ఎమ్మెల్యే ఆర్కే పాపం ఊరికే పోదు...!
posted on Mar 22, 2021 @ 7:37PM
గంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరులో ఇవాళ ప్రభుత్వం చేపట్టిన ఆక్రమణల తొలగింపు ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. గ్రామంలో రోడ్డు విస్తరణలో భాగంగా ఇరుపక్కల గల నివాసాలను మున్సిపల్ అధికారులు కూల్చివేసారు. అక్రమ నిర్మాణాల పేరుతో కొన్ని నివాసాలను అధికారులు పొక్లెయిన్‌ల సాయంతో కూల్చేశారు. బాధితులు ఈ కూల్చివేతలను అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. భారీగా మోహరించిన పోలీసులు బాధితులను పక్కకు నెట్టి వేసి అక్కడ ఉన్న కట్టడాలను పడగొట్టారు. మరోపక్క ఈ విషయంపై బాధితులు గతంలోనే కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. కాగా వారు వేసిన పిటిషన్ త్వరలో విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో కోర్టు విచారణ ప్రారంభానికి ముందే బలవంతంగా తమ ఇళ్లను ఖాళీ చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేసారు.
ఇక్కడ తాము 40 ఏళ్లుగా ఉంటున్నా.. ఇళ్ల స్థలాలు కేటాయించకుండా తమ కట్టడాలను ఎలా తొలగిస్తారని బాధితులు ప్రశ్నించారు. అయితే అధికారులు వారి వాదనను ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో టీడీపీ, వాపక్ష నేతలు అక్కడకు భారీగా చేరుకుని బాధితులకు అండగా నిలిచి.. అధికారులను నిలదీశారు. బాధితులకు ప్రత్యామ్నాయ స్థలాలు చూపించాకే ఖాళీ చేయించాలని.. అప్పటి వరకు కూల్చివేతలు ఆపాలని వారు డిమాండ్ చేశారు. దీంతో అధికారులకు, బాధితులకు అండగా నిలబడిన నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
ఇది ఇలా ఉండగా ప్రభుత్వం, అధికారుల వ్యవహరించిన తీరుపై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. లోకేష్ గెలిస్తే మంగళగిరి లో పేదల ఇళ్లు కూల్చేస్తాడు అని ఎన్నికల్లో అసత్య ప్రచారం చేసారని.. కానీ ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మానవత్వం లేకుండా రోజుకో చోట పేదల గూడు కూల్చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పాపం ఆయన్ని ఊరికే వదలదు అని లోకేష్ మండిపడ్డారు. మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరు గ్రామంలో 40 ఏళ్లుగా నివాసముంటున్న పేదల ఇళ్లను దుర్మార్గంగా కూల్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను ఇళ్ల సమస్య కోర్టు పరిధిలో ఉన్నా.. ఎమ్మెల్యే చేసిన ఒత్తిడితో అధికారులు, పోలీసులు ప్రజలను కట్టుబట్టలతో నడి రోడ్డు మీదకి నెట్టేసారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండేళ్లలో పేదలకు ఒక్క ఇళ్లు కట్టని జగన్ రెడ్డి ప్రభుత్వానికి పేదలు కష్టపడి నిర్మించుకున్న ఇంటిని ధ్వంసం చేసే హక్కు ఎవరిచ్చారని ఆయన ప్రశ్నించారు. పేదలకు న్యాయం జరిగే వరకూ వారికి టీడీపీ అండగా పోరాడుతుంది లోకేష్ స్పష్టం చేశారు.