తెలంగాణలో లాక్ డౌన్ తప్పదా?
posted on Mar 23, 2021 @ 11:33AM
తెలంగాణలో లాక్ డౌన్ తప్పదా.. రాత్రిపూట కర్ఫ్యూ పెట్టబోతున్నారా అంటే వైద్య శాఖ వర్గాలు మాత్రం అవుననే అంటున్నాయి. తెలంగాణలో ప్రస్తుతం కరోనా పంజా విసురుతోంది. 15 రోజుల నుంచి రోజుకు 3 వందలకుపైగా పాజిటీవ్ కేసులు నమోదవుతున్నాయి. సోమవారం ఏకంగా 4 వందలు క్రాస్ అయ్యాయి. అందులో దాదాపు సగానికిపైగా కేసులు గురుకులాల్లలోనే వచ్చాయి. కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తుండటంతో రాష్ట్ర సర్కార్ అప్రమత్తమైంది. కేసుల సంఖ్య తగ్గాలంటే లాక్ డౌన్ తప్పదని నిపుణులు చెబుతున్నారు. కరోనా కేసులు పెరగడంతో ఇప్పటికే మహారాష్ట్రతోపాటు పలు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్ విధించారు. రాత్రి పూట కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. సోమవారం ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన కేసీఆర్.. లాక్ డౌన్ అంశంపైనే చర్చించారని తెలుస్తోంది. దీంతో దీంతో తెలంగాణలో కూడా లాక్ డౌన్. లేదా రాత్రి పూట కర్ఫ్యూ విధిస్తారని ప్రచారం జరుగుతోంది.
తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 412 కరోనా కేసులు నమోదయ్యాయి. సోమవారం ఒక్కరోజే కరోనాతో ముగ్గురు చనిపోయారు. అదే సమయంలో 216 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,03,867కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,99,042 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,674గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 3,151 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 1,285 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 103 మందికి కరోనా సోకింది. రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాల్లోనూ కరోనా కేసులు వేగంగా పెరిగిపోతున్నాయి.
కరోనా వైరస్ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్యానికి తావివ్వొద్దని తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో వైద్యశాఖపై మంత్రి సమీక్ష నిర్వహించారు. వైరస్ కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, రోజుకు 50 వేల పరీక్షలు నిర్వహించాలని అధికారులు సూచించారు. వైరస్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలను హెచ్చరించారు మంత్రి ఈటల. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని సూచించారు. భౌతిక దూరం పాటించాలని, మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, నిర్లక్ష్యం కూడదని అన్నారు. వైరస్ కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ప్రజల భాగస్వామ్యం కూడా అవసరమని మంత్రి రాజేందర్ అన్నారు.