బోల్తా కొట్టిందిలే బీజేపీ పిట్ట!
posted on Mar 30, 2021 @ 4:23PM
అనుకున్నదొక్కటి.. అయినది ఒక్కటి... బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్టా.. ఈ పాట ప్రస్తుతం తెలంగాణ బీజేపీకి అతికినట్లు సరిపోతోంది. నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉపఎన్నికలో ఆ పార్టీ అనుకున్నది ఒకటి అయితే మరొకటి జరిగింది. అంచనాలు, ఆశలు తారుమారై.. నాగార్జున సాగర్ లో కమలం పార్టీనే చిక్కులో పడిపోయింది.
దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో సంచలన విజయం, గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలతో తెలంగాణలో బీజేపీ దూకుడు పెంచింది. అదే స్పీడ్ తో నాగార్జున సాగర్ లో జెండా పాతి... వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ముందుకు సాగాలని భావించింది. అందుకే సాగర్ ఎన్నికలో అభ్యర్థి ఎంపికపై ఆచితూచి వ్యవరించింది బండి సంజయ్ టీమ్. టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటిస్తే... ఆ తర్వాత ఆ పార్టీ అసంతృప్త నేతలను లాక్కుని వారిలో ఎవరికో ఒకరికి టికెట్ ఇవ్వాలని బీజేపీ భావించింది. టీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశిస్తున్న నేతలతోనూ బీజేపీ పెద్దలు చర్చలు జరిపారని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు మాత్రం సీన్ మారిపోయింది. టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వలసలు ఉంటాయని అనుకుంటే.. కమలం పార్టీ నుంచే కారు పార్టీలోకి నేతలు జంప్ అవుతున్నారు.
నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో బీజేపీ టికెట్ ఆశించి నిరాశకు గురైన కడారి అంజయ్య యాదవ్ టీఆర్ఎస్ గూటికి చేరారు.సాగర్ ఉప ఎన్నికల్లో కడారి బీజేపీ టికెట్ ఆశించగా... చివరి నిమిషంలో రవి నాయక్‌కు బీజేపీ టికెట్ ఇచ్చింది. దీంతో అంజయ్య తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇదే అదనుగా టీఆర్ఎస్ నేతలు కడారితో టచ్ లోకి వచ్చారు. ఎమ్మెల్యేలు పైలా శేఖర్ రెడ్డి, రవీంద్ర కుమార్ నాయక్, సైదిరెడ్డి చర్చలు జరిపారు. వారి చర్చలు సఫలం కావడంతో అంజయ్య టీఆర్ఎస్‌లో చేరిపోయారు. ఫామ్ హౌస్‌లో కడారి అంజయ్య యాదవ్ ను పార్టీలోకి ఆహ్వానించారు సీఎం కేసీఆర్. కడారి పార్టీ మారడటంతో నాగార్జున సాగర్ లో బీజేపీకి బిగ్ షాక్ తగిలినట్లైంది.
సీఎం కేసీఆర్ రాజకీయ ఎత్తుగడల వల్లే సాగర్ లో బీజేపీ ప్లాన్ చిత్తయిందని తెలుస్తోంది. తమ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్న నేతలకు బీజేపీ గాలం వేస్తుందని ముందే గ్రహించిన కేసీఆర్.. వ్యూహాత్మకంగా పావులు కదిపారు. చివరి వరకు అభ్యర్థిని ప్రకటించలేదు. అంతేకాదు పార్టీలో టికెట్ ఆశిస్తున్న నేతలతో స్వయంగా మాట్లాడి వారికి అభయమిచ్చారు. ఎవరూ పార్టీ నుంచి వెళ్లిపోకుండా జాగ్రత్త పడ్డారు. అందుకే సోమవారం దివంగత నేత నోముల నర్సింహయ్య కుమారుడికే టీఆర్ఎస్ అవకాశం ఇచ్చింది. ముందే నేతలందరిని కేసీఆర్ సెట్ రైట్ చేయడంతో అధికార పార్టీలో అసమ్మతి అన్నదే లేకుండా పోయింది. అటు బీజేపీలో మాత్రం లుకలుకలకు బయటపడ్డాయి. బలమైన నేతగా ఉన్న అంజయ్య యాదవ్ కారు గూటికి చేరగా.. మరికొందరు నేతలు అదే బాటలో ఉన్నారని చెబుతున్నారు.
మరోవైపు రవినాయక్ అభ్యర్థిత్వంపై నాగార్జున సాగర్ బీజేపీలోనూ తీవ్ర అసమ్మతి నెలకొందని చెబుతున్నారు. బలమైన జానా రెడ్డి, తమ బలగాన్ని మొత్తం మోహరిస్తున్న టీఆర్ఎస్ ను రవి నాయక్ ఎలా ఎదుర్కొంటారని స్థానిక నేతలు ప్రశ్నిస్తున్నారట. దీంతో కొన్ని రోజుల వరకు జోష్ లో ఉన్న నాగార్జున సాగర్ బీజేపీ కేడర్ ప్రస్తుతం నిరాశలో మునిగిపోయిందని తెలుస్తోంది.