ప్రభుత్వ సహకారంతోనే.. ఓటు కోసం హైకోర్టుకు?

ఏపీలో స్థానిక ఎన్నికలు విజయవంతంగా నిర్వహించాం. రీపోల్ లేకుండా ఎన్నికలు నిర్వహించడం చాలా అరుదు. స్థానిక ఎన్నికల్లా కాకుండా సాధారణ ఎన్నికల స్థాయిలో ఈ ఎన్నికలు నిర్వహించాం. ప్రభుత్వ తోడ్పాటుతోనే ఇది సాధ్యమైందన్నారు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్. మార్చి 31తో ఆయన పదవీ విరమణ చేయనున్నారు. ఎన్నికల నిర్వహణ పట్ల తాను పూర్తి సంతృప్తిగా ఉన్నానన్నారు. మీడియా ద్వారా సిఎస్‌కు, సహచర ఉద్యోగులకు ధన్యవాదాలు తెలియజేశారు. వ్యవస్థల మధ్య అంతరాలు అనవసరంగా వచ్చాయన్నారు నిమ్మగడ్డ.  ఏపీ హైకోర్టు పంచాయతీ ఎన్నికల్లో కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిందని నిమ్మగడ్డ గుర్తు చేశారు. ఎన్నికల కమిషన్ ఒక రాజ్యాంగ వ్యవస్థ అని, 243కె ద్వారా విస్తృత అధికారాలు రాజ్యాంగం కల్పించిందన్నారు. వ్యవస్థలపై తనకు పూర్తి అవగాహన ఉందన్నారు. నామినేషన్ వెయ్యనివ్వలేనప్పుడు మరో అవకాశం ఇచ్చేందుకు ప్రయత్నం చేశామని చెప్పారు.  ఇక తన ఓటు హక్కుపై చెలరేగిన దుమారంపైనా స్పందించారు ఎస్ఈసీ నిమ్మగడ్డ. తన ఓటు తెలంగాణలో రద్దు చేసుకుని సొంత గ్రామంలో ఓటు అడిగానని, అది నిరాకరించడంవల్ల టీ కప్పులో తుఫానుగా మారిందన్నారు. ఇప్పటికీ తన ఓటు హక్కు కలెక్టర్ వద్ద పెండింగ్‌లో ఉందన్నారు. తాను పదవిలో ఉన్నంత కాలం ఇలాంటి వ్యక్తిగత విషయాలు పట్టించుకోలేదని.. పదవీ విరమణ తర్వాత ఒక పౌరుడిగా తన హక్కు సాధించుకోడానికి వెనకాడనన్నారు. ఓటు హక్కు కోసం అవసరమైతే హైకోర్టుకు వెళతానన్నారు నిమ్మగడ్డ రమేశ్ కుమార్.

వైసీపీకి ఓటేయను.. జగన్ కి పనిచేయను...

ఏపీలో దళితుల హక్కులను తుంగలో తొక్కుతున్నారని. ఎసి ఎస్టీ అట్రాసిటీ కేసును తప్పుదోవ పట్టిస్తున్నారు. రైతులపై దాడులు చేస్తున్నారని. వైసీపీ ప్రభుత్వం పై అమరావతి దళిత జేఏసీ మండిపడింది. ఇది ఇలా ఉండగా రైతులు వైసీపీ పార్టీ పాలనపై చాలా విరక్తిగా మాట్లాడారు.    గత ఎన్నికల్లో వైసీపీ ఏజెంట్‌గా పని చేశాను. జీవితంలో బుద్ధి వచ్చింది. ఇంకోసారి వైసీపీకి ఓటు వేయను, ఆ పార్టీ కి పని చేయను. ఒక్క అవకాశం ఇచ్చి చూడండి అని అప్పుడు అన్నాడు. గెలిచాక ఇప్పుడు అమరావతిని నాశనం చేస్తున్నాడు.  అవకాశం అంటే ఆదరించారు గానీ.. అన్యాయం జరిగితే ఊరుకునేది  లేదు ఆనుతున్నారు ఏపీ రైతు జెఏసి. అమరావతిలోని బడుగు, బలహీన వర్గాల రైతులను అణగదొక్కడానికి వైసీపీ ప్రభుత్వం వారిపై అక్రమ కేసులు బనాయించిందన్నారు. రాజధాని అమరావతికి భూములిచ్చిన దళిత రైతులకు జగన్‌ ప్రభుత్వం న్యాయం చేయడం లేదని రాజధాని దళిత జేఏసీ జగన్ ప్రభుత్వం పై నిప్పులు చెరిగింది. వెలగపూడి రైతు జేఏసీ కార్యాలయంలో నిర్వహించిన దళిత రైతుల సమావేశంలో రాయపూడి, ఉద్దండ్రాయునిపాలెం, తాళ్లాయపాలెం, మందడం, వెంకటపాలెం, ఐనవోలు, దొండపాడు గ్రామాలకు చెందిన దళిత, బీసీ, ఇతర వెనుకబడిన వర్గాలకు చెందిన అసైన్డ్‌ రైతులు పాల్గొన్నారు. సమావేశంలో ఐనవోలుకు చెందిన రైతు జెట్టి చిన్నా మాట్లాడుతూ వైసీపీ కి ఎప్పుడు పనిచేయనని ఓటు వేసేది లేదని తెగేసి చెప్పాడు.   మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌ మాట్లాడుతూ రాష్ట్రము లో దళితులకు హక్కు కల్పిస్తూ గత టీడీపీ ప్రభుత్వం జారీ చేసిన జీఓ.41ని సీఎం జగన్‌రెడ్డి రద్దు చేస్తానని చెప్పడం ఆయన నియంత్ర పాలనకు నిదర్శనమని.. అమరావతి లో అసైన్డ్‌ రైతుల భూములు లాక్కున్నారని ప్రచారం చేయిస్తున్నారని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్టు దుర్వినియోగం చేసిన ప్రభుత్వం బహుశా దేశ చరిత్రలో జగన్‌రెడ్డి ప్రభుత్వమే అని శ్రావణ్ కుమార్ అన్నారు. ఎస్సీ నియోజకవర్గంలో రాజధాని అభివృద్ధి చెందుతుంటే ఓర్వలేక నాశనం చేయడానికి పూనుకున్నారని. మంగళగిరి ఎమ్మెల్యే ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తమ భూముల అమ్మకాలు, కొనుగోళ్లకు అవకాశం కల్పించాలని రాజధాని అసైన్డ్‌ రైతులు అడిగితేనే మాజీ సీఎం చంద్రబాబు జీఓ.41 ఇచ్చారన్నా రు. అసైన్డ్‌ దళిత రైతుల హక్కుల గురించి, జీఓ.41తో అసైన్డ్‌ రైతులకు కలిగే ప్రయోజనాల గురించి హైకోర్టు న్యాయవాది లక్ష్మీనారాయణ వివరిం చారు. గ్రామాల్లో దళిత రైతుల ఇళ్ల వద్దకు సీఐడీ పోలీసులు వచ్చి వారిని భయభ్రాంతులకు గురిచేయడం మానుకోవాలన్నారు. మిగిలిన రైతులతో సమానంగా అసైన్డ్‌ రైతులకు ఇస్తామన్న ప్రత్యేక ప్యాకేజీని  ప్రభుత్వం అమలు చేయాలని సమావేశంలో తీర్మానించారు. దళితుల భూములను అడ్డంపెట్టుకొని రాజకీయంగా లబ్ధి పొందడం జగన్ కే చెల్లుతుందని. అమరావతి లో కట్టిన పేదల టిడ్కో గృహాలు కల్పించాలని.  ప్రతి దళిత రైతుకి రూ.5వేలు పింఛను హామీ అమలు చేయాలని తీర్మానాలు చేశారు. రాజధానిలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మరియు అధికారులు దళితుల భూములపై కుట్రలు పన్ని, వారిని మానసికంగా ఆందోళనకు గురిచేస్తున్నారని. వారిపై అట్రాసిటీ కేసులు నమోదు చేసి వారిపై చర్యలు తీసుకోవాలని తీర్మానించారు. ఈ సమావేశం లో దళిత జేఏసీ కన్వీనర్‌ గడ్డం మార్టిన్‌, జేఏసీ మహిళా అధ్యక్షురాలు సువర్ణ కమల, కంభంపాటి శిరీష, జేఏసీ సభ్యులు బేతపూడి సుధాకర్‌, ముళ్లమూడి రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.  

