్లాట్లు వేసి విక్రయిస్తే ఆర్ఐఎన్ఎల్‌కు నిధులు సమకూరుతాయి. భూ వినియోగ మార్పిడికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల అనుమతులిస్తుంది. ఈ ప్రత్యామ్నాయాలను పరిశీలించాలి" అని మోదీకి రాసిన లేఖలో జగన్ కోరారు.  విశాఖ ఉక్కు కోసం రాజీనామాలకు సిద్ధమా? అంటూ విపక్ష నేతలు ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా ముఖం చాటేస్తున్న వైసీపీ నేతలు.. ఇలా లేఖల పేరుతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజలు ఎవరిని నమ్ముతున్నారో.. ఎవరిని ద్రోహులుగా నిలబెడుతున్నారో.. జీవీఎమ్సీ ఎన్నికల తీర్పుతో తేలిపోతుందని అంటున్నారు.

విశాఖ ఉక్కుని జగన్ రెడ్డి కొంటున్నారా?

విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణ అంశం కాక రేపుతోంది. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అమ్మేస్తున్నామంటూ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనపై ఆంధ్రులు భగ్గుమంటున్నారు. ఉక్కు కర్మాగారం దగ్గర సోమవారం సాయంత్రం నుంచి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. స్టీల్ ప్లాంట్ అధికారులకు నిరసన తెగ తగిలింది. ఎక్కడికక్కడ అధికారుల కార్లను కార్మికులు అడ్డుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గూడు పుఠాని బయటపడడంతో మోడీ, జగన్ బొమ్మలను కార్మికులు తగులబెట్టారు. జగన్, మోడీ ప్రభుత్వాలకు తమ ఉసురు తగులుతుందని శాపనార్థాలు పెట్టారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను అమ్మేస్తున్నామంటూ కేంద్రం చేసిన ప్రకటనపై సీరియస్ గా స్పందించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. విశాఖ ఉక్కును కేంద్రం అమ్మేస్తోందని.. ఏపీ సీఎం జగన్ కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. గంగిరెద్దుల్లా తలాడించడానికి 28 మంది ఎంపీలున్నారని.. ప్రజల హక్కులు కాపాడలేని వారు ఎంత మంది ఉండి ఉపయోగమేంటని ట్విటర్ వేదికగా  లోకేష్ ప్రశ్నించారు.  '"విశాఖ ఉక్కుని కేంద్రం అమ్మేస్తుంది. జగన్ రెడ్డి కొంటున్నాడు.. ఓకే సార్ అంటూ గంగిరెద్దుల్లా తల ఆడించడానికి 28 మంది ఎంపీలు ఎందుకు దండగ. ప్రజల హక్కులు కాపాడలేని వారు ఎంత మంది ఉండి ఉపయోగం ఏంటి? విశాఖ ఉక్కుని తుక్కులా కొట్టేయడానికి జగన్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా వాటిని భగ్నం చేసేందుకు ఎంత దూరమైనా వెళ్తాం. అన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పే చేస్తున్నాం, జగన్ రెడ్డి అంగీకారంతోనే విశాఖ ఉక్కు అమ్మకం ప్రక్రియ జరుగుతోందని కేంద్రం స్పష్టం చేసింది. విశాఖ ఉక్కు పరిరక్షణ పేరు చెప్పి లేఖలతో జగన్ రెడ్డి పిరికి కాలక్షేపం,వైకాపా నాయకుల డ్రామాలు ఆపాలి’’ అని నారా లోకేష్ ట్వీట్ లో పేర్కొన్నారు. 

