గుడిసెలో ఆరుగురు చిన్నారులు సజీవ దహనం
posted on Mar 30, 2021 @ 5:48PM
ఆరుగురు చిన్నారులు.. పూరి గుడిసెలో ఆడుకుంటున్నారు. వాళ్ల తల్లిదండ్రులు పనికి వెళ్లడంతో అందరూ ఇంట్లో కూర్చుని ఆడుకుంటున్నారు. వాళ్లంతా సరదాగా ఉండగానే జరగరాని ఘోరం జరిగింది. వాళ్లు ఉన్న గుడిసెకు నిప్పంటుకుంది. పూరి గుడిసె కావడంతో వేగంగా మంటలు విస్తరించాయి. నిమిషాల్లోనే గుడిసె మొత్తం తగలబడింది. అందులో ఆడుకుంటున్న ఆరుగురు చిన్నారులు కూడా ఆ మంటల్లో సజీవ దహనమయ్యారు. అత్యంత విషాదకరమైన ఈ ఘటన బీహార్ రాష్ట్రంలో జరిగింది.
బీహార్‌లోని అరరియా ప్రాంతంలో పలసి పోలీస్ స్టేషన్ పరిధిలోని కబియా గ్రామంలో ఈ దారుణం జరిగింది. మంటల్లో చిక్కుకున్న పిల్లల కేకలు విన్న కొందరు యువకులు కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ.. మంటలు దట్టంగా అలుముకోవడంతో వాళ్లు కాపాడలేకపోయారు. ఇల్లు తగలబడిన విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. అయితే.. అప్పటికే జరగకూడని నష్టం జరిగిపోయింది.ఫైర్ డిపార్ట్‌మెంట్ వాహనం వచ్చి మంటలను ఆర్పేసింది. పోలీసులు చిన్నారుల మృతదేహాలను పోస్ట్‌మార్టానికి తరలించారు.
పూరి గుడిసె తగలబడిందన్న సంగతి తెలిసిన వెంటనే వందల సంఖ్యలో గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. అయితే మంటలు ఎలా రేగాయన్న దానికి ప్రస్తుతానికి కారణం తెలియరాలేదు. ఆరుగురు అభంశుభం తెలియని చిన్నారులు మంటల్లో చిక్కుకుని చనిపోవడంతో గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆ చిన్నారుల తల్లిదండ్రులను ఓదార్చడం అక్కడున్న వారి తరం కాలేదు.