తెలంగాణలో మళ్లీ లాక్ డౌన్! అసెంబ్లీలో కేసీఆర్ ప్రకటన?
posted on Mar 22, 2021 @ 5:13PM
తెలంగాణలో కరోనా మళ్లీ పంజా విసురుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. స్కూల్స్, కాలేజీలు కరోనా హాట్ స్పాట్లుగా మారిపోయాయి. ఏ స్కూల్ లో పరీక్షలు నిర్విహంచినా పదుల సంఖ్య వైరస్ బాధితులు బయటపడుతున్నారు. కరోనా విజృంభణతో కేసీఆర్ సర్కార్ అప్రత్తమైంది. రాష్ట్రంలో మరోసారి లాక్ డౌన్ విధించే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో వైద్య శాఖా మంత్రి ఈటల రాజేందర్ సమావేశమయ్యారు. ఇతర రాష్ట్రాల్లో లాక్‌డౌన్ అమలు చేస్తున్న నేపథ్యంలో తెలంగాణలో లాక్‌డౌన్ పెట్టాలా వద్దా అనేదానిపై చర్చించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో వీకెండ్స్‌లో లాక్‌డౌన్ విధించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వారంలో 3 రోజుల పాటు లాక్‌డౌన్ లేదా రాత్రిపూట కర్ఫ్యూపై కసరత్తు చేస్తున్నారని, సినిమా థియేటర్లు, జనాల రద్దీ ఉండే ప్రాంతాల్లో ఆంక్షలు విధించే యోచనలో ఉన్నట్లు సమాచారం. తెలంగాణ సరిహద్దు రాష్ట్రమైనా మహారాష్ట్రలో కరోనా తీవ్రత భారీగా ఉండటంతో.. ఇక్కడి ప్రజల్లో కూడా ఆందోళన నెలకొంది.
రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో కరోనా కలవరపెడుతోంది. రోజురోజుకు పెరుగుతున్న పాజిటివ్‌లతో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు హడలిపోతున్నారు. మరో నెలన్నర రోజుల్లో పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్న తరుణంలో ఇప్పుడు సందిగ్ధత ఏర్పడింది.ఇప్పటికే 1 నుంచి 8వ తరగతి వరకు విద్యార్థుల్ని పైతరగతులకు ప్రమోట్ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. దీనిపై మంగళవారం అసెంబ్లీలో కేసీఆర్ కీలక ప్రకటన చేయనున్నారు. పెరుగుతున్న కోవిడ్ కేసులతో పాఠశాలల మూసివేతకు సర్కార్ సిద్ధమవుతోందని తెలుస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. పలు రాష్ట్రాలు కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న నగరాల్లో, ప్రాంతాల్లో పాక్షిక లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూలను అమలు చేస్తున్నాయి.
మరోవైపు తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 337 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 3,03,455కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ సోమవారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. ఆదివారం కరోనాతో ఇద్దరు మృతిచెందారు. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 1671కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 2,958 ఉండగా.. వీరిలో 1,226 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. కొత్తగా నమోదైన కేసులో జీహెచ్‌ఎంసీ పరిధిలో 91 కేసులు ఉన్నాయి.