జగన్ తో మాట్లాడండి.. షర్మిలకు వినతి

తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతున్న వైఎస్ షర్మిల దూకుడు కొనసాగిస్తున్నారు. వరుస సమావేశాలతో బిజిబిజీగా ఉంటున్నారు. షర్మిల పార్టీ తెలంగాణతో పాటు ఏపీలోనూ  హాట్ టాపిక్ గా మారింది. ఆమె పార్టీపై ఏపీలోనూ జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ కు చెందిన హోంగార్డులు లోటస్ పాండ్ లో వైఎస్ షర్మిలను కలిశారు. తమ సమస్యలు చెప్పుకుంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తో మాట్లాడాలని షర్మిలను కోరారు ఏపీ హోంగార్డులు.  తెలంగాణలో పని చేస్తున్న ఆంధ్ర ప్రాంత హోంగార్డులు లోటస్ పాండ్‌లో వైఎస్ షర్మిలను కలిశారు. తమను తెలంగాణ నుంచి ఏపీలో విధుల్లోకి తీసుకునే విధంగా జగన్ ప్రభుత్వంతో మాట్లాడాలంటూ షర్మిలకు విన్నవించారు. తెలంగాణలో పని చేస్తున్నా ఇప్పటికీ తమను స్థానికేతరులుగానే గుర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చినట్లుగా తమకు ఆప్షన్లు ఇవ్వలేదని, అందువల్ల ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చిందని షర్మిల వద్ద హోంగార్డులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఇక్కడ స్థానికేతరులుగా ఉండలేమని, తమను ఆంధ్రాలో విధుల్లోకి తీసుకునేలా సీఎం జగన్‌తో మాట్లాడాలని షర్మిలకు విజ్ఞప్తి చేశారు. హోంగార్డుల విన్నపంపై షర్మిల సానుకూలంగా స్పందించారు. హోంగార్డుల సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు.

ఎమ్మెల్సీ ఎన్నికలలో  బోగస్ ఓట్ల కలకలం

తెలంగాణలో జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో హోరాహోరీగా ప్రచారం జరుగుతోంది. అన్ని పార్టీలు సవాల్ గా తీసుకోవడంతో గతంలో ఎప్పుడు లేనంతగా పోటీ నెలకొంది. అయితే పోలింగ్ సమయం దగ్గర పడుతున్న వేళ.. నల్గొండ ,ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ స్థానంలో  బోగస్ ఓట్ల కలకలం రేగింది.  టిఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి, అనురాగ్ యూనివర్సిటీ కేంద్రంగా బోగస్ ఓట్లు నమోదు చేయించారని‌ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ కి  స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఫిర్యాదు చేశారు. బోగస్ ఓట్లకు సంబంధించిన సాక్షాధారాలను కూడా రిటర్నింగ్ అధికారికి సమర్పించారు తీన్మార్ మల్లన్న.  బోగస్ ఓట్లు చేర్పించిన టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు తీన్మార్ మల్లన్న. అనురాగ్ యూనివర్సిటీ గుర్తింపు రద్దు చేయాలని కోరారు.  పల్లా రాజేశ్వర్ రెడ్డి కి ఎమ్మెల్సీ బి ఫామ్ ఇచ్చిన టిఆర్ఎస్ పార్టీ గుర్తింపు కూడా రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం, సుప్రీం కోర్టు కు ఫిర్యాదు చేస్తానని తెలిపారు తీన్మార్ మల్లన్న. ఓడిపోతామనే భయంతోనే అధికార పార్టీ అక్రమాలకు పాల్పడిందని, వేలాదిగా బోగస్ ఓట్లను ఎన్ రోల్ చేయించిందని మల్లన్న ఆరోపించారు. 

6 రోజులు బ్యాంకులు బంద్.. కస్టమర్లు బీ అలర్ట్..

