ఎన్నికల్లో అధికారపార్టీ దౌర్జన్యాలు.. వైసీపీ నేత సంచలన వ్యాఖ్యలు

స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ ఆగడాలు. అంతకుమించి అరాచకాలు. ఏకగ్రీవాల కోసం వైసీపీ చేయని దౌర్జన్యాలు లేవు. ప్రతిపక్షాలపై దాడులు, బెదిరింపులు, కేసులతో భయోత్పాతం. ఈ మాట అన్నది ఏ విపక్ష నేతో కాదు. స్వయానా అధికార వైసీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు.  ప్రతిపక్షంలో ఉన్నవారు విమర్శలు చేయడం కామన్. కానీ, అధికార పార్టీ నేతే.. తమ సొంత పార్టీపైనే ఆరోపణలు చేయడం సంచలనమే. పంచాయతీ ఎన్నికలలో వైసీపీ దౌర్జన్యాలకు పాల్పడిందని, ప్రత్యర్థులను బెదిరించి ఏకగ్రీవాలకు చేసుకుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే డేవిడ్ రాజు. జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు మరింత పెరిగాయని కూడా అన్నారు. పనిలో పనిగా, మంత్రి బాలినేని శ్రీనవాసరెడ్డిపై కూడా తీవ్ర విమర్శలు చేశారు. ఒంగోలులో సమస్యల పరిష్కారానికి బాలినేని కృషి చేయలేదని, ఏ ముఖం పెట్టుకొని ఒంగోలు ప్రజలను బాలినేని ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. అధికారంలోకి రాకముందు ఒకలా.. అధికారంలోకి వచ్చాక మరోలా వైసీపీ నేతలు ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. దళితులకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని ఓవైపు చెబుతూనే.. మరోవైపు ఆ సామాజికవర్గాలపై దాడులు జరుగుతున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు వైసీపీ నేతలు దళితులపై అమానవీయంగా ప్రవర్తించడంపై ఇటీవల నిరసనలు వెల్లువెత్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై దాడులు మిన్నంటాయని ఆందోళలకు కూడా దిగాయి కొన్ని దళిత సంఘాలు. అయితే జగన్‌ పార్టీలో పదవులు ఇవ్వకపోగా చిన్నచూపు చూస్తున్నారన్న ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే డేవిడ్ రాజు. 

కంటే కూతుర్నే కనాలి అనిపించే పథకం 

ఆడపిల్లల పట్ల అనాదిగా వస్తున్నవివక్ష కారణంగా కావచ్చు, కాదంటే, ఇతరత్రా కారణాలే కారణం కావచ్చును.. దేశంలో అమ్మాయిల  జనాభా తగ్గిపోతోంది. బాల బాలికల నిష్పత్తిలో అసమతుల్యత పెరిగి.. పెళ్ళికాని ప్రసాదుల సంఖ్య పెరిగిపోతోంది.  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆడపిల్లలను ఆదుకుని, విద్యావంతులుగా చేసేందుకు, బేటీ బచావో - బేటీ పడావో’ పేరిట ఒక పథకాన్ని ఐదారేళ్ళ క్రితం ప్రవేశ పెట్టారు. ఆ పథకం ఎంత ‘చక్క’ గా పనిచేస్తోందో ఏమో కానీ, ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం, సివాయి గూడెం గ్రామా సర్పంచ్, చెరుకూరి ప్రదీప్ కుమార్, మహిళా దినోత్సవం రోజున, ‘కంటే కూతుర్నే కనాలి’ అనిపించేలా, ‘ఆడపిల్లను కనండి ... ఐదు వేల రూపాయలు పొందండి’ అంటూ ఓ మంచి పథకాని ప్రకటించారు.  ఈ పథకం వినడానికి కొంచెం విడ్డూరంగా అనిపించినా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న  చాలా పథకాల కంటే..ఇది నిజంగా దేశంలో మరెక్కడాలేని పథకం. సంక్షేమానికి మా ముఖ్యమంత్రి చాలా పెద్ద పీట వేశారు ... ఇన్ని వేల కోట్లు, లక్షల కోట్లు ఖర్చు చేశారు, అని గొప్పలు చెప్పుకునే ఏ ముఖ్యమంత్రి, మంత్రి తమ జేబులోంచి, ఒక్క రూపాయి ఇవ్వరు. ఇంకా ఛాన్స్ చిక్కితే, ఆ వేల లక్షల కోట్ల నుంచి  కొన్ని కోట్లు సొంత జేబులో వేసుకుంటారు. ఇక కింది స్థాయిలో ఎన్నెన్ని నొక్కుళ్ళు ఉంటాయో, ఎంతెంత మనోళ్ళ జేబుల్లోకి పోతుందో ఏమో.. కానీ ప్రదీప్ కుమార్ తాను పదివిలో ఉన్నత వరకు, గ్రామంలో పుట్టిన  ప్రతి ఆడపిల్ల పేరున రూ.5000 వంతున సొంత సొమ్ము పోస్టాఫీసులో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తానని ప్రకటించారు.   మాములుగా రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు నగదు రూపంలో సొమ్ములు పంచి సంక్షేమం పేరిట ప్రజాధనం దుర్వ్యయాన్ని ప్రోత్సహిస్తున్నాయి. ప్రభుత్వాలు పంచుతున్న సంక్షేమ సొమ్ములు చాలా వరకు ‘మద్యం’ మార్గంలో కొట్టుకు పోతున్నాయి. అందుకే సంక్షేమ పథకాల వలన ఆశించిన ఫలితాలు రావడం లేదని ఆర్థిక వేత్తలు చెపుతుంటారు. అదెలా ఉన్న మన సివాయిగూడెం సర్పంచ్ చెరుకూరి ప్రదీప్ కుమార్, పోస్టాఫీసులో  ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం వలన పుట్టిన బిడ్డ ఉన్నత చదవులకు ఆ సొమ్ము ఉపయోగానికి వస్తుంది.అందుకే చెరుకూరి పథకం ‘బేటీ బచావో ... బేటీ పడావో’ కు ఏమాత్రం తీసుపోని మంచి పథకం అని గ్రామ పెద్దలు చెరుకూరిని అభిందిస్తున్నారు.

విశాఖ ఓటర్లు ఎటువైపు? కలవరమాయె వైసీపీ మదిలో..

