జగన్‌కు ఇంకో ఎంపీ అవసరమా?
posted on Mar 30, 2021 @ 4:10PM
కేంద్రాన్ని నిలదీయలేని జగన్‌కు ఇంకో ఎంపీ అవసరమా? 28మంది ఎంపీలను ఉంచుకొని, ఏపీకి ఏమీ సాధించలేని వ్యక్తికి, మరో ఎంపీని గెలిపించమనే అర్హత లేదు. ఈ రెండేళ్లలో రాష్ట్రానికి ఏం సాధించారో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సమాధానం చెప్పాలి. రైల్వేజోన్, వెనుకబడిన జిల్లాలకు నిధులు, కేంద్రం నుంచి రావాల్సిన 24వేల కోట్లపై వైసీపీ ఎంపీలు, ముఖ్యమంత్రి ఎందుకు కేంద్రాన్ని నిలదీయరని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీమంత్రి కిమిడి కళావెంకట్రావు ప్రశ్నించారు.
విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన వాటిపై కేంద్రాన్ని నిలదీయలేని జగన్ ప్రభుత్వానికి మరో ఎంపీ అవసరమా? అని కళావెంకట్రావు నిలదీశారు. ప్రత్యేక హోదాతో రాష్ట్రం రూపురేఖలే మారిపోతాయని చెప్పిన జగన్, ఇప్పుడెందుకు దాని ఊసెత్తడం లేదన్నారు. విశాఖ ఉక్కు, కడప స్టీల్ ప్లాంట్, దుగరాజపట్నం, రామాయపట్నం పోర్టులు ఏమయ్యాయో జగన్ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఓట్లకోసం తమ ముందు కొచ్చే వైసీపీ నేతలను, ముఖ్యమంత్రిని ప్రజలంతా నిలదీయాలని పిలుపు ఇచ్చారు. కేసుల భయంతోనే ముఖ్యమంత్రి, కేంద్రం ముందు నోరెత్తడం లేదన్నారు కిమిడి కళావెంకట్రావు.