శివరాత్రి సెలవుతో పాటు బ్యాంకు ఉద్యోగుల సమ్మె. ఉద్యోగుల సమ్మెతో వరుసగా నాలుగు రోజులు బ్యాంకులు తెరుచుకోవు. శివరాత్రి సెలవు కూడా కలిపితే ఐదు రోజులు బ్యాంకులు బంద్. ఉద్యోగులు శుక్రవారం కూడా సెలవు పెడితే.. ఏకంగా 6 రోజులు ఇబ్బందులు తప్పవు. అంటే, గురువారం నుంచి మంగళవారం వరకూ బ్యాంకులు మూతే. అందుకే, బ్యాంకుకు వెళ్లే పని ఉండే కస్టమర్లంతా బీ అలర్ట్.  బ్యాంకుల ప్రైవేటీకరణకు నిరసనగా మార్చి 15వ తేదీ నుంచి రెండు రోజుల పాటు సమ్మెకు బ్యాంకు ఉద్యోగ సంఘాలు పిలుపు ఇచ్చాయి. బ్యాంకు ఉద్యోగుల సమ్మె సందర్భంగా మార్చి 13 నుంచి వరుసగా 4 రోజుల పాటు బ్యాంకులు మూసివేయనున్నారు. మార్చి 13న రెండవ శనివారం సెలవు, మార్చి 14న సండే హాలిడే. మార్చి 15, 16 తేదీల్లో ఉద్యోగుల సమ్మెతో బ్యాంకులు బంద్. ఇలా వరుసగా నాలుగు రోజులు బ్యాంకులు పని చేయవు. ఆన్ లైన్ బ్యాంకింగ్ సేవలు మాత్రం ఎప్పటిలానే యధావిధిగా కొనసాగుతాయి. కేవలం బ్యాంకు బ్రాంచీలు మాత్రమే పని చేయవు.  మార్చి 11న మహాశివరాత్రి నాడు బ్యాంకులకు సెలవు. మార్చి 22న బీహార్ దివస్, మార్చి 30న హోలి పండుగ హాలిడే ఉంది. ఇలా, పండుగ సెలవులు, బ్యాంకుల ఖాతాల ముగింపు, రెండవ శనివారాలు, 4 ఆదివారాలతో కలిసి మార్చి నెలలో మొత్తం 11 రోజుల పాటు బ్యాంకులు క్లోజ్. స్థానిక సెలవులతో కలిసి 11 రోజులు బ్యాంకు పనిచేయనందున ఖాతాదారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని బ్యాంకులు సూచించాయి.

ఓడిపోతే ఎవరి ఖాతాలో.. మళ్లీ ఆయనే టార్గెట్? 