జగన్ సర్కార్ పై హైకోర్టు సీరియస్ 

ఆంధ్రప్రదేశ్ లోని జగన్ రెడ్డి  ప్రభుత్వంపై ఏపీ హైకోర్టు మరోసారి సీరియస్ అయింది. ఉపాధి హామీ పనులకు బిల్లులు చెల్లించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై సరైన జవాబు ఇవ్వకపోతే సీఎస్‌ను కోర్టుకు పిలిపించాల్సి ఉంటుందని ధర్మాసనం హెచ్చరించింది. రాష్ట్రంలో 2018 నుంచి 2019 వరకు నరేగా పనులు చేసిన వారికి బిల్లులు చెల్లించడం లేదంటూ న్యాయవాదులు వీరారెడ్డి, ప్రణతి, నర్రా శ్రీనివాస్‌ పిటిషన్లు వేశారు. దీనిపై సుమారు ఏడాది కాలంగా విచారణ జరుగుతోంది. 2018 నుంచి 2019 వరకు ఎన్ని బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి? ఎంత మొత్తం చెల్లించాలో కోర్టుకు నివేదించాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. దీనికి సమాధానంగా కేంద్రం నుంచి డబ్బులు రాలేదని ప్రభుత్వం తరఫున న్యాయవాది చెప్పారు. ఆ సమాధానంతో న్యాయస్థానం సంతృప్తి చెందలేదు. 2018 నుంచి 2019 వరకు రాకపోతే ఆ తర్వాత సంవత్సరాలకు బిల్లులు ఎలా వచ్చాయని కోర్టు ప్రశ్నించింది. పైగా రూ. 5 లక్షల లోపు ఉన్న బిల్లులకు 20 శాతం తగ్గించి ఇస్తామని కోర్టుకు చెప్పి ఆ తర్వాత డబ్బులు ఎందుకు ఇవ్వలేదని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు వారాల్లో పూర్తిస్థాయి అఫిడవిట్ దాఖలు చేయాలని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది.  

హైదరాబాద్ లో కరోనా హాట్ స్పాట్స్

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. జీహెచ్ఎంసీలో ఆందోళనకరంగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ వచ్చిందనే భయాందోళన వ్యక్తమవుతోంది. దీంతో  మహమ్మారి కట్టడి కోసం జీహెచ్ఎంసీ గట్టి చర్యలు చేపట్టింది. మరోసారి నగరంలో కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసే యోచనలో అధికారులు ఉన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని కూకట్ పల్లి, జీడిమెట్ల, శేరిలింగంపల్లి, హిమాయత్ నగర్, చింతల్ బస్తీ, మలక్ పేట్, చాంద్రాయణగుట్ట, ఎల్బీనగర్ లను అధికారులు హాట్ స్పాట్స్ గా ప్రకటించారు. ఈ ప్రాంతాల్లో ఉన్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఇప్పటికే సిటీలో మాస్క్ మస్ట్ అనే ప్రచారంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.  ప్రత్యామ్నాయ చర్యలు చేపడితే కొంతవరకైనా కరోనా పాజిటివ్ కేసులు రాకుండా ఉంటాయని జీహెచ్ఎంసీ అభిప్రాయం వ్యక్తం చేస్తుంది. జీహెచ్‌ఎంసీలోని ప్రధాన కార్యాలయంలో కరోనా వేగంగా విస్తరిస్తోంది. కార్యాలయంలోని  3, 4, 5 అంతస్తుల్లో పని చేసే 10 మంది ఉద్యోగులకు కరోనా వచ్చింది. దీంతో ఉద్యోగులు డ్యూటీకి రావాలంటేనే భయపడిపోతున్నారు మరోవైపు కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మాస్కులపై వాహనదారులకు రాచకొండ టాఫిక్ పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. ప్రతిఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచిస్తున్నారు. మాస్క్‌లు ధరించక పోతే కరోనా ఎలా వెంటాడుతుందో వాహన దారులకు తెలియజేస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం జూబ్లిహిల్స్ చెక్ పోస్ట్ వద్ద వాహనదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.  ప్రజలంతా కచ్చితంగా మాస్కులు ధరించాలని ప్లకార్డులతో అవగాహన కల్పిస్తున్నారు. గుంపులు గుంపులుగా గేదరింగ్ అవ్వొద్దని చెబుతున్నారు. కరోనా నిబంధనలు పాటించాలని సూచిస్తున్నారు. మరి కొన్ని రోజుల పాటు స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.   

పవన్ సీఎం.. జగన్‌లో కలవరం..

