నోటీస్ పాలి..ట్రిక్స్! టీడీపీ ఆర్థిక మూలాలే టార్గెట్
posted on Mar 22, 2021 @ 5:33PM
మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చిన రెండు రోజులకే ప్రతిపక్ష నేతకు సీఐడీ నోటీసులు. మాజీ ముఖ్యమంత్రిపై ఏకంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసింది జగన్ రెడ్డి సర్కార్. అది కూడా హైకోర్టు గతంలోనే క్లీన్‌చీట్ ఇచ్చిన అమరావతి భూముల కేసులోనే. చంద్రబాబుపై పెట్టిన కేసు చెల్లదని న్యాయ నిపుణులు, టీడీపీ నేతలు ముందు నుంచి చెబుతూనే ఉన్నారు. అయినా హడావుడి చేసిన ఏపీ సీఐడీ.. హైదరాబాద్ వెళ్లీ మరీ చంద్రబాబుకు నోటీసులు ఇచ్చింది. విచారణకు హాజరు కాకపోతే అరెస్ట్ చేస్తామని కూడా నోటీసులో హెచ్చరించింది. చంద్రబాబు కేసు, నోటీసుల అంశం తీవ్ర దుమారం రేపింది. అయితే అందరు అనుకుంటున్నట్లే చంద్రబాబుపై పెట్టిన పసలేని సీఐడీ కేసు విచారణపై స్టే ఇచ్చింది ఏపీ హైకోర్టు.
బలం లేదని తెలిసినా చంద్రబాబుకు సీఐడీ నోటీసులు ఇవ్వడం వెనక జగన్ రెడ్డి సర్కార్ పెద్ద స్కెచ్చే ఉందనే చర్చ జరుగుతోంది. పక్కా పొలిటికల్ వ్యూహం దాగుందని అంటున్నారు. టీడీపీ ఆర్థిక వనరులను దెబ్బ తీయడం, ఏపీ సర్కార్ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లీంచడం, ప్రభుత్వ భూములను అమ్మేయడం, రాజధాని తరలింపు వంటి కీలక అంశాలు దీని వెనుక దాగున్నాయంటున్నారు. చంద్రబాబుకు, టీడీపీ ప్రధాన బలం కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలే. అమరావతి పరిధిలోనే చంద్రబాబు సన్నిహితుల వ్యాపారాలు ఎక్కువగా ఉన్నాయి. చంద్రబాబుపై కేసు పెట్టడం ద్వారా.. టీడీపీ అనుకూల వ్యాపారులను భయపెట్టి వారి బిజినెస్ దెబ్బ తీయడం ప్రధాన లక్ష్యమంటున్నారు. చంద్రబాబే ఇబ్బందులు పడుతున్నారు ఇక మనమెంత అనే అలోచనకు వచ్చి టీడీపీ మద్దతు వ్యాపారులంతా పక్కకు తప్పుకునేలా చేయాలనే కుట్ర ఉందంటున్నారు. ప్రకాశం జిల్లాలో ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న మైనింగ్ లీజులన్ని ప్రస్తుతం చంద్రబాబు అనుకూల వ్యాపారుల చేతుల్లో ఉన్నాయి. వాళ్లందరిని భయపెట్టి.. అక్కడి నుంచి పంపించి.. రెడ్డి వర్గానికి చెందిన వారికి మైనింగు లీజులు అప్పగించాలనే కుట్ర ఉందంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం దారుణంగా ఉంది. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా అప్పులు తెస్తున్నారు. ఏపీ ప్రభుత్వం పరిమితికి మించి రుణాలు సేకరించిందని కేంద్ర ఆర్థికశాఖ కూడా ప్రకటించింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే తీవ్ర ఆర్థిక సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని కూడా హెచ్చరించింది. అయినా రాజకీయ ప్రయోజనాల కోసం అనవసరమైన పనులకు అడ్డగోలుగా ఖర్చులు చేస్తోంది సర్కార్. అందుకే ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు జగన్ సర్కార్ కొత్త స్కెచ్ వేసిందని, భూములను అమ్మాలని నిర్ణయించిందని తెలుస్తోంది. చంద్రబాబుపై కేసు, నోటీసులతో రాజకీయాన్ని వేడెక్కించి.. జనాలనంతా అటువైపు ఫోకస్ చేసేలా చేసి.. సర్కార్ భూములను గుట్టు చప్పుడు కాకుండా విక్రయించాలని జగన్ సర్కార్ ప్లాన్ చేసిందని చెబుతున్నారు. ఇప్పటికే కర్నూల్ అంతరాత్జీయ ఎయిర్ పోర్టు నిర్మిస్తామని జగన్ ప్రభుత్వం ప్రకటన చేసింది. అది అమలు సాధ్యం కాదని తెలిసినా... దాని పేరుతో అక్కడి భూముల రేట్లు పెంచి సర్కార్ భూములను అమ్మేయాలన్నది వైసీపీ వ్యూహమనే ప్రచారం జరుగుతోంది.
మూడు రాజధానుల పేరుతో విశాఖ, కర్నూల్ లో తాము అనుకున్నది చేసుకునేందుకు జగన్ రెడ్డి సర్కార్ పక్కా ప్రణాళికలు వేసిందంటున్నారు. రాజధానిని అమరావతి నుంచి విశాఖకు రాత్రికి రాత్రి షిఫ్ట్ చేసేందుకు.. చంద్రబాబుకు సీఐడీ నోటీసుల ఇష్యూని తెరపైకి తీసుకొచ్చారని అంటున్నారు. రాజధానిని అమరావతి నుంచి విశాఖకు మార్చేయాలని జగన్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించిందని అంటున్నారు. రాజధాని మార్పు అంశం ఇప్పటికే హైకోర్టులో ఉంది. ఫైనల్ తీర్పు వచ్చే వరకూ అమరావతి నుంచి ఇటుక కూడా కదిలించలేరని రైతులు హెచ్చరిస్తున్నారు. కేపిటల్ మార్పు విషయంలో ఎప్పుడో నిర్ణయం తీసేసుకున్న సర్కారు.. దాన్ని అమలు చేయలేక అడుగు ముందుకు వేయలేకపోతోంది. హైకోర్టు కేసులు, రైతుల నుంచి నిరసనలు, చంద్రబాబు పోరాటంతో సందిగ్థంలో పడింది. కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రజాభిప్రాయం తమవైపే ఉందంటూ రాజధాని మార్పుపై జగన్‌రెడ్డి ప్రభుత్వం దూకుడు పెంచబోతోందని తెలుస్తోంది.
చంద్రబాబుకు సీఐడీ నోటీసులతో ప్రతిపక్ష నేతను ముందస్తుగా కట్టడి చేయడం.. విపక్షాన్ని డిఫెన్స్‌లో పడేయడం.. అమరావతి రైతులను భయబ్రాంతులకు గురి చేయడం.. ఇదంతా టాపిక్ డైవర్షన్ స్కీమ్‌లో భాగమే అంటున్నారు విపక్ష నేతలు. టీడీపీ ఆర్థిక మూలాలను దెబ్బతీయడానికి, సర్కార్ భూములను అమ్మడానికి, అమరావతిని విశాఖకు షిఫ్ట్ చేయడానికి సర్కారు ఆడుతున్న మైండ్ గేమ్ అని అనుమానిస్తున్నారు. ఇదంతా సర్కారు ఆడుతున్న డైవర్షన్ డ్రామాలో భాగమంటూ భగ్గుమంటున్నాయి విపక్షాలు.