ప్రగతి భవన్ కు ఈటల.. కేటీఆర్ రాయబారం
posted on Mar 22, 2021 @ 3:26PM
తన సొంత నియోజకవర్గంలో మంత్రి ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు టీఆర్ఎస్ లో కలకలం రేపుతున్నాయి. సీఎం కేసీఆర్ పై ఈటల తిరుగుబాటు చేయబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్ తో తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించుకునే రాజేందర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారని ఆయన అనుచరులు చెబుతున్నారు. బీసీ ఎజెండాతో కొత్త పార్టీ పెట్టే యోచనలో ఈటల ఉన్నారని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈటల వ్యాఖ్యలు అసెంబ్లీలోనూ హాట్ టాపిక్ గా మారాయి. అధికార పార్టీతో పాటు విపక్ష సభ్యులంటూ దీని గురించి మాట్లాడుకోవడం కన్పించింది.
ఈటల వ్యాఖ్యలతో టీఆర్ఎస్ అధిష్టానం అప్రమత్తమైందని తెలుస్తోంది. TRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అసెంబ్లీ నుంచి మంత్రి ఈటెల రాజేందర్ ను వెంట బెట్టుకొని ప్రగతి భవన్ వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.ఆదివారం వీణవంక దగ్గర ఈటెల చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతుండటంతో ఆయన నుంచి వివరణ కోసం KCR.. ఈటలను పిలిపించి ఉంటారని కథనం వినిపిస్తోంది. ఈ వివాదానికి తెర దించడానికి స్వయంగా KTR రంగంలోకి దిగి రాయబారం నడుపుతున్నట్టుగా కూడా చెబుతున్నారు.
ఆదివారం తన సొంత నియోజకవర్గంలో పర్యటించిన ఈటల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ధర్మం, న్యాయం తాత్కాలికంగా ఓడిపోవచ్చు కానీ శాశ్వతంగా ఓడిపోదంటూ ఈటల నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. తాను గాయపడినా మనసు మార్చుకోలేదని.. కులం, డబ్బు, పార్టీ జెండాను కాదని, మనిషిని గుర్తు పెట్టుకోవాలంటూ మరింత మంట రాజేశారు రాజేందర్. 20 ఏళ్ల ప్రస్థానంలో ప్రజలు తనను ఎంతో ఎత్తుకు తీసుకెళ్లారన్నారు. మరి, అంత ఎత్త్తు నుంచి ఈటలను సడెన్‌గా కిందకు పడేసింది ఎవరు? వరుసగా ఆయన చేస్తున్న కాంట్రవర్సీ స్టేట్‌మెంట్స్ ఎవరిని ఉద్దేశించి? ఈటల పార్టీ వీడతారని.. కొత్త పార్టీ పెడతారనే ప్రచారంలో నిజమెంత? ఇలా ఈటల విషయంలో రాజకీయ మంట ఎగిసిపడుతోంది.
కేసీఆర్‌కు, ఈటలకు చెడిందని.. మంత్రి రాజేందర్‌ను ముఖ్యమంత్రి పూర్తిగా పక్కన పెట్టేశారని అంతా అంటున్నారు. ఇటు పార్టీలోనూ అటు ప్రభుత్వంలోనూ ఈటలకు ఇప్పుడు ఎలాంటి ప్రాధాన్యత లేదు. కనీసం ఎమ్మెల్సీ సన్నాహక సమావేశాలకు కూడా ఆయన్ను పిలవలేదు. కొత్త పార్టీ పెట్టడం పాన్ డబ్బా పెట్టినంత ఈజీ కాదంటూ గతంలో గులాబీ బాస్ చేసిన కామెంట్లు సైతం ఈటలను ఉద్దేశించే అంటున్నారు. గులాబీ జెండాకు అసలైన ఓనర్లం మేమేనంటూ గతంలో ఈటల చేసిన హాట్ కామెంట్స్‌పై ఇంకా హాట్ హాట్ డిష్కషన్ జరుగుతోంది. తాజాగా, ఎమ్మెల్సీ ఫలితాలు తర్వాత మరోసారి ధర్మం, న్యాయం, కులం, డబ్బు అంటూ రాజేందర్ పేల్చిన డైలాగులు దుమ్మురేపుతున్నాయి.