మా సీఎం అభ్యర్థి పవన్ కల్యాణ్. ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు సంచలన ప్రకటన. తిరుపతి ఉప ఎన్నికల కోసమే ఈ స్టేట్‌మెంట్ అంటూ ప్రత్యర్థి పార్టీల విమర్శ. మిగతా పార్టీల సంగతి ఏంటో గానీ.. అధికార వైసీపీలో మాత్రం ఈ ప్రకటన ప్రకంపణలు స‌ృష్టిస్తోంది. బీజేపీ. జనసేన కలిసి పోటీ చేయడం ఫ్యాన్ పార్టీకి సంకటమే. అలాంటిది పవన్ కల్యాణ్ సీఎం కేండిడేట్ అంటూ ఎన్నికల బరిలో దిగితే వైసీపీ ఓట్లు భారీగా డైవర్ట్ అయ్యే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో బీజేపీ, జనసేన వేరు వేరుగా పోటీ చేయడంతో ఆ మేరకు వైసీపీ లాభపడింది. ఈ సారి సీన్ అలా ఉండబోదని.. జగన్ పార్టీ సీన్ సితారా కావడం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పవన్ అంటే ఓ పేరు కాదు. అదో పవర్. అభిమానులకు పూనకం తెప్పించే ఎమోషన్. పవర్ స్టార్‌ను పవర్‌లో చూడాలనేది ఫ్యాన్స్ కోరిక. ఆయన కనిపిస్తేనే ఊగిపోతారు. నినాదాలతో హోరెత్తిస్తారు. కానీ, ఓటేయమంటే సైడ్ అయిపోతారు. గత ఎన్నికల్లో ఇదే జరిగింది. ఈసారి మాత్రం అలా జరగబోదంటోంది జనసేన. తొలిసారి కాబట్టి జగన్‌కు ఒక్క ఛాన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఆ ఛాన్స్ ఎందుకిచ్చామా అని జనం తల పట్టుకుంటున్నారు. రెండేళ్లలోనే జగన్ ఎంత డేంజరో జనాలకి తెలిసొచ్చింది. రాష్ట్రాన్ని దివాళా అంచున నిలబెట్టిన జగన్‌ను ప్రజలు ఈసడించుకుంటున్నారు. జగన్‌కు ప్రత్యామ్నాయం జనసేనానే అంటున్నారు ఆయన అభిమానులు. 2019లో కామ్రేడ్లు, బీఎస్పీతో కలిసి బరిలో దిగారు పవన్ కల్యాణ్. ఎన్నికలయ్యాక మీకేమైనా బాకీనా? అంటూ కామ్రేడ్లతో దోస్తీకి కటీఫ్ చెప్పారు. మోదీనే బెస్ట్ అంటూ బీజేపీతో జత కలిశారు. తెలంగాణ బీజేపీతో సంబంధాలు చెడినా.. ఏపీ బీజేపీతో మైత్రి బంధం ప్రస్తుతానికైతే బాగానే నడుస్తోంది. ముందుముందూ నడుస్తుందని ఆశిస్తున్నారు. తిరుపతి ఎంపీ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన గట్టిగా ప్రయత్నించింది. గత ఎంపీ ఎలక్షన్లలో బీజేపీకంటే తమకే ఎక్కువ ఓట్లు వచ్చాయని ఆ లెక్కలన్నీ ముందేసింది. అయినా, కమలనాథులు కనికరించలేదు. తిరుపతి సీటు జనసేనకు ఇవ్వలేదు. కానీ, అనూహ్యంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన కూటమి తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థి పవన్ కల్యాణే అంటూ సంచలన ప్రకటన చేశారు సోము వీర్రాజు. పీకే క్రేజ్‌ను తిరుపతి బై పోల్‌లో ఫుల్‌గా క్యాష్ చేసుకునేందుకే ఈ స్టేట్‌మెంట్ ఇచ్చారని కొందరు అంటున్నారు. అయితే, అలాంటిదేమీ లేదని.. ఏపీలో బీజేపీ ఇంకా సీఎం కుర్చీకి పోటీ పడే స్థాయికి చేరుకోలేదని చెబుతున్నారు. ముందు తమ మిత్రుడు పవన్ కల్యాణ్‌కు ఛాన్స్ ఇచ్చి.. ఆ తర్వాత పార్టీ పరంగా మరింత బలపడి.. ఆ తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చనే ఆలోచనలో కమలదళం ఉందని విశ్లేషిస్తున్నారు. సీఎం కేండిడేట్‌గా పవన్ కల్యాణ్ పేరును ఇప్పుడే తెరమీదకు తీసుకురావడం వ్యూహాత్మకమంటున్నారు. అయితే, ఈ ప్రకటన అధికార వైసీపీని కలవరపాటుకు గురి చేస్తోంది. ఏపీకి అన్యాయం చేసిన పార్టీగా బీజేపీపై గుర్రుగా ఉన్నారు ఏపీ ప్రజలు. ఎంతగా టెంపుల్ పాలిటిక్స్ చేస్తున్నా.. ఓటర్లను ఆకర్షించలేకపోతున్నారు. అటు, పవన్ కల్యాణ్ టైం పాస్ పాలిటిక్స్ చేస్తూ.. అప్పుడప్పుడూ ఆవేశంగా ఊగిపోతూ.. ఆ తర్వాత కొంతకాలం సినిమాలు చేస్తూ.. ఇలా రెండు పడవలపై కాళ్లు పెట్టి ప్రయాణం సాగిస్తున్నారు. ఆ రెండు పార్టీల మైనస్‌లు ఇన్నాళ్లూ వైసీపీకి పాజిటివ్‌గా మారాయి. ఇటీవల ముగిసిన స్థానిక సమరంలో జనసేన చెప్పుకోదగ్గ సంఖ్యలో స్థానాలు గెలుచుకోవడం అధికార పార్టీకి షాక్ ఇచ్చింది. ఇక ప్రజల్లో హీరో పరంగా ఫుల్ క్రేజ్ ఉన్న పీకే.. సీఎం కేండిడేట్‌గా బీజేపీ మద్దతుతో తెర మీదకు వస్తే.. అది వైసీపీకి పిడుగుపాటే. ఇప్పటికే మద్యం ధరలు, ఇసుక ధరలు, అభివ‌ృద్ధి తిరోగమనం తదితర అంశాలతో జగన్‌పై వ్యతిరేకత ఉన్న ఆ పార్టీ సానుభూతి వర్గం ఓట్లు చెప్పుకోదగ్గ స్థాయిలో జనసేన వైపు షిఫ్ట్ అయ్యే అవకాశం లేకపోలేదు. టీడీపీ ఓట్లు ఎలానూ టీడీపీకే పడతాయి కాబట్టి.. పవన్ కల్యాణ్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించడం అధికార పార్టీ ఓట్లకే చిల్లు. అందుకే, సోము వీర్రాజు ప్రకటన చేసినప్పటి నుంచీ వైసీపీలో కలకలం చెలరేగుతోంది. పైకి గంభీరంగా ఉంటున్నా.. లోలోన గుబులు మొదలైంది. 

గుడిసెలో ఆరుగురు చిన్నారులు సజీవ దహనం

ఆరుగురు చిన్నారులు.. పూరి గుడిసెలో ఆడుకుంటున్నారు. వాళ్ల తల్లిదండ్రులు పనికి వెళ్లడంతో అందరూ ఇంట్లో కూర్చుని ఆడుకుంటున్నారు. వాళ్లంతా సరదాగా ఉండగానే జరగరాని ఘోరం జరిగింది. వాళ్లు ఉన్న గుడిసెకు నిప్పంటుకుంది. పూరి గుడిసె కావడంతో వేగంగా మంటలు విస్తరించాయి. నిమిషాల్లోనే గుడిసె మొత్తం తగలబడింది. అందులో ఆడుకుంటున్న ఆరుగురు చిన్నారులు కూడా ఆ మంటల్లో సజీవ దహనమయ్యారు. అత్యంత విషాదకరమైన ఈ ఘటన బీహార్ రాష్ట్రంలో జరిగింది.  బీహార్‌లోని అరరియా ప్రాంతంలో పలసి పోలీస్ స్టేషన్ పరిధిలోని కబియా గ్రామంలో ఈ దారుణం జరిగింది. మంటల్లో చిక్కుకున్న పిల్లల కేకలు విన్న కొందరు యువకులు కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ.. మంటలు దట్టంగా అలుముకోవడంతో వాళ్లు కాపాడలేకపోయారు. ఇల్లు తగలబడిన విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. అయితే.. అప్పటికే జరగకూడని నష్టం జరిగిపోయింది.ఫైర్ డిపార్ట్‌మెంట్ వాహనం వచ్చి మంటలను ఆర్పేసింది.  పోలీసులు చిన్నారుల మృతదేహాలను పోస్ట్‌మార్టానికి తరలించారు.   పూరి గుడిసె తగలబడిందన్న సంగతి తెలిసిన వెంటనే వందల సంఖ్యలో గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. అయితే మంటలు ఎలా రేగాయన్న దానికి ప్రస్తుతానికి కారణం తెలియరాలేదు. ఆరుగురు అభంశుభం తెలియని చిన్నారులు మంటల్లో చిక్కుకుని చనిపోవడంతో గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆ చిన్నారుల తల్లిదండ్రులను ఓదార్చడం అక్కడున్న వారి తరం కాలేదు. 

రాష్ట్రపతి కోవింద్‌ కు బైపాస్ సర్జరీ 

భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ బైపాస్ సర్జరీ జరిగింది. ఢిల్లీలోని ఎయిమ్స్ లో ఆయనకు ఈ చికిత్స నిర్వహించారు. ఛాతీలో అసౌకర్యంగా ఉండటంతో రాష్ట్రపతి కోవింద్‌ గత శుక్రవారం ఉదయం ఢిల్లీలోని ఆర్మీ (ఆర్ అండ్ ఆర్) ఆసుపత్రిలో హెల్త్ చెక్ అప్ చేయించుకున్నారు. ప్లాన్‌డ్ బైపాస్ ప్రొసీజర్ చేయించుకోవాలని వైద్యులు సూచించడంతో.. కోవింద్‌ను మార్చి 27న మధ్యాహ్నం ఎయిమ్స్‌కు తరలించారు. మంగళవారం ఎయిమ్స్ లోని ప్రత్యేక వైద్య బృందం  రాష్ట్రపతికి శస్త్ర చికిత్స నిర్వహించింది.    రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు జరిగిన బైపాస్ సర్జరీ విజయవంతమైందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ట్వీట్ ద్వారా తెలిపారు. ఢిల్లీలోని అఖిల భారత వైద్య, విజ్ఞాన శాస్త్రాల సంస్థ (ఎయిమ్స్)లో ఆయనకు ఈ చికిత్స జరిగినట్లు తెలిపారు. ఈ శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించిన వైద్యుల బృందాన్ని అభినందించారు. రాష్ట్రపతి కోవింద్ ఆరోగ్య పరిస్థితి గురించి ఎయిమ్స్ డైరెక్టర్‌ను అడిగి తెలుసుకున్నానని తెలిపారు. ఆయన త్వరగా కోలుకోవాలని, క్షేమంగా ఉండాలని రాజ్ నాథ్ సింగ్ ఆకాంక్షించారు.    

