రావత్ కు వాస్తు కాటు.. మరి కేసీఆర్ కు..?
posted on Mar 10, 2021 @ 4:24PM
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పదవికి త్రివేంద్ర సింగ్ రావత్ రాజీనామా చేయడం, ఆయన స్థానంలో తీరత్ సింగ్ రావత్ ప్రమాణ స్వీకారం చేయడం చక చకా జరిగి పోయాయి. అయితే ఉత్తర ప్రదేశ్ నుంచి విడివడి ఉత్తరాఖండ్ ఏ ముహూర్తాన ఏర్పడిందో ఏమో కానీ గడచిన 20 ఏళ్లలో దేవభూమిలో సుస్థిర పాలన ఎండమావిగానే మిగిలిపోయింది. ఇరవై ఏళ్లలో ఎనిమిది మార్లు ముఖ్యంత్రులు మారారు. తీరత్ సింగ్ రావత్ తొమ్మిదో కృష్ణుడు. ఈ ఎనిమిది మందిలో ఒక్క నారాయణ దత్ తివారీ (2002-2007) మినహా ఇంకెవరు పూర్తిగా ఐదేళ్లూ అధికారంలో కొనసాగలేదు.
ముఖ్యమంత్రులు మాజీలు అయినట్లే, మాజీలు మళ్ళీ ముఖ్యమంత్రులు అయిన సందర్భాలున్నాయి. రెండు సార్లు, మూడు సార్లు ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఏపార్టీ అధికారంలో ఉన్నా బొమ్మలను మార్చినట్లు ముఖ్యమంత్రులను మార్చే, సీల్డ్ కవర్ కల్చర్ కామన్ గా కంటిన్యూ అయింది. కాంగ్రెస్ అడుగు జాడల్లో కమలదళం నడిచింది.
అయితే ఇలా ముఖ్యమంత్రులు మారిపోవడానికి ముఖ్యమంత్రుల పట్ల ప్రజాప్రతినిదులు, ప్రజల్లో అసంతృప్తి కారణంకాదుట. అది కేవలం పైకి కనిపించే కారణమేనట,అసలు కారణం మాత్రం ముఖ్యమంత్రి అధికార నివాసానికి ఉన్న వాస్తు దోషమే అసలు కారణమట. ముఖ్యంత్రి అధికార నివాసానికి ఉన్న వాస్తు దోషం కారణంగానే అధికారం నిలబడడం లేదని రాష్ట్ర రాజకీయ వర్గాల విశ్వాసం. త్రివేంద్ర సింగ్ రావత్ ఉద్వాసన ఆ విశ్వాసాన్ని మరింతగా బలపరుస్తోందని స్థానిక మీడియానే కాదు నేషనల్ మీడియా కూడా కథనాలను ప్రచురించాయి.
డెహ్రాడూన్ కంటోన్మెంట్ ప్రాంతంలో ఉన్న బంగ్లాలో అధికార నివాసం ఉన్న ముఖ్య మాత్రులు రమేష్ పోఖ్రియాల్ నిషాంక్, విజయ బహుగుణ ఇద్దరూ కూడా వాస్తు దోషం తోనే అర్ధాంతరంగా పదవి కోల్పోయారుట. అందుకే ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన హరీష్ రావత్ అధికార నివాసం కాదని బీజాపూర్ గెస్ట్ హౌస్ లో కాలక్షేపం చేశారు.
2017లో ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన త్రివేంద్ర సింగ్ రావత్.. వాస్తూ లేదు గీస్తూ లేదు అనుకున్నారో లేక ఉన్నంత కాలమే ఉందాం, ఉన్నతవరకు హాయిగా, హాపీగా ఎంజాయ్ చేద్దామనే అనుకున్నారో ఏమో కానీ, పదెకరాల విశాల ముఖ్యమంత్రి అధికార భవనంలోకి వెళ్లి పోయారు. నాలుగేళ్ళు హాయిగా ఎంజాయ్ చేశారు. చివరి సంవత్సరంలో అసమ్మతి మొదలైంది, ఇంకా పతాక సన్నివేశానికి రాలేదు, అయినా బీజీపే అధిష్టానం ఇలా ఢిల్లీకి పిలిచి అలా ముఖ్యమంత్రి పదవి తీసుకుని వట్టి చేతులతో వెనక్కి పంపించింది. అందుకే నూటికి నూరు శాతం వాస్తు కాటే అని గంట కొట్టి మరీ చెపుతున్నారు.