మరికొద్ది గంటల్లో విశాఖ కార్పొరేషన్ ఎన్నికలు. అధికార, ప్రతిపక్షాలకు అత్యంత ప్రతిష్టాత్మకం. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణతో వైజాగ్ ఓటర్లు కాక మీదున్నారు. ఇంతటి కీలక సమయంలో అధికార పార్టీకి మరో పిడుగు పాటు. స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ తథ్యం అంటూ కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంట్ లో ప్రకటించడంతో పరిణామాలు అమాంతం మారిపోతున్నాయి. అవసరమైనప్పుడల్లా రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నామంటూ మంత్రి చెప్పడంతో అధికార పార్టీ అడ్డంగా బుక్కైంది. ఇన్నాళ్లూ విశాఖ ఉక్కు కోసం ఏదో ప్రయత్నం చేస్తున్నట్టు జగన్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతున్నట్టు తేలిపోయింది. తమకేమీ తెలీదంటూ సర్కారు తప్పించుకోవడం ఇకపై కుదరదు. రాష్ట్రంతో ఎప్పటికప్పుడు సందప్రదిస్తున్నామంటూ స్వయంగా కేంద్రమంత్రి పార్లమెంట్ లో స్టేట్ మెంట్ ఇవ్వడంతో వైసీపీ పరిస్థితి అడకత్తరలో పోకవక్కలా మారింది. విశాఖ కార్పొరేషన్ ఎలక్షన్ కు ఒక రోజు ముందు వచ్చిన ఈ ప్రకటన వైసీపీని పీకల్లోతు ఊబిలోకి దింపేసింది.  నెల రోజులుగా విశాఖ ఉక్కు కోసం కార్మికులు, ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు. నిరవధిక నిరాహార దీక్షలు, ధర్నాలు, రాష్ట్ర బంద్ తో హోరెత్తిస్తున్నారు. ప్రజల నుంచి ఇంత వ్యతిరేకత వస్తున్నా.. కేంద్రం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. వంద శాతం ప్రైవేటీకరణ తప్పదంటూ తేల్చి చెప్పేసింది. కేంద్రాన్ని ఒప్పించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రజలను మభ్య పెట్టేందుకే సీఎం జగన్ కేంద్రానికి లేఖ రాశారని అంటున్నారు. విశాఖ ఉక్కును అడ్డంగా అమ్మేసుకోడానికి కేంద్రానికి జగన్ ప్రభుత్వం సహకరిస్తోందని మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటనతో తేలిపోయింది.  కేంద్రం ప్రకటనతో విశాఖ మరోసారి భగ్గుమంది. ఆందోళనలు ఉవ్వెత్తున ఎగిసాయి. అర్థరాత్రి జాతీయ రహదారిని జామ్ చేశారు కార్మికులు. మానవహారంగా ఏర్పడి రహదారిని దిగ్బంధించారు. విశాఖ ఉక్కు కోసం ఉద్యమ కార్యచరణ సైతం సిద్ధం చేశారు. ప్రజలంతా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై కసితో రగిలిపోతున్నారు. ఆ ఆగ్రహం బుధవారం జరిగే విశాఖ కార్పొరేషన్ ఎన్నికలపై సుస్పష్టంగా కనిపించబోతోంది. ఆంధ్రుల హక్కును కాలరాస్తూ.. అడ్డగోలుగా అమ్ముకుంటూ.. ఏపీకి తీరని అన్యాయం చేస్తున్న కేంద్రం తీరును నిరసిస్తున్నారు. ఆ కేంద్రానికి ఇతోధికంగా సహకరిస్తూ.. ప్రైవేటీకరణకు పరోక్షంగా పావులు కదుపుతూ.. ప్రజలను మోసం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు విశాఖ ప్రజలు.  ప్రజాగ్రహం కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటు రూపంలో వెల్లడికానుందని తెలుస్తోంది. జీవీఎమ్సీలో అధికార పార్టీకి గట్టి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారని చెబుతున్నారు. ఆంధ్రుల హక్కు కోసం పిడికిలి బిగించి పోరాడుతున్న టీడీపీకి మద్దతుగా విశాఖ ఓటర్లు నిలిచే అవకాశం ఉందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో విశాఖ కార్పొరేషన్ ఎన్నికలు అత్యంత కీలకం. ప్రజానాడి ఎలా ఉందో.. ఎవరికి అనుకూలంగా ఉందో.. ఈ ఎలక్షన్ తో తేలిపోనుంది. జీవీఎమ్సీ ఎలక్షన్లు.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు రెఫరెండంగా భావిస్తున్నారు ఓటర్లు. ఓటుతో తమ తీర్పు చెప్పేందుకు సై అంటున్నారు. అందుకే.. కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటన తర్వాత వైసీపీలో చెప్పలేనంత కంగారు, కలవరం...

స్టీల్ ప్లాంట్ పై జగన్ సర్కార్ మోసం! పవన్ పోరాడాలన్న గంటా 

విశాఖ స్టీల్ ప్లాంట్ పై రాష్ట్ర ప్రభుత్వం, కొంత మంది బిజేపి నేతలు ప్రజలను తప్పుతోవ పట్టించారని విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు అన్నారు. స్టీల్ ఫ్లాంట్ ప్రైవేటీకరణ పై ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నామని నిర్మలా సీతారామన్ స్పష్టం చేయడంతో.. జగన్ సర్కార్ బండారం బయటపడిందన్నారు. స్టీల్ ఫ్లాంట్ ఇప్పుడు కాపాడుకోలేకపోతే చరిత్ర హీనులుగా మిగిలిపోతామన్నారు గంటా. స్టీల్ ఫ్లాంట్ ప్రైవేటీకరణ పై చంద్రబాబు కూడా ప్రధానికి లేఖ రాశారని చెప్పారు.  స్టీల్ ఫ్లాంట్ ప్రైవేటీకరణ వంద శాతం అయిపోయిందని.. అది ముగిసిన అధ్యాయం అన్నారు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. అధికారంలో ఉన్నవారికి ఎక్కువ బాధ్యత ఉంటుంది కాబట్టి.. ఇప్పుటికైనా ముఖ్యమంత్రి ప్రధాన పాత్ర తీసుకోవాలన్నారు. స్టీల్ ఫ్లాంట్ కాపాడుకోవడం కోసం రాజకీయాలు,పార్టీలు పక్కన పెడదామన్నారు గంటా శ్రీనివాస రావు. పవన్ కళ్యాణ్ కూడా స్టీల్ ఫ్లాంట్ ప్రైవేటికరణ పై స్పందించాలన్నారు. ఫ్లాంట్ పరిరక్షణ కోసం పవన్ కళ్యాణ్ ముందుకు రావాలని సూచించారు.     బడ్జెట్ సమావేశాల్లో ఖచ్చితంగా  తన రాజీనామాను అమోదింపచేసుకుంటానని చెప్పారు గంటా శ్రీనివాసరావు. వైసిపీ నేతలు రాజీనామాలు చివరి అస్త్రం అన్నారని... ఇప్పుడైనా చివరి అస్త్రం వాడాలన్నారు. అధికార పార్టీ ఒక ప్రణాళిక రూపొందించి ముందుకు వెళ్ళాలని.. వారితో  తోడుగా పోరాటం చేయడానికి  తాము  సిద్ధంగా ఉన్నామన్నారు. ఇప్పటి  స్టీల్ ఫ్లాంట్ ఎక్కడికి వెళ్ళదని బిజేపి నేతలు మాయమాటలు చెబుతున్నారన్నారు గంటా. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. మైండ్ గేమ్ ఆడడానికి ఇది సరైన సమయం కాదని స్పష్టం చేశారు గంటా శ్రీనివాస రావు. 

కడప జిల్లాలో వైసీపీ నేతల బరి తెగింపు! 

ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రచార గడువు ముగిసినా.. వైసీపీ నేతలు ప్రచారం చేస్తుండటంపై ఆరోపణలు వస్తున్నాయి. స్థానిక అధికారులు, పోలీసుల మద్దతుతో అధికార పార్టీ నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో వైసీపీ నేతలు బరి తెగిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.  జమ్మలమడుగులో అధికారపార్టీ నేతలు ఎన్నికల నిభందనలు ఉల్లంఘించారు. సోమవారంతో ప్రచార ఘట్టం ముగిసినప్పటికీ.. మంగళవారం ఉదయం స్ధానిక వైసీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తన కార్యకర్తలతో కలసి జమ్మలమడుగు రోడ్లపై తిరుగుతున్నారు. ఓటర్లను కలుస్తూ తమ పార్టీ అభ్యర్థులకు ఓటేయమని కోరుతున్నారు. ఎన్నికల యంత్రాంగం చూసిచూడనట్లు వ్యవహరిస్తోంది. దీంతో ఎమ్మెల్యే తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. కడప జిల్లాలోని ఇతర ప్రాంతాల్లోనూ వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. 

నీటిలో ఐ ఫోన్.. మళ్ళీ బతికింది.. 

అందరికి ఐ ఫోన్ ని ఒకాసారైనా వాడాలని అనుకుంటారు. కొందరు వాళ్ళ స్టేటస్ అందరికి తెలియానాలి ఐ ఫోన్ వాడితే మరి కొందరు ఫీచర్స్ బాగుంటాయని వాడుతారు. ఐ ఫోన్ వాడితే ఆన్లైన్ మోసాలు జరగకుంట సేఫ్టీ ఉంటుందని వాడుతారు. దాదాపు ఐ ఫోన్ గురించి తెలిసిన వాళ్ళు అందుకే వాడుతుంటారు.  అర్ధ సంవత్సరం పాటు నీటిలో పడిన ఐ ఫోన్ ని బయటికి  తీస్తే మళ్ళీ పనిచేసింది. కెనడాలోని చిల్లివాక్ నగరంలో గతేడాది సెప్టెంబర్‌లో ఓ యువతి చేతిలో నుంచి ఐఫోన్ 11 మోడల్ అనుకోకుండా హ్యారిసన్ సరస్సులో పడిపోయింది. చేసేదేం లేక యువతి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఫ్రీడైవర్ జంట ఈ సరస్సు అడుగున ఉన్న చెత్తను క్లీన్ చేస్తుంటారు. ఇటీవల వారు చెత్తను క్లీన్ చేస్తుండగా వారికి రెండు ఫోన్లు దొరికాయి.  రెండు ఫోన్లలో ఒక ఫోన్ స్విచ్‌ఆన్ అవలేదని, యాపిల్ సంస్థకు చెందిన ఐఫోన్ మాత్రం వెంటనే స్విచాన్ అయినట్టు జంట తెలిపింది. ఆ ఫోన్ యజమాని వ్యాంకోవర్‌కు చెందిన యువతి అని తెలుసుకుని ఫోన్‌ను ఆమెకు అప్పగించారు. తన ఫోన్ మళ్లీ తన వద్దకు వస్తుందని అనుకోలేదంటూ యువతి ఆనందం వ్యక్తం చేసింది. కాగా.. ఐఫోన్ 11 మోడల్‌కు ఐపీ 68 (ఇంగ్రెస్ ప్రొటెక్షన్) రేటింగ్ ఉంది. అంటే.. ఈ మోడల్ ఫోన్ నీటిలో(రెండు మీటర్ల లోతు) పడినా అరగంట వరకు ఎటువంటి డ్యామేజ్ కాదు. కానీ తాజాగా దొరికిన ఫోన్ ఆరు నెలలు గడిచినా స్విచాన్ అవడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేసింది.

తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా 

తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. జనవరితో పోలిస్తే ఫిబ్రవరిలో కేసులు రెట్టింపు అయ్యాయి. మార్చిలో ఇంకా పెరుగుతున్నాయి. జనవరిలో కేవలం 4,079 కేసులు నమోదైతే.. ఫిబ్రవరిలో 8,029 వచ్చాయి. కొద్ది రోజులుగా కరోనా పరీక్షల్లో పాజిటివ్‌ల సంఖ్య పెరుగుతోందని క్షేత్రస్థాయిలో టెస్టులు చేస్తున్న ల్యాబ్‌ టెక్నీషియన్లు చెబుతున్నారు. ఫిబ్రవరి చివరి నుంచి క్రమంగా సంఖ్య ఎక్కువగా కనిపిస్తోందని,  పాఠశాలలు, కాలేజీలు తెరవడం , ప్రైవేటు సంస్థల్లో తెలియకుండానే ఒకరి నుంచి మరొకరికి వైరస్‌ విస్తరిస్తుందనే అనుమానాలు వస్తున్నాయి. పొరుగు రాష్ట్రాల్లో కేసులు భారీగా పెరుగుతుండడం రాష్ట్రంలోనూ ప్రభావం చూపుతోంది.కేసులు పెరుగుతున్న విషయాన్ని వైద్య శాఖ కూడా అంగీకరిస్తోంది. విద్యా సంస్థలు తిరిగి ప్రారంభించినప్పటి నుంచి కేసుల సంఖ్య పెరుగుతోందని చెబుతోంది.ప్రైవేటు సంస్థల్లో ఒకరికో ఇద్దరికో వచ్చి, వారి ద్వారా తెలియకుండానే విస్తరిస్తోందని, తద్వారా.. ఎక్కువ మంది కరోనా బారినపడుతున్నారని వివరించాయి. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లోనే కేసులు ఒక్కసారిగా పెరుగుతున్నాయని వైద్య వర్గాలు చెబుతున్నాయి. కరీంనగర్‌లో జిల్లాలో ఇటీవల ఒకరి అంత్యక్రియల్లో పాల్గొన్న 33 మందికి పాజిటివ్‌ వచ్చింది. హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు సంస్థలో పని చేస్తున్న 21 మందికి కరోనా నిర్ధారణ అయింది. ఆదిలాబాద్‌ జిల్లా తలమడుగు మండలంలోని ఓ ప్రభుత్వ వసతి గృహంలో వైద్య పరీక్షలు నిర్వహించగా.. ఐదుగురు 10వ తరగతి విద్యార్థులకు పాజిటివ్‌గా తేలింది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా వసతి గృహంలోని మిగతా విద్యార్థులను అధికారులు ఇళ్లకు పంపించారు. అయితే రాష్ట్రంలో రోజువారీ కేసుల సంఖ్య మాత్రం 200లోపే ఉంటోంది. వైరస్‌ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో దాన్ని బ్రేక్‌ చేయాలంటే కచ్చితంగా పెద్దఎత్తున పరీక్షలు చేయాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆమెకు కరోనా లక్షణాలు కనిపించడంతో సోమవారం ఉదయం పరీక్ష నిర్వహించగా పాజిటివ్‌ అని తేలింది. వెంటనే ఆమె ఐసొలేషన్‌కు వెళ్లారు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని యశోదా ఆస్పత్రిలో చేరారు. తనను కలిసిన వారంతా కొవిడ్‌ టెస్టులు చేయించుకోవాలని మంత్రి ఒక ప్రకటనలో కోరారు. 