అంత్యక్రియలు జరిగాక.. తిరిగొచ్చాడు..

ఓ వ్యక్తి  దొంగతనం కేసులో జైలు కి వెళ్ళాడు.. తాను జైలు నుండి తిరిగి వచ్చే సరికి.. ఆ వ్యక్తి చనిపోయాడని అనుకున్న తన కుటుంబసభ్యులు భారత సంప్రదాయం ప్రకారం.. అంత్యక్రియలు చేశారు. పిండం పెట్టారు. ఈ తంతు అంతా చేసిన మూడు నెలలకి ఆ వ్యక్తి తన కుటుంబ సభ్యుల ముందు ప్రత్యక్షమయ్యాడు. దీంతో ఆ కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. తన పేరు సాబూ..  క్యాటరింగ్, బస్సు క్లినింగ్ వంటి పనులు చేస్తుండే వాడు.. అప్పుడప్పుడు చేతికి పని చెబుతూ చిన్న చిన్న దొంగతనాలు చేస్తుండేవాడు. దొంగతనాలకు అలవాటు పడిన సాబూ.. తాను పనిచేస్తున్న హోటల్ లో డబ్బు దొంగిలించాడు. ఆ నేరం కింద పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. అయితే సాబూ రాకపోవడంతో బంధులు వెతికారు. ఇంతలోనే స్థానిక పోలీసు స్టేషన్‌ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించాడు. పోలీసులు ఆ మృతదేహం సాబూదేనన్న అనుమానంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆ దేహం సాబూదేనని పొరపాటు పడిన కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. సీన్ కట్ చేస్తే మూడు నెలలు గడిచిపోయింది. సాబూను అంతా మరిచిపోయారు. ఒక బస్‌ డ్రైవర్‌కు సాబూ తటస్థపడ్డాడు. సాబూను గుర్తుపట్టిన డ్రైవర్‌ సమాచారాన్ని పోలీసులకు, కుటుంబ సభ్యులకూ తెలియజేశారు.దీంతో సాబూ బతికే ఉన్నాడని తెలుసుకుని.. అతని కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు. ఈ ఘటన కేరళ రాష్ట్రం పతనంతిట్ట జిల్లాలోని కుదస్సనాడులో జరిగింది. సాబూ కథ సుఖాంతం కావడంతో.. గత డిసెంబర్‌లో అంత్యక్రియలు జరిపిన మృతదేహం ఎవరిదో తెలుసుకునే పనిలో పడ్డారు పోలీసులు.  

జగన్ సేవ వర్సెస్ జనం సేవ

తిరుపతి ఉపఎన్నిక 'జగన్ సేవ వర్సెస్ జనం సేవ' అని అన్నారు జీవీఎల్. ఏది కావాలో జనం తేల్చుకోవాలని పిలుపిచ్చారు. జగన్‌కు వ్యక్తిగతంగా సేవలందించిన వ్యక్తికి ఎంపీ టికెట్ ఇస్తారా? వ్యక్తిగత సేవలు చేసిన వారికి నామినేటెడ్ పోస్టులు ఇవ్వొచ్చు కదా అని ప్రశ్నించారు బీజేపీ నేత, రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధిలో ప్రధాని మోదీ ముద్ర స్పష్టంగా కనిపిస్తోందన్నారు జీవీఎల్. తిరుపతి అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? అని వైసీపీకి సవాల్ విసిరారు. సోము వీర్రాజు గురించి విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ వైసీపీ భయాన్ని సూచిస్తోందన్నారు. బీజేపీ చేసిన అభివృద్ధిని, ప్రస్తుత పాలకుల వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పారు. తిరుపతిలో బీజేపీ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరన్నారు జీవీఎల్. 

ఎర్రచందనం సరిపోక తలనీలాలా?

తిరుమల శ్రీవారి భక్తుల తలనీలాలు చైనాకు స్మగ్లింగ్ చేస్తున్నారన్న అంశం ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. టీటీడీ పెద్దల డైరెక్షన్ లోనే స్మగ్లింగ్ జరుగుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. అడుగడుగునా సీసీ కెమెరాలు, అత్యంత భద్రత ఉండే తిరుమల శ్రీవారి ఆలయం నుంచి తలనీలాలను తీసుకెళ్లడం అసాధ్యమంటున్నారు. ఇంటిదొంగల సహకారంతోనే స్కాం జరుగుతుందని వెంకన్న భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  తిరుమల శ్రీవారి భక్తులు సమర్పించిన తలనీలాల స్మగ్లింగ్ పై నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు తీవ్రంగా స్పందించారు. తిరుపతి వెంకన్నకు  భక్తులు సమర్పించిన తలనీలాలు కూడా అమ్మకపోవడం సిగ్గుచేటన్నారు. స్వామివారి డబ్బులు దొంగిలించిన వారు బాగుపడినట్లు చరిత్రలో లేదన్నారు రఘురామ. ఇన్నిరోజులు ఎర్రచందనం, ఇప్పుడు తలనీలాలు  దొంగిలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  దేశంలో ఏ రాష్ట్రంలో కూడా బడ్జెట్‌ను ఆర్డినెన్స్ ద్వారా ప్రవేశపెట్టిన పరిస్థితి లేదని రఘురామకృష్ణంరాజు  అన్నారు. రానున్న కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉండనుందని.. దీనిపై సీఎం జగన్మోహన్‌రెడ్డి కనీసం మాటకూడా మాట్లాడడం లేదన్నారు. మరో రోమ్ చక్రవర్తిని ఎన్నుకున్నామన్న భావనలో రాష్ట్ర ప్రజలు ఉన్నారని రఘురామ ఎద్దేవా చేశారు. రుణ ఆంధ్రప్రదేశ్ నుంచి దివాలా ఆంధ్రప్రదేశ్‌గా రాష్ట్రం మారే అవకాశాలు తొందరలో ఉన్నాయని నర్సాపురం ఎంపీ  హెచ్చరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాల కోసం మద్యంపై ఆదాయాన్ని పెంచుకోవాల్సి వస్తుందన్నారు.  బీజేపీ-జనసేన పొత్తుపైనా రఘురామ కృష్ణం రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్‌ను సీఎంగా చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించడం చూస్తే, వైసీపీకి ప్రమాదమేమో అన్న అనుమానం కలుగుతుందని చెప్పారు. సీబీఐ అధికారులు తనపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయడంలో ఎవరి ఒత్తిడి అయినా ఉందా అనే కోణంలో దర్యాప్తు చేయమని త్వరలో లేఖ రాస్తానని ఎంపీ రఘురామకృష్ణంరాజు  చెప్పారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును ఇన్ని రోజులయినా సీబీఐ చేధించకపోవడం బాధాకరమని ఎంపీ రఘురామకృష్ణంరాజు తెలిపారు.

బంజారాహిల్స్ లో లవర్ సూసైడ్.. 

