ఘనంగా టీడీపీ ఆవిర్భావ వేడుకలు.. రామరాజ్యమే లక్ష్యమన్న చంద్రబాబు
తెలుగు దేశం పార్టీ 40వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహిస్తున్నారు. పార్టీ జెండాను ఎగురవేస్తున్నారు. నందమూరి తారకరామారావు అశయాలను ముందుకు తీసుకుపోతామని ప్రతిజ్ఞ చేస్తున్నారు. తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ కార్యకర్తలు, నేతలు, అభిమానులకు అధినేత చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలియాజేశారు. తెలుగువారందరూ ఆత్మగౌరవంతో, సమసమాజానికి బాటలువేస్తూ, తెలుగునేల ఘనతను ప్రపంచ నలుదిక్కులా చాటేలా... అభివృద్ధిపథంలో దూసుకుపోవాలన్న ఎన్టీఆర్ ఆశయాలను సాధించేందుకు, ప్రజలకు అసలైన రామరాజ్యాన్ని అందించే వరకు విశ్రమించరాదని ఈ వ్యవస్థాపక దినం సందర్భంగా మనందరం ప్రతిజ్ఞ తీసుకుందాం అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.
కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు, పొట్టి శ్రీరాములు, అంబేద్కర్ వంటి దేశభక్తుల స్ఫూర్తిగా మహాశయుడు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యకర్తలకు, నేతలకు, అభిమానులకు శుభాకాంక్షలు అని చంద్రబాబు ట్వీట్ చేశారు.
అనంతపురం రాప్తాడులో దివంగత పరిటాల రవి, మాజీ మంత్రి పరిటాల సునీతల కుమారుడు శ్రీరామ్ టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్, దివంగత నేత మాజీమంత్రి పరిటాల రవీంద్ర చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సుదీర్గ ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ ఒక చరిత్రను సృష్టించుకున్న పార్టీ టీడీపీ అని అన్నారు. బడుగు, బలహీన వర్గాలను, వెనుకబడిన తరగతులను రాజకీయంగా, ఆర్థికంగా ముందుకు నడిపించడానికి ఒక శక్తిలా ఆవిర్భవించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని కొనియాడారు. కొత్తగా రాష్ట్రం ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ఐదేళ్లలో ఎంతో అభివృద్ధి చేసిందని పరిటాల శ్రీరామ్ అన్నారు. ప్రస్తుత అధికారంలోఉన్న వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి జరగడంలేదని తీవ్ర స్థాయిలో విమర్శించారు. వైసీపీ నాయకులు రాష్ట్రాన్ని దోచుకుతింటున్నారని, అవినీతి పెరిగిపోయిందని విమర్శించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వాలంటీర్లను అడ్డం పెట్టుని, ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసి వైసీపీ గెలిచిందన్నారు. గ్రామాల్లో ఎదురుతిరిగే రోజులొస్తాయని, వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందని పరిటాల శ్రీరామ్ ఆశాభావం వ్యక్తం చేశారు