గంగూలీ పొలిటికల్ ఎంట్రీ..!

ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహిండెదరు అన్నట్లు. టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తన రాజకీయ ప్రవేశం అనుకోకుండానే జరుగుతుందని తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశాడు. తన జీవితం లో అన్ని అనుకోకుండానే జరిగాయని తన రాజకీయ ప్రవేశం ఎప్పుడు ఎలా జరుగుతుందో తెలిదని, కానీ ఏదైనా అప్పటికప్పుడు జరిగిపోతుందని దాదా చెప్పాడు. తన జీవితంలో అన్నీ అలానే జరిగాయని, తన జీవితంలో రాజకీయాలు ఉంటే అది కూడా అలానే అనుకోకుండానే జరగుతుందని దాదా చెప్పాడు. ‘చూద్దాం ఎక్కడిదాకా వెళ్తుందో. వచ్చే అవకాశాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలి. నా జీవితంలో చాలా విషయాలు హఠాత్తుగా జరిగినవే. సచిన్‌ కెప్టెన్సీ  తీసుకుని ఉంటే నాకు కెప్టెన్సీ వచ్చే అవకాశాలే లేవు. కానీ అతడు రిజైన్ చేశాడు. దాంతో తనకు బాధ్యతలు దక్కాయి. బీసీసీఐ అధ్యక్షుడి పదవి కూడా అలానే వచ్చింది. నిమిషాల ముందు వరకు అధ్యక్షుడిని అవుతానని అనుకోలేదు. అసలు నాకు ఆ విషయమే తెలియదు. నా జీవితం ఎప్పుడూ అలానే ఉంటుంద’ని గంగూలీ చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పటికే తనకు రాజకీయ అవకాశాలు వచ్చాయని, కానీ తానే పక్కన పెడుతూ వస్తున్నానని దాదా తెలిపాడు. కుటుంబం, జీవన శైలి, ఆరోగ్యం, పని వంటి చాలా అంశాలన్నీ రాజకీయాలపై ప్రభావం చూపుతాయని, ప్రజల్లో తనపై ఇంత అభిమానం ఉండటం సంతోషకరమని అందేకే వారిని ఎల్లప్పుడూ కలుస్తూనే ఉంటానని గంగూలీ వివరించాడు.

10 లక్షల కరెన్సీ నోటు! 

10 లక్షల కరెన్సీ నోటు రాబోతోంది... అవును మీరు వింటున్నది నిజమే. మన దేశంలో ప్రస్తుతం 2 వేల కరెన్సీ నోటే అత్యధికం. కాని... ఇప్పుడు 10 లక్షల కరెన్సీ నోటు రాబోతోంది. అయితే ఆ నోటు వచ్చేది మన దేశంలో కాదు.. తీవ్ర దుర్భిక్షంతో కొట్టుమిట్టాడుతున్న దక్షిణ అమెరికాలో  వెనిజులా దేశంలో. ఒకప్పుడు ఆర్థిక సంపన్న దేశంగా ఉంది వెనిజులా. చమురు, బంగారం నిక్షేపాలతో విరాజిల్లింది. కానీ అదంతా 90వ దశకానికి ముందుమాట. హ్యూగో చావెజ్ అధికారం చేపట్టాక తీసుకున్న కొన్ని నిర్ణయాలు వెనిజులాను సంక్షోభంలోకి నెట్టాయి. చమురు నిల్వలు ఉన్నాయన్న ధీమాతో ఎడాపెడా అప్పులు చేసి దుర్భర దారిద్ర్యం కోరల్లో చిక్కుకుంది. దాంతో ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. నష్టనివారణ కోసమంటూ ఇష్టం వచ్చినట్టు కరెన్సీ నోట్లు ముద్రించారు. సమస్య పరిష్కారం కాలేదు సరికదా ద్రవ్యోల్బణం ఆకాశాన్నంటింది. అదే సమయంలో కరెన్సీ విలువ దారుణంగా పడిపోయింది. కూరగాయలు కొనేందుకు కూడా సంచుల కొద్దీ డబ్బు తీసుకెళ్లాల్సి వచ్చేది. ఈ నేపథ్యంలో వెనిజులా సర్కారు ఏకంగా 10 లక్షల బొలివర్ల విలువతో కరెన్సీ నోట్లు ముద్రించాలని నిర్ణయించింది. వెనిజులా కరెన్సీని బొలివర్ అంటారు. చమురు ధరలు ఎక్కువగా ఉన్న సమయంలో ధనిక దేశంగా ఉన్న వెనిజులా ప్రజలకు అన్నీ ఉచితంగా అందించేంది. అందుకోసం విదేశాల నుంచి భారీగా రుణాలు తీసుకుని విచక్షణ లేకుండా ఖర్చు చేసింది. అంతర్జాతీయంగా చమురు ధరలు పడిపోవడంతో వెనిజులాకు కష్టాలు మొదలయ్యాయి. అప్పుల భారం పెరిగిపోయింది. హ్యూగో చావెజ్ అనంతరం వచ్చిన నికొలాస్ మదురో ప్రభుత్వం కూడా చేతులెత్తేసింది. ఇప్పుడు 10 లక్షల విలువైన బొలివర్ నోటు విడుదల చేసినా పరిస్థితి మారుతుందన్న నమ్మకం లేదు.   ఆశ్చర్యం కలిగించే అంశం ఏమిటంటే... వెనిజులా తీసుకువస్తున్న 1 మిలియన్ బొలివర్ నోటు విలువ భారత కరెన్సీలో 39 రూపాయలే.. దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు ఈ చిన్నదేశం ఎంత పెద్ద కష్టంలో పడిందో! ఒకప్పుడు ఆఫ్రికా దేశం జింబాబ్వే కూడా ఇలాంటి పరిస్థితే ఎదుర్కొంది. తర్వాత కాలంలో కాస్త కోలుకున్నట్టు కనిపించినా కరోనా దెబ్బకు మళ్లీ చతికిలపడింది. మరి వెనిజులా ఏంచేస్తుందో చూడాలి..