ప్రేమించుకున్నారు. పెద్దలకు తెలియకుండా పెళ్లి చేసుకున్నారు. చివరికి ఆ విషయం తెలిసిన పెద్దలు వాళ్ళని విడదీశారు.. అయినా అప్పుడప్పుడు కలుసుకునేవాళ్ళు.. ఆ తరుణంలో ఎలాగైనా పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటానని తన ప్రియుడు, ఆ ప్రియురాలికి మంగమ్మ శపథం చేశాడు..కాలం గడుస్తూ వచ్చింది.. పెళ్లి మాట పక్కన పెట్టాడు ఆ ప్రియుడు.. కొంత కాలం తర్వాత  ఆ విషయం పై ప్రియుడిని నిలదీసింది.. ప్రియుడు పెళ్ళికి నిరాకరించాడు. ఆ విషయాన్నీ జీర్ణించుకోలేని ఆ అమ్మాయి హాస్టల్ ఫ్యాన్ కి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.  సూర్యాపేటకు చెందిన ఐశ్వర్య (19) నగరంలో ప్రైవేటు ఉద్యోగం చేస్తూ బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 5లోని ఓ ప్రైవేటు హాస్టల్ లో ఉంటుంది. ఈ క్రమంలో మరెడ్డి అషేర్ (20) అనే యువకుడితో ఆమెకు  పరిచయం ఏర్పడింది.. ఆ పరిచయం ప్రేమ అనే గీత దాటి, వివాహం వరకు వెళ్లింది. గతంలో తమ పెద్దలకు తెలియకుండా వీరిద్దరూ ఓ గుడిలో వివాహం చేసుకున్నారు. పెళ్లి విషయం తెలుసుకున్న పెద్దలు.. వీరిని విడదీశారు. అయినప్పటికీ ఆ యువ జంట అప్పుడప్పుడూ కలుస్తుండేది. ఈ క్రమంలో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటానని ఐశ్వర్యను ప్రియుడు అషేర్‌ నమ్మిస్తూ వచ్చాడు. ఇలా కాలం పరుగులెత్తడంతో అషేర్‌ను ఐశ్వర్య నిలదీసింది. దీంతో ప్రియుడు మస్కా కొట్టాడు. దాంతో మనస్తాపం చెందిన యువతి తాను ఉంటున్నవసతి గృహంలో బలవన్మరణానికి పాల్పడింది. ఆత్మహత్యకు ముందు ఐశ్వర్య కొన్ని సెల్ఫీ వీడియోలు తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ  ఘటన హైదరాబాద్‌ బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. 

బోల్తా కొట్టిందిలే బీజేపీ పిట్ట!  

అనుకున్నదొక్కటి..  అయినది ఒక్కటి... బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్టా.. ఈ పాట ప్రస్తుతం తెలంగాణ బీజేపీకి అతికినట్లు సరిపోతోంది. నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉపఎన్నికలో ఆ పార్టీ అనుకున్నది ఒకటి అయితే మరొకటి జరిగింది.  అంచనాలు, ఆశలు తారుమారై.. నాగార్జున సాగర్ లో  కమలం పార్టీనే చిక్కులో పడిపోయింది. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో సంచలన విజయం, గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలతో తెలంగాణలో బీజేపీ దూకుడు పెంచింది. అదే స్పీడ్ తో నాగార్జున సాగర్ లో జెండా పాతి... వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ముందుకు సాగాలని భావించింది. అందుకే సాగర్ ఎన్నికలో అభ్యర్థి ఎంపికపై ఆచితూచి వ్యవరించింది బండి సంజయ్ టీమ్. టీఆర్ఎస్  అభ్యర్థిని ప్రకటిస్తే... ఆ తర్వాత ఆ పార్టీ అసంతృప్త నేతలను లాక్కుని వారిలో ఎవరికో ఒకరికి టికెట్ ఇవ్వాలని బీజేపీ భావించింది. టీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశిస్తున్న నేతలతోనూ బీజేపీ పెద్దలు చర్చలు జరిపారని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు మాత్రం సీన్ మారిపోయింది. టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వలసలు ఉంటాయని అనుకుంటే.. కమలం పార్టీ నుంచే కారు పార్టీలోకి నేతలు జంప్ అవుతున్నారు.  నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో బీజేపీ టికెట్ ఆశించి నిరాశకు గురైన కడారి అంజయ్య యాదవ్ టీఆర్ఎస్‌ గూటికి చేరారు.సాగర్ ఉప ఎన్నికల్లో కడారి బీజేపీ టికెట్ ఆశించగా... చివరి నిమిషంలో రవి నాయక్‌కు బీజేపీ టికెట్ ఇచ్చింది. దీంతో అంజయ్య తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇదే అదనుగా టీఆర్ఎస్ నేతలు కడారితో టచ్ లోకి వచ్చారు. ఎమ్మెల్యేలు  పైలా శేఖర్ రెడ్డి, రవీంద్ర కుమార్ నాయక్, సైదిరెడ్డి చర్చలు జరిపారు. వారి చర్చలు సఫలం కావడంతో అంజయ్య టీఆర్ఎస్‌లో చేరిపోయారు. ఫామ్ హౌస్‌లో కడారి అంజయ్య యాదవ్ ను పార్టీలోకి ఆహ్వానించారు సీఎం కేసీఆర్. కడారి పార్టీ మారడటంతో నాగార్జున సాగర్ లో బీజేపీకి బిగ్ షాక్ తగిలినట్లైంది.  సీఎం కేసీఆర్ రాజకీయ ఎత్తుగడల వల్లే సాగర్ లో బీజేపీ ప్లాన్ చిత్తయిందని తెలుస్తోంది. తమ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్న నేతలకు బీజేపీ గాలం వేస్తుందని ముందే గ్రహించిన కేసీఆర్.. వ్యూహాత్మకంగా పావులు కదిపారు. చివరి వరకు అభ్యర్థిని ప్రకటించలేదు. అంతేకాదు పార్టీలో టికెట్ ఆశిస్తున్న నేతలతో స్వయంగా మాట్లాడి వారికి అభయమిచ్చారు. ఎవరూ పార్టీ నుంచి వెళ్లిపోకుండా జాగ్రత్త పడ్డారు. అందుకే సోమవారం దివంగత నేత నోముల నర్సింహయ్య కుమారుడికే టీఆర్ఎస్ అవకాశం ఇచ్చింది. ముందే నేతలందరిని కేసీఆర్ సెట్ రైట్ చేయడంతో అధికార పార్టీలో అసమ్మతి అన్నదే లేకుండా పోయింది. అటు బీజేపీలో మాత్రం లుకలుకలకు బయటపడ్డాయి. బలమైన నేతగా ఉన్న అంజయ్య యాదవ్ కారు గూటికి చేరగా.. మరికొందరు నేతలు అదే బాటలో ఉన్నారని చెబుతున్నారు.  మరోవైపు రవినాయక్ అభ్యర్థిత్వంపై నాగార్జున సాగర్ బీజేపీలోనూ తీవ్ర అసమ్మతి నెలకొందని చెబుతున్నారు. బలమైన జానా రెడ్డి, తమ బలగాన్ని మొత్తం మోహరిస్తున్న టీఆర్ఎస్ ను రవి నాయక్ ఎలా ఎదుర్కొంటారని స్థానిక నేతలు ప్రశ్నిస్తున్నారట. దీంతో కొన్ని రోజుల వరకు జోష్ లో ఉన్న నాగార్జున సాగర్ బీజేపీ కేడర్ ప్రస్తుతం నిరాశలో మునిగిపోయిందని తెలుస్తోంది. 

జగన్‌కు ఇంకో ఎంపీ అవసరమా?