ఇంకా పోలింగ్ జరగలేదు. ప్రచారమే సాగుతోంది, కానీ అప్పుడే, కొందరి ఆలోచనలు ఓటమికి ఎవరు బాధ్యత వహిస్తారు అనే వరకు వెళ్ళాయి. దుబ్బాక ఉపఎన్నికల్లో ప్రచార బాధ్యతను బుజానికి ఎత్తుకున్న మంత్రి హరీష్ రావు పార్టీ ఓటమికి తనదే బాధ్యతని ప్రకటించారు. ఎన్నికల ప్రచారం మొత్తాన్ని తన బుజాలపైకి ఎత్తుకుని, పార్టీ అభ్యర్ధి సుజాతను గెలిపిస్తే ప్రజలకు ఏ సమస్య వచ్చినా, తానే స్వయంగా పూనుకుని పరిష్కరిస్తానని హామీ ఇవ్వడమే కాకుండా, ప్రజలు తననే అభ్యర్ధిగా బావించి, ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. హరీష్ ఎక్కడికేకెళితే అక్కడ గెలుపు ఖాయమన్న ధీమానూ వ్యక్త పరిచారు. సో ... సహజంగానే దుబ్బాక  ఓటమిహరీష్ ఖాతాలో చేరింది.  జీహెచ్ఎంసీ ఎన్నికలలో పార్టీ ఎన్నికల ప్రచార బాధ్యతలను బుజానికి ఎత్తుకున్న పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఅర్,కూడా ఆశించిన ఫలితాలు రానందుకు, కొంచెం అటూ ఇటుగా ఓటమి బాధ్యతను తీసుకున్నారు.ఫలితాలు వెలువడిన వెంటనే ఆయన మీడియా ముందుకు వచ్చారు. ఆశించిన విధంగా ఫలితాలు రాలేదని అంగీకరించారు. అయినా సింగల్ లార్జెస్ట్ పార్టీగా ఎన్నుకున్న ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు. పది పన్నెండు నియోజక వర్గాల్లో స్వల్ప తేడాతో ఓడిపోయామని,అయినా పార్టీలో చర్చించి లోపాలను దిద్దుకుంటామని చెప్పుకొచ్చారు. హరీష్ అంత హుందాగా కేటీఆర్ ఓటమి బాధ్యతను ఓన్ చేసుకోక పోయినా.. జీహెచ్ఎంసీ ఓటమి ఆయన ఖతాలోకే  చేరింది. ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ నియోజక వర్గంలో, కేటీఅర్, హరీష్ ఇద్దరూ జోరుగా ప్రచారం చేస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఇద్దరికీ స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. ఈ నేపధ్యంలో దురదృష్టవశాత్తు పార్టీ అభ్యర్ధి, వాణీదేవి ఓడిపోతే అందుకు, ఎవరు బాధ్యత వహిస్తారు,ఆ ఓటమి ఎవరి ఖాతాలో చేరుతుంది.. అనే విషయంలో రాజకీయ,జర్నలిస్ట్ సర్కిల్స్’లో సరదా చర్చ జరుగుతోంది. ఈ ఎన్నికలలో ఫలితాలను అటో ఇటో తేల్చేది అత్యధికంగా, 2.6 లక్షల ఓటర్లున్న రంగా రెడ్డి జిల్లానే.  తెరాస అసలు పెట్టుకున్నది కూడా ఈ జిల్లాపైనే. అందుకే  జిల్లా బాధ్యతలను కేసీఆర్ హరీష్ రావుకు అప్పగించారు.  కాబట్టి, గెలుపు అయినా, ఓటమి అయినా హరీషే బాధ్యత వహించవలసి ఉంటుందని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. రంగారెడ్డి బాధ్యతలను హరీష్ రావుకు అప్పగించే  సమయంలోనే, ముఖ్యమంత్రి, కేసీఆర్,దుబ్బాక ఫలితం పునరావృతం కారాదన్న హెచ్చరికను కూడా చేశారని పార్టీ వర్గాల సమాచారం. అందుకs , కావచ్చు హరీష్ రావు, ఇటు బడ్జెట్ చర్చల్లో బిజీగా ఉండి కూడా,ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం, వ్యూహ రచన పై ప్రత్యేక దృష్టి పెట్టారు. జిల్లా మంత్రి  సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు ఇతర నాయకులతో కలిసి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. మరో వంక  జిల్లాలో బీజేపీ అనుసరిస్తున్న పన్నా ప్రముఖ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రతి 50 మంది ఓటర్లకు ఒక పన్నా ప్రముఖ్’ను ఏర్పాటు చేసి, వారి ద్వారా ఎన్నికల ప్రచారాన్ని హరీష్ మానిటర్ చేస్తున్నారు. అయినప్పటికీ, జరగకూడనిది జరిగితే,ముఖ్యమంత్రి వ్యూహాత్మకంగా ఎంపిక చేసిన పీవీ కుమార్తె, వాణీదేవి ఓడిపోతే, అందరికంటే ఎక్కువ బదనాం అయ్యేది హరీష్ రావే కావచ్చును. ఆయన మెడ మీది కత్తి మరింత  దగరవుతుంది ఆయన గ్రాఫ్ ఇంకా పడిపోతుందని పార్టీ వర్గాలు సైతం భావిస్తున్నాయి. 

సోనూసూద్‌ పేరుతో ఛీటింగ్.. ఆన్‌లైన్‌లో పైసా వసూల్..

కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. ప్రముఖుల పేర్లు వాడుకొని విచ్చలవిడిగా మోసాలకు దిగుతున్నారు. లాక్ డౌన్ టైమ్ లో అవసరంలో ఉన్న వారికి సాయపడుతూ వార్తల్లో నిలిచారు హీరో సోనూసూద్. ఆ తర్వాతా సహాయక కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా.. తోచిన మేర సాయం చేస్తున్నారు. దేశంలో ఇప్పుడు సోనూసూద్ ఫుల్ పాపులర్ పర్సన్. అందుకే, జనాలు ఈజీగా బుట్టలో పడతారని సోనూసూద్ పేరుతో మోసాలకు తెగబడుతున్నారు కంత్రీగాళ్లు.  పక్కా ప్లాన్డ్ గా ట్రాప్ చేస్తున్నారు మోసగాళ్లు. గూగుల్ లో సోనూసూద్ హెల్పింగ్ ఫౌండేషన్ పేరుతో లింక్ క్రియేట్ చేస్తున్నారు. ఫేక్ నెంబర్లతో ఛీటింగ్ కు పాల్పడుతున్నారు. తాజాగా.. హైదరాబాద్ కు చెందిన ఒకరి నుంచి 60 వేలు కాజేశారు. సైబరాబాద్‌ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి సోనూసూద్‌ హెల్పింగ్‌ ఫౌండేషన్‌ కాంటాక్ట్‌ నంబర్‌ కోసం గూగుల్‌లో వెతికితే బలరామ్‌ పేరుతో ఓ నంబర్‌ కనిపించింది. ఫోన్‌ చేయగా, అవతలి వ్యక్తి సోనూసూద్‌ ఫౌండేషన్‌ అడ్వైజర్‌గా పరిచయం చేసుకున్నాడు. బాధితుడు తనకు సోనూసూద్ నుంచి 10వేలు సాయం కావాలని అడిగాడు. బలరామ్ పేరుతో కాంటాక్ట్ లోకి వచ్చిన మోసగాడు.. బాధితుడి వివరాలు సేకరించాడు. ఆ తర్వాత బలరామ్‌ మరోసారి ఫోన్‌ చేసి ‘సోనూసూద్‌ మీకు 50 వేలు ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించారు. రిజిస్ట్రేషన్‌ ఫీజు, జీఎస్టీ కింద 8,300 కట్టాలని చెప్పాడు. నిజమేనని అనుకున్న బాధితుడు అతను చెప్పిన అకౌంట్లో డబ్బులు డిపాజిట్‌ చేశారు. మోసగాడు మరోసారి ఫోన్‌ చేసి ‘నేను చెప్పినట్లు డబ్బులు ఇస్తే, సోనూసూద్‌ నుంచి మూడున్నర లక్షలు ఇప్పిస్తానంటూ బేరం పెట్టాడు. సరేనని.. విడతలవారీగా 60 వేలు అతని ఖాతాలో జమ చేశాడు. ఇంకా డబ్బులు కావాలని అడగటంతో తాను మోసపోయానని గుర్తించిన బాధితుడు సైబరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు చేయగా.. కేటుగాళ్లు గూగుల్‌లో నకిలీ నంబర్లు అప్‌లోడ్‌ చేసి సోనూసూద్ పేరుతో సైబర్‌ నేరానికి పాల్పడుతున్నట్టు గుర్తించారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.