నిర్మల ప్రకటనపై భగ్గుమన్న విశాఖ

విశాఖ ఉక్కు పరిశ్రమను అమ్మేస్తున్నామని లోక్ సభలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి ప్రకటించడంతో విశాఖ భగ్గుమంటోంది. ప్రైవేటీకరణ ఆగబోదని, నూటికి నూరుపాళ్లు జరిగే తీరుతుందన్న నిర్మల ప్రకటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విశాఖ వాసులు. కేంద్రం ప్రకటనతో కార్మికులు ఉద్యమం ఉధృతం చేశారు.ప్రైవేటీకరణ ఆపేందుకు తక్షణ కార్యాచరణ ప్రకటించారు. రాత్రికి రాత్రే హైవే దిగ్బంధంతో విశాఖ అట్టుడుకుతోంది. కేంద్రం వెనక్కి తగ్గాలని, రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలంటూ విశాఖలో కార్మిక సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటనతో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆగబోదని మరోసారి రుజువైంది. దీంతో విశాఖలోని ఉక్కు కార్మికులు, నిర్వాసితులు ఒక్కసారిగా భగ్గుమన్నారు. సోమవారం రాత్రి  విశాఖలో ఆందోళనలు మిన్నంటాయి. నేషనల్ హైవే కూర్మన్నపాలెం సర్కిల్ దగ్గర ఉన్న ఉక్కు ఫ్యాక్టరీ మెయిన్ గేట్ వద్ద ఉద్యమకారులు ఆందోళన చేపట్టారు. కార్మికులు మానవహారంగా ఏర్పడి రహదారిని దిగ్బంధించారు. రోడ్డుమీద బైఠాయించడంతో సుమారు రెండు గంటలపాటు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.  కూర్మన్నపాలెం సెంటర్ లో ఆందోళనకారులు చేపట్టిన నిరసన కార్యక్రమం అర్థరాత్రి దాటినా కొనసాగుతూనే ఉంది. కేంద్ర ప్రభుత్వ తీరుకి నిరసనగా మంగళవారం విశాఖలోని ఉక్కుపరిపాలనా భవనం ముట్టడించాలని ఉక్కు పోరాట సమితి పిలుపునిచ్చింది. దీంతో విశాఖ మరోసారి రణరంగంగా మారే అవకాశం ఉంది. అనకాపల్లి నుంచి విశాఖ నగరానికి వచ్చే వాహనాలను లంకెలపాలెం వద్ద నుంచి సబ్బవరం మీదుగా నగరం లోకి మళ్లిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ పై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన నేపథ్యంలో ఉక్కు పరిసరాల్లోకి వాహనాలు రాకపోకలు పూర్తిగా నిలిపి వేశారు. దీంతో ట్రాఫిక్ స్తంభించి పోయింది. ప్రయాణీకులు ఆందోళనలకు దిగుతున్నారు.

ఏలూరు కార్పొరేషన్ ఎన్నిక వాయిదా 

ఏలూరు కార్పొరేషన్‌ ఎన్నికలను నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. ఓటర్ల జాబితాలో అవకతవకలపై హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లును విచారించిన న్యాయస్థానం ఏలూరులో ఎన్నికలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఏపీలో 12 మున్సిపల్ కర్పొరేషన్లకు మార్చి 10 ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.  పశ్చిమగోదావరి జిల్లాలో ఏలూరు ముఖ్య పట్టణం.1886లో ఏలూరు మున్సిపాలిటీగా ఏర్పడింది. జనాభ ప్రతాపాధికన 2005లో ఏలూరును మున్సిపల్ కార్పొరేషన్‌గా గుర్తించారు. ఈ ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు పోటీ చేస్తున్నాయి. అయితే ప్రధానంగా వైసీపీ, టీడీపీల మధ్యనే ప్రధాన పోటీ ఉంది. అయితే ఎలూరులో పాగా వేయాలని వైసీపీ ముందు నుంచే పథకాలు రచించింది. అందులోభాగంగా ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని కార్పొరేషన్‌ ఎన్నికలకు ముందుగానే రూ.50 కోట్లతో నగరంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇప్పుడు ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలను హైకోర్టు నిలిపివేయంతో అధికార పార్టీకి మింగుడుపడడం లేదు.  

విజయవాడలో 50 లక్షల నగదు పట్టివేత..

విజయవాడ లో ఓ కార్పొరేటర్‌ అభ్యర్థి బంధువు ఇంట్లో భారీగా నగదు పట్టుబడింది. ఎన్నికల సందర్బంగా అభ్యర్థుల ఇంట్లో  టాస్క్ ఫోర్స్ పక్క సమాచారం రావడంతో అధికారులు ఈ తనికీలు నిర్వహించారు. ఓ ఇంట్లో దాదాపు 50 లక్షలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నగరంలో సెంట్రల్ నియోజకవర్గంలోని న్యూ రాజరాజేశ్వరిపేటలో డబ్బు ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందించారు. అమరావతి నగర్ 3వ లైన్‌లో ఓ ఇంటిపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. మిషన్లు తీసుకెళ్లిన పోలీసులు డబ్బులను లెక్కించారు. సుమారు రూ.50 లక్షలకు పైగానే ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. వైసీపీకి చెందిన కార్పొరేటర్‌ అభ్యర్థి బంధువు ఇంట్లో డబ్బు పట్టుబడింది. డబ్బులు పట్టుబడిన వ్యక్తి వైసీపీ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి బరువుగా పోలీసులు  అనుమానిస్తున్నారు.   

బాలయ్యకు వైసీపీ సెగ.. హిందూపురంలో హైటెన్షన్

బాలకృష్ణ. హిందూపురం ఎమ్మెల్యే. రాష్ట్రమంతా వైసీపీ గాలి వీచినా.. హిందూపురంలో మాత్రం బాలయ్యకు ఎదురు లేకుండా పోయింది. మంచి మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచారు. హిందూపురం గడ్డ.. బాలయ్య అడ్డ. నియోజకవర్గంలో తిరుగులేని నేతగా నిలిచిన బాలయ్యకు తాజాగా వైసీపీ సెగ తగిలింది. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కొన్ని రోజులుగా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు బాలయ్య. మోత్కుపల్లిలో ప్రచారానికి వెళ్లిన ఎమ్మెల్యే బాలకృష్ణను వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. స్థానిక ఎమ్మెల్యేను ప్రచారం చేయనీయకుండా అడ్డుకోవడంతో మోత్కుపల్లిలో ఉద్రిక్తత తలెత్తింది.  జై జగన్ నినాదాలు చేస్తూ బాలకృష్ణను వైసీపీ కార్యకర్తలు అడ్డగించారు. వైసీపీ కార్యకర్తలకు మద్దతుగా ఎమ్మెల్సీ ఇక్బాల్ అహ్మద్ మోత్కుపల్లి రావడంతో హైటెన్షన్ నెలకొంది. వైసీపీ కార్యకర్తలకు పోటీగా, బాలయ్యకు మద్దతుగా తెలుగు తమ్ముళ్లు సైతం భారీగా తరలివచ్చారు. ఇరు వర్గాలు మోహరించడం, పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. వైసీపీ, టీడీపీ కార్యకర్తలను కట్టడి చేయడం పోలీసులకు సవాల్ గా మారింది. 

సీఎం జగన్ ఏపీకి స్పెషల్ స్టేటస్ తెచ్చారంట..