కేంద్రాన్ని నిలదీయలేని జగన్‌కు ఇంకో ఎంపీ అవసరమా? 28మంది ఎంపీలను ఉంచుకొని, ఏపీకి ఏమీ సాధించలేని వ్యక్తికి, మరో ఎంపీని గెలిపించమనే అర్హత లేదు. ఈ రెండేళ్లలో రాష్ట్రానికి ఏం సాధించారో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సమాధానం చెప్పాలి. రైల్వేజోన్, వెనుకబడిన జిల్లాలకు నిధులు, కేంద్రం నుంచి రావాల్సిన 24వేల కోట్లపై వైసీపీ ఎంపీలు, ముఖ్యమంత్రి ఎందుకు కేంద్రాన్ని నిలదీయరని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీమంత్రి కిమిడి కళావెంకట్రావు ప్రశ్నించారు.  విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన వాటిపై కేంద్రాన్ని నిలదీయలేని జగన్ ప్రభుత్వానికి మరో ఎంపీ అవసరమా? అని కళావెంకట్రావు నిలదీశారు. ప్రత్యేక హోదాతో రాష్ట్రం రూపురేఖలే మారిపోతాయని చెప్పిన జగన్, ఇప్పుడెందుకు దాని ఊసెత్తడం లేదన్నారు. విశాఖ ఉక్కు, కడప స్టీల్ ప్లాంట్, దుగరాజపట్నం, రామాయపట్నం పోర్టులు ఏమయ్యాయో జగన్ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఓట్లకోసం తమ ముందు కొచ్చే వైసీపీ నేతలను, ముఖ్యమంత్రిని ప్రజలంతా నిలదీయాలని పిలుపు ఇచ్చారు. కేసుల భయంతోనే ముఖ్యమంత్రి, కేంద్రం ముందు నోరెత్తడం లేదన్నారు కిమిడి కళావెంకట్రావు. 

అవినీతిలో ఏపీ నెంబర్ వన్! 

ఆంధ్రప్రదేశ్ అక్షర క్రమంలో దేశంలో నెంబర్ వన్ స్టేట్. జగన్ రెడ్డి పాలనలో అప్పులు తీసుకోవడంలోనూ దేశంలో ఆంధ్రప్రదేశే టాప్. అప్పులు చేయడంలోనే కాదు అవినీతి, అక్రమాల్లోనూ ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం నెంబర్ వన్ ప్లేస్ లో ఉందని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. అవినీతి అక్రమాల్లో రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి  జగన్మోహన్‌రెడ్డి ప్రథమ స్థానంలో నిలిపారని చెప్పారు.  22 మంది ఎంపీలను పెట్టుకుని 22 నెలల్లో రాష్ట్రానికి జగన్ ఏం చేశారని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ఏ మొహం పెట్టుకుని తిరుపతి ఉపఎన్నికలో ఓట్లు అడుతారు? అని  నిలదీశారు. పార్లమెంట్‌లో వైసీపీ ఎంపీలు తమ గళాన్ని వినిపించ లేదన్నారు. వ్యక్తిగత విధ్వేషాలతో  తనపై తప్పుడు కేసులు బనాయించారని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడే వ్యక్తిని కాదని అచ్చెన్నాయుడు చెప్పారు. తిరుపతి ఉప ఎన్నికలో తెలుగు దేశం పార్టీ విజయం ఖాయమన్నారు అచ్చెన్నాయుడు. 

బెల్ట్ షాపుల జోలికి వెళ్లొద్దు.. ఎక్సైజ్ శాఖకు ఎమ్మెల్యే వార్నింగ్

బెల్ట్ షాపులన్నీ మా కార్యకర్తలవే. వాటిని చూసీ చూడనట్టు వదిలేయండి. ఎక్సైజ్ సీఐ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి రావాలని హుకూం. బెల్టు షాపుల జోలికి ఎక్సైజ్ సిబ్బంది వెళ్లొద్దని ఒక తీర్మానం చేసి ముఖ్యమంత్రికి కూడా పంపుతాం. ఈ మాటలన్నీ అన్నది ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే. అది కూడా ఓ ఓపెన్ మీటింగ్‌లో. ఆ ఎమ్మెల్యే గారు చేసి కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.  బెల్ట్ షాపులను వదిలేయమంటూ కాంట్రవర్సీ కామెంట్లు చేసింది ఖమ్మం జిల్లా వైరా టీఆర్ఎస్ ఎమ్మెల్యే రాములు నాయక్. మండలంలోని బెల్ట్ షాపులన్నీ టీఆర్ఎస్ కార్యకర్తలవేనని.. కాస్త చూసీ చూడనట్లు ఉండాలని అధికారులను ఉద్దేశించి ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేశారు. ఎక్సైజ్ సీఐ క్యాంపు కార్యాలయానికి రావాలని ఆయన సూచించారు. ఒక తీర్మానం చేసి సీఎం కేసీఆర్‌కు కూడా పంపుతామని రాములు నాయక్ అన్నారు. ఇప్పుడీ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఎమ్మెల్యే మెసేజ్‌కి మందుబాబులంతా చప్పట్లు కొడుతుంటే.. మహిళలు మాత్రం మండిపడుతున్నారు.

అమ్మాయిలూ.. రాహుల్ తో జాగ్రత్త!

కేరళలో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటముల మధ్య టఫ్ ఫైట్ సాగుతోంది. ఎన్నికల ప్రచారంలో నేతలు మాటల తూటాలు పేల్చుతున్నారు. వ్యక్తిగత దూషణలతో కాక పుట్టిస్తున్నారు. కాంగ్రెస్ యువరాజు, ఎంపీ రాహుల్ గాంధీపై కేరళకు చెందిన మాజీ స్వతంత్ర ఎంపీ జాయ్స్ జార్జ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీపీఎం అభ్యర్థి, మంత్రి ఎంఎం మణికి మద్దుతుగా నిర్వహించిన సభలో పాల్గొన్న ఆయన.. రాహుల్ గాంధీ పట్ల అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఆయనకు ఇంకా పెళ్లి కాలేదని, ఆయన ముందు వంగకూడదని అన్నారు. ‘‘రాహుల్ గాంధీ ఎప్పుడూ అమ్మాయిల కాలేజీలకే వెళుతుంటారు. అక్కడికి పోయి వంగాల్సిందిగా అమ్మాయిలకు చెబుతుంటారు. అమ్మాయిలూ.. దయచేసి రాహుల్ ముందు వంగకండి. ఆయన ముందు అసలు నిలబడకండి. ఆయనకు ఇంకా పెళ్లి కాలేదు’’ అంటూ రాహుల్ ను ఉద్దేశించి.. ఇడుక్కీ మాజీ ఎంపీ కామెంట్ చేశారు. జార్జ్ మాటలకు పక్కనే ఉన్న మంత్రి ఎంఎం మణి నవ్వుతూ కనిపించారు. ఆ వీడియో కాస్తా వైరల్ కావడంతో జార్జ్ పై విమర్శలు వెల్లువెత్తాయి. జార్జ్ వ్యాఖ్యలను కాంగ్రెస్ ఖండించింది. కేరళలో సీపీఎంకు ఓటమి భయం పట్టుకుందని విమర్శించింది.

ఏపీలో వాతలు, కోతలు తప్పవా ?

