మౌనమేలనోయి..? కొండంత కిరికిరి!
posted on Mar 22, 2021 @ 5:34PM
ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిశాయి. రెండు చోట్లా కాంగ్రెస్ చిత్తు చిత్తుగా ఓడిపోయింది. ప్రతిపక్షాలన్నీ టీఆర్ఎస్‌ను తిట్టి పోస్తున్నాయి. అరాచకాలతో ఎమ్మెల్సీలు గెలిచారంటూ దెప్పిపొడుస్తున్నాయి. రాజకీయంగా ఇంత హడావుడి ఉంటే.. ఫైర్ బ్రాండ్ లీడర్ రేవంత్‌రెడ్డి మాత్రం పత్తా లేకుండా పోయారు. కేసీఆర్‌పై ఒంటికాలిపై లేచే కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. వారం రోజులుగా వార్తల్లో కనిపించడం లేదు. సమయం, సందర్భం లేకుండా గులాబీ బాస్‌ను ఏకిపారేసే రేవంత్.. కీలక సమయంలో సైలెంట్ కావడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది.
మొన్నటి వరకూ ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నారెడ్డి గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం చేశారు రేవంత్. నియోజక వర్గ పరిధిలో పర్యటిస్తూ.. సర్కారు దుమ్ముదులిపారు. చిన్నారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఇంత వరకూ బాగానే ఉంది. ఇలా ప్రచారం ముగిసిందో లేదో.. అలా మాయమైపోయారు. సుదీర్ఘంగా సాగిన ఎమ్మెల్సీ కౌంటింగ్ సమయంలోగానీ, ఫలితాలు వచ్చాక గానీ.. రేవంత్ గొంతు ఎక్కడా వినిపించలేదు. మనిషీ కనిపించలేదు. అసలు రేవంత్ విషయంలో ఏం జరగింది? ఏం జరుగుతోంది? అనేది ఆసక్తికరంగా మారింది.
ఓటింగ్ సరళితో కాంగ్రెస్ ఓడిపోతుందని రేవంత్‌రెడ్డి ముందే గ్రహించారని అంటున్నారు. కాంగ్రెస్‌లో ఎంత ఎగిరినా ప్రయోజనం లేదనే భావనకు వచ్చారంటున్నారు. తనను పీసీసీ చీఫ్ చేసేందుకు అధిష్టానం వెనకాడుతుండటం.. పార్టీలోని సీనియర్లు ఆయనను అస్సలు పట్టించుకోకపోవడం.. వరుస ఓటమిలు.. ఇలా కాంగ్రెస్‌లో ఉంటే ఇంతే అనే వేదాంత ధోరణికి రేవంత్ వచ్చారంటున్నారు.
నిన్నా మొన్నటి వరకు రేవంత్ కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరుతారంటూ ప్రచారం జరగ్గా.. తాజాగా మరో కొత్త టాక్ పొలిటికల్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. ఆ పార్టీ, ఈ పార్టీలో ఉండటం, చేరటం ఎందుకని.. తానే సొంతంగా పార్టీ పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అందుకు బలం చేకూరేలా.. కొండా విశ్వేశ్వరరెడ్డి ఎపిసోడ్ మరో టర్న్ తీసుకుంది. ఇప్పటికే కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన కొండా మూడునెలలు రాజకీయాలకు దూరంగా ఉంటానని ఆయనే ప్రకటించారు. విశ్వేశ్వరరెడ్డి బీజేపీ తీర్థం తీసుకుంటారంటూ టాక్ నడిచింది. అయితే, సడెన్‌గా ఆయన ఆలోచనల్లో మార్పు వచ్చినట్టు కనిపిస్తోంది. ఇప్పటికే ఉన్న పార్టీలో చేరాలా? లేక, కొత్త పార్టీ పెట్టాలా? అనే ఆలోచన చేస్తున్నట్టు స్వయంగా కొండానే క్లారిటీ ఇచ్చారు. దీంతో.. ఆ కొత్త పార్టీ రేవంత్‌రెడ్డిదేనంటూ ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే, రేవంత్‌కు నమ్మదగిన అనుచరుడు కొండా విశ్వేశ్వరరెడ్డి. రేవంత్ డైరెక్షన్‌లోనే కొండా రాజకీయ ముందడుగులు వేస్తున్నారని అంటున్నారు. ఇప్పటికే రేవంత్ ప్రధాన అనుచరుడు కూనా శ్రీశైలంగౌడ్ కాంగ్రెస్‌ను వీడటం, ఆ తర్వాత కొండా హస్తం పార్టీకి హ్యాండ్ ఇవ్వడం సడెన్‌గా జరిగినవి కావని.. వీరిద్దరూ రేవంత్ రాజకీయ పావులంటూ చర్చ జరుగుతోంది. అన్ని నదులు సముద్రంలో కలిసినట్టు.. తిరిగి అంతా కలిసి రేవంత్ పెట్టబోయే కొత్త పార్టీలో చేరుతారని అంచనా వేస్తున్నారు. కొత్త పార్టీ ఏర్పాట్లను ఇప్పటికే ప్రారంభించారని.. త్వరలోనే ఆ విషయం ప్రకటిస్తారని లీకులు వస్తున్నాయి. అందుకే, ఎలాగూ వదిలేసే పార్టీలో అంతగా హడావుడి చేయడం ఎందుకనే ధోరణితోనే రేవంత్‌రెడ్డి ఎమ్మెల్సీ ఫలితాల తర్వాత సైలెంట్ అయిపోయారని అంటున్నారు. ఆయన మౌనం వెనుక అనేక అర్థాలు ఉన్నాయంటూ.. ఎవరి తోచిన ఊహాగానం వారు చేస్తున్నారు. రేవంత్ మౌనం వీడితేనే.. ఆయన మనసులో మాటేంటో తెలిసేది. అప్పటి వరకూ.. కమాన్ గుసగుస...