ఏపీలో వేసవి కాలం ఇంకా పూర్తిగా రాకముందే ఏపీలో మున్సిపల్ ఎన్నికల హీట్ పీక్స్ కు చేరింది. అధికార, ప్రతిపక్ష పార్టీల ముఖ్య నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచార చివరి రోజైన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మచిలీపట్నంలో తమ పార్టీ అభ్యర్థుల తరుఫున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అయన సీఎం జగన్ అలాగే వైసిపి మంత్రులైన ముగ్గురు నానీలపై తీవ్రంగా మండి పడ్డారు "తాడేపల్లి కోడికత్తి రెడ్డి, బందరు తాపీకత్తి నాని అధికారంలోకి వచ్చి 21 నెలలు అయ్యిందని... వారు బందరు లో పీకింది ఏంటి?" అని నారా లోకేష్ ప్రశ్నించారు. ఒకాయన కోడికత్తి డ్రామా.ఆడితే.. ఈయన తాపీకత్తి డ్రామా వేసారు తప్ప చేసింది జీరో అని విమర్శించారు. అంతేకాకుండా తాపీక‌త్తి నానీ బందరుని భ్ర‌ష్టు ప‌ట్టించాడని లోకేష్ మండిపడ్డారు. మున్సిపల్ మరియు కార్పోరేషన్ ఎన్నికల ప్రచారానికి చివరోజయిన ఈరోజు (సోమవారం) లోకేష్ బందరులో ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అసలు నాని అంటేనే నాకెంత? నీకెంత? అని ఎద్దేవా చేశారు. సీఎం జగన ఈ రాష్ట్రాన్ని నాశనం చేసే పనిని ముగ్గురు నానీలకు అప్పగించారని... వారిలో ఒకరు బూతుల శాఖ మంత్రి.. గుడివాడ గెడ్డం గ్యాంగ్ నాని , రెండు అబద్దాల శాఖ మంత్రి బందరు నాని, మూడు అనారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అంటూ లోకేష్ సెటైర్లు వేశారు. అంతేకాకుండా "గుడివాడ నాని సన్న బియ్యం సన్నాసి ఐతే బందరు నాని నోరిప్పితే చాలు అబద్దం అనీ ఇక కనీసం సొంత ఊరిలో ప్రజల ప్రాణాలు కాపాడలేని ఏలూరు ఆళ్ల నాని అంటూ ఎద్దేవా చేశారు. బందరు నానికి మాత్రం మాటలు పీక్స్... కానీ మ్యాటర్ మాత్రం వీక్ అని ... నియోజ‌క‌వ‌ర్గంలో పేద‌లు క‌రెంటు బిల్లు ఎక్కువొచ్చింద‌య్యా అని బందరు మంత్రి నానిని అడిగితే క‌ల‌ర్ టీవీ వాడితే క‌రెంటు బిల్లు ఎక్కువొస్తుంద‌ని చెప్పిన మెద‌డు మోకాలులో ఉన్న మంత్రి వుండ‌టం మ‌న ఖ‌ర్మ'' అని మండిపడ్డారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో బందరుని అభివృద్ధి బాట పట్టించేందుకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టగా.. వైసిపి ప్రభుత్వం వాటిని పక్కన పెట్టిందని.. అలాగే మంచి నీటి సమస్యను తీర్చేందుకు గత ప్రభుత్వం ట్యాంకులను నిర్మిస్తే ఇప్పటివరకు వాటిని వాడుకలోకి తీసుకురాక పోవడం ఏంటీ.. నానీ గారూ.. బందరు ప్రజలకు మేం కట్టిన వాటర్ ట్యాంకుల నుంచి మంచి నీళ్లిస్తే మంచి నీళ్లే ఇచ్చారంటారు తప్ప.. టీడీపీ నీళ్లు అనో.. కొల్లు రవీంద్ర నీళ్లనో అనరు.. కదా మా మీద.. టీడీపీ మీదున్న కోపాన్ని ప్రజలపై చూపించడం తగదని లోకేష్ అన్నారు. మరోపక్క వైసిపి సర్కార్ ఇచ్చిన ఇళ్ల పట్టాలపై స్పందిస్తూ.. ఎందుకు ఆ కాగితాలతో నాలిక గీసుకోవాలా..? ఆ స్థలాలు ఎక్కడున్నాయో చూపండి నాని గారు. టిడిపి హయాంలో మచిలీపట్నంలో 4200 టిడ్కో ఇళ్ళు కట్టాం. వాటిని పేదలకు ఇవ్వలేని చేతగాని మంత్రి బందరు నాని. బందరు నుంచి ఎమ్మెల్యేగా నానిని ఎన్నుకున్నారు.. మంత్రి అయ్యాడు సరే.. అయన బందరుకేమీ చేయకపోవచ్చు.. రవాణా శాఖ మంత్రి అయ్యుండి కనీసం బందరు ఆర్టీసీ బస్టాండ్ కూడా సరి చేయలేకపోయారు. అయ్యా నానీ గారూ మీ శాఖకు చెందిన పనిని.. మీ నియోజకవర్గంలోనే చేసుకోలేపోయారు.. ఇక మీరు బందరునేం అభివృద్ధి చేస్తారు..? ఈ రెండేళ్ల వైసీపీ హయాంలో బందరులో ఈ ప్రభుత్వం ఈ పని చేసిందని చెప్పగలిగే దమ్ము నానికి ఉందా..?'' అని లోకేష్ నిలదీశారు. ''నిన్న బందరు మంత్రి నాని మాట్లాడుతూ అమరావతి లో నీరు, మట్టి, గ్రాఫిక్స్ తప్ప ఏమి లేవంటాడు. జగన్ రెడ్డి ఏమో అక్కడ 90 శాతం పూర్తయిన భవనాలు చాలా ఉన్నాయి. వాటిని పూర్తి చెయ్యడానికి నిధులు కేటాయిస్తా అంటున్నారు. ఇద్దరిలో సన్నాసి కానిది ఎవరో వాళ్లే తేల్చుకోవాలి. అమరావతిలో ఉన్న భవనం మీద నుండి దూకి గ్రాఫిక్స్ అని నిరూపిస్తారో లేక సన్నాసులం అని ఒప్పుకుంటారో వారే తేల్చుకోవాలి'' అని సవాల్ విసిరారు. మరోపక్క 21 నెలల్లో ఎం చేసారు అని అడిగితే.. సంక్షేమ పథకాలు అందించామంటారు. ఎవడబ్బ సొమ్మని సంక్షేమ పథకాలు ఇస్తారు. జగన్ జేబులో సొమ్మో.. నాని ఇంట్లో సొమ్మో ఇవ్వడం లేదు. ప్యాంట్ జేబులోని డబ్బులు కత్తిరించి షర్ట్ జేబులో పెడుతోంది ఈ ప్రభుత్వం.. అది కూడా సగం కోసేసి. పాదయాత్రలో పెంచుకుంటూ పోతా అన్నాడు.ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు'' అని ఎద్దేవా చేశారు. సీఎం ''జగన్ రెడ్డి పిల్లి...పిరికోడు....ఆయనకి మోడీ గారిని చూస్తే వణుకు. సీబీఐ, ఈడీ కాదు ఏకంగా ఇంటర్ పోల్ రంగంలోకి దిగింది. అందుకే స్పెషల్ స్టేటస్ అవుట్, విశాఖ ఉక్కు అవుట్, పోర్టులు అవుట్. మొన్న ఎదో ఊరెళితే ప్రజలు అడిగారట ప్రత్యేకహోదా ఎక్కడ అని? జగన్ రెడ్డి తెచ్చా కదా అన్నారంట. ఎప్పుడు సార్ అంటే మన బ్రాండ్ స్పెషల్ స్టేటస్ మందు బాటిల్ తెచ్చా కదా అన్నారంట . స్పెషల్ స్టేటస్, ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్రా గోల్డ్ ఇలా అబ్బో సీఎం జగన తెచ్చిన కంపెనీలు ఎన్నో. అదే బాబు హయాంలో కియా,హెచ్ సిఎల్ వంటి పెద్దపెద్ద కంపెనీలు వచ్చాయి. జగన్ రెడ్డి హయాంలో దొంగ లిక్కర్ మాఫియా కంపెనీలు వచ్చాయి'' అని లోకేష్ విమర్శించారు .    