కరోనా భయం ఉన్నా దేశంలో ఆర్థిక, రాజకీయ కార్యకలాపాలు అన్నీ యథావిధిగా జరుగుతూనే ఉన్నాయి.కరోనా రక్షణ చర్యల నడుమ రెండు విడతలుగా సుమారు నెల రోజులకు పైగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరిగాయి. పొరుగు రాష్ట్రం తెలంగాణలోనూ శాసన సభ బడ్జెట్ సమావేశాలు జరిగాయి. ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్’ను ప్రవేశ పెట్టింది. సభ ఆమోదించింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, ఏపీ సహా అనేక రాష్ట్రాలలో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.   \ఆంధ్ర ప్రదేశ్’లోనూ ఇతరత్ర్రా కార్యకలాపాలన్నీ,మామములుగానే సాగుతున్నాయి. స్కూల్స్, హాల్స్,మాల్స్, బార్స్ అన్నీ యథాతథంగా నడుస్తునాయి. కానీ,  అసెంబ్లీ సమావేశాలు అంటే మాత్రం ఆ ఒక్కటీ అడగొద్డంటోంది ముఖ్య మంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వం. అంతే కాదు,వరసగా రెండవ సంవత్సరం కూడా ఆర్డినెన్సు రూట్లో, ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్’తో మమ అనిపించేసింది. అయితే, ఇందుకు కరోనా లేదా నిన్న మొన్నటిదాకా జరిగిన స్థానికసంస్థల ఎన్నికలు లేదా రేపు జరగబోయే తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక, జడ్పీటీసీ, ఎమ్టీపీసీ ఎన్నికలు  కారణమా, అంటే, కాదనే సమాధానమే వస్తోంది. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక జరుగతున్న తెలంగాణలో బడ్జెట్ ఆగలేదు. ఒక్క  కాదు తెలంగాణ అనే కాదు, అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న రాష్ట్రాలతో సహా అన్ని రాష్ట్రల శాసనసభలు బడ్జెట్ సమావేశాలు నిర్వహించుకున్నాయి.   పోనీ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అద్వాన్న స్థితికి, చేరింది కాబటి  ఉప ఎన్నికల ముందు బొక్కలు కనిపించకుండా దాచుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందా అంటే, అదీ కాదని అంటున్నారు. ఎందుకంటే, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక సర్కార్ బొక్కలన్నింటినీ బయట పెట్టింది, వేయవలసిన అక్షింతలు వేసింది. అప్పు చేసి పప్పుకూడు కథలా రాష్ట్ర ఆర్థిక ఆర్థిక పరిస్థితి ఉందని కాగ్, పేర్కొంది.కాబట్టి, బడ్జెట్ పెట్టడం వలన కొత్తగా  బయటపడే బొక్కలు ఏమీలేవు. రాష్ట్ర ఖజానానే నిండుకుంది. సోషల్ వెల్ఫే హాస్టల్స్ విద్యార్ధులకు పాలు, గుడ్లు పెట్టే పరిస్థితి కూడా లేదు, ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. మరి అలాంటప్పుడు, జగన్ ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు ఎందుకు భయపడుతోంది? ఎందుకు ఓటాన్, అది కూడా ఆర్డినెన్సు రూట్’లో ఎందుకు తెచ్చింది? అంటే అందుకు ప్రభుత్వ అంతర్గత వర్గాలు రెండు ప్రధాన కారణాలు చెపుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థతి అద్వాన్నం కంటే అద్వాన్నంగా వుంది. రానున్న మూడు నెలల్లో, ఆదాయం కొంత పెరిగి, పరిస్థితి ఎంతో కొంత మెరుగు పడుతుందని, ప్రభుత్వం ఆశిస్తోంది. సో .. అందాకా ఓటాన్’తో నెట్టుకొచ్చి, అప్పుడు పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెడితే, ప్రభుత్వ అబోరు కాసింత అయినా దక్కుతుందని ప్రస్తుతానికి బడ్జెట్’ను దాటేసిందని, రాజకీయ వర్గాల్లో వినవస్తోంది. అదలా ఉంటే, కొంచెం ఆలస్యంగానే అయినా, జగన్ సర్కార్’కు ఈ స్థాయిలో సంక్షేమ పథకాలను అమలుచేస్తూ పోతే, అందినకాడికి  అప్పులు చేసినా,చివరకు ప్రభుత్వ అస్తులనే అమ్మినా, ఆర్థిక పరిస్థిని అదుపు చేయడం సాధ్యం కాదన్న వాస్తవం అర్థమైందని, అంటున్నారు. అందుకే ఇంటికో పథకం పేరిట  సంక్షేమ పథకాల సమీక్ష జరిపి కోతలు విధించే ఆలోచన ఉందని తెలుస్తోంది.అదే విధంగా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకునేందుకు, పన్నులు, ఇతరత్రా వాతలు పెట్టేందుకు కూడా ప్రభుత్వం సిద్దమైంది. అందుకే, తిరుపతి తర్వాత బడ్జెట్ ప్రవేశ పెడితే కోతలు, వాతలు యధేచ్చగా చేస్కోవచ్చిని జగన్ సర్కార్ ఆలోచిస్తోందని అంటున్నారు. అయితే, తిరుపతి దాటక ముందే బద్వేల్ ఉపఎన్నిక అనివార్యమైంది, ఈ పరిస్తితులలో ప్రభుత్వం ఏమి చేస్తుంది అనేది,ఆసక్తికరంగా మారింది. అయితే ఒకటి మాత్రం నిజం రానున్న రోజుల్లో, జగన్న పథకాలు, వైఎసార్ వరాలు ముందులా ఉండవు, అలగే వాతలు తప్పవు, అని ఆర్థిక శాఖ పద్దులనూ చూసేపెద్దలు.. చెపుతున్నారు.

పోలీసులకే ఝలక్..

దోచుకోవడం, దాచుకోవడం వాళ్ళ ఎయిమ్.. అందుకు ఎవరు అతీథులు కారు. వాళ్ళు ఫిక్స్ అయితే మన ప్యాకెట్ చిల్లు పడుతుంది. అప్పుడు మనల్ని ఆ ఈశ్వరుడు కూడా కాపాడలేడు. అదే వాళ్ళ సత్తా.. వాళ్ళు కామన్ మ్యాన్ ని దోచుకోగలరు. ఖద్దరు చొక్కాలను దోచుకోగలరు. అవసరమైతే ఖాకీ లను కూడా దోచుకోగలరు.. అందుకు వాళ్ళు ఎంచుకున్న సులువైన మార్గం హ్యాకింగ్. ఇప్పటి వరకు సాఫ్ట్ వేర్ ని , లోన్ కావాలనుకునే వాళ్ళను  టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు .. ఇప్పుడు ఏకంగా ఖాకీలపైనే కన్నేశారు .  ఖాకీల పేరుతో డబ్బులు దండుకుందాం అనుకున్నారు.. అందుకు వాళ్ళు వేసిన పథకమే పోలీసుల ఫేస్బుక్ హ్యాక్ చేయడం.  పోలీసుల పేస్ బుక్ హ్యాక్ చేసి ఆ అకౌంట్లో ఉన్న వాళ్ళకి గూగుల్  పే, ఫోన్ పే ల ద్వారా డబ్బులు పంపాలంటూ ఆ అకౌంట్ నుండి మెస్సేజెస్ పంపారు.  వరంగల్ జిల్లా దామెర పోలీస్ స్టేషన్‌కు చెందిన ఫేస్ బుక్ ఖాతా హ్యాక్ అవ్వడం సంచలనం సృష్టిస్తోంది. దామెర ఎస్సై భాస్కర్‌రెడ్డి ప్రకారం  ఏడాదిన్నర క్రితం దామెర పోలీసులు ఒక ఫేస్ బుక్ అకౌంట్ ఓపెన్ చేశారు. ఇటీవల మరో అకౌంట్ క్రియేట్ చేసి.. పాత దాన్ని వినియోగించడం పూర్తిగా మానేశారు. దీన్ని క్యాచ్ చేసుకున్న సైబర్ నేరగాళ్లు.. ఆ అకౌంట్‌ను హ్యాక్ చేశారు. ఫోన్ పే, గూగుల్ పే నుంచి డబ్బులు పంపాలంటూ పలువురికి మెసేజులు పంపారు. ఈ విషయాన్ని ఎస్సై భాస్కర్ రెడ్డికి  చేరవేశారు కొందరు.. దీంతో అలర్ట్ అయినా పోలీసులు వెంటనే కమిషనరేట్‌లోని సైబర్‌ క్రైమ్ విభాగం పాత ఫేస్‌బుక్‌ అకౌంట్‌ను బ్లాక్‌ చేయించారు. అయితే ఇప్పటివరకు వరకు సైబర్ నేరగాళ్ల వలలో ఎవరు పడలేదని ఎవరూ డబ్బులు పంపించకపోవడంతో హమ్మయ్య అనుకున్నారు పోలీసులు. మధ్యప్రదేశ్‌కు చెందిన ముఠా ఈ పని చేసినట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.   