బెంగాల్ లో బీజేపీదే అధికారం! తేల్చేసిన పీపుల్స్ పల్స్ సర్వే 

దేశ వ్యాప్తంగా పొలిటికల్ హీట్ పెంచుతున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సారి సంచలనం జరగబోతుందా?  హ్యాట్రిక్ కోసం పోరాడుతున్న మమతా బెనర్జీకి షాక్ తగలనుందా? బెంగాల్ కోటలో కమలం వికసించబోతుందా? అంటే అవుననే చెబుతోంది ‘పీపుల్స్ పల్స్’ మూడ్ సర్వే నివేదిక. బెంగాల్ ఎన్నికలపై ఆ సంస్థ నిర్వహించిన ప్రీ పోల్ సర్వేలో సంచలన విషయాలు బయటికి వచ్చాయి. ఇప్పటివరకు చేసిన సర్వేల్లో టీఎంసీకి లీడ్ కనిపించగా.. పీపుల్స్ పల్స్ సర్వేలో మాత్రం బీజేపీ స్పష్టమైన మెజార్టీ వస్తోంది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలుండగా.. 160 స్థానాల్లో బీజేపీకి అనుకూలత కన్పిస్తోంది. 70 స్థానాల్లో మాత్రమే తృణమూల్‌ కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందని స్పష్టమైంది. 12 స్థానాల్లో లెఫ్ట్-కాంగ్రెస్ కూటమికి విజయావకాశాలు కన్పిస్తున్నాయి.   39 అసెంబ్లీ నియోజకవర్గాల్లో  బీజేపీ-టీఎంసీ మధ్య హోరాహోరీ  పోటీ నెలకొంది.  5 స్థానాల్లో టీఎంసీ-లెఫ్ట్ కూటమి మధ్య  గట్టి పోటీ ఉండగా.. మరో 7 సీట్లలో  టీఎంసీ-బీజేపీ-లెఫ్ట్ కూటమి మధ్య త్రిముఖ పోటీ నెలకొందని పీపుల్స్ పల్స్ సర్వేలో తేలింది.  పశ్చిమ బెంగాల్ లో  ‘పీపుల్స్ పల్స్’ ప్రతినిధులు పర్యటించి రాష్టంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై ఓటర్ల మనోభావాలెలా ఉన్నాయనే అంశంపై అధ్యయనం చేశారు. ఎస్సీ, ఎస్టీ ఓటర్లతోపాటు వివిధ సామాజికవర్గాల, మతాల వారీగా అభిప్రాయాలను సేకరించి నివేదిక రూపొందించారు. రీజియన్లు, మతాలు, కులాలు, వివిధ వర్గాల వారీగా సమగ్రంగా పీపుల్స్ పల్స్ సర్వే చేసింది. ‘పీపుల్స్ పల్స్’ సంస్థ డైరెక్టర్, రీసెర్చర్ డాక్టర్ సజ్జన్ కుమార్ ఈ నివేదికలోని ముఖ్యాంశాలను వెల్లడించారు.  మెజారిటీ ఓటర్లలో మమతా బెనర్జీ ప్రభుత్వంపట్ల నెలకొన్న వ్యతిరేకతే ఇందుకు కారణమని చెప్పారు. దీదీ  ప్రభుత్వం పట్ల ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత ఈసారి బీజేపీకి లబ్ది చేకూరే అవకాశముందన్నారు. బెంగాల్ లోని మెజారిటీ హిందూ ఓటర్లు బీజేపీవైపు పోలరైజ్ అవుతున్నట్లు సర్వేలో వెల్లడైంది. అబ్బాస్ సిద్దిఖీ కారణంగా ముస్లిం ఓటు బ్యాంకు చీలే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ సర్వేలో తేలింది.  రాష్ట్రంలోని ప్రాంతాల వారీగా పరిశీలిస్తే నార్త్ బెంగాల్ లో బీజేపీ హవా  కనిపిస్తోంది. నార్త్ బెంగాల్ లోని డార్జిలింగ్, కాళింపోంగ్, జల్పాయిగురి, అలిపుర్దౌర్, కూచ్ బిహార్ జిల్లాల్లోని 28 అసెంబ్లీ స్థానాలుండగా..  వీటిలో ఏకంగా 22 స్థానాల్లో బీజేపీ జోరు కన్పిస్తోంది. మరో 5 స్థానాల్లో టీఎంసీ-బీజేపీ మధ్య, 1 స్థానంలో టీఎంసీ-లెఫ్ట్-బీజేపీ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. నార్త్ బెంగాల్ లో 75 శాతానికిపైగా హిందువులుండగా, 14 శాతం ముస్లింలు, 4 శాతం క్రిస్టియన్లు, బౌద్ద ఓటర్లున్నారు. సామాజికవర్గాల వారీగా పరిశీలిస్తే దాదాపు 35 శాతం మంది ఎస్సీ ఓటర్లున్నారు. వీరిలో అత్యధిక ఓటర్లు తృణమూల్‌ కాంగ్రెస్ పాలనపట్ల వ్యతిరేకతతో ఉన్నారు. నార్త్ బెంగాల్ లో  10 శాతానికిపైగా ఎస్టీ ఓటర్లుండగా.. వీరు కూడా అధికార పార్టీ నేతల పనితీరు, అవినీతిపట్ల వ్యతిరేకతతో ఉన్నారు. ఈ ప్రాంతంలోని ఎస్సీ, ఎస్టీ ఓటర్లు ఈసారి బీజేపీకి అనుకూలంగా ఉండబోతున్నారని పీపుల్స్ పల్స్ సర్వే అంచనా వేసింది.  