ముత్తూట్‌లో గోల్డ్ సేఫేనా? షేర్లు పతనం, మరి, మీ బంగారం?

యజమాని చనిపోతే సంస్థ కుప్పకూలిపోతుందా? ఏమో.. ఏమైనా జరగొచ్చు. కొన్ని సంస్థలు యజమానితో సంబంధం లేకుండా మనుగడ సాగిస్తే.. మరికొన్ని సంస్థలు ఓనర్ తో పాటు కాలగమనంలో కలిసిపోయిన ఘటనలు ఉన్నాయి. మరి, ముత్తూట్ లో ఏం జరుగుతోంది? భవిష్యత్ లో ఏం జరగబోతోంది? ఇదే ప్రశ్న ముత్తూట్ ఫైనాన్స్ లో బంగారం తనఖా పెట్టిన మదుపర్లను ఒత్తిడికి గురి చేస్తోంది. సోమవారం స్టాక్ మార్కెట్లో ముత్తూట్ షేర్లు భారీగా పతనం అవడంతో ఆ భయం మరింత పెరుగుతోంది.  ఇటీవల ముత్తూట్ గ్రూప్ ఛైర్మన్, హోల్ టైమ్ డైరెక్టర్ ఎంజీ జార్జ్ ముత్తూట్ (71) అనుమానాస్పదంగా మృతిచెందారు. తన నివాసంలో నాలుగో అంతస్తు నుంచి పడి జార్జ్ ముతూట్ చనిపోయారు. పోలీసులు అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఢిల్లీ ఎయిమ్స్  ఫోరెన్సిక్ విభాగం ముగ్గురు సీనియర్ వైద్యుల బోర్డును ఏర్పాటు చేసింది. ఈ కేసును వారు అన్ని కోణాల్లో పరిశీలిస్తున్నారు.  1993లో జార్జ్ ముత్తూట్‌ గ్రూప్ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఆధ్వర్యంలో సంస్థ భారీగా విస్తరించింది. గోల్డ్ లోన్ ఇండస్ట్రీలో మార్కెట్ లీడర్ గా ఎదిగింది. సంస్థ యజమాని మరణంతో ముత్తూట్‌ ఫైనాన్స్‌ లో బంగారం కుదవపెట్టి రుణం తీసుకున్న వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది. తాము తనఖా పెట్టిన బంగారం ఎవరి దగ్గర ఉందో? ఆ లెక్కలు ఎవరు చూస్తున్నారో? ఓనర్ లేకపోవడంతో తమ గోల్డ్ తిరిగి వస్తుందో రాదో? సంస్థ మునపటిలా కొనసాగుతుందో లేదో? ఇలా అనేక అనుమానాలు. దాని ఫలితమే.. స్టాక్ మార్కెట్లో ముత్తూట్ ఫైనాన్స్ షేర్ పతనం. ఇక బంగారం తనఖా పెట్టిన వారు సైతం పెద్ద సంఖ్యలో సంస్థ ముందు బారులు తీరారు. కుదవ పెట్టిన బంగారం విడిపించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో.. సంస్థ గోల్డ్ కస్టమర్ల నుంచి భారీగా ఒత్తిడి ఎదుర్కొంటుంది. ప్రజల్లో భయం మరింత పెరిగితే.. సంస్థ ఆర్థిక కార్యకలాపాలపై ప్రభావం అధికంగా ఉంటుంది. ఈ సమయంలో ముత్తూట్ ఫైనాన్స్ తరఫున స్పష్టమైన ప్రకటన గానీ, హామీ గానీ రావాల్సి ఉంది. అప్పటి వరకూ వినియోగదారుల్లో ఆందోళన తప్పకపోవచ్చు.

మెన్స్ డే కావాలని మహిళా ఎంపీ డిమాండ్ 

అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున రాజ్యసభలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఎంపీలకు సహచర మగ ఎంపీలు శుభాకాంక్షలు చెప్పారు. అయితే ఈ సందర్భంగా మెన్స్ డే కావాలని మహిళా ఎంపీ డిమాండ్ చేశారు. పురుషుల కోసం కూడా ఓ రోజు ఉండాలని బీజేపీ మహిళా ఎంపీ సోనాల్‌ మాన్‌సింగ్‌ అన్నారు. పురుషులకు ‘మెన్స్‌ డే’ నిర్వహించాలని ఆమె డిమాండ్‌ చేశారు.  రాజ్యసభలో ఎంపీ సోనాల్‌ మాన్‌సింగి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. మహిళా దినోత్సవాన్ని ఇద్దరు జర్మన్‌ దేశానికి చెందిన మహిళలు ప్రారంభించారని తెలిపారు. ప్రపంచంలోనే ఎక్కడాలేని విధంగా తొలిసారి ఓ భారీ సముద్ర నౌకను మహిళలే పూర్తి స్థాయిలో​ సారథ్యం వహించటం మనదేశానికి గర్వకారణమని తెలిపారు. మహిళలు పోటీతత్వాన్ని పెంచుకోవాలని, అన్నిరంగాల్లో​ పురుషులతో సమానంగా రాణించాలని పేర్కొన్నారు. మహిళలను పురుషుల్లో సగభాగమని చెబుతున్నప్పటికీ కొన్నిచోట్ల మహిళలు తీవ్రమైన వివక్షతను ఎదుర్కొంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు.

