జగన్ కు వెన్నుపోటు తప్పదా?
posted on Mar 22, 2021 @ 4:03PM
ఎంపీ విజయసాయిరెడ్డి. ప్రతిపక్షాలకు A2. జగన్మోహన్‌రెడ్డి తర్వాత వైసీపీలో నెంబర్ 2. జగన్‌కు కావలసిన పనులన్నీ.. జగన్‌తో కాని పనులన్నీ.. చేసేది, చేయించేది విజయసాయినే. ఢిల్లీలో పార్టీ తరఫున చక్రం తిప్పేది.. వ్యవహారం చక్కబెట్టేది ఆయనే. పార్లమెంట్ లాబీలో ప్రధాని మోదీనే ఆగి మరీ.. రెడ్డి గారూ బాగున్నారా? అని పలకరించేటంత పాపులారిటీ. జగన్ హస్తిన పర్యాటన ఖరారు చేసేది.. కేంద్ర పెద్దలతో సమావేశాలు సెట్ చేసేది విజయసాయిరెడ్డే. ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌లో తెర వెనుక కార్యకలాపాలు చక్కబెట్టేది, సెటిల్మెంట్లు చేసేది నెంబర్ 2నే. జీవీఎమ్సీ ఎన్నికల్లాంటి లోకల్ పాలిటిక్స్‌లోనూ ఆయనదే కీరోల్. ఇదంతా పైకి కనిపిస్తున్న సంగతి. కానీ, లోలోన విజయసాయి సైతం రాజకీయ చదరంగంలో రాజుకు చెక్ పెట్టే పావే అంటున్నారు.
కేంద్ర పెద్దలతో అత్యంత సన్నిహితం. ప్రధాని మోదీకి సైతం ఎంతో హితం. మంత్రులందరి దగ్గర చొరవ. ఈ గౌరవమంతా జగన్‌రెడ్డిని చూసి కాదని.. విజయసాయికే అంత ప్రాధాన్యత అని అంటున్నారు. ఎందుకంటే.. ఆయన వైసీపీ నేతకంటే కూడా బీజేపీకి బినామీ లీడర్ అని చెబుతున్నారు. అవును, విజయసాయి బీజేపీ మనిషేనట. అందులో ఎలాంటి అనుమానం అవసరం లేదంటున్నాయి ఢిల్లీ వర్గాలు. ఆయనపై ఉన్న కేసులతో ఇప్పటికే విజయసాయిని దారికి తెచ్చుకున్నారట బీజేపీ పెద్దలు. అవసరం వచ్చినప్పుడు వాడుకునేలా వ్యూహం సిద్ధం చేశారని చెబుతున్నారు. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు పార్టీలో ఉంటూనే రెబెల్‌గా లౌడ్ వాయిస్‌తో రెచ్చిపోతుండటం బీజేపీ ప్లాన్‌లో భాగమే. అదే.. విజయసాయి విషయం వచ్చే సరికి మరో రకమైన వ్యూహం అమలు చేస్తోంది కాషాయం పార్టీ. జగన్ వెన్నంటే ఉంటూ.. జగన్‌కు నమ్మినబంటులా, నమ్మశక్యంగా వ్యవహరిస్తూ.. సమయం వచ్చినప్పుడు వెన్నుపోటు పొడిచేలా.. టైంబాంబు సెట్ చేసిందని అంటున్నారు.
యావత్ దేశం కాషాయమయం చేయాలనేది బీజేపీ దీర్ఘకాలిక ప్రణాళిక. ఉత్తరాదిన మాంచి ఊపుమీదున్న కమలదళం.. దక్షిణాదిలో మాత్రం బాగా ఇబ్బంది పడుతోంది. ప్రాంతీయ పార్టీల పట్టు ఎక్కువగా ఉండటంతో.. ఒక్కో స్టేట్‌లో ఒక్కో రకమైన గేమ్ ప్లాన్ అమలు చేస్తోంది. తెలంగాణలో టగ్ ఆఫ్ వార్ ఫైట్ చేస్తూ కేసీఆర్‌కు చుక్కలు చూపిస్తుంటే.. ఏపీలో మాత్రం వేచి చూసే స్ట్రాటజీ అమలు చేస్తోంది. ముందు స్నేహం. ఆ తర్వాత వైరం. అందులో భాగంగా ముందు వైసీపీతో కాస్త స్నేహపూర్వకంగా వ్యవహరిస్తోంది. ప్రజల్లో బీజేపీపై సానుకూల వైఖరి వచ్చాక.. సరైన సమయంలో.. సరైన రీతిలో జగన్‌ను తొక్కేసేలా స్కెచ్ రెడీ చేసిందట. తప్పించుకోలేని రీతిలో.. కేసులపై కేసులతో.. పీకల్లోతు ఊబిలో కూరుకుపోయిన జగన్మోహన్‌రెడ్డికి ఉచ్చు బిగించడం చాలా సింపుల్ అని కమలం నేతలు భావిస్తున్నారని చెబుతున్నారు.
అయితే బీజేపీనే అలా చేసిందనే అపవాదు రాకుండా విజయసాయిరెడ్డితో మైండ్ గేమ్ ఆడిస్తోందని ఢిల్లీ వర్గాల సమాచారం. విజయసాయిని అప్రూవల్‌గా మార్చేసుకొని.. ఆయన్ను ముందుంచి.. వైసీపీని చీల్చేసి.. జగన్‌ను తప్పించాలన్నదే.. బీజేపీ ఎత్తుగడ అంటున్నారు. అందుకే, విజయసాయిరెడ్డికి ఢిల్లీలో అంత ప్రాధాన్యత ఇస్తున్నారని చెబుతున్నారు. త్వరలోనే ఆయన జగన్మాయ చేయడం ఖాయమంటున్నారు. ఇప్పటికైతే విజయసాయి జగన్ మనిషే.. మరి, ముందుముందు జగన్‌ను ముంచే మనిషి కావడం ఖాయమనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.