మైనారిటీ ఓటర్ల ఆధికంగా ఉన్న నార్త్ దినాజ్ పూర్, సౌత్ దినాజ్ పూర్, మాల్దా, ముర్షిదాబాద్ జిల్లాల్లో టీఎంసీకి అనుకూలత కన్పిస్తోంది. ఈ నాలుగు జిల్లాల్లోని మొత్తం ఓటర్లలో దాదాపు 50 శాతం మంది ముస్లిం సామాజికవర్గం వారే. ఇక్కడ మొత్తం  49 అసెంబ్లీ స్థానాలుండగా.. వీటిలో 17 స్థానాల్లో టీఎంసీ, 10 స్థానాల్లో బీజేపీ, 11 స్థానాల్లో లెఫ్ట్ కూటమికి అనుకూలత లభిస్తోంది. 4 సీట్లలో టీఎంసీ-బీజేపీ, మరో 4 సీట్లలో బీజేపీ-లెఫ్ట్ కూటమి మధ్య నువ్వా-నేనా అన్నట్లుగా తీవ్రమైన పోటీ నెలకొంది. 2 స్థానాల్లో టీఎంసీ-లెఫ్ట్-బీజేపీ, మరో స్థానంలో బీజేపీ-లెఫ్ట్ కూటమి మధ్య టఫ్ ఫైట్ నెలకొంది. సెంట్రల్ బెంగాల్ ప్రాంతంలోని బిర్భుం, పశ్చిమ వర్దమాన్+పూర్వవర్ధమాన్, నాదియా జిల్లాల్లో 49 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఈ రీజియన్ పరిధిలో 29 శాతం మంది ఎస్సీలు, 5 శాతానికిపైగా ఎస్టీలు ఉన్నారు. మతాల వారీగా విశ్లేషిస్తే 71 శాతానికైగా హిందువులు, 28 శాతానికిపైగా ముస్లింలు, 1 శాతానికిపైగా బౌద్దులున్నారు.సెంట్రల్ బెంగాల్ పరిధిలోని 49 సీట్లకుగాను 30 స్థానాల్లో బీజేపీకి అనుకూలత కన్పిస్తోంది. టీఎంసీకి 11 స్థానాల్లో, లెఫ్ట్ కూటమికి 1 స్థానంలో అనుకూలత కన్పిస్తోంది.  7 స్థానాల్లో టీఎంసీ-బీజేపీ కూటమి మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. జంగల్-మహల్ ప్రాంతంలోని పురూలియా, బంకురా, ఝారాగ్రాం, పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాల్లోని 42 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఈ ప్రాంతంలో 83 శాతానికిపైగా హిందువులు, 8 శాతానికిపైగా ముస్లింలు, 1 శాతంలోపు బౌద్దులు ఉన్నారు.జంగల్-మహల్ ప్రాంతంలోని 42 అసెంబ్లీ స్థానాలకుగాను 33 సీట్లలో బీజేపీ గెలిచే అవకాశం కన్పిస్తోంది. టీఎంసీకి 5 స్థానాల్లో మాత్రమే అనుకూలత ఉండగా.. మిగిలిన 4 సీట్లలో టీఎంసీ-బీజేపీ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. సౌత్ బెంగాల్ పరిధిలో 126 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఈ ప్రాంతంలోని హుగ్లి, హౌరా, ఉత్తర 24 పరగణాలు, కోల్ కతా,  దక్షిణ 24 పరగణాలు, తూర్పు మిడ్నాపూర్ జిల్లాలున్నాయి. ఈ ప్రాంతంలో దాదాపు 16 శాతం మంది ఎస్సీలు, 1.5 శాతం మంది ఎస్టీలున్నారు. ఈ ప్రాంతంలోని 126 అసెంబ్లీ స్థానాలకుగాను 65 స్థానాల్లో బీజేపీకి అనుకూల గాలి వీస్తోంది. 37 స్థానాల్లో టీఎంసీకి సానుకూలత ఉంది. మరో 19 స్థానాల్లో టీఎంసీ-బీజేపీ, 1 స్థానంలో టీఎంసీ-లెఫ్ట్ కూటమి, 4 స్థానాల్లో టీఎంసీ-బీజేపీ-లెఫ్ట్ కూటమి మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది.సౌత్ బెంగాల్ ఇప్పటివరకు టీఎంసీకి గట్టి పట్టు ఉండగా.. ఈసారి మాత్రం కమలం ప్రభావం కనిపిస్తోంది.