జగన్ కు తెలిసే స్టీల్ ప్లాంట్ అమ్మకం.. పార్లమెంట్ లో కేంద్రం క్లారిటీ

అయిపాయే. అంతా అయిపాయే. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం చేతులెత్తేసింది. పార్లమెంట్ లో మళ్లీ కీలక ప్రకటన చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తప్పదని మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్‌లో వంద శాతం పెట్టుబడులను ఉపహరించుకుంటున్నట్లు ఆమె తెలిపారు. స్టీల్ ప్లాంట్ అమ్మకంపై ఏపీ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపామని మంత్రి ప్రకటించారు. అవసరమైనప్పుడు మద్దతు ఇవ్వాలని కోరామని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఎంపీ సత్యనారాయణ అడిగిన ప్రశ్నకు పార్లమెంట్ సాక్షిగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రైవేటీకరణపై సుస్పష్ట ప్రకటన చేశారు.  స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఏపీలో ఆందోళనలు ఉధృతంగా సాగుతున్నాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని అన్ని పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రతిపక్ష నేతలతో పాటు బీజేపీ రాష్ట్ర శాఖ నాయకులు సైతం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై కేంద్ర పెద్దలను కలిసి వినతి పత్రాలు అందజేశారు. ప్రజల నుంచి పార్టీల నుంచి ఎన్ని ఒత్తిడులు వస్తున్నా కేంద్రం తీరులో ఎలాంటి మార్పు రాలేదు. విశాఖ ఉక్కును వంద శాతం ప్రైవేటీకరిస్తామంటూ మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి పార్లమెంట్ లో ప్రకటన చేయడంతో ప్రజల్లో ఆగ్రహం మరింత ఎగిసిపడుతోంది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్టీల్ ప్లాంట్ పై ఇప్పటికే రాష్ట్రంతో సంప్రదింపులు జరిపామని మంత్రి ప్రకటించడంతో ఇన్నాళ్లూ తమకేమీ తెలీదన్నట్టు చెబుతున్న ఏపీ ప్రభుత్వం ఇప్పుడు ఇరకాటంలో పడినట్టైంది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశం సీఎం జగన్ కు తెలిసే జరిగిందని తేటతెల్లమైంది.

తోక కట్ చేస్తా.. గుట్కా ఎమ్మెల్యే ఖబడ్దార్ 

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో వైసీపీ నేతలు, జగన్ సర్కార్ పై నిప్పులు చెరుగుతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. గుంటూరులో రోడ్ షో నిర్వహించిన చంద్రబాబు.. వైసీపీ నాయకుల చిల్లర రాజకీయాలు ఇక చెల్లవన్నారు. తన  రాజకీయ జీవితంలో ఇంత చిల్లర రాజకీయాలు చూడలేదని ఆగ్రహం చంద్రబాబు వ్యక్తం చేశారు. పులివెందుల, మాచర్ల రాజకీయాలు సాగనీయమన్నారు చంద్రబాబు. అందరి తోక కట్ చేస్తానని వార్నింగ్ ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్యేలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అమరావతిని మూడు ముక్కలు చేస్తే ఇక్కడ ఎమ్మెల్యేలకు సిగ్గు లేదా అన్నారు.  గుట్కా ఎమ్మెల్యే ఖబడ్దార్ అని హెచ్చరించారు. గుట్కా ఎమ్మెల్యేకు మీరు ఊడిగం చేస్తే ... ఆ ఎమ్మెల్యే తాడేపల్లి వెళ్లి జగన్‌కు ఊడిగం చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. ఓటు విషయంలో మరోసారి తప్పు చేస్తే మీ జీవితాలు అధోగతిపాలేనని చెప్పారు.  దేశంలోని అందరినీ ఇక్కడకు రప్పించేందుకు అమరావతి రాజధానిగా ఏర్పాటు చేశామని చెప్పారు. ఏ1 ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మాత్రం మూడు ముక్కలాటతో అందరినీ ఇతర ప్రాంతాలకు పంపుతున్నాడని చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రజలు కన్నెర్ర చేస్తే తాడేపల్లి నుంచి పారిపోతావ్ అని హెచ్చరించారు. టీడీపీ పాలనలో రౌడీయిజం, ఉగ్రవాదం, టెర్రరిజం లేకుండా చేశామన్నారు. నేను ఓట్లు కోసం రాలేదు.. మీ భవిష్యత్తు కోసం వచ్చానని వ్యాఖ్యానించారు. ఎవరికీ భయపడకుండా ఓటు వేయండి.. మీ ఓటు దెబ్బకు తాడేపల్లి ప్యాలెస్ నుంచి జగన్ బయటకు వస్తాడని చంద్రబాబు పేర్కొన్నారు.  

కేసీఆర్ ని తిట్టిన షర్మిల...

వైఎస్ షర్మిల తెలంగాణ ప్రభుత్వం పై విమర్శల జోరు పెంచింది. మహిళా దినోత్సవం  సందర్బంగా కేసీయార్ ప్రభుత్వంలో మహిళకు అన్యాయం జరుగుతుందని తెలంగాణల రాష్ట్ర మంత్రి మండలిలో కేవలం ఇద్దరికి మాత్రమే అవకాశం కల్పించిందని ఎద్దేవా చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా లోటస్ పాండ్ లో ఆమె వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రాణాలు త్యాగాలు చేసి సాధించుకున్న రాష్ట్రంలో మహిళలకు మనుగడ కరువైయిందని. తెలంగాణ గడ్డ రాజకీయ చైతన్యానికి అడ్డా అని అన్నారు. ఇక్కడి మహిళలు ఎవరికీ తక్కువ కాదని చెప్పారు. ఈ గడ్డపై పుట్టిన రాణి రుద్రమదేవి చరిత్ర అందరికీ తెలిసిందేనని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో మహిళల పాత్ర ఎంతో ఉందని, కానీ, ప్రస్తుత తెలంగాణలో స్త్రీలకు ఉన్న ప్రాతినిధ్యం చాలా తక్కువని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో అసమానతలు ఉన్నాయని... మహిళలకు అన్యాయం జరుగుతోందని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలకు సరైన ప్రోత్సాహాన్ని ఇవ్వడం లేదని దుయ్యబట్టారు.వైయస్ రాజశేఖరెడ్డి హయాంలో ఎందరో మహిళలు మంత్రి పదవులను అలంకరించారని... కేసీఆర్ ప్రభుత్వంలో కేవలం ఇద్దరు మహిళలు మాత్రమే మంత్రులుగా ఉన్నారని చెప్పారు. ఆ ఇద్దరికీ కూడా ఐదేళ్ల తర్వాతే అవకాశం దొరికిందని అన్నారు. మహిళలు అన్నింటిలో సగం అయినప్పుడు... ఈ అన్యాయం ఎందుకని ప్రశ్నించారు. మహిళల హక్కుల కోసం తాను నిలబడతానని చెప్పారు. తాము చేయబోయే ప్రతి పనిలో మహిళలకు తగిన ప్రాతినిధ్యం కల్పిస్తానని హామీ ఇస్తున్నానని అన్నారు.  దుర్గమ్మ సాక్షిగా మహిళాదినోత్సవం రోజున మహిళలపై వైసీపీ ప్రభుత్వం విజయవాడ దుర్గమ్మ సాక్షిగా మహిళాదినోత్సవం రోజున మహిళలపై వైసీపీ ప్రభుత్వం. కానకదుర్గ దర్శనానికి వెళ్లిన మహిళా రైతులపై అమానుషంగా ప్రవర్తించిన సొంత అన్న ప్రభుత్వం ఒక వైపు మహిళపై స్వతహాగా దాడి చేస్తుంటే అన్నను వ్యతిరేకించలేని చెల్లి షర్మిల తెలంగాణలో మహిళలకు అన్యాయం జరుగుతుందని మాట్లాడం హాస్యాస్పందంగాని తెలంగాణ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. షర్మిల అలా మాట్లాడాం వెనక రాజకీయ లాభం ఉందని చెప్పకనే చెపుతుంది.