బొచ్చు స్కాం? శ్రీవారి తలనీలాల స్మగ్లింగ్!

తిరుమల క్షేత్రం. పరమ పావన నిలయం. కలియుగ దేవుడు శ్రీ వేంకటేశ్వరస్వామి నిలయం. నిత్యం వేలాదిగా భక్తులు. తల నీలాలతో మొక్కులు. కట్ చేస్తే.... అది మిజోరంలోని ఇండియా-చైనా బోర్డర్. పక్కా ఇన్ఫర్మేషన్‌తో అస్సోం రైఫిల్స్, కస్టమ్ డిపార్ట్‌మెంట్ కలిసి సరిహద్దులో కాపు కాశారు. ఒక్కో వాహనం చెక్ చేస్తున్నారు. కాసేపటికి వారు వెతుకుతున్న వెహికిల్స్ అక్కడికి వచ్చాయి. వాటిని ఆపారు భద్రతా సిబ్బంది. డాక్యుమెంట్స్ చూపించమన్నారు. ఆ డ్రైవర్ ఏవో కాగితాలు ఇచ్చాడు. అనుమానంతో ఆ వాహనాలు చెక్ చేశారు అస్సోం రైఫిల్స్ జవాన్లు. వాటి నిండా సంచులు. ఆ బ్యాగుల్లో తల వెంట్రుకలు. ఒక్కో సంచిలో 50కేజీల వెంట్రుకలు. అలా మొత్తం 120 బ్యాగుల తలనీలాలు. ఆ వెంట్రుకలు తిరుమల నుంచి చైనాకు అక్రమంగా తరలిస్తుండగా అస్సోం రిఫిల్స్, కస్టమ్ డిపార్ట్‌మెంట్ కలిసి పట్టుకున్నారు. రెండు వాహనాలను, తల వెంట్రుకల బ్యాగులను సీజ్ చేశారు.  ఎక్కడి తిరుమల, ఎక్కడి మిజోరం. ఇక్కడ భక్తులు శ్రీవారికి భక్తితో ఇచ్చిన తలనీలాలను.. దొంగచాటుగా చైనాకు తరలిస్తున్నారు కేటుగాళ్లు. గతంలో ఎప్పుడూ ఇలా జరిగింది లేదు. వెంట్రుకలను సీజ్ చేసిన కస్టమ్స్ అధికారులే వాటిని చూసి అవాక్కయ్యారు. మిజోరాం బోర్డర్ మీదుగా చైనాకు వెంట్రుకలు అక్రమంగా స్మగ్లింగ్ చేస్తున్నారు. చైనాలో వాటిని శుద్ధి చేసి విదేశాలకు అమ్ముతుంటారు. ఆ జుట్టును విగ్గుల తయారీకి వాడుతుంటారు. వాటికి అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. సరిహద్దుల్లో సీజ్ చేసిన 120 బ్యాగుల వెంట్రుకల విలువ సుమారు కోటి 80 లక్షలు ఉంటుందని అంటున్నారు. వాటి ఫైనల్ ప్రొడక్ట్ కాస్ట్.. అంతకు పదింతలే పలుకుతుంది. ఇక్కడ విషయం వెంట్రుకల గురించి కాదు.. తిరుమలలో శ్రీవారికి సమర్పించిన తలనీలాలు అన్ని రాష్ట్రాలు దాటి దేశ సరిహద్దుల వరకు ఎలా చేరిందనేది ఆసక్తికరం. తిరుమలలో కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. అడుగడుగునా సీసీకెమెరాలు, సెక్యూరిటీ తనిఖీలు ఉంటాయి. గుట్కా, మందు బాటిళ్ల లాంటి వాటినే సిబ్బంది కన్నుగప్పి తీసుకురాలేరు. అలాంటిది.. ఎలాంటి పత్రాలు లేకుండా అంత పెద్ద ఎత్తున తలనీలాలు ఎలా తరలించబడ్డాయి? 120 సంచుల వెంట్రుకలు తిరుమల కొండ దిగుతుంటే అధికారులు ఏం చేస్తున్నట్టు? వారికి తెలీకుండానే ఇదంతా జరుగుతోందా? లేక, అంతా వారి కనుసన్నల్లోనే నడుస్తోందా? పెద్దల నుంచి ఒత్తిడి ఉందా? ఆ పెద్దలు చెబితేనే అక్రమంగా తలనీలాలు తరలిపోయాయా? ఇలా అనేక ప్రశ్నలు. అంతకు మించి అనుమానాలు.   ఈ ఏడాది ఫిబ్రవరి 7న జరిగిందీ ఘటన. ఆ విషయం జాతీయ మీడియాలో ప్రముఖంగా వచ్చింది. ఏపీలో మాత్రం అంతా గప్‌చుప్. చాలా ఆలస్యంగా ఇప్పుడిప్పుడే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక్కడ మరో ఆసక్తికర సంఘటనా చోటు చేసుకుంది. ఫిబ్రవరిలో టీటీడీ అధికారికంగా 143.9 టన్నుల వెంట్రుకలను వేలం వేసి.. 11.17 కోట్ల రాబడి సంపాదించింది. ఇది అధికారిక లెక్క. మరి, మిజోరాం ఘటనతో అనధికారికంగా పెద్ద ఎత్తున వెంట్రుకలు అక్రమంగా సరిహద్దులు దాటుతున్నాయనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు శ్రీవారి భక్తులు. తలనీలాలతో పెద్ద ఎత్తున స్కాంకు తెగబడుతున్నారని అంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వెంట్రుకలను స్మగ్లర్ల సాయంతో దేశ సరిహద్దులు తరలిస్తున్నారని ఆరోపిస్తున్నారు. మరి, ఈ బొచ్చు స్కాం వెనుకున్న బడాబాబులు ఎవరు? ఇంత జరుగుతుంటే టీటీడీ ఏం చేస్తోంది? దీనిపై టీటీడీనే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఇందులో నిజానిజాలు నిగ్గు తేలాల్సి ఉంది. అయితే, ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాక తీరిగ్గా స్పందించింది టీటీడీ. మిజోరం సమీపంలోని మయన్మార్ సరిహద్దులో అస్సోం రైఫిల్స్ సీజ్ చేసిన 120 బ్యాగుల తలనీలాలతో తమకు ఎలాంటి సంబంధం లేదని టీటీడీ ప్రకటించింది. శ్రీవారికి సమర్పించిన తలనీలాలను ఈ-ప్లాట్ ఫామ్ ద్వారా నిర్వహించే అంతర్జాతీయ టెండర్ల ద్వారా విక్రయిస్తున్నామని తెలిపింది. టెండర్‌లో ఎక్కువ మొత్తం కోట్ చేసిన బిడ్డర్‌కు తలనీలాలు అప్పగిస్తామని, కొనుగోలు చేసిన బిడ్డర్‌కు అంతర్జాతీయ ఎగుమతి అనుమతులు ఉన్నాయా... లేక దేశంలోనే ఏ ప్రాంతంలో విక్రయిస్తారనేది టీటీడీకి సంబంధించిన విషయం కాదన్నారు. తలనీలాల అక్రమ రవాణాకు పాల్పడిన సంస్థల పేర్లు అధికారికంగా తెలియజేస్తే వాటిని బ్లాక్ లిస్ట్‌లో పెడతామని స్పష్టం చేసింది టీటీడీ.