అంత్యక్రియలు జరిగాక.. తిరిగొచ్చాడు..
posted on Mar 30, 2021 @ 5:06PM
ఓ వ్యక్తి దొంగతనం కేసులో జైలు కి వెళ్ళాడు.. తాను జైలు నుండి తిరిగి వచ్చే సరికి.. ఆ వ్యక్తి చనిపోయాడని అనుకున్న తన కుటుంబసభ్యులు భారత సంప్రదాయం ప్రకారం.. అంత్యక్రియలు చేశారు. పిండం పెట్టారు. ఈ తంతు అంతా చేసిన మూడు నెలలకి ఆ వ్యక్తి తన కుటుంబ సభ్యుల ముందు ప్రత్యక్షమయ్యాడు. దీంతో ఆ కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు.
తన పేరు సాబూ.. క్యాటరింగ్, బస్సు క్లినింగ్ వంటి పనులు చేస్తుండే వాడు.. అప్పుడప్పుడు చేతికి పని చెబుతూ చిన్న చిన్న దొంగతనాలు చేస్తుండేవాడు. దొంగతనాలకు అలవాటు పడిన సాబూ.. తాను పనిచేస్తున్న హోటల్ లో డబ్బు దొంగిలించాడు. ఆ నేరం కింద పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. అయితే సాబూ రాకపోవడంతో బంధులు వెతికారు. ఇంతలోనే స్థానిక పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించాడు. పోలీసులు ఆ మృతదేహం సాబూదేనన్న అనుమానంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆ దేహం సాబూదేనని పొరపాటు పడిన కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు.
సీన్ కట్ చేస్తే మూడు నెలలు గడిచిపోయింది. సాబూను అంతా మరిచిపోయారు. ఒక బస్ డ్రైవర్‌కు సాబూ తటస్థపడ్డాడు. సాబూను గుర్తుపట్టిన డ్రైవర్ సమాచారాన్ని పోలీసులకు, కుటుంబ సభ్యులకూ తెలియజేశారు.దీంతో సాబూ బతికే ఉన్నాడని తెలుసుకుని.. అతని కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు. ఈ ఘటన కేరళ రాష్ట్రం పతనంతిట్ట జిల్లాలోని కుదస్సనాడులో జరిగింది. సాబూ కథ సుఖాంతం కావడంతో.. గత డిసెంబర్‌లో అంత్యక్రియలు జరిపిన మృతదేహం ఎవరిదో తెలుసుకునే పనిలో పడ్డారు పోలీసులు.